నరేంద్ర మోదీ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మందితో జనసమీకరణ చేస్తోంది ఎందుకు?

విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న విజయసాయి రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Vijayasaireddy

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న విజయసాయి రెడ్డి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో బీజెపీ కంటే వైసీపీ హంగామాయే ఎక్కువగా కనపడుతోంది. సభకు 10 రోజుల ముందు నుంచి సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి విషయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డే చూసుకుంటున్నారు.

ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం చేయడమే మనందరి లక్ష్యం అంటూ పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాల్లో బీజేపీ పెద్దగా కనిపిండం లేదు. పార్టీ నాయకులు, మీడియాతో సమావేశాలు నిర్వహించి...ప్రధాని సభ విజయవంతం చేయాలని బీజెపీ నాయకులు చెప్తున్నారు.

దేశ ప్రధాని వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడం, రాష్ట్రంలో ప్రధాని కార్యక్రమానికి తగిన సహాయ, సహకారాలు అందించడం సాధారణమే అయినా, ఈ సభకు వైసీపీ చేస్తున్న హంగామా మాత్రం గతంలో ఎప్పుడూ చూడలేనంతంగా ఉందిని పొలిటికల్ ఎనలిస్టలు చెప్తున్నారు.

టార్గెట్ 3 లక్షల మంది

రోజూ ప్రధాని సభ ఏర్పాట్లను విజయసాయిరెడ్డే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చాలా మంది విశాఖలో బస చేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి అమర్నాధ్ వంటి నాయకులు విజయసాయిరెడ్డే వెంటే ఉంటూ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు బీజెపీ అడపాదడపా సభ ప్రాంగణం వద్ద కనిపిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా నియమించారు. వీరు ఆయా నియోజక వర్గాల నుంచి మోడీ సభ ప్రారంభానికి గంట ముందుగా జనాలను సభా ప్రాంగణానికి తీసుకుని రావాలి

అనకాపల్లికి చెందిన ఒక సమన్వయకర్తతో బీబీసీ మాట్లాడింది.

“విశాఖ, అనకాపల్లి జిల్లాలలోని వాలంటీర్లందరితో సమవేశం ఏర్పాటు చేశాం. మొత్తం 500 మంది వలంటీర్లు అక్కడి పార్టీ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలు, వార్డుల నుంచి ప్రజలను బహిరంగ సభకు వాహనాల్లో తీసుకువచ్చే పనిని వాలంటీర్ల ద్వారా సమన్వయపరుకుంటున్నాం. దీని కోసం ఒక యాప్ ను ఏర్పాటు చేసుకున్నాం. ఈ యాప్ ద్వారా ఎవరు, ఎంత మందిని తరలిస్తున్నామనే విషయాలను అప్ లోడ్ చేస్తున్నాం. మూడు లక్షల మందిని సభకు తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం” అని ఆ సమన్వయకర్త చెప్పారు. తన పేరును రాయవద్దని కోరారు.

ప్రధాని సభకు ఏర్పాట్లు

‘ఈ సభ విశాఖలో ఒక చరిత్రగా మిగలాలి’ - విజయసాయి రెడ్డి

విశాఖ సభ వేదిక నుంచి ప్రధాని మోడీ రూ.15,233 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిని ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభ వేదిక నుంచి వర్చువల్ విధానంలో మోడీ చేస్తారు.

“ఈ సభ విశాఖలో ఒక చరిత్రగా మిగలాలి. ప్రధాని సభ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. ఈ సభకు మూడు లక్షల మంది తరలిరావాలి. అందుకు తగ్గ ఏర్పాట్లను చేశాం. ఇది ఏ రాజకీయ పార్టీకో చెందిన సభ కాదు. దేశ ప్రధాని వస్తున్న సభ. దీనిని రాజకీయంగా చూడకూడదు. విశాఖపట్నం వేదికగా ప్రధాని ప్రారంభిస్తున్న, శంఖుస్థాపన చేస్తున్న కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు, దేశ అభివృద్ధికి ఎంతో అవసరం. అందుకే ఈ సభను విజయవంతంగా చేయడం ద్వారా మనమంతా ప్రధానికి కృతజ్ఞత చెప్పాలి” అని విజయసాయిరెడ్డి అన్నారు.

“ఇది రాజకీయ సభ కాదు. ఎన్నికల సభ కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మంత్రి, మఖ్యమంత్రి పాల్గొనే సభ. దీనిని వైఎస్సార్ పార్టీ సభగానో, బీజేపీ సభగానో చూడవద్దు. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం. ఇటువంటివి భవిష్యత్తులో కూడా జరుగుతాయి” అని విజయసాయిరెడ్డి బీబీసీతో అన్నారు.

‘ప్రధాని మెప్పు పొందాలని వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది’ - జనసేన

ప్రధాని కార్యక్రమంలో కేంద్రం స్కీమ్సే అన్నీ ఉన్నా కూడా... వాటిలో స్థానికంగా విశాఖ హార్బర్ ఆధునీకరణ, విస్తరణ ప్రాజెక్టులు, విశాఖ రైల్వే స్టేషన్ అధునీకరణ పనులకు శంఖుస్థాపన వంటివి కూడా ఉన్నాయి. ఇవన్ని విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రధాని ప్రారంభించబోయే పనుల కార్యక్రమంలో సహజంగానే ప్రజలు పాల్గొంటారు. దానికి ప్రజలను తరలించాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతరావు బీబీసీతో అన్నారు.

“జనాన్ని భారీగా సమీకరించి...ప్రధాని మెప్పు పొందాలని వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆయన మెచ్చుకుంటే జగన్, విజయసాయిరెడిలపై ఉన్న కేసులు విషయంలో ఏదైనా సహాయం చేయకపోతారా అని నమ్ముతున్నట్లు ఉన్నారు. కానీ అది జరగదు. ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాబట్టి వైసీపీ ప్రధానిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏదైనా లభ్ధి పొందాలని అనుకోవడం వీలుపడదు. అయినా మోడీ కోసం జనం వస్తారు. వైసీపీ చేసేదేముంది? పైగా బీజేపీ ఉంది, వాళ్లు చేస్తారు. ఎమ్మేల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు, చివరకు వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి మరీ జనాలను సమీకరించడం చాలా విడ్డూరంగా ఉంది” అని కోనతాతారావు చెప్పారు.

ప్రధాని సభకు బీజేపీ ఏర్పాట్లు

‘గతంలో ఏ ప్రధానికి, ఏ ప్రభుత్వం ఇంతలా చేయలేదు’

‘‘విశాఖ వస్తున్నది దేశ ప్రధాని. ఆ ప్రధాని బీజెపీ పార్టీ నుంచి వచ్చారు. బీజేపీ నాయకులే ప్రెస్ మీట్లతో సరిపెడుతుంటే...కనీసం బీజెపీతో ఎటువంటి సంబంధం లేని, పొత్తులేని వైసీపీ మాత్రం దేశ ప్రధానికి రాక కోసం అన్నట్లు కాకుండా అంతకు మించి ఏర్పాట్లు, జన సమీకరణ చేస్తున్నారు. ఆరు వేల మంది పోలీసులను ఈ కార్యక్రమానికి నియమించారు. గతంలో ఏ ప్రధానికి, ఏ ప్రభుత్వం ఇంతలా చేయలేదు” అని విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

“బీజేపీ వాళ్లు వైసీపీ అభివృద్ధికి సహకరించడం లేదని, పైగా వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తిడుతూనే ఉన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కూడా అవే మాటలను పురంధరేశ్వరి వంటి బీజేపీ లీడర్స్ అన్నారు. బీజేపీ వైసీపీని ఇంతలా టార్గెట్ చేస్తున్నా, వైసీపీ మాత్రం జనాల్ని తరలించేందుకు ఆ పార్టీ శ్రేణులను మొత్తం కేంద్రీకరించింది. అంటే వైసీపీ భయపడుతోంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి...జగన్ పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల విషయంలో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే దీనిని భావించాల్సి వస్తోంది” అని యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

‘మోదీజీ.. ఏపీ క్యాపిటల్ కు స్వాగతం’

మోదీ పర్యటనను మూడు రాజధానుల అంశానికి కూడా ఉపయోగపడే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ తీరంలో మోదీ, జగన్ సైకత శిల్పాలు తయారు చేసి...’వెల్ కమ్ టూ వైజాగ్, ఏపీ క్యాపిటల్’ అని రాయడం ద్వారా మూడు రాజధానుల అంశాన్ని కూడా వైసీపీ మోదీ దృష్టిలో పడేటట్లు ప్రయత్నిస్తోందని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

“ఈ సభను విజయవంతం చేయడం ద్వారా మూడు రాజధానుల విషయంలో కీలకంగా ఉన్న విశాఖను మోదీ మదిలో నిలిపి వేయవచ్చునని వైసీపీ భావిస్తున్నట్లుంది. ఏదో ఏజెండా లేకపోతే 3 లక్షల వరకు జనాల సమీకరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చి...ఇంతలా చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి, పార్టీ పరంగా కొంత చేయగలదు కానీ, అధికారికంగా ఏం చేయలేదు. కాకపోతే వైసీపీ మాత్రం ఎప్పుడు లేనంతగా ఇప్పుడు ప్రధాని పర్యటనకు విపరీతంగా హైప్ క్రియేట్ చేసింది” అని ఏయూ పొలిటికల్ సైన్స్ స్కాలర్ రామచంద్రరావు చెప్పారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఊహా చిత్రం

ఫొటో సోర్స్, Facebook/BJPAndhraPradesh

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఊహా చిత్రం

ప్రధానిని కలవనున్న పవన్ కల్యాణ్

ప్రధాని మంత్రి మోదీ ఏపీకి వస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రధానిని కలిసేందుకు విశాఖ వచ్చారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అంతలా కలిసి పని చేయలేకపోయామని కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ కామెంట్ చేశారు. ఆ నేపధ్యంలో బీజేపీ నాయకులు బీజెపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది, ఎటువంటి అపోహలు లేవని, త్వరలోనే పవన్ కు రోడ్ మ్యాప్ ఇస్తున్నామని కూడా చెప్పారు.

జనసేన జనవాణి కార్యక్రమం కోసం పవన్ విశాఖ వచ్చినప్పుడు, సెక్షన్ 30 అమల్లో ఉండగా ర్యాలీలు, సభలు సమావేశాలకు అవకాశం లేదని పవన్ కళ్యాన్ ని పోలీసులు మూడు రోజులు హోటల్ గదికే పరిమితం చేశారు. ఈ విషయంతో పాటు స్టీల్ ప్లాంట్ అంశంపై కూడా పవన్ మాట్లాడతారని జనసేన పార్టీ విశాఖ నాయకులు సురేష్ చెప్పారు.

 ‘40 నిమిషాలు...రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులు’

విశాఖలో 12వ తేదీ ప్రధాని కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు ముగిశాయి. విశాఖపట్నం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు రూ. 15 వేల 233 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో రైల్వే ప్రాజెక్టులతో పాటు, ఫిషింగ్ డిపార్ట్ మెంట్ ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ వంటివి ఉన్నాయి.

  • పాతపట్నం నుంచి నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారిని జాతికి అంకితం
  • తూర్పు తీరంలో రూ. 2917 కోట్లతో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యూ ఫీల్డ్‌ నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవం
  • రూ. 385 కోట్లతో గుంతకల్లులో ఐఓసీఎల్ చేపడుతున్న గ్రాస్ రూట్ డిపో నిర్మాణాన్ని ప్రారంభం
  • విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం 221 కిలోమీటర్ల మార్గం తదితర అభివృద్ధి పనులు ప్రారంభం
  • రూ. 7,614 కోట్ల విలువైన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, విశాఖ హర్బర్ విస్తరణ పనులకు శంఖుస్థాపన

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)