రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని ఇంటర్వ్యూ : నా కళ్ల ముందే నన్ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేశారు

- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, 32 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదల అయ్యారు.
నళిని, ఆర్‌పీ రవిచంద్రన్‌తో పాటు ఈ కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు.
దోషుల్లో సంథన్, మురుగన్, జయకుమార్, రాబర్ట్ పాయస్‌లు శ్రీలంకకు చెందిన వారు. వారిని ఒక ప్రత్యేక క్యాంపులో ఉంచారు.
ఈ సందర్భంగా నళినితో బీబీసీ మాట్లాడింది.
రాజీవ్ గాంధీ మరణం మీద ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను ఒక చోటకు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.
రాజీవ్ గాంధీ మీద జరిగిన ఆత్మాహుతి దాడిలో నళిని కీలక నిందితురాలిగా ఉన్నారు. ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. కానీ సోనియా గాంధీ విజ్ఞప్తితో ఆమెకు విధించిన మరణశిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చారు.

బీబీసీతో నళిని ఏమన్నారంటే...
‘రిమాండ్ మీద జైలుకు తరలించి ప్రత్యేకంగా ఒక సెల్‌లో ఉంచినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎంతో ఏడ్చాను. బయటకు పరుగులు తీశాను. మా అమ్మను దగ్గర్లోని మరొక సెల్‌లో ఉంచారు.
వారు కూడా చాలా భయంగా ఉన్నారు. నా పరిస్థితి చూసి వారు ఏడవడం ప్రారంభించారు.
పోలీసులు నన్ను మెల్లగా సెల్‌లోకి పంపారు. నన్ను కాల్చి చంపేస్తే బాగుంటుందని తుపాకులు పట్టుకుని ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లకు చెప్పాను.
నేను ఎంతగా అరిచానంటే నా నోటి నుంచి రక్తం కూడా కారింది. అది నా జీవితంలో అది ఎంతో కష్టకాలం. అరెస్టు చేసిన తరువాత అయిదు రోజుల పాటు జ్వరం వచ్చింది. మంచం మీద నుంచి లేవ లేక పోయాను.
నన్ను రెండు రోజుల పాటు నిద్ర పోనివ్వలేదు. పళ్లు తోముకోకుండా, జుట్టు దువ్వుకోకుండా అలాగే ఉండిపోయాను. ఆ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం నాకు లేకుండా పోయింది.
కాస్త పరిస్థితి చక్కబడుతున్న తరుణంలో నా ఛాతిలో నొప్పి మొదలైంది. చాలా మంది నేను నటిస్తున్నానని అనుకున్నారు. చివరకు డాక్టర్ పరిశీలించి నిజమేనని చెప్పారు.
కొద్దిరోజుల తరువాత పరిస్థితులు కాస్త సర్దుకున్నాయి. అదే సమయంలో కొడియాక్కరాయి షణ్ముగమ్ చనిపోయాడు. జైలు అధికారులు మా చేతులకు సంకెళ్లు వేయడం ప్రారంభించారు. జైల్లో గాజులు వేసే కార్యక్రమం ఏమైనా జరుగుతోందా అంటూ నేను వారిని సరదాగా అడిగాను.
టాడా కోర్టు 28 మందికి మరణశిక్ష విధించింది. అందులో నా పేరు టాప్‌లో ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేరం చేసినట్లుగా నా మీద ఆరోపణలు ఎన్నడూ మోపలేదు. కానీ నేను కోర్టులో దాన్ని నిరూపించలేక పోయాను.
కోర్టు తీర్పు తరువాత నన్ను వేరే సెల్‌కు మార్చారు. మరణశిక్ష విధించిన ఖైదీలను ఉంచినట్లుగా నన్ను సెల్‌లో ఉంచేవారు. కొద్ది రోజుల తరువాత నాకు కూతురు పుట్టింది.
నేను అరెస్ట్ అయినప్పుడు రెండు నెలల గర్భంతో ఉన్నాను. నన్ను అరెస్ట్ చేసిన తరువాత నా భర్త, తండ్రి, తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
మాకు పెద్దగా డబ్బులు లేవు. ఈ అరెస్టులతో మా పరిస్థితి చాలా దిగజారింది.
రాజీవ్ గాంధీతో పాటు ఎంతో మంది చనిపోయారు. వారి కుటుంబాలను తలచుకుంటే నాకు చాలా బాధ కలుగుతోంది. ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా సాయం అందిందో లేదో తెలియదు. కానీ అది వారికి తీర్చలేని నష్టం.
ఇంటి పెద్ద చనిపోతే అది ఎంత కష్టమో నాకు తెలుసు. మా గురించి కూడా వారు ఆలోచిస్తారని అనుకుంటున్నా.
నాకు చాలా బాధగా కలిగింది. 17 మందిని చంపడం వల్ల నాకు వచ్చేది ఏంటి? అసలు ఆ అవసరం నాకేంటి? నేను చదువుకోలేదా? వారి చావుల మీద నేను చిల్లర ఏరుకుంటానా?
అలా ఎన్నటికీ జరగదు. అప్పటి వరకు నాకు ఆయన పేరు కూడా తెలియదు. కానీ నేను చంపానని కేసు పెట్టారు. అది నా దురదృష్టం తప్ప ఇంకోటి కాదు. చనిపోయిన వాళ్లను నేను ఎన్నడూ చూడలేదు.
రాజీవ్ గాంధీ హత్య కేసులోని ఇతర దోషుల గురించి ముందే నాకు తెలియదు. వారు కుట్ర చేస్తునట్లుగా నాకు అనిపించలేదు. దాన్ని పసిగట్టే శక్తి, సమయం నాకు అప్పుడు లేవు.
నేను చాలా బిజీగా ఉండేదాన్ని. పని చేస్తూనే చదువుకుంటున్నాను. రాత్రి పడుకునే సరికి 11 గంటలు అయ్యేది. కాబట్టి అలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
నా మరణశిక్షను రద్దు చేసినప్పుడు ఇతర నిందితులకు కూడా ఆశలు పెరిగాయి. అంతకు ముందు నన్ను ఉరి తీయడానికి నాలుగు సార్లు తేదీలు ఖాయం చేశారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాటు జరిగాయి.
ఉరి తాడు పేనారు. ఉరి తీసే గదిని సిద్ధం చేశారు. మా బరువును కొలిచారు. అంతే బరువు కలిగిన ఇసుక బస్తాలతో ఉరి వేసి పరీక్షించారు.
అదంతా నా కళ్ల ముందే జరిగింది. కానీ నేను ఆశను ఎన్నడూ వదులుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకు ఏ చెడు జరగదు అని అనుకున్నా.
ఇప్పుడు నా భర్త, కూతురితో ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం నా కుటుంబాన్ని ఏకం చేయాలన్నదే నా కోరిక.

ఫొటో సోర్స్, Getty Images
ఏం జరిగింది?
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వచ్చారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం(ఎల్‌టీటీఈ) ఆత్మాహుతి దాడిలో మే 21వ తేదీన రాజీవ్ గాంధీ చనిపోయారు.
ఆ దాడిలో రాజీవ్ గాంధీతో పాటు మరో 16 మంది చనిపోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ధను కూడా అక్కడే చనిపోయింది. 45 మంది తీవ్రంగా గాయపడ్డారు.
1987లో శాంతి స్థాపన కోసం అంటూ భారత సైన్యాలను రాజీవ్ గాంధీ శ్రీలంకకు పంపడానిక ప్రతీకారంగా ఈ ఆత్మాహుతి దాడికి ఎల్‌టీటీఈ పాల్పడింది.
ఈ కేసును విచారించిన ట్రయిల్ కోర్టు 26 మందిని దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. ఆ తరువాత 1999 మేలో 19 మందిని నిర్దోషులుగా సుప్రీం కోర్టు తేల్చింది. మిగిలిన ఏడుగురిలో నళిని, మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంథన్, పెరారివలన్‌లకు మరణశిక్ష... రవిచంద్రన్, రాబర్ట్ పయాస్, జయకుమార్‌లకు జీవితకాల కారగార శిక్ష విధించింది.
ఆ తరువాత నళిని మరణశిక్షను తమిళనాడు గవర్నర్ జీవితకాల కారాగార శిక్ష కిందకు మార్చారు.
ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారు చాలా కాలంగా తమను ముందే విడుదల చేయాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా వారిని ముందస్తుగా విడుదల చేయాలంటూ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసింది. కానీ అందుకు అంగీకరించని గవర్నర్, ఆ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.
ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి పెరారివలన్‌ను విడుదల చేసింది. ఈ తీర్పుతో పాటు నళిని, ఇతర దోషుల సత్పవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు వారిని విడుదల చేయాలంటూ ఆదేశించింది.
అలాగే వారిని విడుదల చేయాలంటూ 2018లో తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసును కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయిందా’ లేక ‘మోసపోయినట్లు నటించిందా’
- 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా
- బిర్సా ముండా జయంతి: సొంత గ్రామం ఎంతగా అభివృద్ధి చెందింది.. ఆయన వారసుల పరిస్థితి ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














