గాలి కాలుష్యంతో ఊపిరితిత్తులకు క్యాన్సర్.. పొగ తాగకపోయినా క్యాన్సర్ రావడానికి కారణం ఇదే..

గాలి కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గళ్లఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాలి కాలుష్యం క్యాన్సర్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పొగ తాగనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం ఇదేనని తెలిసింది.

'వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే మార్పులు జరుగుతుంటాయి. ఇది సహజమే. కానీ అవి మాములుగా అయితే నిద్రాణంగా ఉంటాయి. కానీ గాలి కాలుష్యం ఊపిరితిత్తుల్లో ఉండే ఇలాంటి కణాలను నిద్ర లేపుతోంది. తద్వారా అవి పెరిగి గడ్డలు ఏర్పడుతున్నాయి' అని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ బృందం తెలిపింది.

మెడికల్ సైన్స్ ప్రపంచంలో ఇదొక కొత్త శకమని ఈ బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ చార్లెస్ స్వాంటన్ అన్నారు. తద్వారా ఇప్పుడు క్యానర్స్ నివారణ కోసం మందులు తయారు చేయడం మరింత సులభంగా మారుతుందని చెబుతున్నారు.

'సాధారణంగా క్యానర్స్‌లో ఆరోగ్యకరంగా ఉండే కణాలపై ప్రభావం పడుతుంది. కణాల డీఎన్‌ఏలో అధిక స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకానొక స్థాయికి చేరిన తరువాత అది క్యానర్స్‌గా మారుతుంది...' ఇప్పటి వరకు క్యాన్సర్‌ను ఇలాగే అర్థం చేసుకుంటూ వస్తున్నారు.

కానీ తాజా పరిశోధనతో ఆ తీరు మారనుంది.

పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తోంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేపట్టారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధిక మరణాలకు కారణం పొగ తాగటమే.

మనిషి వెంట్రుక పరిమాణం

కానీ ఇటీవల కాలంలో పొగ తాగని వారిలోనూ ఊపిరితిత్తుల క్యానర్స్ పెరుగుతోంది. బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ఒకరు గాలి కాలుష్యం వల్లే చనిపోతున్నారు.

భారత్‌లోనూ 2019లో గాలి కాలుష్యం వల్ల 16 లక్షల మంది చనిపోయినట్లు ది లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ వెల్లడించింది.

మనిషి వెంట్రుక కంటే కూడా సన్నగా ఉండే పీఎం 2.5 ధూళి కణాలపై ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ బృందం దృష్టి పెట్టింది. జంతువులు, మనుషుల మీద చేసిన అనేక పరిశోధనల్లో భాగంగా...

  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నమోదయ్యే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగడం కాదు.
  • పీఎం 2.5 ధూళి కణాలు మనలోకి వెళ్లినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇంటర్‌ల్యుకిన్-1-బీటా అనే సైటోకీన్‌ విడుదల అవుతుంది.
  • దాంతో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసి తద్వారా కలిగే డ్యామేజ్‌ను నివారించేందుకు ఊపిరితిత్తుల్లోని కణాలను అది యాక్టివేట్ చేస్తుంది.
  • 50 ఏళ్ల వ్యక్తులను తీసుకుంటే వారిలోని ప్రతి 6లక్షల కణాల్లో ఒక కణం, క్యాన్సర్ కారక మ్యూటేషన్లను కలిగి ఉంటుంది.
  • కానీ ఈ కణాలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. ఇంటర్‌ల్యుకిన్-1-బీటా సైటోకీన్స్ వల్ల ఆ కణాలు యాక్టివేట్ కావడం వల్ల గడ్డలు ఏర్పడతాయి.

పరిశోధనలో భాగంగా గాలి కాలుష్యం వల్ల ఎలుకల్లో క్యాన్సర్ రాకుండా మందులతో శాస్త్రవేత్తలు అడ్డుకోగలిగారు. ఇంటర్‌ల్యుకిన్-1-బీటా సైటోకీన్స్ విడుదల కావడానికి జరిగే అలారమ్ సిగ్నల్‌ను వారు ఆపగలిగారు.

'ఎప్పుడూ పొగ తాగని వారు తమకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందే అర్థం చేసుకోలేక పోతారు. ఇప్పుడు ఈ పరిశోధన వల్ల ఆ రహస్యం తెలిసింది. ఇది ఎంతో ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 99శాతం గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాణాల కంటే కూడా గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది' అని క్రిక్ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ ఎమిలీయా లిమ్ అన్నారు.

కణాల్లో గడ్డలు ఎలా ఏర్పడతాయో మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతోంది.

మెడికల్ పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images

గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు క్యాన్సర్ రాకుండా ఉండేందుకు పిల్స్ వేసుకునే రోజులు కూడా రావొచ్చు. గుండె జబ్బులకు అందించే చికిత్సలో ఇప్పటికే డాక్టర్లు ఇంటర్‌ల్యుకిన్-1-బీటా డ్రగ్‌ను డాక్టర్లు పరిశీలించారు. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఆ డ్రగ్ అడ్డుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది.

పొగ తాగడం క్యాన్సర్‌కు దారి తీసే విధానం మీద మనం మరొక సారి దృష్టి సారించాలని ప్రొఫెసర్ స్వాటన్ అన్నారు. పొగాకులోని రసాయనలు కణాల్లోని డీఎన్‌ఏను డ్యామేజ్ చేస్తున్నాయా? లేక పొగ కూడా నష్టం చేస్తోందా? అనేది తెలుసుకోవాలని ఆయన చెప్పారు.

కణాల్లో డీఎన్‌ఏ పరివర్తనం చెందడం వల్ల మాత్రమే క్యాన్సర్ రాదని, అందుకు ఇతర కారణాలు కూడా ఉంటాయని 1947లో ఐజాక్ బెరిన్‌బ్లమ్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించారు. అది నేటికి నిజమని తేలింది.

'ఆయన 75 ఏళ్ల కిందటే ఈ విషయాన్ని గుర్తించారు. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు' అని డాక్టర్ లిమ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది? మరో దేశానికి వెళ్లడం ఎలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)