అలాస్కాలో మైనస్ 20 డిగ్రీల చలిలో ప్రవాస భారతీయుల దీపావళి

ఫొటో సోర్స్, JR Ancheta
అలాస్కా.. ఉత్తర అమెరికా సుదూరపు అంచుల్లో ఆర్కిటిక్‌కు సమీపంలో ఉండే రాష్ట్రం. అక్టోబరులో వీచే చల్లని గాలులతో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల వరకు పడిపోతాయి. పరిసరాలు మంచుతో దట్టంగా పేరుకు పోయి మనోహరంగా ఉంటాయి.
ఇక్కడ ఏడు భారతీయ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది యూనివర్సిటీ ఆఫ్ అలాస్కాలో పని చేస్తున్నారు. వీరంతా గురువారం నాడు ఉత్సాహంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ప్రతి ఏడాదీ ఇక్కడి వాళ్లు దీపావళి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. భారతీయులకు ఈ పండుగ ఎంత ముఖ్యమో వీరికి బాగా తెలుసు. కానీ ఎలా జరుపుకొంటారో పెద్దగా అవగాహన లేదు. భారతీయ సంస్కృతితో పాటు ఆహారం, వస్త్రధారణ, యోగా వంటి వాటిని వారు అమితంగా ఇష్ట పడతారు.

ఫొటో సోర్స్, JR Ancheta
మైనస్ 60 డిగ్రీల చలిలో..
ఇక్కడి అందమైన నగరం ఫెయిర్‌బ్యాంక్. ఫిబ్రవరిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల దాకా పడిపోతాయి. అయితే దీపావళి ఉత్సాహానికి ఉత్తర ధ్రువంలోని రంగురంగుల అరోరా కాంతులు ఇక్కడి రాత్రులకు మరిన్ని సొబగులు అద్దుతాయి. పగళ్లను మరింత సుందరంగా తీర్చిదిద్దుతాయి.

ఫొటో సోర్స్, JR Ancheta
మే నుంచి ఆగస్టు వరకు అక్కడ రోజంతా, అంటే 24 గంటలూ సూర్యుని నులి వెచ్చని కిరణాలు తాకుతూనే ఉంటాయి. అంటే ఈ కాలంలో అసలు రాత్రిళ్లే ఉండవు.
ఆగస్టు నుంచి ఈ సమయం మెల్లగా తగ్గుతూ సెప్టెంబరు చివరి నాటికి పగలు (12 గం.), రాత్రి (12 గం.) సమానమవుతాయి. డిసెంబరులో పగటి సమయం 3 గంటలు మాత్రమే. సూర్యుడు ఉదయించిన గంట లేదా గంటన్నరలోనే ఏదో అర్జెంటు పని ఉన్నట్లు వెంటనే అస్తమిస్తాడు.

ఫొటో సోర్స్, JR Ancheta
యోగా శిక్షణ కేంద్రం
యోగా శిక్షకులను తయారు చేయడానికి ఇక్కడ యోగా అకాడమీ కూడా ఉంది. ఇక్కడ యోగా నేర్చుకున్న వారిలో చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తుంటారు. రెండేళ్ల క్రితం డేవ్, మెలీసా ఇలాగే పుణెకీ వచ్చారు. ఇప్పటికీ నాటి పర్యటన జ్ఞాపకాలు వారి తలపుల్లో సజీవంగా ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక్క భారతీయ దుకాణం కూడా లేదు. ఇతర దేశాల్లో ఉండే ఏ భారతీయులనైనా అడిగి చూడండి వీటి అవసరమేమిటో చెబుతారు. అయితే అద్భుతమైన భారతీయ రుచులను ఆస్వాదించేందుకు ఇవేవీ మాకు అడ్డు కావడం లేదని వారంటారు.

ఫొటో సోర్స్, JR Ancheta
అలాస్కా యూనివర్సిటీలో వేడుకలు
ఫెయిర్‌బ్యాంక్‌లో యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ప్రాంగణంలో దీపావళి జరుపుకొంటారు. 'నమస్తే ఇండియా' అనే విద్యార్థి సంఘం ఈ ఏర్పాట్లు చూసుకుంటుంది. భారతదేశం నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉంటారు. ఇంజినీరింగ్, బయాలజీ, ఆర్కిటిక్ రీసెర్చ్, మరైన్ సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది.
దాదాపు 350 మంది కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక హాలులో దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో టికెట్ ధర 20 డాలర్లు (సుమారు రూ.1300). ఇందులో కొంత దాతృత్వ పనులకు, మరికొంత అంతర్జాతీయ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, JR Ancheta
రుచికరమైన భారతీయ వంటకాలు
ఇక్కడి వంటకాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు? చోలే, మటర్ పనీర్, బంగాళదుంప కూర, చికెన్ మఖానీ, పూరి, పులావ్, పకోడి, పప్పు వంటివి ఉంటాయి. అమర్‌ఖండ్, బేసన్ లడ్డు, బర్ఫీ వంటి మిఠాయిలు కూడా. ఇవన్నీ విశ్వవిద్యాలయంలోనే తయారు చేస్తారు. ఉదయం మొదలుపెడితే మధ్యాహ్నానికి వంట పూర్తవుతుంది.

ఫొటో సోర్స్, JR Ancheta
హాలును రంగవల్లులు, రంగురంగుల పూలు, దీపాలతో అలంకరిస్తారు. ఇక్కడి వాతావరణం చూస్తే స్వదేశంలో ఉన్నట్లే అనిపిస్తుంది.
వినాయక పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పెద్దలను ఆహ్వానిస్తారు. ఇక్కడి అమెరికన్లను భారతీయ వస్త్రధారణలో చూడటం అద్భుతమైన విషయం. బాలీవుడ్ వంటి పాటలకు నృత్యాలు చేస్తారు. ఆనందంగా మిఠాయిలు పంచుకుంటారు. చివర్లో చిన్నాపెద్దా కలిసి సందడి చేస్తారు.

ఫొటో సోర్స్, JR Ancheta
అందరినీ ఒక చోటకి చేర్చడం.. మన సంస్కృతిని చాటడం.. అందరి జీవితాల్లో వెలుగులు నిండేలా ప్రార్థించడం.. దీపావళి ఇచ్చే సందేశం ఇదే. ‘మాలో జ్ఞాన దీపాలను వెలిగించమని ఆ దేవుడిని వేడుకుంటాం. కాబట్టి భారత్‌కు దూరంగా ఉన్నా పండుగలన్నీ మాతోనే ఉంటాయి. ఆ ఆనందాలు కూడా’ అంటారు వాళ్లు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








