Ethiopia's Tigray conflict: ఈ బ్యూటీ క్వీన్ ప్రాణాలను పణంగా పెట్టి దేశం వదిలి పారిపోయారు ఎందుకు?

ఫొటో సోర్స్, SELAMAWIT TEKLAY
ప్రముఖ మోడల్, బ్యూటీ క్వీన్ సెలామవిట్ టెక్లే, ఇథియోపియాలోని యుద్ధ ప్రభావిత టిగ్రే ప్రాంతానికి చెందినవారు. యూకేలో ఆశ్రయం పొందేందుకు ఇంగ్లిష్ చానెల్‌ను దాటడంలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాల గురించి ఆమె వివరించారు.
తన ప్రాణాలను పణంగా పెడుతూ తోటి వలసదారులతో కలిసి పడవలో ఇంగ్లిష్ చానెల్ దాటడాని కంటే ముందు, ఆమె తొలుత ఫ్రాన్స్‌కు వెళ్లారు.
2020 చివర్లో ఇథియోపియాలో మొదలైన యుద్ధంలో టిగ్రే నాశనమైంది. అక్కడ మూకుమ్మడి హత్యలు, సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఆహార కొరత కూడా ఏర్పడటంతో అక్కడ కరవు లాంటి పరిస్థితులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు వర్ణించారు.
ఈ ప్రమాదకరమైన క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించవద్దని తోటి వలసదారులకు ఆమె సలహా ఇస్తున్నారు. దాని గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.
''యూకేకు చేరుకోవడానికి నేను కఠినమైన, భయంకరమైన క్షణాలను అనుభవించాను. నా టిగ్రేయన్ సోదరులు సముద్రంలో మునిగిపోవడం చూశాను. ఇంగ్లిష్ చానెల్ నుంచి నేను బతికి బయటపడ్డాను. 2021 నవంబర్‌ను నా జీవితంలో మర్చిపోను.
మేం మొదట ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందాం. దాదాపు రెండు వారాల పాటు కలైస్‌లోని పొదల్లో జీవించాం. అక్కడ చలి తీవ్రంగా ఉంది. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేవు. అది ఒక అంతులేని బాధ.
మనుషుల్ని రవాణా చేసే స్మగ్లర్లు వస్తారని మేం ఎదురుచూశాం. కానీ, వేరేవాళ్లు వచ్చారు. వారితో చెల్లింపుల వివరాలు మాట్లాడుకున్నాం. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వారు, వలసదారులను రాత్రిపూట తరలించారు.

ఫొటో సోర్స్, AFP
మొదటి దశలో టిగ్రేయన్‌కు చెందిన కొంతమంది, చానెల్‌ను దాటడానికి ప్రయత్నించినప్పుడు ఆ పడవ మునిగిపోయింది.
దేవుని దయవల్ల వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో మేం షాక్ అయ్యాం. కానీ, మాకు వేరే అవకాశం లేదు. మేం అనుకున్న చోటికి వెళ్లాల్సి వచ్చింది.
కొన్ని రోజుల్లో మేం ఒక చోటుకు చేరాం. అక్కడ విపరీమైన చలి ఉంది. సముద్రం కూడా ప్రమాదకరంగా ఉంది.
మేం అక్కడ ఒక చిన్న పడవలోకి ఎక్కాం. స్మగ్లర్లు చెప్పినట్లు మాత్రమే చేయడానికి మాకు అనుమతి ఉంది. మా ప్రాణాలను రక్షించుకోవడం కోసం యూకేకు మా ప్రయాణం మొదలు పెట్టాం.
అకస్మాత్తుగా మా పడవ ఇంజిన్, సముద్రంలో పడిపోయింది. వెంటనే ఒక అరబ్ వ్యక్తి, దాన్ని పట్టుకునేందుకు సముద్రంలోకి దూకారు. కానీ దాన్ని ఆయన బయటకు తీయలేకపోయారు. ఆ తర్వాత మా సోదరుల్లో ఒకరు కూడా సముద్రంలోకి వెళ్లారు.

ఫొటో సోర్స్, AFP
ఆయన తిరిగి పైకి రాలేదు. మేం ఆయన కోసం వెదికాం. ఆయన అరుపులను విన్నాం. కానీ, ఆచూకీని గుర్తించలేకపోయాం. సహాయం కోసం తీవ్రంగా అర్థించాం. మూడు గంటల తర్వాత లైఫ్‌గార్డులు వచ్చారు. నా కళ్ల ముందే నా సోదరుడు నీటిలో మునిగిపోయాడు. ఆయన మరణాన్ని నేను నా కళ్లతో చూశాను.
ఆ అరబ్ వ్యక్తి అదృష్టవంతుడు. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తిరిగి పడవలోకి రాగలిగారు.
ఆ పడవలో ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని గ్రహించాను. చాలా గంటలపాటు సముద్రంలో పోరాటం చేసిన తర్వాత నాతో పాటు నా తోటి వలసదారులను తీరప్రాంత సైనికులు గుర్తించి కాపాడారు.
మేం యూకే చేరుకున్న మూడు లేదా నాలుగు రోజుల తర్వాత మూడో రౌండ్ ప్రయాణీకులు, చానెల్ దాటడానికి ప్రయాణించారు. కానీ వారంతా మునిగిపోయారు. అందులో ఇద్దరు నా దేశానికి చెందినవారు. ఒకరు నా స్వస్థలం మెకెల్లాకు చెందినవారే.
నేను నాకోసం, నా ప్రజల కోసం, నా తల్లిదండ్రుల కోసం కన్నీరుమున్నీరయ్యాను. ఈ దారి గుండా నేను యూకేకు వస్తున్నానని నా తల్లిదండ్రులకు తెలియదు.
ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు, టిగ్రేలో అనుభవించిన బాధల కంటే ఈ సముద్ర ప్రయాణం అంత కష్టంగా ఏమీ ఉండదని నాకు నేను చెప్పుకున్నా. మా ఇళ్లలో మేం భయంకరమైన పరిస్థితులను చూశాం.

ఫొటో సోర్స్, AFP
కానీ, ఈ సముద్రాన్ని దాటడం చాలా ప్రమాదకరం, ఎవరూ దీన్ని ప్రయత్నించకూడదు.
నా దేశాన్ని వదిలి వెళ్లిపోతానని నేనెప్పుడూ అనుకోలేదు. వెళ్లే ఉద్దేశం కూడా నాకెప్పుడూ లేదు. అందాల పోటీల కోసం, ఇతర పనుల కోసం నేను విదేశాలకు వెళ్లినప్పుడల్లా మళ్లీ తిరిగి మా ఇంటికే వెళ్లేదాన్ని.
మెకెల్లాలో నాకు సొంత వ్యాపారం ఉంది. సంప్రదాయ, ఆధునిక దుస్తులను డిజైన్ చేసి విక్రయించేదాన్ని. నా వ్యాపారం బాగా సాగేది.
అప్పుడే 2020 నవంబర్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ యుద్ధం కారణంగా మేం చాలా పోగొట్టుకున్నాం. కరవు, అత్యాచారాలు, చెప్పుకోలేని బాధలను ఈ యుద్ధం తెచ్చిపెట్టింది. టిగ్రేలో బ్యాంక్ అకౌంట్లు స్తంభించిపోయాయి. తమ డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితి అక్కడి ప్రజలది.

ఫొటో సోర్స్, SELAMAWIT TEKLAY
ప్రతీ టిగ్రేనియన్ ఇళ్లను వదిలేయడంతో పాటు ఎంతో బాధ అనుభవించారు. నాకు, నా కుటుంబానికి కూడా ఇది తప్పలేదు.
అదృష్టవశాత్తు, మా టిగ్రేనియన్ సోదరీమణులకు జరిగినట్లుగా నేను అత్యాచార బాధితురాలిని కాలేదు. కానీ, మానసికంగా నేను ఎంతో కుంగిపోయాను.
యుద్ధం ప్రారంభమైనప్పుడు మెకెల్లాలో భారీగా బాంబు దాడులు జరిగాయి. మా ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఒక గ్రామంలో తలదాచుకోవాల్సి వచ్చింది. అక్సమ్ నగరంలో మా అంకుల్‌ను చంపేశారు.
దీని తర్వాత నేను వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చాను.
నేను శాంతిని కోరకుంటాను. నాకు అక్కడ సరిగా అనిపించలేదు. నా మనశ్శాంతిని కోల్పోయాను. శాంతి ఉంటే ప్రతీది పొందొచ్చు.
నా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా అమ్మ దుస్తులు, చెప్పులు, బూట్లు వేసుకొని నేను సంతోషంగా గడిపిన సమయం నాకు గుర్తు ఉంది.
నేను మోడల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు ముందుగా చదువుపై దృష్టి పెట్టాలని నా తల్లిదండ్రులు సూచించారు. అయితే, మోడల్‌ను కావాలనే నా కోరిక చాలా బలమైనది.
నాకు 16 ఏళ్లప్పుడు, మొదటి అందాల పోటీ 'మిస్ మెకెల్లా'లో పాల్గొన్నా. అదొక అద్భుతమైన పోటీ.
పెద్దయ్యాక, 2015లో అతిపెద్ద జాతీయ స్థాయి అందాల పోటీ 'మిస్ వరల్డ్ ఇథియోపియా'లో పాల్గొన్నాను.
నేను అక్కడితో ఆగలేదు. 2017లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌లో పోటీ పడ్డాను. అదే నా తొలి అంతర్జాతీయ పోటీ.
ఆ పోటీలో కొన్ని ట్రోఫీలను నేను గెలుపొందాను. దాంతో నాకు అవకాశాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Selamawit Teklay
ఆ తర్వాత 2018లో దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచవ్యాప్త అందాల పోటీలో పాల్గొన్నా.
2019లో చైనాలో జరిగిన బ్యూటీ, స్పెషల్ స్కిల్స్ కాంటెస్ట్‌లో కూడా ప్రాతినిధ్యం వహించా.
కానీ, మా కలలన్నీ చెదిరిపోయాయి. నేనిప్పుడు యూకేలో శరణార్థిని. మొదట వారు మమ్మల్ని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత నాతో పాటు మరికొంతమందికి ఒక ఇంటిని కేటాయించారు. నా కేసు పరిష్కారం అయ్యే వరకు యూకేలో పనిచేయడానికి, బయటకు వెళ్లడానికి నాకు అనుమతి లేదు. మళ్లీ కొత్తగా నా జీవితాన్ని ప్రారంభించాను.
ఇదంతా ఒక డ్రామాలా అనిపిస్తుంది.
శరణార్థుల్లోని కొంతమంది మగవారిని రువాండాకు పంపించాలని యూకే యోచిస్తోంది. ఈ నిర్ణయం చాలా విచారకరం. ఈ దేశంలో ప్రాణాలను కాపాడుకునేందుకు వలసదారులు, భయంకరమైన త్యాగాలు చేశారు. చీకటిలో ప్రయాణం ఎలా ఉంటుందో నేను చూశాను.’’
ఇవి కూడా చదవండి:
- నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













