యోగి వేమన విశ్వవిద్యాలయంలో విగ్రహాల మార్పుపై వివాదం ఎందుకు, ఎవరు ఏమంటున్నారు?

యోగి వేమన విగ్రహం

ఫొటో సోర్స్, @FactCheckAPGov

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

కడపలోని యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలగించారని, దాని స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ప్రతిష్టించారని ఇటీవల వార్తలు వచ్చాయి. దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు, నాయకుల ట్వీట్లతో ఇది మరింత వివాదాస్పదం అయ్యింది.

యోగివేమన విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు.

వర్సిటీకి ఏ గ్రేడ్ ప్రకటించిన రోజే వేమన విగ్రహం స్థలాన్ని మార్చి, అక్కడ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టినట్లు వచ్చిన ఆ వార్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ కూడా చేశారు. దానితోపాటూ ఒక వేమన పద్యం కూడా పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పవన్ ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన factcheck.ap.gov.in తమ ట్విటర్ హ్యాండిల్లో పవన్‌ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పింది. ఆయన షేర్ చేసిన వార్తా కథనం పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, యోగి వేమన వర్సిటీలోని వేమన విగ్రహాన్ని అత్యంత గౌరవంగా యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గర ఏర్పాటు చేశామని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఈ విగ్రహం తొలుత రోడ్డు మధ్యలో ఉండేదని, ఇప్పుడు దాన్ని యూనివర్సిటీ గేటు దగ్గర మధ్యలో ప్రతిష్టించామని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే, యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న యోగి వేమన విగ్రహాన్ని ఉన్న చోటు నుంచి ఎందుకు తొలగించారు? ఎక్కడ ప్రతిష్టించారు? అక్కడ వైఎస్ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనిపై ఎవరు ఏమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో చూద్దాం.

వేమన విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహం

యోగి వేమన విగ్రహం

ఫొటో సోర్స్, Yogi Vemana University

ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీలో యోగి వేమన విగ్రహం పాత చోటులో ఉన్నప్పటి దృశ్యం

యోగి వేమన యూనివర్సిటీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో స్థాపించారు. 2014లో అప్పటి యూనివర్సిటీ వీసీ శ్యాం సుందర్ యూనివర్శిటీ లోపలే యోగి వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీ ప్రాంగణంలోని నాలుగు రోడ్ల కూడలిలో అయితే విగ్రహం బాగా కనిపిస్తుందని దానిని అక్కడ ప్రతిష్టించారు. ఈ ఏడాది నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (NAAC) గ్రేడ్ కేటాయించేందుకు వర్సిటీలో పర్యటించనుండడంతో అక్టోబర్ చివరి వారంలో యోగి వేమన యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేశారు. ఇందులో భాగంగా యూనివర్సిటీకి గేటు ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోడ్ల కూడలిలో ఉన్న యోగి వేమన విగ్రహాన్ని తీసుకువచ్చి ఆ గేటు ముందు ప్రతిష్టించారు.

వర్సిటీ గేటు వద్ద వేమన విగ్రహం
ఫొటో క్యాప్షన్, వర్సిటీ లోపల రోడ్ల కూడలిలో ఉన్న యోగి వేమన విగ్రహాన్ని తీసుకువచ్చి గేటు ముందు ప్రతిష్టించారు
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం
ఫొటో క్యాప్షన్, ఇంతకుముందు వేమన విగ్రహం ఉన్న చోట వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు

కూడలిలో తీసివేసిన యోగి వేమన విగ్రహం స్థానంలో సైన్స్ బ్లాక్ దగ్గరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించారు. ఆ తర్వాత, 2022 నవంబర్ 2 నుంచి 4 వరకూ నాక్ అధికారుల బృందం యోగి వేమన యూనివర్సిటీలో పర్యటించింది. బుధవారం నవంబర్ 10న ఆ విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్ కూడా ప్రకటించింది. యూనివర్సిటీ ‘ఏ’ గ్రేడ్ సాధించిందని వర్సిటీ అధికారులు గొప్పగా చెప్పుకునే తరుణంలో.. ఈ విగ్రహాలు మార్చడం ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది. కొన్ని ప్రధాన తెలుగు వార్తా పత్రికల్లో దీనిపై కథనాలు రావడం, జనసేన అధినేత ఆ కథనాల ఫొటోలను ట్వీట్ చేయడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. విద్యార్థి సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు యూనివర్శిటీ ముందు ఆందోళన చేపట్టారు.

వైస్ చాన్సలర్ మునగల సూర్య కళావతి
ఫొటో క్యాప్షన్, ఇంత ఇష్యూ చేస్తారని నేను అనుకోలేదని యూనివర్సిటీ వీసీ మునగల సూర్య కళావతి చెప్పారు

‘15 రోజులయ్యాక ఇష్యూ చేస్తున్నారు’

ఈ విగ్రహాల మార్పు మొత్తం నాక్ గ్రేడ్ పొందడం కోసం యూనివర్సిటీలో చేసిన సుందరీకరణ పనుల్లో భాగంగానే జరిగిందని, దీన్ని వివాదాస్పద అంశంగా మార్చారని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మునగల సూర్య కళావతి బీబీసీతో చెప్పారు. “ఎప్పుడు కూడా మేము యోగి వేమనను తక్కువ చేసే విధంగా ఎక్కడ కూడా చేయలేదు. ఇక్కడ ఎక్కడ చూసినా యోగివేమన పద్యాలు మా యూనివర్సిటీలో ఉంటాయి. మేం వేమన వాణి అనే ఒక త్రైమాసిక పత్రికను కూడా నడుపుతున్నాం. ఆయన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటాం. మాకు నాక్ గ్రేడ్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ యూనివర్సిటీని మొత్తం విస్తరించాం. మొత్తం యూనివర్సిటీని అందంగా తీర్చిదిద్దాం’’ అని ఆమె వివరించారు. ‘‘మాకు ‘ఏ’ గ్రేడ్ వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోవడంలేదు. వేమన విగ్రహాన్ని మార్చి కూడా 15 రోజులు అయింది. నాక్ విజిట్ చేసి వెళ్లి, ‘ఏ’ గ్రేడ్ కూడా వచ్చాక, దీన్ని ఇష్యూ చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

అన్ని యూనివర్సిటీల ముందూ ఆ యూనివర్సిటీ పేరుకు సంబంధించిన విగ్రహమే ఉంటుంది కాబట్టి అంతకు ముందు వెనుక ఉన్న యోగి వేమన విగ్రహాన్ని యూనివర్సిటీ ముందు ప్రతిష్టించామని, ఆ విగ్రహం తీసేయడంతో ఖాళీ అయిన ప్లేస్‌లో వర్సిటీ స్థాపనకు కారణమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టామని వీసీ చెప్పారు. “మేము బయటనుంచి ఏ విగ్రహాలూ తీసుకురాలేదు. మా దగ్గర ఉన్న విగ్రహాన్నే రీలొకేట్ చేశాం. ఎంట్రన్స్ ముందు యోగి వేమన గారి విగ్రహం పెట్టి, తర్వాత దాని వెనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దీన్ని ఇంత ఇష్యూ చేస్తారని నేను అనుకోలేదు’’ అన్నారామె. విద్యార్థి సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించలేదని, ఇంకాస్త పెద్ద విగ్రహం పెట్టండి, లేదా హైట్ పెంచండని కోరారని వీసీ తెలిపారు. దానికి భవిష్యత్తులో చూద్దామని తాము చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పేరు కూడా వైయస్సార్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని పెట్టడం జరిగింది. మేము మంచి ఉద్దేశంతో ఇదంతా చేశాం. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు” అన్నారు.

విద్యార్థి సంఘం నిరసన
ఫొటో క్యాప్షన్, వేమన విగ్రహం స్థానాన్ని మార్చటం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి

‘వేమన విగ్రహానికి అవమానం’

విద్యార్థి సంఘాలు దీనిని వ్యతిరేకించలేదని వీసీ చెబుతున్నా, రాయలసీమ విద్యార్థి సంఘం, ఏఎస్ఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలు మాత్రం ఈ విగ్రహాల మార్పును తప్పుబడుతున్నాయి. వేమన విగ్రహానికి అవమానం జరిగిందని ఆరోపిస్తూ యూనివర్శిటీ ముందూ ఆందోళన చేశారు. యూనివర్సిటీలో ఏ పని జరగాలన్నా వర్సిటీ పాలకమండలి సభ్యుల సమావేశం నిర్వహించాలని, అదేమీ లేకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఎందుకు మార్చారని రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్.వి.ఎస్) రాష్ట్ర కార్యదర్శి మల్లేల జగదీష్ ప్రశ్నించారు. “యూనివర్సిటీని న్యాక్ విజిట్ చేస్తుందని, ఉన్నట్టుండి కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని డెవలప్ చేశారు. గేటు కూడా పెట్టారు. డెవలప్మెంట్‌లో భాగంగా 2014లో అప్పట్లో స్థాపించిన యోగి వేమన విగ్రహాన్ని తీసుకొచ్చి గేటు ముందు పెట్టారు. అది ఉన్న స్థానంలో ఎక్కడో సైన్స్ బ్లాక్ దగ్గర ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘యూనివర్సిటీలో ఏ పని జరగాలన్న యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల సమావేశంలో అనుమతి ఉండాలి. అది ఏమి జరగకుండా రాత్రికి రాత్రి విగ్రహాన్ని ఎందుకు మార్చారు? యోగి వేమన యూనివర్సిటీ ముందు ఉండాలి, అందరికీ కనపడాలి అనుకుంటే పెద్దదిగా ముందు, ఒక దిమ్మె కట్టి పెట్టచ్చు. ఇలా ఆయన విగ్రహాన్ని కిందకు పెట్టడం ఒక విధంగా ఆయన్ను అవమానించడమే” అన్నారు.

యోగి వేమన, వైఎస్ఆర్ విగ్రహాలు

ఒకవేళ యోగి వేమన విగ్రహం స్థానంలో పెట్టాలంటే వెనకే ఉన్న అంబేడ్కర్ విగ్రహం కూడా అక్కడ పెట్టుండవచ్చని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక వర్గం, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాజకీయాల కోసమే ఈ విగ్రహాల మార్పు జరిగిందని జగదీష్ ఆరోపించారు. “యూనివర్సిటీని రాజశేఖర్‌రెడ్డి స్థాపించడం అభినందనీయమే. కానీ, అది ప్రజాధనమే కదా. ఇలా అన్యాయంగా, అవమానకరంగా చేశారు కాబట్టే మేం దీన్ని ప్రశ్నిస్తున్నాం. మేం కోరేది ఒక్కటే. వేమనది చిన్న విగ్రహం కాకుండా పది అడుగుల ఎత్తు దిమ్మె కట్టి, దాని పైన పెద్ద కాంస్య విగ్రహం పెట్టాలని మేము కోరుతున్నాం” అన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి గంగా సురేష్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. యోగి వేమన విగ్రహం ఉన్న స్థానం నుంచి దాన్ని ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో అప్పటి యూనివర్సిటీ వీసీ శ్యాం సుందర్ నాలుగు రోడ్ల కూడలి కాబట్టి బాగా కనిపిస్తుందని అక్కడ యోగి వేమన విగ్రహాన్ని ప్రతిష్టించారని ఆయన చెప్పారు. “రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఇప్పుడు పెట్టిన స్థానం నుంచి యోగి వేమన విగ్రహాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. వేమన పేరు ఉంది కాబట్టి ముందుకు తెచ్చామని అధికారులు చెప్తున్నారు. ఇది సంతోషకరమైన విషయమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ బంధు వర్గం ప్రధాన కూడలిలో రాజశేఖర్ రెడ్డి బాగా కనిపించాలి అనే అక్కడ పెట్టారు. వేమనకు కులం, మతం, ప్రాంతం లేదు కాబట్టి ఆయన విగ్రహాన్ని తీసి ఇక్కడ పెట్టారు. నిలబడితే మోకాళ్ళ ఎత్తు కూడా లేని వేమన విగ్రహం పెట్టడం తప్పు” అని అన్నారు.

మాజీ వీసీ సాంబశివారెడ్డి
ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీ అధికారులు వేమన గౌరవాన్ని పెంచారే కానీ, తగ్గించలేదని వర్సిటీ మాజీ వీసీ సాంబశివారెడ్డి చెప్పారు

‘వేమన గౌరవాన్ని మరింత పెంచారు’

అయితే యూనివర్సిటీ అధికారులు వేమన గౌరవాన్ని పెంచారే కానీ, తగ్గించలేదని చరిత్రకారుడు, విశ్వవిద్యాలయం మాజీ ప్రిన్సిపల్ సాంబశివారెడ్డి అన్నారు. దీనికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం బాధాకరం అన్నారు. “2006లో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారనే గౌరవంతో సైన్స్ బ్లాక్ దగ్గర వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టారు. రాజకీయ దురుద్దేశం ఉన్నట్టయితే ఆయన విగ్రహం ప్రధాన ద్వారం దగ్గరే పెట్టేవారు. అలాంటప్పుడు తప్పు పట్టాలి. కానీ, అలా జరగలేదు. అక్కడున్న యోగి వేమన విగ్రహం తీసేసినప్పుడు అది ఖాళీగా ఉంది కాబట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా గౌరవం కల్పించాదలనే ఉద్దేశంతో అక్కడ వైఎస్ విగ్రహాన్ని పెట్టారు. అంతే తప్ప ఇది ఎవరిని అవమాన పరచాలని కాదు. ప్రధాన ద్వారం దగ్గర వేమన, దాని వెనకాల వైఎస్, ఆ తర్వాత అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయి. సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు” అని పేర్కొన్నారు. యూనివర్సిటీలో వేమనకు సముచిత గౌరవం కల్పించారని, ఏ చిన్న వేడుక జరిగినా వేమన పద్యాలతోనే ప్రార్థన జరుగుతుందని, ఆయనకు వందనం సమర్పించిన తర్వాతే ఏ కార్యక్రమం అయినా ప్రారంభిస్తామని సాంబశివారెడ్డి వివరించారు. ‘‘ముఖ్యంగా వేమన విగ్రహం ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు, కడప నుంచి పులివెందులకు వెళ్లే వారు, దారిలో దాన్ని చూస్తూ వెళ్తారు. ప్రధాన ద్వారం దగ్గర వేమన విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గౌరవాన్ని పెంచారు. ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. 2006లో ప్రారంభమైన అప్పటి యూనివర్సిటీల్లో ఇతర వర్సిటీలకు ‘బీ’ గ్రేడ్ కూడా రాలేదు. కానీ దీనికి ‘ఏ’ గ్రేడ్ రావడం చాలా గర్వకారణం” అన్నారు.

జానమద్ది విజయ భాస్కర్
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినట్లే, యోగి వేమన వర్సిటీ పేరు కూడా మారుస్తారనే అనుమానాలు కలుగుతున్నాయని జానమద్ది విజయ భాస్కర్ చెప్పారు

‘యూనివర్సిటీ పేరే మారుస్తారేమో...’

వేమన విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో వైఎస్ విగ్రహం పెట్టడం చాలా మందికి బాధ కలిగించిందని యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గ్రంథాలయం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయ భాస్కర్ బీబీసీతో చెప్పారు. యోగి వేమన పద్యాలకు ప్రాచుర్యం తెచ్చిన సి.పి.బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆయన తండ్రి హనుమంత శాస్త్రి స్థాపించారు. ఉన్న విగ్రహాన్ని అక్కడకు తరలించకుండా, మరింత భారీగా ఆకర్షణీయంగా ఉన్న యోగి వేమన విగ్రహాన్ని గేటు ముందు ప్రతిష్టించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. “మూడున్నర సంవత్సరాల క్రితమే అక్కడ వేమన విగ్రహం పెట్టాలని తీర్మానం చేశారు. దానిని పక్కన పెట్టి ఇప్పుడు అక్కడే ఉన్న పాత విగ్రహాన్ని తొలగించి గేటు ముందు పెట్టారు. అది కూడా యోగి వేమనకి సముచితంగా లేదు. సరైన ఎత్తులో, చూపరులను ఆకట్టుకునే విధంగా అది లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడం ఎవరూ వ్యతిరేకించరు. అయితే, వేమన విగ్రహానికి అంత గౌరవం దక్కలేదు. వేమనను గౌరవించాలనే ఉద్దేశం ఉంటే, దానిని ఇంకా పెద్దగా, బంగారు రంగులో ప్రతిష్టిస్తే ఎవరు కాదంటారు? అక్కడ తీసి, ఇక్కడ పెట్టడం అనేది ఆందోళన కలిగించే విషయం” అన్నారు. ఈ విగ్రహాల మార్పు చూస్తున్న కొందరికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినట్లే, యోగి వేమన వర్సిటీ పేరు కూడా మారుస్తారనే అనుమానాలు వస్తున్నాయని విజయ భాస్కర్ అన్నారు. “ఇలా అయినా యోగి వేమన విశ్వవిద్యాలయానికి గుర్తింపు వచ్చిందేమోనని కొందరు అనుకుంటున్నారు. కానీ వేమన విగ్రహం అక్కడ తొలగించి, గేటు ముందు ప్రతిష్టించడం వాంఛనీయం కాదు. ఇది చాలా మంది మనోభావలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. నేషనల్ అక్రిడేషన్ కమిటీ వారు ఇటీవలే పర్యటించివెళ్లారు. దీంతో, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినట్లే, దీనికి కూడా పేరు మారుస్తారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు