పవన్ కల్యాణ్ మీద ఏపీ పోలీసుల కేసు: కారు టాప్ మీద ప్రయాణించడంపై ఫిర్యాదు

కారుపై కూర్చుని ప్రయాణిస్తున్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, janasenaparty

ఫొటో క్యాప్షన్, ఇప్పటం గ్రామానికి వెళ్లేటప్పుడు కారు టాప్ మీద పవన్ కల్యాణ్ ప్రయాణించారు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 5వ తేదీన గుంటూరు జిల్లాలోని ఇప్పటం అనే గ్రామానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా వేగంగా వెళ్తున్న కారు టాప్ మీద కూర్చుని పవన్ కల్యాణ్ ప్రయాణించారు.

ఈ ఘటన మీద శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్-336తోపాటు వాహనాల చట్టంలోని సెక్షన్-177 కింద కేసు నమోదు చేశారు.

ఇతరుల ప్రాణాలకు లేదా తమ ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరిస్తే ఐపీసీ సెక్షన్-336 కింద నేరం అవుతుంది.

ఇప్పటం గ్రామంలో బాధితులను పరామర్శిస్తున్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Facebook/JanasenaParty

ఫొటో క్యాప్షన్, జనసేన పార్టీ సభకు భూములు ఇచ్చినందుకే ఇప్పటం గ్రామంలో ఇంటి నిర్మాణాలు కూలగొడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.

ఏం జరిగింది?

ఇప్పటం అనేది తాడేపల్లి మండలంలోని ఒక చిన్న గ్రామం. జనాభా సుమారు 4 వేలు ఉంటుంది. రోడ్డు విస్తరణ, ‘ఆక్రమణ’ తొలగింపుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఊరిలో ఇళ్ల నిర్మాణాలను కూల్చింది.

ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ఊరిని ఈ నెల 5న సందర్శించారు. ఆ ఊరికి వెళ్లేటప్పుడు తన కాన్వాయ్‌లోని ఒక కారు మీద ఆయన కూర్చొని ప్రయాణించారు. అప్పుడు కారు చాలా వేగంగా ప్రయాణిస్తోంది.

రైతు కూలీలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Facebook/JanasenaParty

ఎందుకు వెళ్లారు?

ఈ ఏడాది మార్చి 14న ఇప్పటం గ్రామానికి చెందిన రైతుల భూముల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. అయితే నాడు తమ పార్టీ సభకు భూములు ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల మీద కక్ష సాధిస్తోందని జనసేన పార్టీ చెబుతోంది.

కక్ష సాధింపులో భాగంగానే ఇప్పటం గ్రామంలోని ఇంటి నిర్మాణాలను కూల్చుతున్నారని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆ గ్రామస్తులను పరామర్శించడానికి వెళ్లారు. బాధితులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇప్పటం: రోడ్డు విస్తరణ కోసం కూల్చిన ఇంటి నిర్మాణాలు
ఫొటో క్యాప్షన్, ఇప్పటం: రోడ్డు విస్తరణ కోసం కూల్చిన ఇంటి నిర్మాణాలు

ఊరి లోపల 118 అడుగుల రోడ్డు

ఇప్పటం గ్రామం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బీ రహదారిని ప్రభుత్వం వెడల్పు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఆక్రమణలు' తొలగించడం ప్రారంభించారు.

జాతీయ రహదారి-16ను అనుసంధానిస్తూ పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ వరకూ ఈ రోడ్డు ఉంటుంది. కొలనుకొండ, వడ్డేశ్వరం వంటి గ్రామాలలో ఈ రోడ్డు వెడల్పు 30-40 అడుగుల వెడల్పు మాత్రమే. ఇప్పటంలో మాత్రం ఆ దారిని 118 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు.

ఆ రోడ్డులో ఆటోలు, కార్లు, టూ వీలర్ వంటి వాహనాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి. లారీలు, ట్రాక్టర్లు కూడా తిరుగుతుంటాయి. స్కూలు బస్సులు మినహా ఆర్టీసి బస్సులు తిరగడం లేదు.అయినా రోడ్డును మాత్రం భారీగా విస్తారించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం విశేషం.

ఇప్పటం గ్రామంలోకి వెళ్లేందుకు ప్రధాన రహదారులు నాలుగున్నాయి. అందులో కొలనుకొండ గ్రామం నుంచి వడ్డేశ్వరం మీదుగా వెళ్లే దారి ఒకటి. పెదవడ్లమూడి నుంచి వచ్చే రోడ్డు మరోటి. మంగళగిరి నుంచి వచ్చే రోడ్డు, వడ్డేశ్వరం నుంచి కూడా జాతీయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా ఇప్పటం వెళ్లొచ్చు. మంగళగిరి, వడ్డేశ్వరం నుంచి ఇప్పటంలో అడుగు పెట్టాలంటే రైల్వే గేటు దాటాల్సి ఉంటుంది.

రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో ఎక్కువ మార్లు గేటు వేసి ఉంటుంది. ఆ గ్రామంలోకి అడుగుపెట్టే అన్ని దారుల వెడల్పు 40 అడుగుల లోపు ఉన్నాయి. కానీ ఇప్పటం గ్రామంలో మాత్రం విశాలమైన రోడ్డు వేసేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

రైలు గేటు దాటి గ్రామంలోకి రావాలంటే తొలుత ఓవర్ బ్రిడ్జీలు లేదా అండర్ పాస్‌లు అందుబాటులో ఉండాలి. అవి లేకుండా కేవలం గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనులకు ప్రయత్నించడం అనేక ప్రశ్నలకు, అనుమానాలకు తావిస్తోంది.

ఓ వైపు రాష్ట్రమంతా రోడ్ల దుస్థితి మీద విమర్శలు వస్తున్నంటే మరొకవైపు ప్రభుత్వం ఇప్పటం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం అపోహలకు తావిస్తోంది.

ఇప్పటం గ్రామం వద్ద రైల్వే గేటు

‘ఆక్రమణ’ల పేరుతో తొలగింపు

ఇప్పటం గ్రామంలోని రోడ్డును వెడల్పు చేసే ప్రయత్నాలు ఆరేడు నెలల క్రితమే మొదలయ్యాయి. అప్పటి నుంచి వివాదం మొదలయ్యింది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నోటీసులు ఇచ్చారు. రెండు మార్లు నోటీసులు సంబంధిత ఇంటి యజమానులకు అందాయి.

తొలుత నోటీసు ఇచ్చి 'ఆక్రమణ'ల్లో ఉన్న ఇళ్లను తొలగించారు. అయితే ఎక్కడా నివాసాలను పూర్తిగా తొలగించిన ఆనవాళ్లు లేవు. గోడలు, ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లు, దుకాణాలు మాత్రమే తొలగించారు.

రెండు నెలల క్రితం గ్రామంలో కొంత భాగం తొలగించి అక్కడ డ్రెయినేజీ నిర్మించారు. కూలగొట్టిన తర్వాత కొందరు ఇంటి గోడలు, మెట్లు కూడా నిర్మించుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

వడ్డేశ్వరం నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఎడమ వైపు 'ఆక్రమణల' తొలగింపు యత్నాలు గతంలో జరిగాయి. ఈసారి కుడివైపు ఇళ్ల ముందు 'ఆక్రమణలు' తొలగించే పని మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టారు. అన్ని కులాలకు చెందిన వారి నిర్మాణాలను ఆక్రమణల పేరుతో తొలగించే ప్రయత్నం చేశారు.

ఈ కూల్చివేతలే వివాదానికి కారణమయ్యాయి.

తమ ఇళ్ల తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోవాలని ఇప్పటం వాసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసినప్పుడు '118 అడుగుల వెడల్పు అవసరం లేకుండా చూస్తామని తమకు హామీ ఇచ్చినట్టు' స్థానికుడు రామనరసయ్య బీబీసీకి తెలిపారు.ఇతరులు కూడా ఈ విషయాన్ని బీబీసీకి చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ ఆచరణ అందుకు భిన్నంగా ఉండడమే తమకు ఆందోళన కలిగిస్తోందని వారు అన్నారు.

ఇప్పటంలో కూల్చిన నిర్మాణాలు

కులాల మధ్య ఆధిపత్య పోరు

ఇప్పటం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. పూల సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా నాయుళ్లు, రెడ్లతో పాటుగా గౌడ్ కులస్తులుంటారు. రాజకీయంగా కాపు, రెడ్డి కులాల మధ్య ఆధిపత్యం ఉంటుంది. గౌడ్ కులానికి చెందిన వారు ఎవరికి అండగా నిలిస్తే వారిదే ఆధిపత్యం.

రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే ఇప్పటంలో ఇప్పుడు ఆధిపత్యం కోసం బహిరంగ ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో గ్రామ రాజకీయాల్లో స్వల్ప విభేదాలు తప్ప బహిరంగంగా ఎదురుపడని వర్గాల మధ్య కుల విభేదాలు రాజుకున్నాయి.

కమ్యూనిటీ హాలు మీద పెత్తనం విషయంలో కూడా పట్టింపులు రావడం, అధికార పార్టీ అండతో రెడ్లు ఆధిపత్యం ప్రదర్శించడం వంటివి జరిగాయి. ఆ క్రమంలోనే జనసేన సభ తర్వాత రోడ్ల విస్తరణ తెరమీదకు వచ్చింది.

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ జరుగుతోంది. అందుకు తోడుగా ఇప్పటం సమీపంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఒకటి రాజకీయ పెత్తనం, రెండు వ్యాపార ప్రయోజనం ముడిపడి ఉన్నందునే రోడ్ల వెడల్పు అవసరం ఏర్పడినట్టుగా భావించాల్సి ఉంటుందని స్థానికంగా ఉండే సీనియర్ జర్నలిస్ట్ వి.సురేష్ అన్నారు.

వీడియో క్యాప్షన్, బస్తర్ అడవుల్లో తీర్థగఢ్ జలపాత సోయగాల్ని ఎప్పుడైనా చూశారా?

ఇవి కూడా చదవండి: