అమ్మకానికి ఊరు.. ధర రూ.2 కోట్లు.. స్పెయిన్‌లో బంపర్ ఆఫర్

సాల్టో డి కేస్ట్రో గ్రామం

ఫొటో సోర్స్, BALLES2601/WIKIMEDIA COMMONS

ఫొటో క్యాప్షన్, సాల్టో డి కేస్ట్రో గ్రామం
    • రచయిత, గై హెడ్జ్‌కో
    • హోదా, బీబీసీ న్యూస్, మాడ్రిడ్

స్థలాలు కొనాలనుకుంటారు, పొలాలు కొనాలనుకుంటారు... కానీ ఏకంగా ఒక ఊరినే కొనుక్కునే అవకాశం వస్తే. చేతిలో డబ్బుండాలే కానీ అలాంటి అవకాశం కూడా కల్పిస్తోంది స్పెయిన్‌లోని ఓ గ్రామం.

అవును... వాయువ్య స్పెయిన్‌లోని సాల్డో డి కేస్ట్రో అనే గ్రామాన్ని అమ్మకానికి పెట్టారు దాని యజమానులు. స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో పోర్చుగల్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామానికి దేశ రాజధాని మాడ్రిడ్ నుంచి కారులో 3 గంటల్లో చేరుకోవచ్చు.

ఈ ఊరిలో మొత్తం 44 ఇళ్లున్నాయి. ఒక హోటల్, చర్చ్, స్కూల్, మున్సిపల్ స్విమింగ్ పూల్ కూడా ఉన్నాయి.

అన్నీ ఉన్నా ఇక్కడ లేనిది జనం మాత్రమే. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ నివసించడం లేదు.

దాదాపు 30 ఏళ్లుగా ఈ ఊరిలో ఎవరూ ఉండడం లేదు.

ప్రస్తుత యజమాని దీన్ని 2000 సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. మంచి పర్యటక ప్రాంతంగా మార్చాలన్న ఉద్దేశంతో ఆయన దీన్ని కొనుగోలు చేశారు. అయితే, యూరోజోన్ సంక్షోభం కారణంగా ఆయన ప్రణాళికలేవీ ఫలించలేదు.

‘‘ఈ ఊరిని కొనుగోలు చేసిన యజమాని ఇక్కడ హోటల్ నిర్మించాలనుకున్నారు. కానీ, పరిస్థితులను చూసి ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు’’ అని యాజమాన్య సంస్థ రాయల్ ఇన్వెస్ట్‌కు చెందిన ప్రతినిధి రోనీ రోడ్రిగో చెప్పారు.

‘‘ఇప్పటికీ ఆయన ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగానే ఉన్నారు’’ అన్నారు రోనీ రోడ్రిగో.

తాను నగరంలో ఉంటానని, ఈ గ్రామాన్ని మెంటెయిన్ చేయలేకపోతున్నానని చెబుతూ యజమాని దీన్ని ‘ఐడియలిస్టా’ వెబ్‌సైట్‌లో పెట్టారు.

వారం కిందట ఐడియలిస్టాలో దీన్ని అమ్మకానికి పెట్టిన తరువాత ఇంతవరకు 50 వేల మందికిపైగా చూశారు.

రోనీ రోడ్రిగో

ఫొటో సోర్స్, ROYAL INVEST

ప్రకటన చూసిన తరువాత 300 మంది కొనుగోలుకు ఆసక్తి చూపించారని రోనీ రోడ్రిగో చెప్పారు.

రష్యా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్ నుంచి కొందరు తమను సంప్రదించారని ఆయన చెప్పారు.

సాల్డో డి కేస్ట్రో గ్రామాన్ని విద్యుదుత్పత్తి కంపెనీ ఇబర్‌డ్యూరో నిర్మించింది. ఇక్కడున్న జలాశయం నిర్మించినప్పుడు 1950లో ఉద్యోగుల కుటుంబాల కోసం దీన్ని నిర్మించారు.

అయితే, జలాశయ నిర్మాణం పూర్తయిన తరువాత కుటుంబాలన్నీ ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. 1980ల చివరి నుంచి ఊరంతా ఖాళీగా ఉంటోంది.

సాల్టో డి కేస్ట్రోను తొలుత 65 లక్షల యూరోలకు(సుమారు రూ. 54 కోట్లు) అమ్మకానికి పెట్టారు. కానీ, ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో 2.6 లక్షల యూరోలకు (సుమారు రూ. 2 కోట్లు) ధర తగ్గించారు.

స్పెయిన్‌లోని ప్రధాన నగరాలు మాడ్రిడ్, బార్సిలోనాల్లో సింగిల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇంత ధర పలుకుతాయి.

అయితే, ఈ ఊరిని కొనుగోలు చేసి పర్యటక ప్రాంతంగా మార్చాలంటే భారీగా డబ్బు ఖర్చవుతుంది.

ఐడియలిస్టా అంచనా ప్రకారం ఈ గ్రామాన్ని పూర్తిగా పునరుద్ధరించాలంటే 20 లక్షల యూరోల వరకు(సుమారు రూ. 16 కోట్లు) ఖర్చవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)