భారత్‌లో జన్మించిన వంద కోట్ల చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది?

ఆస్థా అరోరా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

సంబరాల నడుమ ఆస్థా అరోరా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

2000 మే 11న ఉదయం 05.05 గంటలకు దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో ఆస్థా జన్మించింది. ఆమె జననంతో భారత్‌ జనాభా వంద కోట్ల మార్కును చేరుకుంది. దీంతో ఆమెను వంద కోట్ల పౌరురాలిగా అభివర్ణిస్తుంటారు.

అప్పట్లో గులాబీ దుప్పటిలో చుట్టిన ఆమెను ఎత్తుకుంటూ కేంద్ర మంత్రులు ఫోటోలు దిగుతూ కనిపించారు.

ఆస్థా జననంతో భారత్‌ కూడా వంద కోట్లకుపైనే జనాభా కలిగిన దేశాల జాబితాలో చైనా సరసన నిలిచింది.

ఆస్థాను ‘‘వెరీ స్పెషల్, వెరీ యునీక్’’ చిన్నారిగా ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ)లోని భారతీయ ప్రతినిధి మైఖెల్ వ్లాసాఫ్ అభివర్ణించారు. అప్పట్లో వంద కోట్ల మైలురాయిపై వేడుకలు చేసుకునేందుకు యూఎన్‌ఎఫ్‌పీఏ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసింది.

భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న జనాభా సమస్య విషయంలో ఆస్థా జననం ఒక మేలుకొలుపు లాంటిదని కొందరు నిపుణులు కూడా హెచ్చరించారు.

ఆస్థా అరోరా

అయితే, మొత్తంగా ఆస్థా జననం ప్రపంచ వ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. దీంతో నజఫ్‌గఢ్‌లోని ఆమె ఇంటికి పాత్రికేయులు వరుసకట్టారు. నైరుతి దిల్లీలోని దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా జీవించే ప్రాంతం ఇదీ. ‌

ఆ చిన్నారి సెలబ్రిటీని చూసేందుకు, ఆమె తల్లి అంజన అరోరాతో మాట్లాడేందుకు అప్పట్లో బీబీసీ కూడా వారి ఇంటికి వెళ్లింది.

రెండు దశాబ్దాల తర్వాత ఆ చిన్నారి ఎలా ఉన్నారు? ఆమె ఏం చేస్తున్నారు? లాంటి అంశాలు తెలుసుకునేందుకు నేను మళ్లీ వారి ఇంటికి వెళ్లాను.

ఇటీవల ఓ ఆదివారం ఉదయం మేం తలుపుకొట్టినప్పుడు 22ఏళ్ల ఆస్థా బయటకు వచ్చారు. మాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తనేమీ తనను తాను ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదని చెప్పారు. తను పుట్టినప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆమె వివరించారు.

మేం ఆదివారం మాత్రమే ఆమె ఇంటికి ఎందుకు వెళ్లామంటే.. ఆ రోజు మాత్రమే ఆమె ఉద్యోగానికి సెలవు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఇటీవల ఆమె చేరారు.

ఆస్థా అరోరా

‘‘నేను డాక్టర్ కావాలని అనుకున్నాను. కానీ, నన్ను ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు పంపించి చదివించేంత స్తోమత మా తల్లిదండ్రులకు లేదు. దీంతో నేను నర్సు కావాలని నిర్ణయించుకున్నాను’’అని ఆమె మాతో చెప్పారు.

తను పుట్టినప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తలను ఓ ఫోల్డర్‌ ఆస్థా తల్లిదండ్రులు భద్రంగా దాచారు. వీటిని చూస్తూ అప్పుడు జరిగిందో ఆస్థా తెలుసుకున్నారు. ఆ ఫోల్డర్‌ను ఆస్థా మాకు చూపించారు.

ఆమె పుట్టిన తర్వాత వచ్చిన సెలబ్రిటీ హోదా కొంతకాలంపాటు ఆమెతోనే ఉంది. ఆమెకు 11 నెలల వయసు ఉన్నప్పుడు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, యూఎన్ఎఫ్‌పీఏ సంయుక్తంగా సిద్ధంచేసిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించేందుకు ఆమెను ముఖ్యఅతిథిగా పిలిచారు.

మొదటి పుట్టిన రోజు తర్వాత అజ్‌మేర్ చెందిన ఒక పత్రిక ప్రతినిధి ఒక రోజు మొత్తం ఆమె ఇంట్లో గడిపి ప్రత్యేక కథనం రాశారు. తన అన్నయ్య పుస్తకాలను ఆస్థా ఎలా ఆనందంగా చింపేదో ఆ కథనంలో పేర్కొన్నారు.

మొదటిసారి స్కూలుకు వెళ్లినప్పుడు అక్కడ ప్రత్యేకంగా చూసిన సంగతి ఇప్పటికీ తనకు గుర్తుందని ఆస్థా వివరించారు.

‘‘బిలియన్త్ బేబీ అనే పేరు మొదటిసారి విన్నట్లు గుర్తునప్పుడు నా వయసు నాలుగైదు ఏళ్లు ఉంటుంది. ఐక్యరాజ్యసమితి జనాభా దినోత్సవంనాడు అప్పుట్లో కొంతమంది కెమెరాలు పట్టుకొని మా స్కూలుకు వచ్చారు. ఒక చిన్నారికి టీవీల్లో కనిపించడం అంటే అది చాలా గొప్ప విషయం. నాకు కూడా ఆ గుర్తింపు నచ్చేది’’అని ఆమె చెప్పారు.

ఆస్థా అరోరా

ఈ సెలబ్రిటీ హోదా వల్ల కొన్నిసార్లు ఆమె కుటుంబానికి మేలు కూడా జరిగింది.

ఆమె తండ్రి ఒక షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. ఆయనకు నెలకు రూ.4000 (50 డాలర్లు) మాత్రమే జీతం వచ్చేది. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి కూడా ఆయన ఇబ్బంది పడేవారు.

‘‘ఏటా మా ఇంటికి జర్నలిస్టులు వచ్చేవారు. నాపై కథనాలు రాసేవారు. దీని వల్ల మా స్కూలుకు కూడా పేరు వచ్చేది. దీంతో రెండో తరగతి తర్వాత, వారు మా తల్లిదండ్రుల నుంచి ఫీజు తీసుకోవడం మానేశారు’’అని ఆస్థా వివరించారు.

స్కూలులో ఆస్థా బాగా చదువుకునేది. చర్చలు, డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది. తనకు 16ఏళ్ల వయసున్నప్పుడు ‘‘గ్రేస్‌ఫుల్ పర్సన్ అవార్డు’’ను స్కూలు అందించింది.

అయితే, అవార్డులతోపాటు గుర్తింపు కూడా వస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల 11వ తరగతిలో ప్రైవేటు స్కూలు నుంచి ఆమె ప్రభుత్వ స్కూలుకు మారాల్సి వచ్చింది.

‘‘కొత్త స్కూలులో నేను అంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. ఆ ఫలితం నా మార్కుల్లోనూ కనిపించేది. అలా నేను డాక్టర్ కావాలన్న ఆశలకు ముగింపు పడింది’’అని ఆమె చెప్పారు.

తాము పేదవాళ్లం అయినప్పటికీ, ఆస్థా పుట్టిన తర్వాత, తాము ఏదైనా సాధించగలమనే నమ్మకం వచ్చిందని ఆస్థా తల్లి అంజన వివరించారు.

ఆస్థా అరోరా

ఫొటో సోర్స్, Getty Images

తమ కుమార్తె చదువు బాధ్యత తాము తీసుకుంటామని అప్పటి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చారని అంజన చెప్పారు. ‘‘చదువుతోపాటు ఆరోగ్య సంరక్షణ, ఉచిత రైల్వే ప్రయాణం హామీలను ఆమె ఇచ్చారు. పాపను చూసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు’’అని వివరించారు. అయితే, ఈ హామీలకు సంబంధించి వీరి దగ్గర ఎలాంటి ధ్రువపత్రాలు లేవు.

ఆస్థా పుట్టిన తర్వాత కొన్ని నెలలకు తమ ఇంటికి వచ్చిన స్థానిక ఎంపీ సాహిబ్ సింగ్ వర్మ కూడా ఆస్థా తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారని అంజన చెప్పారు.

‘‘మేం చాలాసార్లు వారి కార్యాలయాలకు వెళ్లాం. కానీ, అక్కడకు వెళ్లిన ప్రతిసారీ మేడమ్ అందుబాటులో లేరు అని సమాధానం చెప్పేవారు’’అని అంజన వివరించారు.

తమకు యూఎన్‌ఎఫ్‌పీఏ నుంచి మాత్రమే రూ.2,00,000 జమ చేశారని ఆస్థా కుటుంబం చెప్పింది. ఆస్థాకు 18ఏళ్ల వయసు వచ్చినప్పుటికి అవి రూ.7,00,000 అయ్యాయని, వీటినే తన కాలేజీ చదువు కోసం ఉపయోగించామని ఆ కుటుంబం వివరించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ ప్లేబాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది

నాయకులు ఏం అంటున్నారు?

వర్మ 2007లో మరణించారు. మరోవైపు 2019లో క్రియాశీల రాజకీయాల నుంచి సుమిత్రా మహాజన్ విశ్రాంతి తీసుకున్నారు. చివరగా ఆమె లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

ఆస్థా కుటుంబం చెబుతున్న హామీల గురించి నేను సుమిత్రను అడిగాను. అయితే, సుమిత్రకు అవేమీ గుర్తులేవు. యూఎన్‌ఎఫ్‌పీఏ నిధి మినహా ఇతర సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తనకు గుర్తులేదని ఆమె వివరించారు.

‘‘నేను వారి ఇంటికి ఒక మంత్రిగా వెళ్లాను. అయితే, ఎక్కువ కాలం ఆ పదవిలో నేను కొనసాగలేదు. నేను క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నప్పటికీ, ఆ కుటుంబం నన్ను కలవలేదు. వారు నాకు లిఖిత పూర్వకంగా అభ్యర్థన పెట్టినా, నేను సాయం చేసేదాన్ని. ఇప్పుడు కూడా వారు నా దగ్గరకు వస్తే, నేను సాయం చేసేందుకు ప్రయత్నిస్తాను’’అని సుమిత్ర వివరించారు.

వీడియో క్యాప్షన్, నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?

విపరీతంగా పెరుగుతున్న జనాభా వల్ల అందరికీ మౌలిక వసతులు కల్పించడం కూడా కష్టం అవుతోందనే సమస్యకు ఆస్థా జననం ఒక మేలుకొలుపు లాంటిది.

ఇటీవల కాలంలో ఈ సమస్య గురించి ఆస్థా కూడా భిన్న వేదికలపై మాట్లాడుతున్నారు. భారత్‌కు భారీ జనాభా ఒక సమస్యగా మారుతోందని ఆమె చెబుతున్నారు.

‘‘జనాభాను నియంత్రించేందుకు భారత్ ఏదైనా చేయాలి’’అని ఆమె నాతో అన్నారు. ‘‘అబ్బాయిలను కనాలనే తపనే జనాభా ఇలా పెరిగిపోవడానికి కారణం’’అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘తమకు కొడుకు పుట్టేవరకు కొందరు అలా పిల్లలను కంటున్నారు. ఎందుకంటే అబ్బాయి వల్లే తమ వంశం పేరు ముందుకు వెళ్తుందని వారు భావిస్తారు’’అని ఆస్థా వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

2000లో ఆస్థా జన్మించినప్పుడు 2045నాటికి జనాభాలో చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనాలు ఉండేవి. అయితే, ఈ రికార్డును వచ్చే ఏడాదికే భారత్ అధిగమించే అవకాశముందని గత జులైలో ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక విడుదల చేసింది.

‘‘ఇప్పటికే ప్రతి విషయంలోనూ విపరీతమైన పోటీ ఉంటోంది. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాల్లో చాలా పోటీ ఉంటోంది’’అని ఆస్థా వివరించారు.

‘‘నేను వంద కోట్ల చిన్నారిని, త్వరలోనే మనకు రెండు వందల కోట్ల చిన్నారి కూడా పుట్టొచ్చేమో. అలాంటి మైలురాయిని మనం ఎప్పటికీ చేరుకోకూడదు’’అని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)