టీ20 వరల్డ్ కప్: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రూల్స్ మార్చిన ఐసీసీ

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్

ఫొటో సోర్స్, facebook/PakistanCricketBoard

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్

వేదిక: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్

తేదీ: 13 నవంబర్, టైమ్: మధ్యాహ్నం 1.30 (భారత కాలమానం ప్రకారం)

ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం జరగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారు.

మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా కూడా మ్యాచ్ కొనసాగించేందుకు వీలుగా మార్పులు చేశారు.

పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30కు జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలగొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది.

ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉన్నప్పటికీ సోమవారం కూడా వర్ష సూచన ఉండడంతో అదనంగా మరో 2 గంటల సమయాన్ని రిజర్వ్‌లో పెట్టుకున్నారు నిర్వాహకులు.

రిజర్వ్ డే ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయం రెండు గంటలు అదనంగా పెంచినప్పటికీ కూడా వర్షం అంతరాయం కలిగించి ఒక్కో జట్టు 10 ఓవర్ల కంటే తక్కువ ఆడాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడు ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

గురువారం ఆడిలైడ్‌లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

అంతకుముందు బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

ఫైనల్ మ్యాచ్ ఆదివారం కనుక పూర్తికాకుంటే రిజర్వ్ డే అయిన సోమవారం కొనసాగుతుంది. అంటే సోమవారం మళ్లీ రెండు జట్ల మధ్య కొత్తగా ఆట మొదలు కాకుండా ఆదివారం నాటి ఆటను సోమవారం కొనసాగిస్తారు.

ముందురోజు ఆదివారం ఎన్ని ఓవర్లకు ఆట నిర్ణయమైతే రెండో రోజు ఆటనూ ఆ లెక్కనే కొనసాగిస్తారు.

అంటే తొలిరోజే ఆటను 10 ఓవర్లకు కుదిస్తే రెండో రోజుకూడా అదే లెక్కన మ్యాచ్ కొనసాగుతుంది.

ఈ మ్యాచ్‌కు అదనంగా 2 గంటలు కేటాయించడం అంటే సోమవారం రిజర్వ్ డేతో కలిపి మొత్తం 7 గంటల 10 నిమిషాలు అదనంగా ఉన్నట్లు.

ఆదివారం వర్షం వల్ల ఆట ఆగిపోతే సోమవారం ఉదయం 9.30 గంటలకే(భారత కాలమానం ప్రకారం) ఆట కొనసాగించాలనుకుంటున్నారు నిర్వాహకులు.

ఈ టోర్నీలో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లకు వర్షం వల్ల అంతరాయం కలిగింది.

సూపర్ 12 దశలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయమేర్పడింది. ఒక్క బంతి కూడా ఆడే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు.

అంతకుముందు సూపర్ 12 దశలోనే ఇంకో మ్యాచ్‌లో వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ కుదించారు. అందులో ఐర్లాండ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)