జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయారా’ లేక ‘మోసపోయినట్లు నటించారా’?

ఫొటో సోర్స్, Jacqueline Fernandez/Facebook
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు మనీ లాండరింగ్ కేసులో మంగళవారం బెయిల్ వచ్చింది.
సుకేశ్ చంద్రశేఖర్ నిందితునిగా ఉన్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో రూ.2 లక్షల పూచికత్తు చెల్లించాలంటూ దిల్లీలోని పాటియాల కోర్టు ఆమెను ఆదేశించింది.
ఈ కేసులో జాక్వలిన్ పాత్ర మీద గత కొంతకాలంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ జరుపుతోంది. ఆమె నేరాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తమ కస్టడీకి జాక్వలీన్‌ను అప్పగించాల్సిందిగా ఈడీ కోరుతోంది.
అయితే జాక్వలిన్ మీద వచ్చిన ఆరోపణలను ఆమె న్యాయవాది ప్రశాంత్ పాటిల్ తోసి పుచ్చారు. ఆమె మీద అసలు కేసు నమోదు కాలేదని వాదించారు.

ఫొటో సోర్స్, Jacqueline Fernandez/Facebook
జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఎవరు?
జాక్వలిన్ బాలీవుడ్ నటి కావడం వల్ల ఈ కేసుకు ఎంతో గుర్తింపు వచ్చింది.
శ్రీలంకకు చెందిన ఆమె అక్కడ అందాల పోటీల్లో గెలిచారు. 2009లో బాలీవుడ్‌లో అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమా విశ్లేషకులు జాక్వలిన్ నటనను తరచూ విమర్శిస్తుంటారు. కానీ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ వంటి బాలీవుడ్ పెద్ద నటులతో ఆమె నటించారు.
భారత్‌లోనూ విదేశాల్లోనూ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి వాళ్లతో స్టేజీ షోలు చేశారు. డ్యాన్స్ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.
ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు.
‘మోస్ట్ డిజైరబుల్ విమెన్’, ‘ద వరల్డ్స్ సెక్సియెస్ట్ ఏసియన్ విమెన్’, ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ వంటి జాబితాల్లో తరచూ జాక్వలిన్ పేరు కనిపిస్తూ ఉండేది.
కానీ పోయిన ఏడాది నుంచి ఆమె పేరు మరోలా పాపులర్ అయింది. అనేక కేసులో నిందితునిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ నుంచి చాలా ఖరీదైన బహుమతులు తీసుకోవడం ఆమెను చిక్కుల్లో పడేసింది. ఆమె మీద మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.
చాలా సార్లు విచారణ కోసం ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె అరెస్టు కోరుతూ ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది. కానీ మంగళవారం ఇచ్చిన తీర్పులో కోర్టు అందుకు అంగీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కేసు ఏంటి?
సుకేశ్ చంద్రశేఖర్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మధ్య ఉన్న సంబధం వల్లే ఆమె చిక్కుల్లో పడ్డారు.
32 ఏళ్ల సుకేశ్ చంద్రశేఖర్ చాలా మందిని మోసం చేసి భారీగా డబ్బులు లాగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్, 2018 నుంచి జైలులో ఉంటున్నాడు.
అయితే 2020లో ఒక వ్యాపార కుటుంబాన్ని బెదిరించి సుమారు రూ.200 కోట్లు దోచుకున్నాడంటూ గత ఏడాది అగస్టులో కొత్త కేసు నమోదు చేశారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలు అని, ‘కావాలనే ఇరికించారు’ అని సుకేశ్ న్యాయవాది చెబుతున్నారు.
రూ.200 కోట్లకు సంబంధించిన కేసును విచారిస్తున్న సమయంలో పోయిన ఏడాది ఫిబ్రవరి నుంచి అగస్టు మధ్య చాలా ఖరీదైన బహుమతులను జాక్వలిన్‌కు సుకేశ్ ఇచ్చినట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వాటి ఖరీదు సుమారు రూ.7.12 కోట్లు.
డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్, దుస్తులు, ఆభరణాలు, గుర్రం, కారు వంటివి ఉన్నాయి. జాక్వలిన్‌తోపాటు ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులకు కూడా బహుమతులు అందాయి. నగదు, ప్రాపర్టీ కూడా లభించాయి.
అయితే ఖరీదైన బహుమతులు తీసుకున్న విషయాన్ని ఆమె కూడా అంగీకరించారు. కాకపోతే సుకేశ్ చంద్రశేఖర్ మోసానికి జాక్వలిన్ కూడా ‘బాధితురాలే’ అని ఆమె లాయర్ తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/AsliJacquelineFernandez
వారి మధ్య బంధం ఏంటి?
సుకేశ్ చంద్రశేఖర్ తొలిసారి 2020 డిసెంబర్‌లో జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ను కలిశాడు. పింకీ ఇరానీ అనే మహిళ ఇందుకు సహకరించింది. కానీ అప్పుడు సుకేశ్‌ను జాక్వలిన్ పెద్దగా పట్టించుకోలేదు.
‘చంద్రశేఖర్ చాలా ముఖ్యమైన అధికారి. ఆయనతో మీరు తప్పకుండా మాట్లాడాలి’ అంటూ కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి అంటూ ఫోన్ కాల్ రావడంతో 2021 జనవరిలో తొలిసారి సుకేశ్‌తో జాక్వలిన్ మాట్లాడారు.
అది ఫేక్ కాల్ అని ఆ తరువాత విచారణలో తేలింది. చంద్రశేఖర్ నెంబర్‌ను మోసపూరితంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చెందిన నెంబర్‌గా చూపించారు.
తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి తాను వచ్చినట్లు సుకేశ్ తనకు చెప్పాడని జాక్వలిన్ విచారణలో వెల్లడించారు. తనకు టీవీ చానెల్, జువెలరీ షాప్ ఉన్నట్లు చెప్పడంతోపాటు జాక్వలీన్‌తో ఒక ప్రోగ్రాం చేయాలని భావిస్తున్నట్లుగా సుకేశ్ చెప్పాడు.
సుకేశ్ పేరోల్ మీద బయటకు వచ్చి చెన్నైలో ఉన్నప్పుడు రెండు సార్లు అతన్ని జాక్వలిన్ కలిశారు.
అయితే అతను ఎప్పుడూ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండటం వల్ల సుకేశ్ జైలులో ఉంటున్నాడనే విషయం జాక్వలిన్‌కు తెలియదని ఆమె లాయర్ తెలిపారు. ప్రైవేటు జెట్స్‌లో ప్రయాణిస్తున్న వీడియోలను కూడా ఆమెకు సుకేశ్ పంపించాడు.
అలాగే సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వలిన్ డేటింగ్ చేస్తున్నారనే ఆరోపణలను కూడా ఆమె లాయర్ ఖండించారు. ‘ఆమె వెంట అతనే పడ్డాడు. ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులకు ఖరీదైన బహుమతులు ఇచ్చి జాక్వలిన్ మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించాడు. అతను ఆమె పరిశీలనలో మాత్రమే ఉన్నాడు’ అని పాటిల్ వెల్లడించారు.
సుకేశ్ ఒక డైమండ్ రింగ్ మీద ఇద్దరి పేర్లోని మొదటి అక్షరాలను చెక్కించి దాన్ని జాక్వలిన్‌కు ఇచ్చి ప్రపోజ్ చేసినట్లుగా కోర్టుకు సమర్పించిన పత్రాలను బట్టి తెలుస్తోంది.
సుకేశ్‌తో చాలా సన్నిహితంగా ఉన్న జాక్వలిన్ ఫొటో ఒకటి ఈ ఏడాది జనవరిలో బయటకు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
విచారణ అధికారులు ఏమంటున్నారు?
సుకేశ్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి ముందే జాక్వలిన్‌కు తెలుసు అని ఈడీ అధికారులు చెబుతున్నారు. పోయిన ఫిబ్రవరిలో ఆమె సిబ్బందికి సుకేశ్ నేరాల మీద వచ్చిన వార్తా కథనాలను పంపినట్లుగా తెలిపింది.
అయితే ‘నాకు 13 ఏళ్లుగా చంద్రశేఖర్ తెలుసు. ఆయన చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. మీడియాలో ఆయన మీద వచ్చిన వార్తల వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉంది’ అంటూ పింకీ ఇరానీ చెప్పిన మాటలను తాను నమ్మినట్లు జాక్వలిన్ తెలిపారు.
దాంతో తిరిగి సుకేశ్‌తో తన బంధాన్ని కొనసాగించానని, కానీ పోయిన ఏడాది అగస్టులో మళ్లీ అరెస్టు చేశారని తెలిసి అతనితో సంబంధాలు తెంచుకున్నానని ఆమె చెప్పారు.
కానీ ‘అతని నేర చరిత్ర గురించి తెలిసి కూడా ఖరీదైన బహుమతులు స్వీకరించడం నేరం కిందకు వస్తుంది’ అని ఈడీ అధికారులు వాదిస్తున్నారు.
సమాచారాన్ని దాచి ఉంచడం, విచారణ అధికారులను తప్పుదారి పట్టించడం, ఫోన్ నుంచి మెసేజీలు డిలీట్ చేయడం వంటి వాటిని ఆధారాలుగా చూపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జాక్వలిన్ లాయర్ ఏమంటున్నారు?
‘ఆమె మెసేజీలు డిలీట్ చేయడం వెనుక కారణం ఉంది. అతను ఒక మోసగాడు అని తెలిసినప్పుడు ఆమె ఎలాంటి వేధనకు లోనై ఉంటారో మీరు అర్థం చేసుకోగలరు. అవి వారిద్దరి మధ్య వ్యక్తిగత సంభాషణలకు సంబంధించినవి.
ఆమె ఒక సెలబ్రిటీ. కొన్ని రకాల ఫొటోలు బయటకు రావడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె వ్యక్తిగత ఫొటోలతో మీకు సంబంధం లేదు. ఒక మహిళ గౌరవ మర్యాదలను కాపాడాలి.
ఇతరుల మాదిరిగానే జాక్వలిన్ కూడా చంద్రశేఖర్ అబద్ధపు మాటలకు బాధితురాలిగా మారారు.
ఇక్కడ నేర చరిత్ర గురించి తెలిసి ఉండటం అనేది కీలకంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. చంద్రశేఖర్ నేరాలకు పాల్పడ్డాడు అనే విషయం జాక్వలిన్‌కు అసలు తెలియదు. ఆమె చేసింది నైతికంగా తప్పు అయి ఉండొచ్చు. కానీ చట్టపరంగా తప్పు అని మీరు చెప్పగలరా?
ఈ కేసులో మెరిట్ లేదు’ అని జాక్వలిన్ లాయర్ పాటిల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది - బెంగళూరులో మోదీ ఆవిష్కరిస్తున్న దీని వెనుక కుల రాజకీయాలున్నాయా
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- బిర్సా ముండా జయంతి: సొంత గ్రామం ఎంతగా అభివృద్ధి చెందింది.. ఆయన వారసుల పరిస్థితి ఏంటి
- క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి
- ఆయన్ను చూశాకే కృష్ణ హీరో కావాలనుకున్నారు.. అనుకున్నట్లే అయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














