తిరుపతి: కులాంతర వివాహం చేసుకున్న యువతికి దళితవాడ పెద్దల జరిమానా.. ‘కుల కట్నం చెల్లించనందుకు దాడి’

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
‘‘మాదిగను చేసుకుంది, దీన్ని చూసి మా పిల్లలు కూడా నేర్చుకుంటారు దీన్ని చంపేయాలి అని బెదిరించారు. సూటిపోటి మాటలతో వేధించారు. 50 వేలు అపరాధం కట్టాలని, లేకపోతే ఊళ్లోకి రాకూడదని బెదిరించారు. పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే, అపరాధం అడగబోమని చెప్పి రాజీ కుదుర్చుకున్నారు. మళ్లీ ఈ నెల 14న దాని కోసం నాపైన దాడి చేశారు’’అని 22 ఏళ్ల లీలావతి బీబీసీ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాత వీరాపురం దళితవాడకు చెందిన లీలావతి, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన మాదిగ యువకుడు శ్రీహరి ఇదే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లీలావతి మాల కులానికి చెందినవారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
రేణిగుంట సమీపంలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నప్పుడు లీలావతి, శ్రీహరి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి తరపువారు ఒప్పుకున్నా, అమ్మాయి తరఫువారు మొదట ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత వాళ్లు కూడా ఈ జంటను ఆశీర్వదించారు.
మాదిగ యువకుడిని పెళ్లిచేసుకున్నందుకు లీలావతి నివసించే దళితవాడలోని పెద్దలు అపరాధం కట్టాలన్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. దీనికి ఎదురు తిరిగిన యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితవాడ పెద్దలను పోలీసులు పిలిపించి, అలాంటివి మరోసారి జరగకూడదని చెప్పి పంపేశారు.
ఇదంతా మూడు నెలల క్రితం జరిగింది. అయితే, వీరాపురం దళితవాడ పెద్దలు మళ్లీ ఇప్పుడు పరిహారం కట్టలేదంటూ తనపై దాడి చేశారని బాధితురాలు తెలిపారు.

సూటిపోటి మాటలు..
ఈ కులంతార వివాహాన్ని తమ రెండు కుటుంబాలు అంగీకరించినా, దళితవాడలోని మిగతా మహిళలు తమ కుటుంబాన్ని సూటిపోటి మాటలు అంటుండేవారని లీలావతి చెప్పారు.
ఇటీవల, శ్రీహరికి బెంగళూరులో ఉద్యోగం రావడంతో లీలావతిని ఆమె పుట్టింటిలో వదిలిపెట్టి వెళ్లారు.
తాను మళ్లీ గ్రామంలోకి వచ్చానని, అపరాధం కట్టలేదని అంటూ దళితవాడలోని మహిళలు మళ్లీ వేధిచడం మెదలు పెట్టారని లీలావతి ఆరోపించారు. అక్టోబర్ 14న దళిత పెద్దలు తన కుటుంబ సభ్యులతో గొడవపడ్డారని, తనపై దాడి చేశారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
‘‘పెళ్లయిన మూడు నెలల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నువ్వు మాదిగను చేసుకున్నావ్. నువ్వు ఊరిలోకి రావాలంటే అపరాధం కట్టాలి. కట్టే వరకు నువ్వు ఊళ్లోకి రాకూడదు అని పెద్దలు చెప్పారు. దాంతో నేను వారిపై కేసు పెట్టాను. తర్వాత మిమ్మల్నిక డబ్బులు అడగము అంటూ పెద్దలు రాజీ అయ్యారు. మా ఆయన బెంగుళూరులో ఉద్యోగం కోసం వెళ్తూ నన్ను నెల క్రితం మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్లాడు. అయితే గ్రామస్థులు మొన్న అక్టోబర్ 14న మధ్యాహ్నం నన్ను మళ్లీ తిట్టడంతో మా ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఎందుకు తిడుతున్నారని మా ఇంట్లోవాళ్లు అడగడంతో మా ఇంటి పైకి గొడవకు వచ్చిన మా కాలనీ వాళ్లు.. మాపైన దాడి చేశారు. దాడిలో నేను తీవ్రంగా గాయపడ్డాను” అని లీలావతి చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
చేతబడులు చేస్తున్నామని ఆరోపణలు
తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి బీబీసీతో తన బాధను పంచుకున్నారు. కాలనీవాసుల దాడిలో తీవ్ర రక్తస్రావం అయ్యిందని ఆమె చెప్పారు. అపరాధం కట్టలేదని చేతబడులు చేస్తున్నామని ఆరోపిస్తూ తమ కుటుంబంపై కేసులు పెడుతున్నారని చెప్పారు.
“నాకంటే ముందు ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ అపరాధం కట్టారు. తర్వాత నన్ను కూడా కట్టమన్నారు. నేను మాదిగ యువకుడిని పెళ్లి చేసుకున్నానని 50 వేలు కట్టమన్నారు. మమ్మల్ని గుడి దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దీంతో, మేం మా ఇంటి దగ్గరే మా కులదైవానికి పూజలు చేసుకుంటున్నాం. దాంతో చేతబడులు, వశీకరణలు చేస్తున్నామంటూ మా అన్నదమ్ములపై కేసులు పెడుతున్నారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు నేను ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడం కూడా సమస్యగా ఉంది. నా ప్రేమ వివాహన్ని మా కుటుంబం అంగీకరించినా, మా ఊళ్లో వాళ్లు మాత్రం ఒప్పుకోవడం లేదు” అన్నారు లీలావతి.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
శ్రీహరి తక్కువ జాతి వ్యక్తి అని, ఆయన్ను పెళ్లి చేసుకున్నందుకు లీలావతి కుల కట్నం కట్టాలని గ్రామస్థులు తమపై దాడి చేసినట్లు లీలావతి తల్లి పద్మ ఆరోపించారు. మా అమ్మాయి వివాహాన్ని మేం ఓప్పుకున్నా మా దళితవాడలో వారు ఒప్పుకోలేదన్నారు.
‘‘ఊరంతా వచ్చి నన్ను, నా కోడల్ని దారుణంగా కొట్టారు. నా కూతురిని కడుపుపై తన్నారు. మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారు, అది ఇక్కడికి రాకూడదు అని మమ్మల్ని తిట్టారు. మేం క్షుద్ర పూజలేవీ చేయలేదు. మమ్మల్ని గుడిలోకి రానీయరు. అందుకు మా కుల దేవున్ని ఇంటిలో పెట్టుకున్నాము. ఊరంతా ఒకటి. మా ఇల్లు మాత్రమే ఒకటిగా ఉన్నాం. వీళ్లు ఈ ఊళ్లోనే ఉండకూడదని కొడుతున్నారు. డబ్బు ఉన్నప్పుడు, నేను కుల కట్నం కట్టేస్తా అని కూడా చెప్పాను. కానీ వాళ్లు వినలేదు. మా కూతురు వచ్చినప్పుడల్లా మాపై దాడి చేస్తున్నారు’’ అని చెప్పారు పద్మ.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
గ్రామస్థులు ఏం అంటున్నారు?
అయితే యువతిపై దాడి చేశారని చెబుతున్న కాలనీలోని మిగతా దళితులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తమ కుటుంబాల్లో కూడా కులాంతర వివాహాలు జరిగాయంటున్న మురగయ్య, తమకు కుల వివక్షలేదని, క్షుద్రపూజలు చేయవద్దన్నందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు.
‘‘మేం కొట్టలేదు. ఆ పాపని నేను కొట్టానని, తన్నానని చెప్తున్నారు. ఆమె నాకు చెల్లెలవుతుంది. కుల కట్నం పేరుతో వేధిస్తున్నామని మాపైన తప్పుడు కేసులు పెట్టారు. మా ఊళ్లో కుల కట్నం అనేది లేదు. మా కుటుంబంలో వేరువేరు కులాల వాళ్లను పెళ్లి చేసుకున్నాము. ఇదంతా లీలావతి అన్న చంద్ర వల్లే జరుగుతోంది. వాళ్లు క్షుద్ర పూజలు చేస్తారు. దీంతో మాలవాడ అంతా భయపడుతోంది. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో శిలలు పెట్టారు. బయటివాళ్లంతా కార్లు, ఆటోలలో వచ్చి పూజలు చేయించుకుంటారు. శ్మశానంలో కూడా పూజలు చేస్తుంటారు’’ అని మురగయ్య బీబీసీతో చెప్పారు.
లీలావతి ఫిర్యాదుతో దళితవాడలో ముగ్గురిపై కేసు పెట్టామని ఏర్పేడు సీఐ శ్రీహరి బీబీసీకి చెప్పారు. కానీ, ఊళ్లో ఎవరైనా ప్రేమ వివాహం లేదా కులాంతర వివాహం చేసుకుంటే, ఎస్సీ కాలనీ అభివృద్ధికి, గుడికి డబ్బులివ్వాలని లేదా అందరికీ భోజనాలు పెట్టాలని అక్కడ ఒక కట్టుబాటు కూడా ఉందన్నారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
‘‘మేం కొంతమందిని విచారిస్తే గతంలో కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు భోజనాలు పెట్టాం అని చెప్పారు. అలాగే లీలావతిని అడిగితే ఆ అమ్మాయి మేం ఎందుకు కట్టాలి అని వారిని ఎదిరించింది. దాంతో, స్థానిక మహిళలు మన ఆచారం ప్రకారం డబ్బులు కట్టాలని ఆమెను నిలదీయడంతో వారి మధ్య గొడవ జరిగిందని తెలిసింది. తర్వాత అదే విషయంలో ఆ అమ్మాయిని కొట్టడంతో, ఆమె తిరుపతి రుయా హాస్పిటల్‌లో చేరింది. దీనిపైన వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని ఏర్పేడు సీఐ వివరించారు.
ఇలాంటి ఆచారాలు ఉండకూడదని గ్రామస్థులకు అవగాహన కూడా కల్పించామని ఆయన చెప్పారు.
“అమ్మాయి మాల, అబ్బాయి మాదిగ.. అందరూ ఎస్సీలే. కానీ గ్రామంలో పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా, ప్రేమ వివాహం లేదా కులాంతర వివాహం చేసుకుంటే డబ్బులు కట్టాలనే నియమాలు పెట్టుకోవడం జరిగింది. అలాంటి ఆచారాలు ఉండకూడదు అని గ్రామస్థులకు అవగాహన కూడా కల్పించాం”అని ఆయన వివరించారు.
పరిస్థితి మెరుగుపడుతోంది...
దీనిపై వీరాపురానికే చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక స్థానిక ప్రజా ప్రతినిధి కూడా బీబీసీతో మాట్లాడారు.
“లీలావతి ఇంట్లో ఏవో పూజలు చేస్తున్నారని గ్రామస్థులందరూ భయపడుతున్నారు. దీంతో గ్రామం అంతా ఒకటిగా, యువతి కుటుంబం మాత్రమే ఒకటిగా అయిపోయింది. ఊళ్లో కులాంతర వివాహం చేసుకున్నప్పుడు డబ్బులు కట్టే ఆచారం కూడా ఉంది. అడిగినపుడు అది కట్టకుండా ఎదిరించారనే కోపం మనసులో పెట్టుకున్న మిగతా దళిత కాలనీ వాసులు, వారు పూజలు చేస్తున్నారనే సాకుతో ఆ కుటుంబంపై దాడి చేసుండవచ్చు”అని అన్నారు.
ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త శ్రీహరి బెంగళూరులోనే ఉన్నారు. కొన్ని రోజులు ఉద్రిక్తంగా ఉన్న దళిత వాడలో ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడుతోంది. విచారణ కోసం పోలీసులు తరచూ వచ్చిపోతుండడంతో దళితవాడలోని మిగతా కుటుంబాల వారు పెదవి విప్పడం లేదు.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















