‘‘రేపు ఎన్నికల్లో నన్ను గెలిపించకపోతే.. అదే నాకు చివరి ఎన్నిక’’ - ఏడాది కిందటి ప్రతిజ్ఞను గుర్తు చేసిన చంద్రబాబు

ఫొటో సోర్స్, telugudesam party
‘‘నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే.. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపించాలి. లేదంటే నాకు అదే చివరి ఎన్నిక అవుతుంది’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
నెల్లూరులో పర్యటిస్తున్న చంద్రబాబు బుధవారం రాత్రి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని ఆరోపిస్తూ.. ఏడాది కిందట అసెంబ్లీలో జరిగిన పరిణామాలను, నాడు తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావించారు.
‘‘నేను అసెంబ్లీకి వెళ్లాను. నేనొక సీనియర్ నాయకుడిని. నా 40 ఏళ్లలో నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయలేదు. అసెంబ్లీకి పోతే నన్ను అవమానించారు. కడకు నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా. ఇది గౌరవ సభ కాదు. ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అప్పుడు ఎంటరవుతా. లేకపోతే అసెంబ్లీకి రానని ఆ రోజే చెప్పా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని. నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే.. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నాకు ఇదే చివరి ఎన్నిక అవుతుంది. అది కూడా చెప్తున్నా’’ అన్నారు.

ఫొటో సోర్స్, facebook
ఏడాది కిందట అసెంబ్లీలో ఏం జరిగింది?
గత ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. సభలో తనను, తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా’’ అని ప్రకటించి వాకౌట్ చేశారు.
ఆ తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, ఇంతటి ఘోరమైన సభను తాను ఇంత వరకు చూడలేదని, అధికార పార్టీ దీనిని కౌరవ సభలా నిర్వహిస్తోందని, ఆఖరికి ప్రతిపక్ష నేత కుటుంబంలోని మహిళలను కూడా సభలో ప్రస్తావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
''నా భార్య రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రొటొకాల్ సమయంలో తప్ప ఆమె ఏ కార్యక్రమంలోనూ కనపబడేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు ఆమెకు తెలియదు. ఆవిడ పని ఆమె చూసుకుంటారు. నలుగురికి సాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఆమెకు మరొకటి తెలియదు. అలాంటి వ్యక్తిని కూడా డర్టీ పాలిటిక్స్‌కి లాగే పరిస్థితికి వచ్చారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం'' అంటూ తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
‘‘ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధం. ప్రజాక్షేత్రంలోనే దీన్ని తేల్చుకుంటాం. ఈ ధర్మపోరాటంలో ప్రజలు నాతో సహకరించాలి. ధర్మక్షేత్రంలో అధికార పార్టీతో తేల్చుకున్నాకే అసెంబ్లీలో అడుగు పెడతా'' అని చంద్రబాబు నాడు ప్రతిజ్ఞ చేశారు.
తాజాగా నెల్లూరు పర్యటనలో ఈ ప్రతిజ్ఞను చంద్రబాబు ప్రస్తావించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే తాను రాజకీయాల్లో ఉంటానని, అసెంబ్లీకి వెళతానని, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ysrcp
మా కుటుంబ సభ్యుల గురించి సభలో చంద్రబాబే మాట్లాడారు: జగన్
ఆనాడు చంద్రబాబు ఆరోపణలపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో స్పందిస్తూ.. చంద్రబాబుది ఓ డ్రామా అని, ఆయన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని విమర్శించారు.
చంద్రబాబు సభలో సంబంధంలేని టాపిక్ తీసుకొచ్చారని, దానిపై ఆయనే మాట్లాడారని, దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతిస్పందించారని, చంద్రబాబు చెబుతున్న మాటలైతే అధికార పార్టీ వారు ఎవ్వరూ అనలేదని జగన్ తెలిపారు.
చంద్రబాబు చేసిన ఆరోపణలకు ప్రత్యారోపణలుగా వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ.. వీటిపైన కూడా చర్చ జరగాలని అధికార పార్టీ సభ్యులు అన్నారని జగన్ వివరించారు.
కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబే మాట్లాడారు కానీ అధికార పార్టీ సభ్యులు మాట్లాడలేదన్నారు.
చంద్రబాబు తన కుటుంబం గురించి, తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి మాట్లాడారని జగన్ అన్నారు. సభ రికార్డులు చూసినా ఈ విషయాలన్నీ తెలుస్తాయన్నారు.

ఫొటో సోర్స్, seediri appalaraju
‘సానుభూతి, బ్లాక్ మెయిల్ డ్రామాలు’
చంద్రబాబు వ్యాఖ్యలను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. ‘‘చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగటం, అదే పనిగా నా భార్యని అవమానించారని చెప్తూ సానుభూతి రాజకీయాలు చేయటం దారుణం’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు.
ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడినా జనం నమ్మరని వ్యాఖ్యానించారు.
‘‘నిజంగా అసెంబ్లీలో ఏమైనా, ఎవరైనా అని ఉంటే ఫలానా వ్యక్తి, ఫలానా రకంగా అని ఉన్నాడని చెప్పాలి. ఇంకెంత కాలం నీ భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తావ్? రాజకీయాలు చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.
‘‘నాకు ఓటు వేయకపోతే రాజకీయాలు మానేస్తానంటే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనేమీ క్రికెట్ టీమ్‌లో కోహ్లీ కాదు కదా. ఆయన లేకపోతే క్రికెట్ ఏమైపోతుందోనని బాధపడటానికి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఎక్స్‌ట్రా ప్లేయర్’’ అని గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు.
‘‘మీకు నిజంగా సత్తా ఉంటే రేపు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు అన్నింటిలో తాము పోటీ చేస్తామని చెప్పగలరా? చెప్పలేకపోతే 2019 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని భావించాల్సి ఉంటుందని నా అభిప్రాయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం








