INDvsENG: రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

ఫొటో సోర్స్, Getty Images
అడిలైడ్‌లో ఏకపక్షంగా సాగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బట్లర్, హేల్స్ చెలరేగి ఆడారు.
బట్లర్ 49 బంతుల్లో 80, హేల్స్ 47 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరి జోరును అడ్డుకునేందుకు రోహిత్ శర్మ ఆరుగురు బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఫలితం లేకుండా పోయింది.
హేల్స్ 7 సిక్సులు, 4 ఫోర్లు సాధించగా, బట్లర్ 3 సిక్సులు, 9 ఫోర్లు కొట్టి సత్తా చాటాడు.
ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టు 169 పరుగులు లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ విజయంతో ఫైనల్ కు చేరుకున్న బట్లర్ సేన, 13 వ తేదీన పాకిస్తాన్‌తో ఫైనల్లో తలపడుతుంది.
ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మధ్య మధ్యలో వికెట్లు పడుతున్నా, మెరుగైన స్కోరు దిశగా సాగింది.
9 పరుగుల వద్ద భారత్ జట్టు కె.ఎల్.రాహుల్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగులకు రాహుల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్, విరాట్‌లు స్కోరును నెమ్మదిగా ముందుకు సాగించారు. 9వ ఓవర్ వచ్చేసరికి భారత్ స్కోరు 56 పరుగులు. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ(27) జోర్డాన్ బౌలింగ్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. పది ఓవర్లకు భారత జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
12వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ (14) అవుటయ్యాడు.
అప్పటికి జట్టు స్కోరు 75 పరుగులు. మూడు వికెట్లు కోల్పోయిన దశలో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు క్రీజ్ లో ఉన్నారు.
టీమిండియా వంద పరుగులు చేయడానికి 15 ఓవర్లు తీసుకుంది.ఆ తర్వాత నుంచి హార్ధిక్ పాండ్యా దూకుడుగా ఆడటం, విరాట్ అతనికి సహకరిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
18 ఓవర్ వచ్చేసరికి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ(50) అవుటయ్యాడు. అప్పటికి భారత స్కోరు 136 పరుగులు.
విరాట్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ 6 పరుగులు చేసి జట్టు స్కోరు 158 వద్ద రనౌటయ్యాడు.
చివరి రెండు ఓవర్లలో హార్ధిక పాండ్యా చెలరేగి ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
చివరి ఓవర్ చివరి బంతికి హార్ధిక్ పాండ్యా(63) హిట్ వికెట్‌గా అవుటయ్యాడు.
ఇంగ్లాండ్ జట్టులో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, ANI
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 ఓవర్లు వేసి 39 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 34 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లు వేసి 27 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చారు.
భారత బౌలింగ్ ఇంగ్లాండ్ దూకుడును ఏ దశలోనూ అడ్డుకునే స్థితిలో కనిపించ లేదు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- ‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








