ఆంధ్రప్రదేశ్: బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు ఎందుకు నివారించలేకపోతున్నారు.. బాధ్యత ఎవరిది, ఏం చేయాల్సి ఉంది?

కడియద్ధ ప్రమాదంలో పేలుడు తీవ్రత చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించింది
ఫొటో క్యాప్షన్, కడియద్ధ ప్రమాదంలో పేలుడు తీవ్రత చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించింది
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా బాణాసంచా ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అంతకుముందు విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇద్దరు మృతి చెందారు.

గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల బాణాసంచా పేలుడు కారణంగా 60 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అంటే ఏటా పది మందికి తగ్గకుండా ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

వరుస ప్రమాదాలతో బాణాసంచా తయారీకేంద్రాల్లో భద్రత మీద పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇంతకీ బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం ఎక్కడుందన్నది కీలకాంశంగా ముందుకొస్తోంది.

జీవనోపాధి కోసం వలస వచ్చి...

తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కడియద్ధ గ్రామ సమీపంలో బాణాసంచా తయారీ యూనిట్ నాలుగేళ్లుగా నడుస్తోంది. సమీపంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి యూనిట్లున్నాయి.

ప్రభుత్వ అనుమతి తీసుకుని ఇక్కడ బాణాసంచా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, అవుట్లు వంటివి నిత్యం తయారు చేస్తుంటారు.

దీపావళి సీజన్ లో రోజూ 60 మంది వరకూ కూలీలు ఇక్కడ పనిచేస్తారు. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో రోజుకి 10 మంది కూలీలు పనిచేస్తున్నారు.

వారిలో స్థానికులు తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత రాత్రి 8గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. దాంతో అక్కడే ఉంటున్న వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 18 ఏళ్ల వయసులోపు వారే కావడం గమనార్హం.

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరుకు చెందిన యాళ్ల దుర్గా ప్రసాద్, దయ్యాల శివ అలియాస్ స్వామి, దుళ్ల సత్యనారాయాణ అలియాస్ నాని చనిపోయారు.

వీరంతా జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రమాదకర పరిశ్రమలో పనిచేస్తున్నారు.

తమకు అండగా ఉండాల్సిన వయసులో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. పైగా ఒక్కసారిగా పేలుడు తీవ్ర స్థాయిలో జరగడంతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పి అన్నవరం అనే వ్యక్తి తీసుకున్న లైసెన్సు ఆధారంగా ఈ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహణ జరుగుతోంది.

నవంబర్ 10వ తేదీన రాత్రి జరిగిన ప్రమాదంలో అరేపల్లి రాజు అనే మరో యువకుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారంతా 18 ఏళ్లలోపు యువకులే
ఫొటో క్యాప్షన్, ఈ ప్రమాదంలో మృతి చెందినవారంతా 18 ఏళ్లలోపు యువకులే

కోలుకోలేకపోతున్నాం..

కడియం ప్రమాదంలో పేలుడు తీవ్రత చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించింది. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో తాడేపల్లిగూడెం వాసులు కూడా కలవరపడాల్సి వచ్చింది.

మంటలు కూడా ఎగిసిపడి 20 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించాయి. ఆ మంటలు కూడా దూర ప్రాంత వాసులకు కూడా కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. 

"నాలుగేళ్లుగా బాణాసంచా తయారీ చేస్తున్నారు గానీ ఎన్నడూ ప్రమాదాలు లేవు. కానీ రాత్రి అంతా ఇళ్లకు చేరుకుని భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత వెంటవెంటనే భారీగా పేలిపోవడంతో ఏం జరిగిందోనని కంగారు పడ్డాము. మా ఇంటి పక్కనే జరిగిందన్నంత శబ్దం వచ్చింది. మందుగుండు తయారీ దగ్గర అని చెప్పారు. ఫైరింజిన్ వచ్చింది గానీ దారి సరిగ్గా లేక దగ్గరకు వెళ్లలేకపోయింది. తెల్లవార్లు మంటలు వస్తూనే ఉన్నాయి. గంట పాటు పేలుళ్లకు అదిరిపోయాం. 10గంటల తర్వాత మాత్రమే దగ్గరకు వెళ్లగలిగాం" అంటూ స్థానికుడు పి రమేష్ తెలిపారు.

ఆ పేలుళ్ల తీవ్రతకు తమ చెవులు ఇంకా సాధారణ స్థితికి రాలేదని, పిల్లలయితే భయంతో వణికిపోతూనే ఉన్నారని ఆయన వివరించారు.

11వ తేదీ ఉదయానికి కూడా ఘటనా స్థలంలో పొగలు వస్తూనే ఉన్నాయి.

ప్రమాదానికి కారణాలేంటి?

భారీ ప్రమాదం జరగడం, ప్రాణ నష్టం జరగడంతో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యన్నారాయణతో పాటుగా డీఐజీ పాల్ రాజ్, ఇతర పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. 

ఇప్పటికే బాణా సంచా తయారీ కేంద్రం యజమాని మీద వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెం. 274/2022గా కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 338,285,304 వంటివి పెట్టారు.

వాటితో పాటుగా పేలుడు పదార్థాల చట్టం 1908 లోని సెక్షన్ 3,5 నిబంధనలు ఉల్లంఘించారని, ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1884లో సెక్షన్ 9(బి) ఉల్లంఘించారని కూడ కేసు నమోదయ్యింది.

ప్రమాదానికి నిర్వహణ లోపాలు కారణంగా ప్రాధమికంగా తేల్చారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, కార్మికుల ప్రాణాలు పోయేందుకు కారణమయ్యిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

తయారీకి సమయపాలన పాటించకపోవడం, నిల్వ ఉంచాల్సిన దాని కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండడం, ప్రమాద నివారణా చర్యలు లేకపోవడం, భారీ పేలుడు పదార్థాలను కలిగి ఉండడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

పూర్తి కారణాలను అన్వేషించేందుకు మంగళగిరి నుంచి వచ్చిన ప్రత్యేక క్లూస్ టీమ్ రంగంలో దిగింది. ఆధారాలు సేకరించింది. ప్రమాద స్థలంలో పడి ఉన్న వస్తువులు, సమీపంలో దూరంగా చెల్లాచెదరయిన సమాగ్రిని పరిశీలించింది. తీవ్రతను అంచనా వేసి, అసలు కారణాలు తెలుసుకునేందుక సమయం పడుతుందని ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ బీబీసీకి తెలిపారు.

నవంబర్ 10వతేదీన తాడేపల్లిగూడెం మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు
ఫొటో క్యాప్షన్, నవంబర్ 10వతేదీన తాడేపల్లిగూడెం మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు

అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఎలా?

బాణాసంచా తయారీ , విక్రయ కేంద్రాల నిర్వహణ నిబంధనల ప్రకారం నడవాల్సి ఉంటుంది. దేశంలో బాణాసంచా తయారీకి తమిళనాడు పెట్టింది పేరు. శివకాశీలోనే దేశీయంగా ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో అత్యధిక భాగం తయారవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యూనిట్లున్నాయి. వాటికి కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పేలుడు పదార్థాల చట్టం 1908 ప్రకారం నిర్ధిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.

అత్యధిక సమయాల్లో అనుమతి లేకుండానే బాణాసంచా తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతుంది. లైసెన్స్ తీసుకున్న యూనిట్లలో కూడా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే యత్నాల్లో నిబంధనలు అతిక్రమించడం మరో కారణం. తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రమాదంలో కూడా అనుమతికి మించి భారీ పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారని పోలీసులు చెబుతున్నారు.

"బాణాసంచా తయారీలో నిబంధనలను పాటించకుండా, లాభాలు అర్జింజడమే ప్రధానంగా వ్యవహరించడం ఎక్కువ ప్రమాదాలకు కారణం. వాటిని నియంత్రించాలి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారమున్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా భద్రత లేని చోట్ల అన్ని రకాల బాణాసంచాని కలిపి ఉంచుతారు. అక్కడ పనిచేసే వారి కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లుండాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే నియంత్రించేందుకు వారికి అవగాహన కల్పించాలి. అలాంటి ఏర్పాట్లు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఎక్కువ ప్రమాదాలకు కారణం" అంటున్నారు రిటైర్డ్ ఫైర్ సర్వీస్ అధికారి ఎమ్ జేసుదాసు.

వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దీపావళి సమయంలో కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత యంత్రాంగం ఈ విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం తయారీదారులకు ఇష్టారాజ్యంగా మారుతుందని ఆయన బీబీసీతో అన్నారు.

ఏపీ హోం మంత్రి ఏమన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాల నిర్వహణ విషయమై ప్రత్యేక దృష్టి సారించేలా అందరినీ అప్రమత్తం చేస్తామని ఏపీ హోం మంత్రి తానేటి వనతి అన్నారు. 

"తాడేపల్లిగూడెంలో ప్రమాదం విచారకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. బాధితుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వారిని ఆదుకుంటాం. బాణాసంచా తయారీ విషయంలో అవసరమైన చర్యల కోసం చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించకుండా చూస్తాం" అని ఆమె బీబీసీకి తెలిపారు.

వరుస ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ఫైర్, పోలీస్ యంత్రాంగం తగిన దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించామని ఆమె అన్నారు.రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు అవసరమైన అదనపు చర్యల మీద దృష్టి సారిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)