దేనిపైనా త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అయితే తాజా పరిశోధన మీకో శుభవార్తే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ రాబ్సన్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
నిర్ణయాలు త్వరగా తీసుకోలేకపోవడం అనే లక్షణాన్ని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే, మనం తెలివిగా నడుచుకునేందుకు, మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తోడ్పడుతుందని తాజా పరిశోధన చెబుతోంది.
టీవీ సిరీస్ ‘‘ద గుడ్ ప్యాలెస్’’లో క్యారెక్టర్ చిడీ అనగోనియే రోజువారీ సాధారణ నిర్ణయాలను కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. ఏం తినాలి? జీవిత భాగస్వామిపై ప్రేమను ఎలా వ్యక్తంచేయాలి? లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడతారు.
అసలు నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనే ఒక్కోసారి కడుపునొప్పికి కారణం అవుతుంటుంది. ‘‘అనాలసిస్ పరాలసిస్’’తో ఆయన సతమతం అవుతుంటారు.
చిడీ పాత్ర నటుడు విలియమ్ జాక్సన్ హార్పెర్‌తో మేం మాట్లాడాం. నిజానికి ఇలా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం వల్లే సిరీస్‌లో చిడీ మరణిస్తాడని ఆయన చెప్పారు. తన ఆప్త మిత్రుడితో కలిసి ఏ బార్‌కు వెళ్లాలని ఇంటి బయట నిలబడి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడే పైనుంచి ఒక ఏసీ పడుతుంది. దీంతో ఆయన మరణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదడులో గోల
‘‘చెత్తను నిర్వీర్యంచేసే గార్బేజ్ డిస్పోజల్ మెషీన్‌లో ఒక ఫోర్క్ పడిపోతే ఎలాంటి శబ్దం వస్తుంది. అదే శబ్దం నా మెదడులో నిత్యం వస్తుంటుంది’’అని ఒక ఎపిసోడ్‌లో చిడీ చెప్పారు. దీని వల్ల చిడీకి సంతోషం దూరమయ్యేది. మరోవైపు ఆయనలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉండేది. తను తీసుకునే కొన్ని నిర్ణయాలు, తన చుట్టుపక్కల వారికి తలనొప్పి కూడా తెప్పించేవి.
ఇలాంటి అనుభవం మీకు కూడా ఉందా? అయితే, ఇలా అనిపించేది మీరు ఒక్కరు మాత్రమేనని అనుకోవద్దు. నిర్ణయాలు త్వరగా తీసుకోలేకపోవడం అనేది సాధారణ సమస్య. కొందరు చాలా తేలిగ్గానే నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు అసలు తమ ముందున్న ఆప్షన్లలో ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఒక్కోసారి అసలు ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకుండా అలానే ఉండిపోతారు.
యాంక్సైటీ వల్ల చిడీ నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. అయితే, దీని వల్ల మనకు కాస్త మంచి కూడా జరుగుతుందని తాజా పరిశోధన చెబుతోంది. అంటే వెంటవెంటనే లేదా ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదురయ్యే ‘‘కన్ఫర్మేషన్ బయాస్’’ లాంటి ఎర్రర్‌ల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వివరిస్తోంది. ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకునే కంటే కాసేపు ఆగడం మంచిదని వివరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అది మంచిదే..
నిర్ణయాలు తీసులేకపోయే సమస్యను నిర్ధారించడానికి సైకాలజిస్టులు భిన్న టూల్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిలో ఎక్కువగా ఉపయోగించే ప్రశ్నల జాబితాలో ‘‘ఫ్రాస్ట్ ఇన్‌డెసెసివ్‌నెస్ స్కేల్’’ కూడా ఒకటి. దీనిలో కొన్ని ప్రశ్నలు, వ్యాఖ్యలను ఇచ్చి సమాధానాలు రాయమని కోరతారు. వీటిలో పూర్తిగా అంగీకరించడం (1), పూర్తిగా విభేదించడం (5) లాంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయాల్సి ఉంటుంది.
దీనిలో అడిగే అభిప్రాయాలు ఇలా ఉంటాయి..
- నేను నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తాను
- ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటాను
- తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని ఆందోళన చెందుతాను
- చిన్నచిన్న అంశాల్లోనూ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంటోంది
నిర్ణయాలు తీసుకోవడంలో ఎదుర్కొనే సమస్యను ఈ స్కేల్ సాయంతో సైకాలజిస్టులు అంచనా వేస్తుంటారు. నిజానికి ‘‘పర్ఫెక్షనిజం (అన్ని వంద శాతం కచ్చితత్వంతో చేయాలనుకోవడం)’’ వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే ఏం జరుగుతుందోనని పర్ఫెక్షనిస్టులు భయపడుతుంటారు. సరైన నిర్ణయం తీసుకునేవరకు వారు వాయిదాలు వేస్తూ పోతుంటారు. అసలు ఒక్కోసారి వారికి ఆ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ రాకపోవచ్చు కూడా.
దీని వల్ల వచ్చే విసుగు.. సంతోషాన్ని మాయం చేస్తుంది. ఈ స్కేలుపై స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, వారి జీవితంలో సంతృప్తి స్థాయిలు అంత తక్కువగా ఉంటాయని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఎరిక్ రాసిన్ చెప్పారు. తమ జీవితం అద్భుతంగా ఉందనే మాటలు వారి నోటి నుంచి రావని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వేగంగా నిర్ణయాలు తీసుకోవడం..
ఈ ఫలితాలను చూసి నిర్ణయాలు త్వరగా తీసుకోలేకపోవడం అనేది ఎవరికీ ఇష్టంలేని లక్షణంగా మీరు భావించొచ్చు. అయితే, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కొన్ని లాభాలు కూడా ఉంటాయని తాజా పరిశోధన చెబుతోంది.
టెక్‌నీష్ యూనివర్సిటాట్ డ్రెస్‌డెన్ (టీయూటీ)లోని సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ ఐరిస్ స్క్నీడర్, పరిశోధకురాలు జనా మారియా హాన్స్‌బెన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు.
‘‘ఫ్రాస్ట్ ఇన్‌డెసిసివ్‌నెస్ స్కేల్’’కు బదులుగా ‘‘ట్రైట్ అంబీవలెన్స్’’ పద్ధతిని హాన్స్‌బెన్, స్క్నీడర్ ఉపయోగించారు. దీనిలో భాగంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు వారిలో వచ్చే ఆలోచనలు, ఫీలింగ్స్‌ను దీనిలో విశ్లేషిస్తారు. ఉదాహరణకు దీనిలో పరిగణలోకి తీసుకునే అంశాలు ఇలా ఉంటాయి..
- నా ఆలోచనలు కొన్నిసార్లు పరస్పర విరుద్ధంగా ఉంటాయి
- ఒక్కోసారి రెండు పరస్పర విరుద్ధమైన భావనల కింద నేను నలిగిపోతుంటాను
- ఒక్కోసారి ఏదైనా అంశం గురించి ఆలోచించేటప్పుడు పూర్తిగా శక్తినంతా కోల్పోయినట్లు అనిపిస్తుంది
అధ్యయనంలో పాల్గొన్నవారి ఆలోచనలు వీటి దగ్గరగా ఉంటే వారు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా పరిగణించాలని హాన్స్‌బెన్ చెప్పారు.
‘‘కొంతమందిలో సమస్య తీవ్రంగా ఉండేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టొచ్చు. అయితే, వీరి నిర్ణయాల్లో పక్షపాతం తక్కువగా ఉంటుందని మా అధ్యయనంలో తేలింది’’అని హాన్స్‌బెన్, స్క్నీడర్ వివరించారు.
ఉదాహరణకు ఒక ప్రయోగంలో భాగంగా... కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోవాలని అధ్యయనంలో పాల్గొన్నవారికి సూచించారు. అది ఎలాంటి పరిస్థితి అంటే..
‘‘మీరు ఒక వ్యక్తిని కలిశారు. ఆయన ఇంట్రోవర్టో లేదా ఎక్స్‌ట్రోవర్టో మీరు తెలుసుకోవాలని భావించారు. ఒకవేళ ఆయన ఎక్స్‌ట్రోవర్ట్ అని మీరు అనుకున్నప్పుడు ఈ కింది ప్రశ్నల్లో దేన్ని మీరు అడుగుతారు?’’
- ఇంటిలో ఒంటరిగా ఉండేందుకే మీరు ఇష్టపడతారా?
- మీకు పార్టీలకు వెళ్లడం ఇష్టమేనా?
చాలా మంది ఇక్కడ రెండో ప్రశ్నను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఒక పక్షపాతం ఉంది. మీరు అనుకున్న ఆలోచనలతో సరిపోయే సమాచారం కోసమే మీరు చూస్తున్నారు. మీరు తప్పుగా అయ్యే అవకాశం వచ్చే సమాచారాన్ని అసలు వారికి ఇవ్వడం లేదు. అయితే, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేవారిలో ఇలాంటి పక్షపాతం ఉండే అవకాశం తక్కువని హాన్స్‌బెన్ తెలిపారు. వీరు మొదటి ప్రశ్నకు ఎంచుకునే అవకాశం ఎక్కువని ఆమె వివరించారు.
మరొక ప్రయోగంలో భాగంగా ఒక ఉద్యోగి గురించి చదవమని అధ్యయనంలో పాల్గొన్నవారికి సూచించారు. ఆ ఉద్యోగి పేరు ముల్లర్. తను తన ఉద్యోగ కాంట్రాక్టును రెన్యువల్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను కొనసాగించాలా వద్దా? అనే నిర్ణయం తమనే తీసుకోవాలని సూచించారు. అయితే, ముల్లర్‌పై కొందరు నిపుణుల సమాచారాన్ని కూడా వారికి అందించారు. వీటిలో కొన్ని అధ్యయనలో పాల్గొన్నవారి అభిప్రాయాలతో సరిపోలాయి. మరికొన్ని వారి అభిప్రాయాలకు భిన్నంగా కూడా ఉన్నాయి.
ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొనేవారు చాలా సువిశాల దృక్పథంతో ఆలోచిస్తున్నట్లు హాన్స్‌బెన్, స్క్నీడర్ గుర్తించారు.
ఈ ఫలితాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ‘‘కన్ఫర్మేషన్ బయాస్’’అనేది నిర్ణయాలు సరిగా తీసుకోలేని వారిలో తక్కువగా ఉంటున్నట్లు తేలింది. కాగ్నిటివ్ ఎర్రర్‌లలో కన్ఫర్మేషన్ బయాస్ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. దీని వల్ల రిలేషన్‌షిప్‌లు, రాజకీయాలు లాంటి భిన్న విషయాల్లో మనం సహేతుకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాం. ఇలాంటి తప్పుల నుంచి నిర్ణయాలు వేగంగా తీసుకోలేని వారు మెరుగ్గా బయటపడుతున్నట్లు వెల్లడైంది.
ఇక్కడ నిర్ణయాలు వేగంగా తీసుకోలేనివారిలో కరెస్సాండెన్స్ బయాస్ కూడా తక్కువగా ఉంటున్నట్లు స్క్నీడర్ వెల్లడించారు. ఒక తప్పు జరిగినప్పుడు నాటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా సదరు వ్యక్తిపై పూర్తి భారం వేయడాన్ని కరస్పాండెన్స్ బయాస్‌గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి కింద పడిపోయారు అనుకోండి. అసలు పరిస్థితులేమిటో తెలుసుకోకుండా ఆయన నడక తీరే అలా ఉంటుందని వ్యాఖ్యానించడం.
అంటే కొంత మంది పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. దీని వెనుక వారి కుటుంబ, ఆర్థిక అంశాలు కూడా ఉంటాయి. కానీ, వారికి తెలివిలేదని మనం తేల్చేయడం. అయితే, నిర్ణయాలు వేగంగా తీసుకోలేనివారు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటారని స్క్నీడర్ చెప్పారు.
ఏది మంచిది మరి?
త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనే సమస్యను మీరు ఎదుర్కొంటే తాజా పరిశోధన మీకు శుభవార్త లాంటిది. ‘‘మనం కాస్త సమయం తీసుకోవడం అనేది.. పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది’’అని హాన్స్‌బెన్ చెప్పారు.
అయితే, అన్నివేళలా ఇలా అనుకోవడం కూడా పొరపాటే. ‘‘మనం చాలా విషయాల్లో ఈ రెండింటి మధ్య సమతూకం పాటించాల్సి ఉంటుంది’’అని హాన్స్‌బెన్ చెప్పారు.
ఈ సమస్య విషయంలో మనం ఒక టైమ్ లిమిట్ పెట్టుకుంటే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫలితంగా ఒకే అంశంపై గంటలపాటు ఆలస్యం చేయడం తప్పుతుందని హాన్స్‌బెన్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి
- ఆయన్ను చూశాకే కృష్ణ హీరో కావాలనుకున్నారు.. అనుకున్నట్లే అయ్యారు
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది - బెంగళూరులో మోదీ ఆవిష్కరిస్తున్న దీని వెనుక కుల రాజకీయాలున్నాయా
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















