SCO: గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత తొలిసారి భేటీకానున్న మోదీ, షీ జిన్‌పింగ్, రెండు దేశాల సంబంధాలలో మార్పులు వస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే ఒక భద్రతా సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌లతో భేటీ కానున్నారు.
షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్యదేశాలైన పాకిస్తాన్, ఇరాన్, తుర్కియే, మధ్య ఆసియా దేశాలు ఈనెల 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ వేదికగా సమావేశం అవుతున్నాయి.
యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది.
ఈ సదస్సులో చైనా, రష్యాలతో మోదీ చర్చలు జరుపనున్నారనే అంచనాలు మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీపై అందరి దృష్టి నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
సదస్సులో భారత్ పాత్ర ఏంటి?
ఎస్‌సీవో గ్రూపులో భారత్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల కూటమి అయిన క్వాడ్ గ్రూపులో కూడా భారత్ సభ్యదేశంగా ఉంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచింది.
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా నరేంద్ర మోదీ... రష్యా, చైనాలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని అంచనా. కానీ, దీన్ని ఇంకా ప్రభుత్వం ధ్రువీకరించలేదు.
2020లో ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన హింసాత్మక ఘటనల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను మోదీ తొలిసారి కలువనున్నారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన వివాదంలో 20 మంది భారత సైనికులు మరణించారు. తమ సైనికులు నలుగురు చనిపోయినట్లు తర్వాత చైనా ప్రకటించింది.
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో కూడా మోదీ ఏవైనా చర్చల్లో పాల్గొంటారా అనే అంశంపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా కాలంగా సరిగా లేవు. ఈ ఉద్రిక్తతలు ఎస్‌సీఓ సదస్సును కూడా తాకాయి.
2020 సెప్టెంబర్‌లో ఎస్‌సీఓ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం నుంచి భారత్ బయటకొచ్చింది. భారత భూభాగాలను తమ దేశంలో కలుపుకుంటూ పాకిస్తాన్ ఒక మ్యాపును ఉపయోగించిందంటూ పేర్కొంటూ భారత్ ఆ సమావేశాన్ని వాకౌట్ చేసింది.
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు 2019 నాటికే బాగా క్షీణించాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలిగించి రెండు సమాఖ్య, పరిపాలన ప్రాంతాలుగా విభజించినప్పుడే ఈ దేశాల మధ్య బంధాలు మరింత దిగజారిపోయాయి.
పాకిస్తాన్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్‌తో వాణిజ్యాన్ని నిరవధికంగా నిలిపేశారు.
ఇప్పుడు పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని వచ్చిన నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగే ఈ సదస్సులో ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు తొలిగిపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, భారత్‌తో వాణిజ్యంపై ఆసక్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా చేశారంటూ పాక్ గత ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.
ఒక సదస్సులో పాకిస్తాన్‌తో కలిసి భారత్ పాల్గొనడం విచిత్రంగా ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
భారత్‌ను లక్ష్యంగా చేసుకునే తీవ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ నిధులు సమకూర్చుతోందంటూ భారత్ నిందించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సదస్సులో పాల్గొనడం ఎందుకు ముఖ్యం?
చైనా, రష్యాలతో పాటు నాలుగు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లతో 2001లో ఎస్‌సీవో ఏర్పడింది. ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి కళ్లెం వేయడానికి, సరిహద్దు భద్రతను పెంచే ఉద్దేశంతో ఈ కూటమిని ఏర్పాటు చేశారు.
2017లో తొలిసారిగా ఈ కూటమి విస్తరణను చేపట్టగా భారత్, పాకిస్తాన్‌లు ఇందులో చేరాయి. ఈసారి ఇరాన్ దేశం పూర్తిస్థాయి సభ్యత్వం పొందనుంది.
పశ్చిమ దేశాల కూటమి అయిన 'నాటో' ప్రభావాన్ని పరిమితం చేయడానికి ఏర్పడిన కూటమిగా 'ఎస్‌సీవో'ను చూస్తారు.
ఈ గ్రూపు ప్రపంచంలోని 44 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
కొన్నేళ్లుగా ఈ గ్రూపు కార్యకలాపాలు ప్రాంతీయ భద్రత నుంచి ఆర్థిక, వాణిజ్య అంశాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వరకు విస్తరించాయి. ఇతరులు సభ్యదేశాలుగా లేదా భాగస్వాములుగా చేరుతుండటంతో ఈ గ్రూపు ఆర్థికంగా కూడా పటిష్టంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
కానీ, ఈ గ్రూపులో చైనా, రష్యా దేశాలదే ఆధిపత్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
మధ్య ఆసియా తమ పరిధిలోనే ఉన్నట్లు మాస్కో భావిస్తోంది. కానీ, ఈ ప్రాంతంపై చైనా పట్టు కూడా స్థిరంగా పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?
- గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోటు... రూ.200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- కరోనా మహమ్మారి తరువాత చైనా అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటన, పుతిన్‌తో భేటీ కానున్న షీ జిన్‌పింగ్
- తెలంగాణ: బాధితులకు నష్టపరిహారం ఎలా ఇస్తారు, ప్రభుత్వం తనకు నచ్చినంత ఇవ్వడం కరెక్టేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












