మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?

అపరిచిత కవలలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్మనీ ఫుట్‌బాలర్ మేసర్ ఓజిల్‌, ఇటాలియన్ రేసర్ ఎంజో ఫెరారీ,
    • రచయిత, మార్గరెట్ రోడ్రిగ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆగ్నెస్ రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చారు. తనకు ఏ మాత్రం సంబంధంలేని అంశాలపై ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు.

అయితే, కొద్దిసేపటికే తను అనుకున్న వ్యక్తి ఆమె కాదని మాట్లాడుతున్న వ్యక్తికి అర్థమైంది. వెంటనే ‘‘అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తి నాకు బాగా తెలుసు’’అని ఆయన అన్నారు.

వెంటనే తనలా ఉండే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆగ్నెస్‌లో కుతూహలం పెరిగింది. వెంటనే ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను అడిగి తీసుకున్నారు. ఆమె పేరు ఎస్తేర్. చాట్‌ల తర్వాత, వీరు వ్యక్తిగతంగా కలిశారు కూడా.

‘‘నాలో ఉండే మరో వ్యక్తిని కలవడం కాస్త వింతగా.. ఇంకాస్త అద్భుతంగా అనిపించింది’’అని ఎస్తేర్ చెప్పారు. ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మన గమనించాలి. అవి ఏమిటంటే.. ఆగ్నెస్‌తో తన ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత్వం ఇలా చాలావరకు సరిపోలుతున్నట్లు ఎస్తేర్ చెప్పారు.

‘‘సంగీతం, బట్టలు, టూటూలు.. ఇలా చాలా అంశాల్లో మా ఇష్టాఇష్టాలూ ఒకేలా ఉన్నాయి’’అని ఎస్తేర్ వివరించారు.

ఆగ్నెస్, ఎస్తేర్

ఫొటో సోర్స్, FRANÇOIS BRUNELLE

ఫోటోగ్రాఫర్‌తో

ఎస్తేర్‌కు 32ఏళ్ల వయసున్నప్పుడు, ఆగ్నెస్‌కు 28ఏళ్లు. వీరిద్దరినీ కలిపి కెనడియన్ ఫోటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ బ్రూనెల్‌ ఫోటోలు తీశారు. ఈ ఇద్దరి డచ్ మహిళల కథను ఫ్రాంకోయిస్ బీబీసీకి వివరించారు.

వారిద్దరూ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండటంతో తనకు చూడముచ్చటగా అనిపించిందని ఫ్రాంకోయిస్ వివరించారు.

ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన ఏ బంధుత్వమూలేని అచ్చం ఒకేలా కనిపించే వ్యక్తులకు ఫ్రాంకోయిస్ ఫోటోలు తీస్తుంటారు.

‘‘అ యామ్ నాట్ ఎ లుక్-లైక్’’ ప్రాజెక్టులో భాగంగా మొత్తంగా ఇలాంటి 200 మందికి ఫ్రాంకోయిస్ ఫోటోలు తీశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది

అపరిచిత కవలలు

ఫొటో సోర్స్, FRANÇOIS BRUNELLE

ఈ ఫోటోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వీటిపై ఇంటర్నెట్‌లో చాలా వార్తలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రముఖులను పోలిన సాధారణ వ్యక్తులు వీరేనంటూ చాలా వీడియోలు కూడా మనకు యూట్యూబ్‌లో కనిపిస్తుంటాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి పోలికలపై వార్తలు, వీడియోలు, ఫోటోలు కనిపించడం ఎక్కువైంది. ఇటాలియన్ రేసర్ ఎంజో ఫెరారీ, జర్మనీ ఫుట్‌బాలర్ మేసర్ ఓజిల్‌లు దాదాపుగా ఒకేలా కనిపిస్తున్న ఫోటో కూడా వీటిలో ఒకటి.

అయితే, తను మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టు ఒక అధ్యయనానికి కారణం అవుతుందని ఫ్రాంకోయిస్ ఊహించలేదు.

ఈ అధ్యయనం కోసం బార్సిలోనాకు చెందిన జోసెఫ్ కరెరాస్ లుకేమియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు ఫ్రాంకోయిస్‌ను ఆశ్రయించారు. అసలు ఎలాంటి కుటుంబ సంబంధాలు లేనప్పటికీ ఆ వ్యక్తులు ఎలా ఒకేలా కనిపిస్తున్నారు? అనే అంశంపై ఆ నిపుణులు అధ్యయనం చేపట్టారు.

అపరిచిత కవలలు

ఫొటో సోర్స్, JOSE LEUKEMIA RESEARCH INSTITUTE

అలా.. ఎలా..?

2016లో మొదలైన ఈ అధ్యయన ఫలితాలు గత ఆగస్టులో ‘‘కాల్ రిపోర్ట్స్’’ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.

‘‘లుక్ ఏ లైక్ హ్యూమన్స్ ఐడెంటిఫైడ్ బై ఫేషియల్ రికగ్నిషన్ అల్గారిథమ్స్ షోస్ జెనెటిక్ సిమిలారిటీస్’’అనే శీర్షికతో ఈ అధ్యయనం ప్రచురితమైంది. అసలు ఏ మాత్రం సంబంధంలేని వ్యక్తుల మొహాలు ఒకేలా ఎలా కనిపిస్తున్నాయి? అనే అంశాలను జన్యువుల స్థాయిలో ఈ అధ్యయనంలో విశ్లేషించారు.

ఒకేలా కనిపిస్తున్న ఆ వ్యక్తులను పరిశోధనలో ‘‘అన్‌నోన్ ట్విన్స్ (అపరిచిత కవలలు)’’గా పేర్కొన్నారు.

ఫ్రాంకోయిస్‌ ప్రాజెక్టులో పాల్గొన్న 32 మంది జంటలను ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఆహ్వానించారు.

ఒకేలా కనిపించే వారి ఫోటోలను మూడు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో విశ్లేషించారు. నిజానికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లనే ఎయిర్‌పోర్టులతోపాటు మొబైల్ ఆన్‌లాక్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

‘‘ఒక మొహం మరో మొహానికి ఎంత దగ్గరగా ఉంది అనే అంశాన్ని ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో మనం తెలుసుకోవచ్చు’’అని ఎస్టెలెర్ వివరించారు.

కొంతమంది మధ్య ఈ పోలికలు 90 శాతం నుంచి వంద శాతం వరకు ఒకేలా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. దీంతో అన్‌నోన్ ట్విన్స్ మధ్య ‘‘హై సిమిలారిటీ రేటు’’ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

‘‘32 జంటల్లోని 25 జంటల విషయంలో రెండు అంత కంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్‌లు 75 శాతం పోలికలు ఒకేలా ఉన్నట్లు గుర్తించాయి’’అని అధ్యయనంలో తెలిపారు.

‘‘నిజానికి అవిభక్త కవలల విషయంలోనే పోలికలు ఇంతలా కలుస్తుంటాయి’’అని ఎస్టెలెర్ తెలిపారు.

16 మంది జంటల విషయంలో మూడు సాఫ్ట్‌వేర్‌లు ఒకేలాంటి పోలికలు ఉన్నట్లు గుర్తించాయి. అంటే మొత్తంగా అధ్యయనంలో పాల్గొన్న జంటల్లో సగం దాదాపు ఒకేలా ఉన్నాయని తెలిపాయి.

అపరిచిత కవలలు

ఫొటో సోర్స్, Getty Images

దీని అర్థం ఏమిటి?

ఆ తర్వాత జంటల బయోలాజికల్ నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ‘‘ఈ నమూనాలను విశ్లేషించడం తప్పనిసరి. ఎందుకంటే వీరు వేర్వేరు దేశాలకు చెందినవారు. కానీ, ఒకేలా కనిపిస్తున్నారు’’అని ఎస్టెలెర్ తెలిపారు.

అంటే ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి డీఎన్ఏ, లాలాజల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు.

‘‘జీనోమ్, మరో రెండు బయోలాజికల్ నమూనాలను మేం విశ్లేషించాం. వీటిలో ఎపీజీనోమ్ కూడా ఉంది. ఇది డీఎన్‌ఏను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరోవైపు మైక్రోబయోమ్‌ను కూడా పరిశీలించాం’’అని ఎస్టెలెర్ తెలిపారు.

‘‘ఈ జంటల మధ్య జీనోమ్‌లు ఒకేలా కనిపిస్తున్నాయి. అయితే, ఎపీజెనెటిక్స్, మైక్రోబయోమ్‌ల విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి’’అని ఆయన వివరించారు.

‘‘ఈ జంటల మధ్య పోలికల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, డీఎన్ఏ సీక్వెన్స్‌లు, జెనెటిక్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా వీరిమధ్య కొన్ని పోలికలు ఒకేలా ఉండేందుకు అవకాశం ఏర్పడింది’’అని ఆయన తెలిపారు.

నిజానికి ఈ జంటల మధ్య తరతరాల చరిత్రను అధ్యయనకర్తలు విశ్లేషించారు. కానీ, వారి పూర్వీకుల మధ్య కూడా ఎలాంటి బంధుత్వం బయటపడలేదు.

అపరిచిత కవలలు

ఫొటో సోర్స్, Getty Images

డీఎన్ఏ సీక్వెన్స్‌లలో సమాధానం

మన ముఖ కవళికలు రూపుదిద్దుకోవడంలో కొన్ని డీఎన్ఏ సీక్వెన్స్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

‘‘జంటలోని ఇద్దరి వ్యక్తుల మధ్య సుదూర బంధుత్వం కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ, ఒకేలాంటి రూపానికి కారణమయ్యే జెనెటిక్ వేరియంట్స్ వారిలో ఉన్నాయి’’అని ఎస్టెలెర్ వివరించారు.

అంటే ఆ జంటలోని వ్యక్తుల మధ్య కొన్ని పోలికలకు కారణమయ్యే జన్యు వేరియంట్లు ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.

ఉదాహరణకు కనుబొమ్మలు దట్టంగా ఉండేందుకు కారణమయ్యే వేరియంట్లు ఒకేలా ఉండొచ్చు. లేదా గడ్డం ఆకారానికి కారణమయ్యే వేరియంట్లు కూడా ఒకేలా ఉండొచ్చు.

‘‘ఇలా ఎక్కువ వేరియంట్లు కలిసినప్పుడు.. వారి మొహాలు ఒకేలా కనిపించొచ్చు’’అని ఎస్టెలెర్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఫార్మా కంపెనీ నుంచి ఫార్మసీకి చేరే వరకూ ఔషధాలపై నియంత్రణ ఎలా ఉంటుంది?

రూపాలకు అతీతంగా..

జెనిటిక్స్‌లో ఈ అధ్యయనం కొత్త పరిశోధనలకు ద్వారాలు తెరుస్తోంది. ‘‘ఒకేలా కనిపించే వారి మధ్య డీఎన్ఏల్లోనూ పోలికలు ఉండొచ్చు. అయితే, ఆ విషయం ఇప్పటివరకు ప్రయోగపూర్వకంగా నిరూపితం కాలేదు’’అని స్మిత్‌సోనియన్ జర్నల్‌లో సారా కటా విశ్లేషించారు.

అయితే, అధ్యయనంలో కొన్ని భౌతిక అంశాలకు అతీతంగా పోలికలు బయటపడ్డాయి.

దీనిలో పాల్గొన్నవారికి 60కిపైగా ప్రశ్నలు ఇచ్చి తమ సమాధానాలు రాయమన్నారు. దీనిలో జీవన శైలి సంబంధిత అంశాలు కూడా ఉన్నాయి. ‘‘ఒకేలా ఉన్న ఇద్దరి ఆలోచనల్లో ఎంత వరకూ పోలికలు ఉండొచ్చు?’’అనే అంశాన్ని మేం తెలుసుకోవాలని అనుకున్నామని ఎస్టెలెర్ చెప్పారు.

ఇక్కడ బరువు, వయసు, ఎత్తు తదితర అంశాలను కూడా పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 16 జంటల్లో బరువు కూడా ఒకేలా ఉన్నట్లు తేలింది. మరోవైపు జీనవ శైలి సంబంధిత అంశాల్లోనూ వీరిలో పోలికలు కనిపించాయి.

‘‘పొగ తాగడం, చదువుపై ఆసక్తి లాంటి కూడా కొందరిలో ఒకేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జెనెటిక్ వేరియంట్లు కేవలం భౌతిక అంశాలపై కాదు ప్రవర్తనా, భావోద్వేగ పరమైన అంశాలపైనా ప్రభావం చూపిస్తాయి’’అని అధ్యయనంలో పేర్కొన్నారు.

ఈ అధ్యయన ఫలితాలు ‘‘బయోమెడిసన్’’ విభాగంలో కీలకంగా మారే అవకాశముందని ఎస్టెలెర్ చెప్పారు.

‘‘ముఖ కవళికల్లో ప్రధాన పాత్ర పోషించే జన్యువులు, వేరియంట్లను మేం గుర్తించాం. ముఖ్యంగా ముక్కు, నోరు, నుదురు, చెవులు ఆకారాల్లో కీలకంగా మారే జన్యువులను గుర్తించాం. కొన్ని వ్యాధులకు కారణమయ్యే మ్యుటేషన్లు వీటి ద్వారా అంచనావేస్తే.. కొన్ని రకాల వ్యాధులు రాకుండా మనం ముందుగానే అడ్డుకోవచ్చు’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, జనరిక్ మందులు: 50-90 శాతం తక్కువకు లభిస్తున్నా ఎందుకు తక్కువగా కొంటున్నారు?

నంబర్లే సమస్యా?

తమ అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువేనని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ ఫలితాలను ధ్రువీకరించేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

‘‘మనుషుల జనాభా దాదాపు 800 కోట్ల వరకు ఉంది. కాబట్టి ఒకేలా కనిపించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండొచ్చు’’అని ఎస్టెలెర్ వివరించారు.

‘‘ఎక్కువ మందిపై అధ్యయనం చేపడితే, మరికొన్ని జెనెటిక్ వేరియంట్లను పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ముఖంలోని మరికొన్ని పోలికలకు కారణమయ్యే వేరియంట్లను మనం పరిశీలించొచ్చు’’అని ఆయన అన్నారు.

అయితే, మనలాంటి మరో వ్యక్తి ఎక్కడో ఉండే ఉంటారని మనం అనుకోవచ్చా?

‘‘అచ్చం వంద శాతం మనలానే ఉండే వ్యక్తిని గుర్తించడం కష్టమే. కానీ, 70, 80 శాతం పోలికలుంటే వ్యక్తులను మనం గుర్తించొచ్చు. ఎందుకంటే బంధువులతోపాటు దూరపు బంధువుల డీఎన్‌ఏలు కూడా మనలో కొంతవరకు కలుస్తుంటాయి. ఇవే కొన్ని పోలికలు కలిసేందుకూ కారణం కావొచ్చు’’అని ఒక ఎస్టెలెర్ బీబీసీతో చెప్పారు.

అంటే ఒక పది లక్షల మందిని తీసుకుంటే వారిలో కొన్ని రకాల జన్యువులు ఒకేలా ఉండొచ్చు. ఇవే వారి మధ్య కొన్ని పోలికలకు కూడా కారణం కావొచ్చు.

ఏళ్లపాటు ఒకేలా కనిపించే వ్యక్తులకు ఫోటోలు తీస్తూ వచ్చిన ఫ్రాంకోయిస్‌లో ఈ విషయాలు మరింత ఆసక్తిని పెంచాయి.

‘‘నిజానికి ఒకేలా కనిపించే వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారు. ఎందుకంటే మనమంతా ఒకేజాతికి చెందిన వారం. అంతా ఒకే జీవుల నుంచి పరిణామం చెందాం’’అని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి: