ఆంధ్రప్రదేశ్: మంత్రి మేరుగు నాగార్జున దళితులను అవమానించారా, ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున

ఫొటో సోర్స్, Facebook/Merugu Nagarjuna

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున

'నువ్వు దళితుడివే అయితే, దళితుడికే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా'

ఈ మాటలు అన్నది ఒక రాష్ట్ర మంత్రి.

ఈ మాటలకు వేదిక అయినది ఒక రాష్ట్ర అసెంబ్లీ.

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, నేడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల మీద రాజకీయ దుమారం రేగుతోంది.

నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగం మీద చర్చ చేపట్టాలంటూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల గురించి మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల వల్ల గందరగోళం చోటు చేసుకుంది.

ఈ సమయంలో ఆగ్రహానికి గురైన మంత్రి నాగార్జున, 'నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుట్టి ఉంటే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా' అని అన్నారు.

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం రేగింది. తెలుగు దేశం పార్టీ ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈమేరకు టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

దళితుడైన బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లాలోని కొండేపీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మంత్రి మేరుగు నాగార్జున

ఫొటో సోర్స్, AP Assembly

మంత్రి వివరణ

స్పీకర్ వివరణ అడగ్గా అసెంబ్లీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు.

'అధ్యక్ష, ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గురించి సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు నేను మాట్లాడుతున్నాను. సమాధానం చెబుతున్నప్పుడు తెలుగు దేశం పార్టీ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు.

అప్పుడు వాడిన భాష బాగాలేదు. అనేక రకాలుగా ముఖ్యమంత్రిని, సభ్యులను దూషించారు. కుల ప్రస్తావన కూడా వచ్చింది.

నేను మాట్లాడుతుంటే బాల వీరాంజనేయులు తాను తీసుకొచ్చిన పేపరు నాకు ఎదురుగా పెట్టారు. ఎస్సీ పిల్లల స్టడీ సర్కిళ్ల కోసం మాట్లాడుతుంటే దళితుడివైన నువ్వు మద్దతు ఇవ్వాలి కదా అని అన్నాను.

అప్పుడు బాల వీరాంజనేయ స్వామి నువ్వు దళితుడివా అంటూ నన్ను ప్రశ్నించారు. అప్పుడు మాత్రమే... దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అని అన్న చంద్రబాబు నాయుడి తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు రండి అని ఆయనను అన్నాను.

అంతే తప్ప తప్పుగా నేను ఏమీ మాట్లాడలేదు' అని మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.

'సభా మర్యదలు మరచి పోయి నువ్వు దళితునివా అంటూ నన్ను ప్రశ్నించినప్పుడు నేను స్పందించాల్సిన అవసరం ఉంది. నేను దళితుణ్ని. నా కులాన్ని చంద్రబాబు అవమానించారు. అటువంటి పార్టీలో మీరు ఎందుకున్నారు? బయటకు రండి అన్నాను తప్ప నేను తప్పుగా మాట్లాడలేదు' అని మేరుగు నాగార్జున అన్నారు.

దళిత వర్గానికి చెందిన మేరుగు నాగార్జున గుంటూరులోని వేమూరు నియోజక వర్గ ఎమ్మెల్యే.

కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి

ఫొటో సోర్స్, AP Assembly

ఫొటో క్యాప్షన్, కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి

'సాటి దళితుడిని అవమానిస్తారా?'

సాటి దళిత శాసనసభ్యున్ని అవమానించిన మంత్రి ఏ మాత్రం పశ్చాత్తాపపడకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం ఏంటని బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు.

'నా పుట్టుక గురించి మాట్లాడారు. నేను దళిత శాసనసభ్యుడిని. నన్ను పట్టుకుని దళితుడిగా పుట్టావా? అని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన పశ్చాత్తాప పడటం లేదు.

అధికార సభ్యులు వందసార్లు చెప్పినా సత్యం అసత్యం కాదు' అని అసెంబ్లీలో బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు.

తాను సభలో ఎటువంటి అసభ్యపదజాలం వాడలేదని, కావాలంటే రికార్డులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఫొటో సోర్స్, AP Assembly

'రికార్డులు ప్లే చేయండి'

తనను అవమానించలేదంటూ మంత్రి చెబుతున్నారని, అయితే వాస్తవం తెలిసేందుకు రికార్డులు ప్లే చేయాలని బాల వీరాంజనేయ స్వామి స్పీకర్‌ను కోరారు. వారు ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా రికార్డుల్లో లేకపోతే తాను రాజీనామా చేస్తానని సవాలు చేశారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను ప్లే చేయాలంటూ వీరాంజనే స్వామి పట్టుబట్టగా తాను రికార్డులు చూసి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం బదులిచ్చారు.

నారా చంద్ర బాబు

ఫొటో సోర్స్, Facebook/TDP

సభలో గందరగోళం

మంత్రి మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో గందరగోళం చోటు చేసుకుంది.

'దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరు అంటూ చంద్రబాబు నాయుడు ఎస్సీలను అవమానించారని' అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతున్న సమయంలో మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యల వీడియోను అసెంబ్లీలో ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

సభలో వీడియో ప్లే చేయడానికి తాను అనుమతించనని స్పీకర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, స్పీకర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మంత్రి అంబటి రాంబాబు

ఫొటో సోర్స్, Facebook/YSRCP

ఫొటో క్యాప్షన్, మంత్రి అంబటి రాంబాబు

'స్పీకర్ గారు నాకు న్యాయం చేయండి'

బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, బుగ్గన వంటి వారికి స్పీకర్ మైక్ ఇచ్చారు.

'మంత్రి నాగార్జున మీదకు దురుసుగా బాల వీరాంజనేయ స్వామి వస్తుంటే వాళ్ల పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్ ఆయనను వెనక్కి తీసుకెళ్లారు. లేదంటే నాగార్జున మీద బాల వీరాంజనేయ స్వామి వచ్చి పడతారనే ఉద్దేశంతోనే పయ్యావుల కేశవ్ ఆ పని చేశారు' అని అంబటి రాంబాబు అన్నారు.

ఆ తరువాత మధ్యలో మేరుగ నాగార్జున, బుగ్గన కూడా మాట్లాడారు.

అయితే తాను మాట్లాడుతున్నప్పుడు మీరు అధికారిక పక్షం వారికి మైకు ఇవ్వడం సమంజసం కాదని వీరాంజనేయ స్వామి స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. మధ్యమధ్యలో వారికి మైకు ఇవ్వకండని, తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

సుమారు గంటన్నర పాటు ఈ చర్చ సాగింది. చివరకు రికార్డులు చూసి తాను తుది నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చి చర్చను ముగించారు.

వీడియో క్యాప్షన్, వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)