న్యుమోనియా: పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దీనికి చికిత్స ఏమిటి?

న్యుమోనియా

ఫొటో సోర్స్, FITOPARDO/GETTYIMAGES

    • రచయిత, మయాంక్ భాగవత్
    • హోదా, బీబీసీ మరాఠీ

న్యుమోనియా అనేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. దీన్నే ప్లూరిసీ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక శ్వాసకోశ వ్యాధి.

పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా ఈ వ్యాధి సొకే అవకాశం ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం ప్రకారం, 2019లో ప్రపంచ వ్యాప్తంగా 7,40,000 మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మరణించారు.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ లక్షల మందికి కోవిడ్-న్యుమోనియా సోకింది. దీని వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 12న ‘‘ప్రపంచ న్యుమోనియా దినోత్సవం’’ను జరుపుకొంటారు. ఇంతకీ న్యుమోనియా అంటే ఏమిటి? ఇది ఎలా సోకుతుంది? లాంటి అంశాలు నిపుణుల నుంచి తెలుసుకుందాం.

న్యుమోనియా

ఫొటో సోర్స్, Getty Images

న్యుమోనియో అంటే ఏమిటి?

సాధారణ పరిభాషలో చెప్పాలంటే, ఇదొక శ్వాసకోశ వ్యాధి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ల వల్ల సోకుతాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుంది. మరికొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది.

కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. ఊపిరితిత్తుల కణాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను న్యుమోనియాగా పిలుస్తారు. ఊపిరితిత్తుల్లో చిన్నచిన్న గాలి గదులు ఉంటాయి. వీటినే ‘‘అల్వెయోలై’’గా పిలుస్తారు. వీటిల్లోకి బ్యాక్టీరియా చేరడంతో న్యుమోనియా సోకుతుంది.

మన శరీరం పనితీరులో అల్వెయోలై కీలకపాత్ర పోషిస్తుంది. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్‌ల వడపొత ఇక్కడే జరుగుతుంది. అల్వెయోలై గుండా బయటకు వచ్చే ఆక్సిజన్ శరీరంలోని ఇతర కణాలకు రక్తం ద్వారా చేరుతుంది.

బ్యాక్టీరియా ద్వారా న్యుమోనియా సోకినప్పుడు.. అల్వెయోలైలో నీరు, చీము పేరుకుంటాయి. వీటి వల్ల అల్వెయోలై పనితీరు మందగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఫలితంగా రక్తంలో కలిసే ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య తగ్గిపోతుంది.

న్యుమోనియా

ఫొటో సోర్స్, Getty Images

న్యుమోనియా లక్షణాలు ఏమిటి?

అన్ని వయసుల వారికీ న్యుమోనియా సోకే ముప్పు ఉంటుంది. దీని లక్షణాలు..

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • జ్వరం
  • వణుకు, విపరీతంగా చెమటలు
  • దగ్గు
  • ఛాతి నొప్పి
  • తొలనొప్పి, వికారం, వాంతులు, డయేరియా 

న్యుమోనియాను వెంటనే గుర్తించి, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ‘‘అన్ని రకాల న్యుమోనియాలు ప్రాణాంతకం కాదు. అయితే, అసలు న్యుమోనియా ఎలాంటిదో ముందుగా పరీక్షల సాయంతో తెలుసుకోవాలి. ఇక్కడ చికిత్స అనేది చాలా ముఖ్యం’’అని పల్మనాలజిస్టు డాక్టర్ సలీల్ బింద్రే చెప్పారు.

బ్యాక్టీరియా లేదా వైరస్.. వేటివల్ల సోకినప్పటికీ న్యుమోనియా ప్రభావం ఒకేలా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే, లక్షణాలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి.

‘‘తెలుపు, పచ్చ, ఎరుపు రంగుల్లో కఫం, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు మొదట మనకు కనిపిస్తాయి’’అని బింద్రే వివరించారు.

న్యుమోనియా

ఫొటో సోర్స్, Getty Images

న్యుమోనియా ఎందుకు వస్తుంది?

ప్రధానంగా వైరస్ లేదా బ్యాక్టీరియాల వల్ల న్యుమోనియా సోకుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

బ్యాక్టీరియల్ న్యుమోనియా

బ్యాక్టీరియల్ న్యుమోనియా బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. 50 శాతం ఇలాంటి కేసులకు స్ట్రెప్టోకోకస్ న్యుమోనియానే కారణం. పిల్లల్లో ఎక్కువ న్యుమోనియా కేసులకు ఈ బ్యాక్టీరియానే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

హేమోఫిలియన్ న్యుమోనియా, క్లైమిడోఫిలా న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా తదితర రకాల న్యుమోనియాలు కూడా ఉంటాయి.

వైరస్‌లతో సోకే న్యుమోనియా

పారాఇన్‌ఫ్లూయెంజా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు, కరోనావైరస్, రైనోవైరస్‌ల వల్ల కూడా న్యుమోనియా సోకుతుంది.

కోవిడ్-19 వైరస్‌ కూడా ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని, చాలా మంది కోవిడ్-19 సోకినవారికి న్యుమోనియా సోకిందని నిపుణులు చెబుతున్నారు. ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది.

వాక్‌హాట్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హనీ సవాలా మాట్లాడుతూ.. ‘‘పిల్లల్లో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ తీవ్రం అవుతుంది. 65ఏళ్లకు పైబడిన వృద్ధుల్లోనూ ఇది ప్రాణాంతకంగా మారుతుంది’’అని చెప్పారు.

ఎందుకంటే పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువ.

వీడియో క్యాప్షన్, జనరిక్ మందులు: 50-90 శాతం తక్కువకు లభిస్తున్నా ఎందుకు తక్కువగా కొంటున్నారు?

న్యుమోనియా ఎలా వ్యాపిస్తుంది?

భిన్నరకాల కారణాల వల్ల న్యుమోనియా ఇన్ఫెక్షన్ సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

వ్యాధి కారక బ్యాక్టీరియా, వైరస్‌లు పిల్లల, ముక్కు గొంతుల్లో ఉంటాయి. ఇవి ఒకవేళ ఊపిరితిత్తుల్లోకి చేరితే ఇన్ఫెక్షన్ చుట్టుముడుతుంది.

మరోవైపు దగ్గు, తుమ్ములతో చుట్టుపక్కల గాల్లోకి ప్రవేశించే సూక్ష్మజీవులు కూడా ఇతరులకు ఈ ఇన్ఫెక్షన్ సోకేందుకు కారణం అవుతాయి.

మరోవైపు పుట్టినప్పుడు రక్తం వల్ల కూడా పిల్లలకు న్యుమోనియా సోకే అవకాశం ఉంటుంది.

భారత్‌లో టీబీ న్యుమోనియా ఇన్ఫెక్షన్ కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఆరోగ్య విభాగాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

న్యుమోనియా చికిత్స

న్యుమోనియా కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే దీన్ని తొలి దశల్లోనే గుర్తించడం చాలా అవసరం.

ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లోనూ న్యుమోనియాను తేలిగ్గానే గుర్తించొచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే మనం అప్రమత్తం కావాలి.

ఊపిరితిత్తుల్లోని వైరస్ లేదా సూక్ష్మజీవులు శరీరం మొత్తంగా వ్యాపించడానికి రోజుల నుంచి వారాల సమయం పట్టొచ్చు.

బ్యాక్టీరియా వల్ల సోకే న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందించొచ్చు. అయితే, న్యుమోనియా తీవ్రం అయితే, హాస్పత్రిలో చేరాల్సి రావొచ్చు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం లాంటి చర్యలతో న్యుమోనియా రోగులు త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను ఎలా గుర్తించాలి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. 2019లో 7,40,000 మంది అయిదేళ్ల లోపు చిన్నారులు న్యుమోనియా వల్ల మరణించారు. మొత్తం అయిదేళ్లలోపు పిల్లల మరణాల్లో ఈ వాటా 14 శాతం వరకు ఉంది.

నవజాత శిశువుల్లో న్యుమోనియాను తల్లిదండ్రులు ఎలా గుర్తించాలో ముంబయిలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ జెసల్ సేత్ వివరించారు.

జ్వరం

పిల్లలకు జ్వరం చాలా కారణాల వల్ల రావొచ్చు. సూక్ష్మజీవులతో శరీరం పోరాడేటప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. ఫలితంగా పిల్లల రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ, జ్వరం మరీ ఎక్కువగా ఉన్నా లేదా మందులకు తగ్గకపోయినా వెంటనే అప్రమత్తం కావాలి. పిల్లలను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

పిల్లల శ్వాస రోజులో ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. న్యుమోనియా అనేది ఊపిరితిత్తుల వ్యాధి. ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పిల్లలు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడతారు. కొంతమంది పిల్లలకు గురక కూడా వస్తుంది. అప్పుడు వెంటనే మనం అప్రమత్తం కావాలి.

వీడియో క్యాప్షన్, రోగులకు ఉండే 17 రకాల హక్కులేమిటో తెలుసా

ఆయాసం

న్యుమోనియా వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు పిల్లల్లో ఆయాసం మొదలవుతుంది. అలా పిల్లలు ఆయాస పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కడుపులో కదలికలు

పిల్లల కడుపులో కదలికలను తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి. అప్పుడే పిల్లల శ్వాస ఎలా ఉందో తల్లిదండ్రులకు తెలుస్తుంది. కొన్నిసార్లు జలుబు వల్ల కూడా శ్వాసలో తేడా రావొచ్చు. అయితే, మనం అప్రమత్తంగా ఉండాలి.

వ్యాక్సినేషన్ సాయంతో మనం న్యుమోనియాను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై నారాయణ హెల్త్ హాస్పిటల్ నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు.

‘‘న్యుమోకాకల్ సూక్ష్మజీవుల నుంచి వచ్చే న్యుమోనియాను అడ్డుకునేందుకు న్యుమోకాకల్ వ్యాక్సీన్ అందుబాటులో ఉంది. మరోవైపు ఫ్లూ వ్యాక్సీన్ కూడా ఉంది. వీటిని పిల్లలకు వేయించడం ద్వారా న్యుమోనియా ముప్పును అడ్డుకోవచ్చు’’అని ఆ వీడియోలో డాక్టర్ విజయ్ శర్మ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)