ఖతార్ వరల్డ్ కప్: ‘మా పిల్లల చావుకు బాధ్యులెవరు?’ - వలస కార్మికుల మరణాలపై కుటుంబాల ప్రశ్నలు

ఉమేష్ కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, UMESH KUMAR YADAV

ఫొటో క్యాప్షన్, ఉమేష్ కుమార్ యాదవ్ టిక్ టాక్‌లో డ్యాన్స్, ఇతర వీడియోలు పోస్ట్ చేస్తుండేవాడు
    • రచయిత, రజిని వైద్యనాథన్
    • హోదా, సౌత్ ఏసియా కరెస్పాండెంట్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల నిర్వహణ కోసం ఖతార్ తన మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చేసింది. ఆదివారం నాడు ప్రారంభయ్యే ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు నిర్మాణ ప్రాజెక్టుల్లో దక్షిణాసియాకు చెందిన 50 లక్షల మంది జనాన్ని పనుల్లో పెట్టుకుంది. వారిలో నేపాల్ పౌరులు కూడా ఉన్నారు. ఖతార్‌ నిర్మాణ ప్రాజెక్టుల్లో భద్రతా చర్యల వైఫల్యాల వల్లే తమ వారు చనిపోయారని అక్కడి మృతుల కుటుంబాలు బీబీసీతో చెప్పాయి.

నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం క్యూఆర్ 644.. నేపాల్ రాజధాని కఠ్మాండూలో దిగింది. ఆ విమానం కార్గో నుంచి దింపిన వాటిలో ఒక పెద్ద తెల్లటి చెక్క పెట్టె ఉంది. ‘‘ఉమేష్ యాదవ్, 32 ఏళ్లు, పురుషుడు, నేపాలీ మృతదేహం’’ అని ఆ పెట్టె మీద రాసి ఉంది.

కఠ్మాండూకు 250 కిలోమీటర్ల దూరంలోని గోల్‌బాజార్‌లో అతడి తండ్రి తన ఇటుకల ఇంటి బయట తన బర్రెగొడ్లను కట్టివేస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన దేశంలో అత్యంత పేద జిల్లాల్లో ఒకటైన జిల్లాలో అవకాశం అనేది అత్యంత అరుదైన ప్రాంతంలో ఆయన బతుకుతున్నారు.

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్ వెళ్లి పని చేసే అవకాశం తన కొడుకుకి ఇస్తామని చెప్పినపుడు.. లక్ష్మణ్ యాదవ్ కొన్ని బర్రెగొడ్లు అమ్మి సదరు ఉద్యోగాల ఏజెంటుకు 1500 డాలర్లు చెల్లించాడు.

ఉమేష్ తల్లిదండ్రులు సుమిత్ర, లక్ష్మణ్
ఫొటో క్యాప్షన్, ఉమేష్ తల్లిదండ్రులు సుమిత్ర, లక్ష్మణ్ తమ పశువులు అమ్మి తమ కొడుకును ఖతార్ లో పనికి పంపించారు

నేపాల్‌లోనే కాదు బంగ్లాదేశ్, ఇండియాల్లో కూడా ఉద్యోగాల ఏజెంట్లు పేద ప్రాంతాలకు వెళ్లి యువతకు విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పటం, అందుకోసం వీసా ఇప్పంచటానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటం మామూలు విషయమే.

అలా వెళ్లిన కార్మికులను ఒక కాంట్రాక్టు నుంచి మరో కాంట్రాక్టుకు బదిలీ చేయటం తరచుగా జరుగుతుంటుంది. దీనివల్ల తమ వాళ్లు ఎక్కడ, ఎవరి కోసం పని చేస్తున్నారు అనే వివరాలు వారి కుటుంబాలకు తెలియటం కష్టంగా మారుతుంది.

ఉమేష్ యాదవ్ ఊరి నుంచి రెండు గంటలు ప్రయాణిస్తే ధనుష జిల్లాలో కృష్ణ మండల్ ఇల్లు వస్తుంది. అతడి తండ్రి సీతేష్ నాలుగేళ్ల కిందట ఖతార్ లో పని చేయటానికి వెళ్లారు.

సీతేష్ కొన్నిసార్లు పని చేసేటపుడు తన సెల్ఫీలు తన కొడుకుకి పంపించేవాడు. ‘‘వాటర్ ట్యాంకుల దగ్గర పనిచేస్తున్నానని చెప్పాడు. కానీ ఏం పని చేసేవాడో ఎక్కువ వివరాలు చెప్పలేదు’’ అని కృష్ణ తెలిపారు.

సీతేష్ అక్టోబర్ 12వ తేదీన సెలవులకు ఇంటికి రావాల్సి ఉంది. కానీ దానికి కొన్ని రోజుల ముందు కృష్ణకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ప్రమాదంలో ఆయన తండ్రి చనిపోయారని ఆ ఫోన్ కాల్ సమాచారం.

సీతేష్ మండల్

ఫొటో సోర్స్, SITESH MANDAL

ఫొటో క్యాప్షన్, నాలుగేళ్ల కిందట ఖతార్‌లో పని చేయటానికి వెళ్లిన సీతేష్ తన కొడుకుకి సెల్ఫీలు పంపేవాడు

ఖతార్‌ రాజధాని దోహా నగరంలో.. నేలకు ఏడు అడుగుల లోతున సీతేష్ మురుగు పైపుల పని చేసే సమయంలో అతడి మీద పెద్ద మట్టిగడ్డ విరిగి పడిందని వారి కుటుంబ మిత్రుడు ఒకరు చెప్పారు. ‘‘బలమైన వస్తువు వల్ల అనేక దెబ్బలు తగిలాయ’’ని సీతేష్ మరణ ధృవీకరణ పత్రంలో రాసి ఉంది.

తన తండ్రిని పనిలో పెట్టుకున్న వ్యక్తి లేదా సంస్థ నుంచి తనకు ఒక్క ఫోన్ కాల్ కానీ, పరిహారం ఇస్తామన్న మాట కానీ ఏదీ రాలేదని కృష్ణ చెప్తున్నారు. దీనిపై స్పందన కోసం సీతేష్ పనిచేసిన కంపెనీని బీబీసీ సంప్రదించింది. కానీ వారు స్పందించలేదు.

గోల్‌బాజార్‌లో ఉన్న లక్ష్మణ్‌కు ఖతార్‌లో తన కొడుకు జీవితం ఎలా ఉందనేది పెద్దగా తెలీదు. ఆయన దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు. టిక్‌టాక్‌లో ఉమేష్ పోస్ట్ చేసే రోజువారీ అప్‌డేట్లను కూడా ఆయన ఫాలోకాలేకపోయారు.

ఉమేష్ ఆ వీడియోల్లో ఖతార్‌లో తళకుబెళుకుల నేపథ్యంలోనో, ఇతర వలస కార్మికులతో కలిసి తమ డార్మిటరీ తరహా బసలోనో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు.

తను పనిచేసే నిర్మాణ ప్రాంతాల్లో.. నిచ్చెన పై నుంచి నవ్వుతూనో, భారీ కాంక్రీట్ దిమ్మెలను ఎత్తుతూనో కొన్ని చేస్తున్న క్లిప్‌లను కూడా ఉమేష్ షేర్ చేశాడు.

విరిగిన పరంజా
ఫొటో క్యాప్షన్, ఉమేష్ కజిన్ పంపిన ఒక ఫొటోలో పలు అంతుస్తుల ఎత్తులో విరిగిపోయి వేలాడుతున్న పరంజా కనిపిస్తోంది

అక్టోబర్ 26వ తేదీన ఉమేష్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. రాబోయే వరల్డ్ కప్ ప్రకటనలు చూపిస్తున్న ఆకాశహర్మ్యాల ముందు డాన్స్ చేస్తూ ఉన్నాడు. అదే అతడి చివరి పోస్ట్.

ఉమేష్ కజిన్ లక్ష్మణ్ కూడా ఖతార్‌లో పని చేస్తున్నాడు. అతడికి అక్టోబర్ 27వ తేదీన ఉమేష్ చనిపోయాడంటూ ఫోన్ వచ్చింది. ఎలా చనిపోయాడో తెలుసుకోవటానికి ఇతరులతో కలిసి అతడు కూడా ఆ నిర్మాణ స్థలానికి చేరుకున్నాడు.

‘‘ఉమేష్ పరంజా లిఫ్ట్‌ను పైకి తీసుకు వెళుతున్నాడని, అది దీనికో తగిలి విరిగిపోయిందని, ఉమేష్ కిందపడిపోయాడని వాళ్లు నాకు చెప్పారు’’ అని అతడు తెలిపాడు.

‘‘పని చేసే చోట భద్రత గురించి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. వాళ్లు అన్నీ తనిఖీ చేసి, ఆ తర్వాతే కార్మికులు పని చేయటానికి అనుమతించి ఉండాల్సింది’’ అన్నాడాయన.

ఉమేష్ పనిచేసిన నిర్మాణ సంస్థను బీబీసీ సంప్రదించింది. ఉమేష్ మరణానికి భద్రతా లోపం ఏదైనా కారణమనే వాదనను వాళ్లు గట్టిగా తిరస్కరించారు.

‘‘అతడి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రమాదం సంభవించింది. ఆ కార్మికుడు సైట్‌లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అతడితో పాటు పనిచేసే మిగతా కార్మికుల్లాగా భద్రతా నిబంధనలను పాటించాలని చాలాసార్లు అతడికి తెలియజేశాం. కానీ ఫలితం లేకపోయింది’’ అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉమేష్ చితికి నిప్పంటిస్తున్న దృశ్యం
ఫొటో క్యాప్షన్, ఉమేష్‌కు నేపాల్‌లో ఆయన కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది

ఖతార్‌లో ప్రపంచ కప్ నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచీ.. వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి మరణాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

‘‘మా ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికులందరి ఆరోగ్యం, భద్రత, గౌరవాన్ని కాపాడటానికి’’ తాము కట్టుబడి ఉన్నామని ఖతార్‌ ప్రభుత్వం చెప్తోంది. ఆరోగ్య, భద్రత నియమావళిని తాము మెరుగు పరిచినట్లు బీబీసీకి తెలిపింది.

అయితే బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ బీబీసీకి అందించిన కొత్త లెక్కలు.. గత ఏడాది కాలంలో కార్మికుల హక్కులు ఉల్లంఘించిన ఉదంతాలు దాదాపు 140 వరకూ ఉన్నట్లు చూపుతున్నాయి. వాటిలో సగం కేసులు ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబధించినవే.

అసలు లెక్కలు ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చునని, తిప్పి పంపించేస్తారనే భయంతో కొందరు ఫిర్యాదులు చేయరని ఆ సంస్థ భావిస్తోంది.

ఆరేళ్ల కాలంలో దక్షిణ ఆసియా ప్రాంతంలో 12 మందికి పైగా కార్మికుల మరణ ధృవీకరణ పత్రాలను బీబీసీ చూసింది. చాలా వాటిలో మరణానికి కారణం ‘తీవ్ర గాయాలు’ అని చెప్పారు. అయితే వారి కుటుంబాలు తమకు ఇంకా సందేహాలున్నాయని, జవాబులు కావాలని కోరుతున్నాయి.

ఉమేష్ శవపేటిక విమానాశ్రయం నుంచి గోల్‌బాజార్‌కు చేరుకుంది. అతడి తండ్రి లక్ష్మణ్, ఇతర గ్రామస్తులు కట్టెలు, ఎండుగడ్డి సేకరించి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు.

నేపాల్‌లో చితికి పెద్ద కొడుకు నిప్పంటించటం సంప్రదాయం. ఉమేష్ కొడుకు 13 నెలల సుశాంత్‌ను లక్ష్మణ్ ఎత్తుకుని, ఆ పసివాడి చిన్ని చేతితో కొరివి పట్టించి చితికి నిప్పు పెట్టించారు.

‘‘వాడు మాకు అండగా నిలిచాడు. ఇప్పుడు తీర్చాల్సిన అప్పులున్నాయి. వాడి పిల్లలను సాకాలి’’ అని ఉమేష్ తల్లి సుమిత్ర చెప్పారు. ‘‘వాడు నా హీరో’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి: