ది గ్రేట్ మూన్ హోక్స్: ‘చంద్రుని మీద మనుషులు, 420 కోట్ల జీవులు’.. వారికి బైబిల్ బోధించాలని 187 ఏళ్ల కిందట క్రైస్తవ మిషనరీలు నిధులు సేకరించినప్పుడు..

- రచయిత, క్రిస్టీ బీ కార్టర్ & జో హారిసన్
- హోదా, బీబీసీ రీల్స్
అది 1835...
రాకెట్ మాదిరిగా ఒక వార్త జనంలోకి దూసుకొచ్చింది. ఆ వార్తను చదివిన వేలాది మంది రాత్రి పూట చంద్రుడిని కాస్త వింతగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
‘చంద్రుని మీద నీరు... రాళ్లను కప్పి ఉన్న ఎర్రని పూలు...
అడవుల్లో చెట్ల నీడల్లో సేద తీరుతున్న అడవిదున్నల వంటి జంతువులు...
లోయల్లో మేస్తున్న మేకలు...’ ఇది ఆ కథనంలోని సారంశం.
ఇది రాసింది డాక్టర్ ఆండ్రూ గ్రాంట్. స్కాట్లాండ్‌కు చెందిన ‘ఎడిన్‌బర జర్నల్ ఆఫ్ సైన్స్’లో ‘గ్రేట్ ఆస్ట్రానమికల్ డిస్కవరీస్’ పేరిట రాసిన వ్యాసంలో గ్రాంట్ ఇలాంటి విషయాలు ప్రస్తావించారు.
అదీ సుమారు 187 ఏళ్ల కిందట.

‘చంద్రుని మీద అడవులు’
నాటి ప్రముఖ ఖగోళశాస్త్రజ్ఞుడు సర్ జాన్ హెర్సెల్ వాటిని కనుగొన్నట్లు గ్రాంట్ అందులో చెప్పారు. 1834లో కేప్ ఆఫ్ గుడ్ హోప్, దక్షిణాఫ్రికాలతోపాటు దక్షిణార్ధగోళంలో జాన్ హెర్సెల్ ప్రయాణించారు.
జాన్ హెర్సెల్ చేసిన యాత్రల్లో ఆయనతోపాటు తాను కూడా ఉన్నట్లు డాక్టర్ ఆండ్రూ గ్రాంట్ రాసుకున్నారు. ‘నక్షత్రాలకు మించిన అద్భుతాలను’ తాము గుర్తించినట్లు ఆయన తెలిపారు.
24 అడుగుల వ్యాసం, 7 టన్నుల బరువు ఉన్న టెలిస్కోప్‌తో పరిశోధనలు చేసినట్లు గ్రాంట్ చెప్పుకున్నారు. నాటి కాలంలో ఉన్న అతి పెద్ద టెలిస్కోప్ కంటే తమ టెలిస్కోప్ ఆరు రెట్లు పెద్దదని ఆయన రాశారు.
తొలి సారి తాను చంద్రుని మీద అద్భుతమైన, అందమైన జీవులను చూసినట్లు చెప్పారు.
‘ఎడిన్‌బర జర్నల్ ఆఫ్ సైన్స్’లో ప్రచురితమైన గ్రాంట్ వ్యాసం ఆధారంగా అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ‘ది సన్’ అనే పత్రిక ఆరు కథనాలను ప్రచురించింది.
అందులో రాసిన కొన్ని విషయాలు చాలా వింతగాను ఇంకాస్త విస్మయంగాను అనిపిస్తాయి.
ఎలుక మాదిరిగా ఉండే బీవర్ గురించి గ్రాంట్ రాసిన విషయాలు చదివితే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
‘చంద్రుని మీద అది నిలబడి నడుస్తోంది. అక్కడ అది తెలివైనది మాత్రమే కాదు, అత్యంత పురాతనమైన జంతువు కూడా. మనుషుల మాదిరిగానే పిల్లలను ఎత్తుకుని అవి తిరుగుతుంటాయి. వాటి ఇళ్లు చాలా ఎత్తుగా ఉంటాయి. అనేక మానవ జాతుల నిర్మాణాల కంటే చాలా మెరుగ్గా ఉంటాయ్’ అని ఆ వ్యాసం చెబుతోంది.
ఇక బీవర్ నివాసాల నుంచి పొగ వస్తోందంట. అంటే వాటికి నిప్పు కూడా తెలుసు... ఇది గ్రాంట్ చెప్పిన మరొక సంగతి.

‘మానవుల వంటి గబ్బిలాలు’
గ్రాంట్ చెప్పిన వింత సంగతుల్లో ‘మానవుల వంటి గబ్బిలాలు’ ఒకటని ‘ది సన్ అండ్ మూన్’ రచయిత మాథ్యూ గుడ్‌మాన్ బీబీసీ రీల్స్‌తో అన్నారు. లాటిన్‌లో వీటిని ‘వెస్పర్టిలియో హోమో’ అని పిలుస్తారు.
‘నాలుగు అడుగుల ఎత్తు ఉండే ఈ జీవులు ఎగురుతాయి. మాట్లాడతాయి. దేవాలయాలు నిర్మించాయి. కళలను పుట్టించాయి. బహిరంగంగా సెక్సులో పాల్గొంటాయి’ అని రాసినట్లు మాథ్యూ తెలిపారు.
నాలుగో సిరీస్‌లో ప్రచురించిన కథనాల్లో ఈ విషయాలను ప్రస్తావించారు. ‘మానవుల వంటి గబ్బిలాల’ మీద వచ్చే అనుమానాలను తీర్చేందుకు త్వరలోనే జాన్ హెర్సెల్ ఒక నివేదిక విడుదల చేస్తారని కూడా రాశారు. అలాగే చంద్రుని మీద ఈ జీవాలను చూసిన మతాధికారులు, శాస్త్రవేత్తలు, పౌర సమాజానికి చెందిన వారు ఇచ్చిన సర్టిఫికేట్స్‌ను కూడా ఆ నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు.
చంద్రుని మీద జీవిస్తున్న అన్ని జాతుల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లుగా గ్రాంట్ చెప్పారు.
‘ఎండకు టెలిస్కోప్ కాలిపోయింది’

‘మీరు చూసిన టెలిస్కోప్ ద్వారా మాకు కూడా చంద్రుని మీద జంతువులను చూపించండి’ అని ఎవరైనా అడిగారో ఏమో కానీ ఆ టెలిస్కోప్ కాలిపోయిందని గ్రాంట్ చెప్పారు.
‘కాలిపోవడానికి కారణం సూర్యకిరణాలు. టెలిస్కోప్ లెన్స్ మీద సూర్యకిరణాలు పడి అబ్జర్వేటరీ కాలిపోయింది.
కానీ మేం దాన్ని బాగు చేశాం. కానీ చంద్రుడు మాత్రం కనిపించలేదు.
జాన్ హెర్సెల్ త్వరలోనే మానవులను పోలి ఉండే గబ్బిలాల గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు’ అని గ్రాంట్ రాశారు.
‘నాడు ది సన్ ప్రచురించిన ఆ కథనాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అవొక సంచలనం. న్యూయార్క్ నగరంలో సుమారు 90శాతం మంది ప్రజలు వాటిని నమ్మినట్లు అంచనా’ అని గుడ్‌మాన్ అన్నారు.
నాడు నలుగురు ఎక్కడ కూడినా ఆ కథనాల మీదే చర్చ. యేల్ వంటి యూనివర్సిటీలలోనూ వాటి మీద చాలా ఆసక్తి కనిపించేది.
చంద్రుని మీద జీవం ‘ఉండొచ్చు’ అని ఆ పరిశోధనలను ప్రస్తావిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ రాసింది. ‘సైన్స్, ఖగోళశాస్త్రంలో మరొక కొత్త శకం మొదలైంది’ అని ది న్యూయార్కర్ వ్యాఖ్యానించింది.
ఇదంతా నిజమా?
అంతరిక్ష పరిశోధనల కోసం సర్ జాన్ హెర్సెల్ దక్షిణాఫ్రికాకు వెళ్లింది నిజమే. నాటి బ్రిటన్ రాజు విలియం-4 ఆ యాత్ర కోసం 70 వేల పౌండ్లు ఇస్తానని చెప్పారు. కానీ ఇవ్వలేదు. అయినా సొంత ఖర్చుతో జాన్ హెర్సెల్ దక్షిణాఫ్రికాకు వెళ్లారు.
నాడు ఆయన వద్ద టెలిస్కోప్ కూడా ఉంది. కాకపోతే గ్రాంట్ చెప్పినంత పెద్దది, అధునాతనమైనది కాదు.
అలాగే జాన్ హెర్సెల్‌తో పాటు వెళ్లింది డాక్టర్ ఆండ్రూ గ్రాంట్ కాదు. అసలు ఆ వ్యక్తి నిజమైన మనిషే కాదు. అదొక కల్పిత పాత్ర. ఆ కల్పిత పాత్ర రాసిన వ్యాసం ప్రచురితమైన ‘ఎడిన్‌బర జర్నల్ ఆఫ్ సైన్స్’ అంతకు రెండేళ్ల ముందే మూతపడింది.
వాస్తవానికి అదొక ప్యారడీ వ్యాసం. సైన్స్ ఫిక్షన్. దానికి వచ్చిన స్పందన చూసి ఆ ఫిక్షన్ రాసిన వ్యక్తి కూడా ఆశ్చర్యపోయాడు.
అసాధ్యం అనుకునేది సాధ్యం అవుతుందని వేల మందిని ఆ వ్యాసం నమ్మించ గలిగింది.

ఒక చిన్న అపార్థం వల్ల
ఇంత కథ, సంచలనం వెనుక ఉన్న వ్యక్తి పేరు రిచర్డ్ ఆడమ్స్ లాకీ. ఆయన బ్రిటన్‌కు చెందిన వ్యక్తి. ఫిలాసఫర్ జాన్ లాకీ సంతతికి చెందినవారు. కేంబ్రిడ్జీ యూనివర్సిటీ పట్టా తీసుకున్న వెంటనే ‘ది సన్’లో చేరారు.
1833లో బెంజమిన్ డే అనే వ్యక్తి ‘ది సన్’ పత్రికను స్థాపించారు. కానీ దానికి అంతగా ఆదరణ లభించలేదు.
తమ పత్రికకు బాగా పాపులారిటీ వచ్చి సర్క్యూలేషన్ పెరగాలంటే ఏదైనా సంచలనాత్మక కథనాలు ప్రచురించాలని బెంజామిన్ డే, రిచర్డ్ ఆడమ్స్ భావించారు. నాడు ప్రజలను బాగా ఆకర్షిస్తున్న అంశాలు రెండు. ఒకటి శాస్త్రీయ ఆవిష్కరణలు. రెండు తమకు తెలియని సుదూర ప్రాంతాలకు జరుగుతున్న యాత్రలు.
ఆస్ట్రానమీ అంటే రిచర్డ్ ఆడమ్స్‌కు బాగా ఇష్టం. ఎప్పుడూ వాటి గురించి వార్తలు, పరిశోధన వ్యాసాలు చదువుతూ ఉంటారు.
నాడు చాలా మంది ఖగోళశాస్త్రజ్ఞలు ‘దైవాన్ని నమ్మేవారు’ అని గుడ్‌మాన్ అన్నారు.
విశ్వంలోని ప్రతి గ్రహం మీద దేవుడు జీవాన్ని సృష్టించాడని నాడు చాలా మంది నమ్ముతూ ఉండేవారు. అలా నమ్మే వాళ్లలో స్కాట్లాండ్‌కు చెందిన ఖగోళశాస్త్రవేత్త థామస్ డిక్ ఒకరు.
మతానికి, విజ్ఞాన శాస్త్రానికి ముడిపెడుతూ నాడు ఆయన రాసిన ‘ది క్రిస్టియన్ ఫిలాసఫర్ ఆర్ ది కనెక్షన్ ఆఫ్ సైన్స్ విత్ రిలీజియన్’ అనే పుస్తకం చాలా ఆదరణ పొందింది.
ఖగోళశాస్త్రానికి మతానికి చాలా దగ్గర సంబంధం ఉందని థామస్ డిక్ రాశారు. అంతేకాదు ఈ సౌరవ్యవస్థ మొత్తం జీవంతో నిండి ఉందని ఆయన అన్నారు. ఆ జీవులను లెక్కించారు కూడా.
‘ఈ సౌరవ్యవస్థలో 21,891,974,404,480 జీవులున్నాయి. అందులో 4,200,000,000 జీవులు చంద్రుని మీద ఉన్నాయి’ అంటూ ఆ పుస్తకంలో థామస్ లెక్కలు చెప్పారు.
నమ్మని రిచర్డ్

ఫొటో సోర్స్, Library of Congress
కానీ రిచర్డ్ ఆడమ్స్‌కు అవి నమ్మబుద్ధి కాలేదు.
‘సైన్స్‌లో మతానికి స్థానం లేదు అనేది రిచర్డ్ అభిప్రాయం’ అని గుడ్‌మాన్ అన్నారు.
అందువల్ల థామస్ డిక్ పుస్తకం మీద సెటైర్ వేస్తూ కొన్ని ఆర్టికల్స్ రాయాలని రిచర్డ్ ఆడమ్స్ భావించారు.
‘మతాలను, దేవుళ్లను విశ్వసించే ఖగోళశాస్త్రవేత్తల మీద సెటైర్లు వేయాలని ఆయన భావించారు.
చంద్రుని మీద జీవం ఉందని మీరు నమ్మితే అక్కడ గబ్బిలాలను మీకు నేను చూపిస్తాను.
చంద్రుని మీద నీరు ఉందని మీరు విశ్వసిస్తే అక్కడ సముద్రాలను సృష్టిస్తాను... అంటూ రిచర్డ్ ఆడమ్స్ వారి మీద దాడి చేసే వారు’ అని గుడ్‌మాన్ వివరించారు.
మతాలను విశ్వసించే ఖగోళశాస్త్రవేత్తలు ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారో చాటి చెప్పాలని రిచర్డ్ ఆడమ్స్ భావించారు.
ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన డాక్టర్ ఆండ్రూ గ్రాంట్‌ను సృష్టించారు. కానీ అది ఊహించని విధంగా మరొక మలుపు తిరిగింది.
‘అలా జరుగుతుందని ఆయన కూడా ఊహించలేదు. ‘ది గ్రేట్ మూన్ హోక్స్’ మరొలా మారింది.
అప్పటికే చాలా మంది దైవాన్ని నమ్మే ఖగోళశాస్త్రవేత్తల ప్రభావంలో ఉన్నారు. అలాంటి సమయంలో రిచర్డ్ ఆడమ్స్ రాసిన కథనాలు పేపర్లో రావడంతో వాటిని చాలా మంది నిజం అనుకున్నారు.
బయట జరుగుతున్న దాన్ని చూసి ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఆ కథనాల మీద హక్కులు పత్రిక యజమానికి చెందుతాయి కాబట్టి ఆయన ఆ నిజాన్ని బయటకు చెప్పలేక పోయారు.
దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆ కథనాలు ప్రచురితం కావడం మొదలైంది’ అని గుడ్‌మాన్ తెలిపారు.

చంద్రుని మీదకు బైబిల్
చంద్రుని మీదకు బైబిల్‌ను తీసుకెళ్లాలని అమెరికాలోని మతపరమైన గ్రూపులు నిధులు సేకరించాయి. చంద్రుని మీద ఉండే ప్రజల అవసరాలను తీర్చడంతోపాటు అక్కడ బానిసత్వం ఉంటే దాన్ని రూపుమాపాలని కూడా బ్రిటన్‌లోని ఫిలాంథ్రఫిక్ సొసైటీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది.
రిచర్డ్ ఆడమ్స్ రాసిన ఆ కల్పిత రిపోర్ట్ అబద్ధమని తెలిసే సమయానికి ఇలాంటి పరిణామాలు చకచకా జరుగుతూ పోయాయి.
తన పేరు మీద బయట ఏం జరుగుతుందో కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు సర్ జాన్ హెర్సెల్. రిచర్డ్ ఆడమ్స్ రాసిన కల్పిత వ్యాసాన్ని చదివినప్పుడు ఆయన చాలా నవ్వుకున్నారు.
చంద్రుని గురించి, అక్కడి జీవరాశుల గురించి రాసిన వర్ణన జాన్ హెర్సెల్ భార్యను చాలా బాగా ఆకట్టుకుంది. ‘దాన్ని నమ్మడం న్యూయార్క్ నగర ప్రజల తప్పు కాదు. కానీ అది నిజం కాకపోవడమే బాధాకరం’ అని ఆమె రాశారు.
తన మీద కల్పిత వ్యాసం రాసిన రిచర్డ్ ఆడమ్స్‌కు 1837లో లేఖ రాశారు ఖగోళశాస్త్రవేత్త థామస్ డిక్. ‘అలాంటి సెటైర్ల వల్ల దేవుని ఆజ్ఞలను, నియమాలను ఉల్లంఘిస్తున్నారు’ అంటూ ఆయన రాశారు.
రిచర్డ్ ఆడమ్స్ వేసిన సెటైర్‌ను అర్థం చేసుకున్న కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.
ఆ కల్పిత వ్యాసాలను చదివినప్పుడు ‘పొట్టపగిలేలా నవ్వుతూ ఉండిపోయారు’ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫ్రాకోయిస్ ఆరాగో.
వాటిని చదవగానే అది ‘జోక్’ అనే విషయాన్ని అర్థం చేసుకున్నానని రచయిత ఎడ్గర్ అలాన్ పోయ్ అన్నారు. రిచర్డ్ ఆడమ్స్ సృజనాత్మకతను మెచ్చుకున్నారు.
నాడు ఆ కథనాల సిరీస్ ముగిసే నాటికి న్యూయార్క్‌కు చెందిన ‘ద సన్’ ప్రపంచంలోనే ఎక్కువగా చదివిన పత్రికగా రికార్డు సృష్టించింది. అవన్నీ కల్పిత కథలు అని తెలిసినా కూడా దాని అమ్మకాలు తగ్గలేదు.
కానీ ఆ పత్రిక తాను అబద్ధాలు రాసినట్లు ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ – పాకిస్తాన్ ఓటమిపై మొహమ్మద్ షమీ ట్వీట్ వైరల్
- అమ్మకానికి ఊరు.. ధర రూ.2 కోట్లు.. స్పెయిన్‌లో బంపర్ ఆఫర్
- దివ్య ఎస్ అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించటం మీద ఎందుకీ చర్చ?
- ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- న్యుమోనియా: పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దీనికి చికిత్స ఏమిటి?














