Qatar: భరించలేని వాతావరణం.. పిట్టల్లా రాలిపోతున్న వలస కూలీలు.. మరణాల లెక్కల్ని ప్రభుత్వం దాచిపెడుతోందా?
గుండెపోటుతో చనిపోయిన వలస కార్మికుల సంఖ్యను ఖతార్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందన్న ఆరోపణలపై బీబీసీ జరిపిన పరిశోధనలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ సగటుతో పోలిస్తే గల్ఫ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు రెండు రెట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి.
గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం కోటి 40 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారే.
స్వదేశంలో సరైన ఉపాధి దొరక్కపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోంచి కూడా వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు.
కార్మికుల హక్కుల అణచివేతను ప్రశ్నించినందుకు ఓ వలస కార్మికుడిని జైల్లో పెట్టారు.
ఒక్క ఖతార్ లోనే గత 15 ఏళ్లలో 2వేలకు పైగా నేపాలీ కూలీలు చనిపోయారు.
గత 8 ఏళ్లలో 571 మంది గుండెపోటుతో చనిపోయినట్లు ఇటీవలి అధ్యయనం ఒకటి చెబుతోంది.
అందులో 200 మంది భరించలేని ఉష్ణోగ్రతల వల్లనే చనిపోయారు. దీన్ని నివారించే అవకాశం ఉన్నా.. పట్టించుకోలేదు.
మధ్యాహ్నం పూట కార్మికులతో ఎండలో పని చేయించే సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు నష్టపరిహారం కూడా వసూలు చేస్తామని ఖతార్ కార్మిక విభాగం అధికారులు చెబుతున్నారు.
అయితే అలాంటి వాటి గురించి ఫిర్యాదు చెయ్యడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే అనేది కెన్యాకు చెందిన మాల్కమ్ బిదాలి అనుభవం.
ఖతార్ రాజకుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఖతార్ ఫౌండేషన్‌కు సంబంధించిన భవనాలకు ఆయన కాపలా కాస్తుంటారు.
వలస కూలీల కాంట్రాక్టర్లు ఖతార్ చట్టాలను కట్టుబడి ఉండాలని ఖతార్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి తెలిపారు.
వేడి వల్ల సమస్యలను అంచనా వేయడంతో పాటు చల్లని నీటిని అందించడం, నీడ ఉండేలా చూడటం, పనిలో విరామం ఇవ్వడం లాంటివి చెయ్యాలి. వీటిని ఉల్లంఘిస్తే వారికి జరిమానా వేస్తారు.
మాల్కమ్ కేసు గురించి, వేడి వల్ల చనిపోతున్న వారి సంఖ్యను తక్కువగా చేసి చూపించడం గురించి వివరణ ఇవ్వాలని బీబీసీ ఖతార్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే వారు స్పందించలేదు.
ఈ ఏడాది ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఖతార్‌లో జరగబోతోంది. ఫుట్ బాల్ మ్యాచ్‌లతో పాటు మండుతున్న ఎండల్లో వలస కూలీలు ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నారనే దానిపైనా అందరూ దృష్టి పెట్టే అవకాశం ఉంది.