'యశోద' రివ్యూ: సమంత వన్ 'ఉమన్' షో!

ఫొటో సోర్స్, sridevi movies
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలంటే గతంలో కన్నీళ్లే గుర్తొచ్చేవి.
వాళ్ల బాధలు, వ్యధలు... కథలుగా మారేవి. ఇప్పుడు అలాంటివన్నీ సీరియల్స్‌లో చూసేస్తున్నారు వీక్షకులు.
కొంతకాలానికి హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ సినిమాలు మొదలయ్యాయి.
అవి కూడా చూసీచూసీ జనాలకు విసుగొచ్చేసింది.
ఇప్పుడూ అలాంటి కథలే తీస్తామంటే కుదరదు.
అందుకే లేడీ ఓరియెంటెడ్ కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
స్త్రీ శక్తిని, వాళ్ల నేర్పు, ధైర్యాన్ని, తెగువనూ మేళవించిన కథల్ని రూపొందిస్తున్నారు.
'యశోద' కూడా అలాంటి కథే. సమంతలో చాలామంది దర్శకులు గ్లామర్ కోణాన్నే చూశారు.
కానీ... ఆమెలో ప్రతిభావంతురాలైన నటి దాగి ఉంది.
సమంత యాక్షన్ చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో 'ది ఫ్యామిలీమెన్ 2' వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు తెలుస్తుంది.
ఇప్పుడు సమంతలోని యాక్షన్ కోణాన్ని పూర్తిగా వాడుకొంటూనే, నటికి పదును పెట్టించే సినిమా వచ్చింది.. అదే 'యశోద' .

ఫొటో సోర్స్, UnniMukundan/SrideviMovies
అద్దె గర్భం - మిస్టరీ మరణాలు
యశోద (సమంత) బస్తీ అమ్మాయి. చెల్లాయి అంటే ప్రాణం. అక్కలా కాకుండా అమ్మలా చూసుకొంటుంది.
చెల్లెలి ఆపరేషన్ కోసం యశోదకు డబ్బు కావాలి. అందుకోసం సరోగసీకి ఒప్పుకొంటుంది. డబ్బు కోసం అద్దెగర్భం మోయడానికి ఒప్పుకొన్న యశోదను.. ఓ రహస్య ప్రదేశానికి తరలిస్తారు.
అక్కడ యశోదలానే వందలాదిమంది అమ్మాయిలు కృత్రిమ గర్భంతో తల్లిగా మారే ప్రయత్నాల్లో ఉంటారు.
అందరి లక్ష్యం డబ్బు సంపాదించడమే. ఆ డబ్బే ఎరగా వేసి కృత్రిమ గర్భంతో కోట్లు సంపాదించే పనిలో ఓ బృందం పని చేస్తుంటుంది.
మరోవైపు... కొందరు సెలబ్రెటీలు వరుసగా చనిపోతుంటారు. ఆ మరణాలు సహజమైనవి కావనే విషయం సీబీఐ నిర్ధరిస్తుంది.
ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఓ టీమ్ కృషి చేస్తుంటుంది. సెలబ్రెటీల మరణానికీ, అద్దె గర్భం ద్వారా కోట్లు సంపాదిస్తున్న ముఠాకీ ఏమైనా సంబంధం ఉందా, ఉంటే.. అదేంటి? రహస్య ప్రదేశంలో అడుగుపెట్టిన యశోద.. అక్కడ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది? ఇవన్నీ తెరపై చూడాల్సిన విషయాలు.
ఓ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని రకాల దినుసులూ ఈ కథలో ఉన్నాయి.
సినిమా మిస్టీరియస్ డెత్‌తో మొదలవుతుంది. ఆ తరవాత.. యశోద ఎంట్రీ ఇస్తుంది.
డబ్బుల కోసం కృత్రిమ గర్భాన్ని ధరించడానికి యశోద ఒప్పుకొందన్న విషయాన్ని.. తొలి సన్నివేశాల్లోనే అర్దమయ్యేలా వివరించారు.
ఆ తరవాత.. ఓ రహస్య ప్రదేశానికి తరలిస్తారు. అక్కడ వాతావరణం, యశోదలానే డబ్బుల కోసం ఆశపడి గర్భాన్ని మోస్తున్న అమ్మాయిల కథలు, వాళ్ల మధ్య ఎమోషన్.. ఇవన్నీ మేళవించి ఫస్ట్ హాఫ్‌ను నడిపించేశారు.
మధ్యమధ్యలో సీబీఐ విచారణ కూడా కథని రక్తికట్టిస్తుంటుంది. పైకి సరోగసీ అని చెబుతున్నా - లోపల ఏదో మిస్టరీ ఉందన్న విషయం... సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రేక్షకుల ఊహకు అందుతుంది.
కానీ అదేమిటన్నది అంతు పట్టదు. దర్శకులు కూడా ఈ విషయాన్ని వీలైనంత వరకూ దాచి ఉంచడానికే ప్రయత్నించారు.
కానీ... అక్కడక్కడ కొన్ని క్లూలు వదులుకొంటూ వెళ్లారు.
యశోద పాత్రకు రెండు రకాల షేడ్స్ ఉంటాయన్న విషయం ప్రేక్షకులకు ముందు నుంచీ అర్థమవుతుంటుంది.
అది కావాలని దర్శకుడు వదిలిన లూప్.
నిజానికి యశోద పాత్రని అత్యంత అమాయకురాలిగా మార్చి.. ఈ కథని నడిపి ఉంటే ఇంకొంచెం బాగుండేది.
యశోద ఏదో అన్వేషిస్తోంది... అందుకోసమే.. సరోగసీ ద్వారా రహస్య ప్రదేశానికి వచ్చిందన్న విషయం ప్రేక్షకుడి ఊహకు అందుతూనే ఉంటుంది.

ఫొటో సోర్స్, sridevi movies
ఇలాక్కూడా జరుగుతుందా?
విశ్రాంతి వరకూ కూడా... అసలు కథ మొదలవ్వదు.
ఆ తరువాత తప్పకుండా ముడి విప్పాల్సిన తరుణం వస్తుంది.
సరోగసీ వెనుక కథేమిటి? ఆ రహస్యం ఏముందన్నది విలన్లే పాఠంలా చెప్పేస్తారు.
నిజానికి ఈ విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ ద్వారా కథానాయకుడో, నాయికో.. తెలుసుకోవాల్సిన అంశం.
అదేం జరక్కుండా.. ఎవరైతే, ఈ కుట్రకు పావులు కదిపారో, వాళ్లే పూస గుచ్చి మరీ చెప్పడం స్క్రీన్ ప్లే లోపం.
కాకపోతే.. ఆ ఎలిమెంట్స్ కొంచెం షాకింగ్ గా ఉంటాయి.
సరోగసీ రూపంలో ఏదో జరుగుతోందన్న ఊహైతే ప్రేక్షకుడికి వస్తుంది కానీ... ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి `ఇలాక్కూడా జరుగుతుందా` అని అవాక్కవుతాడు.
అక్కడితో సినిమా అయిపోదు. ఇక్కడే ఓ అసలైన ట్విస్ట్ వస్తుంది.
సరిగ్గా పతాక సన్నివేశాలకు ముందే రివీల్ అయ్యే ఈ సీన్... కథ మొత్తానికి ప్రాణం లాంటిదే.
ఇక్కడ `పోకిరి`లాంటి ఎలివేషన్లు, ప్రభావాలూ ఉన్నా - కచ్చితంగా ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ రకమైన సంతృప్తిని కలిగిస్తాయి.
నిజానికి ఇలాంటి పాయింట్ కోసమే.. అప్పటి వరకూ ఈ సినిమాని జనాలు ఓపిగ్గా చూస్తారు కూడా.
ఎప్పుడైతే ప్రేక్షకుడు సంతృప్తిపడిపోతాడో.. ఎప్పుడైతే ప్రేక్షకుడు ఊహించే, ఎదురు చూసే ఎలిమెంట్ వచ్చేసిందో, అప్పుడు ఇక ఏం చెప్పినా చూస్తాడు.
కథ చెప్పడంలో చిన్న చిన్న లాజిక్కులు మిస్ అయినా.. అవన్నీ పట్టించుకోరు.
తప్పులూ ఒప్పులైపోతాయి. యశోద విషయంలో అదే జరిగింది.
క్లైమాక్స్ బాగున్నా సుదీర్ఘంగా సాగడం.. పెద్ద మైనస్.
యశోద కథకు సమాంతరంగా సాగే సీబీఐ ఇన్వెస్టిగేషన్ ముగింపు కూడా చప్పగా, ఊహా జనితంగా ఉంటుంది.
ఏ కథైనా సింగిల్ లేయర్ లో నడిపించడం కష్టం. యశోదకూ రెండు లేయర్లు ఉంటాయి.
ఒకటి.. యశోద కథ, రెండోదీ సీబీఐ ఇన్వెస్టిగేషన్. అయితే ఇవి రెండూ సరిపోలేదు.
కథలో ఫజిల్ గా మిగిలిపోయే సన్నివేశాలు చాలా తక్కువ. కాకపోతే... దర్శకుడు కొన్నే రాసుకొన్నా అవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ఉదాహరణకు తొలి సన్నివేశాల్లో సమంత... తన రూమ్ లోకి వచ్చి.. కిటికీలోంచి ఓ పావురాన్ని పట్టుకోవాలని చూస్తుంది.
కానీ ఆ పావురం అందదు. అదే రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ సమంతని చూసి `ఆ పావురం నీకు దొరకదు` అంటుంది.
సీన్‌గా చూస్తే మామూలుగానే ఉంటుంది. కానీ... ఆ సంభాషణలకు, విజువల్స్‌కీ మరో అర్థం ఉంటుంది.
సమంత అద్దం ముందు నిలబడి.. నుదుట ఉన్న బొట్టు అద్దానికి అమరుస్తుంది.
`అలా చేయకూడదు` అని ఎవరో అంటే... `ఇది నా అద్దం.. ఇది నా బొట్టుబిళ్ల` అని సమంత మొండి సమాధానం ఇస్తుంది. ఆ మాటలకూ పరమార్థం వేరే ఉంటుంది.
ఇలా.. ఉన్నంతలో తెలివిగానే సన్నివేశాలు రాసుకొన్నాడు దర్శకుడు.
కాకపోతే.. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఊపిరి సలపనివ్వకుండా కూర్చోబెట్టడానికి ఇది సరిపోలేదు.

ఫొటో సోర్స్, sridevi movies
అంతా.. సమంతే!
సమంత కెరీర్‌లో ఇదో ఛాలెంజింగ్ రోల్ గా చెప్పొచ్చు.
గర్భవతిగా కనిపిస్తూనే, యాక్షన్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడం అంటే... నటిగా చాలా షేడ్స్ చూపించాల్సివస్తుంది.
వాటిని సరిగా హ్యాండిల్ చేసింది సమంత. తొలి సన్నివేశాల్లో అమాయకురాలిగా, ఆ తరవాత సరదా మనిషిగా కనిపించి, చివరికి తను యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది.
సమంతలోని నటి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. తనలో యాక్షన్ కోణాన్ని పూర్తిగా బయటపెట్టిన సినిమా ఇది.
సమంతతో పాటు కొన్ని కీలకమైన పాత్రలకు రెండేసి షేడ్స్ ఉంటాయి. రెండో కోణాన్ని ఎప్పుడు రివీల్ చేశారన్న దానిపైనే ఇంట్రస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఆధార పడి ఉంటుంది.
ఈ విషయంలో దర్శక ద్వయం సమర్థవంతంగానే పని చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్... ఈ పాత్రల్ని బాగానే డిజైన్ చేయగలిగారు.
ఆయా పాత్రల్లో వరలక్ష్మి, ఉన్నిముకుందన్ నటన కూడా బాగుంది.
రావు రమేష్ తనదైన కామెడీ టైమింగ్ తో కాస్త ఉల్లాసాన్ని పంచాడు.
స్త్రీ శక్తిని చాటే చిత్రమిది. 'ధైర్యముంటే ముందుకు రారా' అని అన్నప్పుడు.. `ఏం.. అమ్మాయిలకు ధైర్యం ఉండకూడదా` అంటూ సమంత ఎంట్రీ ఇవ్వడం బాగుంది.
పాటలకు స్కోప్ లేదు. ఉన్న ఒకే ఒక్క పాటని బిట్ సాంగ్ లా వాడుకొన్నారు.
నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ కథ మూడ్ కి తగ్గట్టు కుదిరాయి. ఆసుపత్రి సెట్ బాగుంది. భారీగా కనిపించింది.
సినిమాని వీలైనంత వరకూ ఈ సెట్లోనే పూర్తి చేశారు. దర్శకులు రాసుకొన్న పాయింట్ లో కొత్తదనం ఉంది.
ఆసక్తికరమైన పాయింట్ గా మలిచే వీలుంది. కొంత వరకూ ప్రేక్షకుడ్ని సర్‌ప్రైజ్ చేశారు కూడా. కాకపోతే.. అక్కడక్కడ లూజ్ ఎండ్స్ ఉండడం, ప్రధానమైన ట్విస్ట్ ని కొంతమంది ప్రేక్షకులు ముందే ఊహించగలగడం ప్రధానమైన లోపాలు. పైగా.. ఇంటిల్లిపాదీ కలిసి, హాయిగా చూసే జోనర్ కూడా కాదు.
ఓటీటీలో ఇంటిపట్టున కూర్చుని కూసేంత స్టఫ్.. యశోదలో ఉంది. థియేటర్లకు కూడా జనం వచ్చి చూస్తే అది బోనస్ అవుతుంది.
అద్దెగర్భం.. దాంతో కోట్లు సంపాదించే ముఠా.. ఇదంతా కనెక్ట్ అయ్యేపాయింట్స్. కాకపోతే.. అదేదో స్విడ్ గేమ్ తరహాలో.. అందర్నీ ఒకే చోట ఉంచి, అక్కడేదో రహస్యంగా చేయడం వల్ల.. సామాన్య జనానికి, వాస్తవానికి కాస్త దూరంగా జరిగిపోయింది.
ఆ పాయింట్ ని ప్రేక్షకులు ఓన్ చేసుకోకపోయే ప్రమాదం ఏర్పడింది.
ఎమోషన్, థ్రిల్.. తో పాటు సమంత విన్యాసాలు వర్కవుట్ అవ్వడంతో `యశోద`కు పాస్ మార్కులు పడిపోతాయి.
ఇవి కూడా చదవండి:
- దివ్య ఎస్ అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించటం మీద ఎందుకీ చర్చ?
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయా?
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ఆంధ్రప్రదేశ్ - మోదీ విశాఖ పర్యటన: విభజన హామీలు ఎంత వరకు వచ్చాయి, స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి?
- అదా శర్మ బురఖాతో నటించిన సినిమాపై కేరళలో వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














