భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా? ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా?

ఉల్క

ఫొటో సోర్స్, NHM

    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి

బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్‌ నగరంలో గత ఏడాది పడిన ఉల్కలో నీరు ఉందని.. ఆ నీరు భూమి మీద ఉన్న నీటికి దాదాపుగా నిఖార్సుగా సరిపోలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వందల కోట్ల సంవత్సరాల కిందట భూమి రూపొందుతున్న తొలినాళ్లలో అంతరిక్షం నుంచి వచ్చిపడిన ఉల్కల ద్వారా నీరు, ఇతర కీలక రసాయన పదార్థాలు భూమికి వచ్చాయనే ఆలోచనలను ఇది బలపరుస్తోంది.

బ్రిటన్‌లో సేకరించిన అత్యంత ముఖ్యమైన ఉల్కగా గ్లూసెస్టర్‌షైర్ ఉల్కను పరిగణిస్తున్నారు.

ఈ ఉల్క మీద విశ్లేషణలో అద్భుతమైన అంశాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తమ తొలి సవివర ప్రచురణలో పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌లోని వించ్‌కోంబ్ పట్టణంలో గత ఏడాది ఒక రాత్రి పూట ఆకాశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఉల్క వచ్చి పడింది. పలువురి ఇళ్ల తోటల్లో, రోడ్ల మీద, పొలాల్లో పడిన దాని అవశేషాలను సేకరించారు.

ఉల్క

అర కిలోకు పైగా నల్లటి ఉల్కా శిథిలాలను సేకరించి లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచారు. అనంతరం వాటిని అధ్యయనం చేయటానికి యూరప్‌లోని వివిధ పరిశోధక బృందాలకు అరువుగా ఇచ్చారు. ఆ ఉల్క రాయి బరువులో దాదాపు 11 శాతం నీరు ఉంది. ఆ నీటి హైడ్రోజన్ అణువుల నిష్పత్తి.. భూమి మీది నీటిని బాగా పోలినట్లుగా ఉంది. ప్రస్తుతం భూమి ఉపరితలంలో 70 శాతం సముద్రాలతో కప్పేసి ఉంది. ఇంత భారీ మొత్తంలో నీరు.. భూమి ఏర్పడుతున్న తొలి నాళ్లలో బయటి నుంచి, అంటే అంతరిక్షం నుంచి వచ్చి చేరి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. తొలుత, మంచుతో కూడిన తోకచుక్కల పాతం వల్ల ఈ నీరు వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ వాటి రసాయన మిశ్రమాలు భూమితో సరిపోల లేదు.

ఆ తర్వాత కార్బనేసియస్ కోండ్రైట్ అని వర్గీకరించిన ఉల్కలను పరీక్షించినపుడు.. వాటిలో నీటికి సంబంధించిన రసాయన మిశ్రమం.. మన భూమి మీది సముద్రజలాల రసాయన మిశ్రమంతో దాదాపుగా సరిపోలింది.

దీంతో.. ఇలాంటి కార్బనేసియస్ కోండ్రైట్ ఉల్కాపాతం వల్ల భూమి మీదకు నీరు వచ్చి ఉంటుందనే అంచనాకు వచ్చారు.

పాలపుంతలో మన సౌర వ్యవస్థ ఆవిర్భవించినప్పటి గ్రహశకలాలను కార్బనేసియస్ కోండ్రైట్ ఉల్కలుగా పరిగణిస్తున్నారు.

ఉల్కపై పరిశోధన

వించ్‌కోంబ్‌లో పడినటు వంటి ఉల్కను అలాంటి కార్బనేసియస్ కోండ్రైట్ ఉల్కల్లో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. ఆ ఉల్కను అది నేలకు రాలిన 12 గంటల లోపే సేకరించటం వల్ల.. భూమి మీది నీటిని కానీ, ఇతరత్రా పదార్థాలను కానీ అవి పీల్చుకుని ఉండే అవకాశం చాలా స్వల్పం. ‘‘ఇతర ఉల్కలన్నీ కూడా భూపర్యావరణం వల్ల ఏదో విధంగా కలుషితమయ్యాయి’’ అని తాజా అధ్యయనం సహ రచయిత డాక్టర్ ఆష్లే కింగ్ బీబీసీతో చెప్పారు. ‘‘కానీ వించ్‌కోంబ్ ఉల్క భిన్నమైనది. ఎందుకంటే దానిని చాలా వేగంగా సేకరించారు. ఫలితంగా.. ఆ ఉల్కను పరీక్షించినపుడు 460 కోట్ల సంవత్సరాల కిందట సౌర వ్యవస్థ ప్రారంభమైనప్పటి రసాయన మిశ్రమాన్ని పరీక్షిస్తున్నామని మాకు తెలుసు’’ అని ఆమె వివరించారు. ‘‘అంతరిక్షంలోనే ఉన్న ఉల్క నుంచి స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా సేకరించే రాతి నమూనాలు తప్ప.. ఇంతకన్నా స్వచ్ఛమైన నమూనాలు మనకు దొరకవు’’ అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, 460 కోట్ల ఏళ్లనాటి ఉల్క రోడ్డు మీద పడింది

కచ్చితమైన మార్గం

ఈ ఉల్కలోని కార్బన్, నైట్రోజన్ మిశ్రమాలను, అమినో యాసిడ్లను పరీక్షిస్తున్న శాస్త్రవేత్తలకు.. ఒక సారూప్య దృశ్యం కనిపించింది. ఇందులోని రసాయన మిశ్రమం.. తొలినాటి భూమి మీద జీవం ఆరంభమవటానికి ఆధారంగా ఉండగల రసాయన మిశ్రమంతో పోలి ఉంది. ఈ ఉల్క మూలాలను కూడా తాజా అధ్యయనంలో నిర్ధారించారు. అగ్నిగోళంలా మండుతూ వచ్చిన ఈ ఉల్క వీడియో దృశ్యాలను విశ్లేషించటం ద్వారా.. అది వచ్చిన మార్గాన్ని శాస్త్రవేత్తలు చాలా కచ్చితంగా తెలుసుకోగలిగారు. ఈ ఉల్క మార్గాన్ని వెనక్కు లెక్కించినపుడు.. అంగారక గ్రహానికి, గురు గ్రహానికి మధ్య గల బాహ్య గ్రహశకల వలయం నుంచి అది వచ్చినట్లు తెలుస్తోంది.

ఉల్క

ఫొటో సోర్స్, GLASGOW UNIVERSITY

ఇంకా పరిశీలించగా.. దేనినో ఢీకొనటం వల్ల మాతృ గ్రహశకలం ఉపరితలం మీది నుంచి కొన్ని మీటర్లు విరిగిపోగా ఏర్పడిన ఉల్క ఇదని వెల్లడైంది. అలా విరిగిన ఉల్క భూమికి చేరటానికి 2,00,000 సంవత్సరాల నుంచి 3,00,000 సంవత్సరాలు పట్టిందని.. అంతరిక్షంలో నిరంతరం అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నపుడు విశ్వ కిరణాల (కాస్మిక్ రే)తో రాపిడి వల్ల ఆ ఉల్కలో ఏర్పడిన నియాన్ వంటి పదార్థ అణువులు వెల్లడిస్తున్నాయి. ‘‘రెండు, మూడు లక్షల సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ సమయంగా అనిపించవచ్చు. కానీ భూతత్వ కోణంలో అది చాలా వేగంగా వచ్చింది’’ అని డాక్టర్ హెలెనా బేట్స్ చెప్పారు. ‘‘కార్బనేసియస్ క్రోండ్రైట్లు వేగంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. లేదంటే అవి మనగడలో ఉండవు. ఎందుకంటే అవి చాలా పెళుసుగా ఉంటాయి. ముక్కలుగా విడిపోతాయి’’ అని ఆమె వివరించారు.

ఉల్క

ఫొటో సోర్స్, NHM

‘మరిన్ని రహస్యాలు’

వించ్‌కోంబ్ ఉల్కపై శాస్త్రవేత్తలు ఈ వారం ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురించిన తొలి విశ్లేషణ.. ఈ ఉల్క రసాయన పదార్థాలకు సంబంధించిన ఒక విహంగ వీక్షణం మాత్రమే. ప్రత్యేకమైన అంశాలపై ఇంకా పదికి పైగా అధ్యయన పత్రాలు త్వరలో ‘మెటియోరిటిక్స్ అండ్ ప్లానెటరీ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయి. అవి కూడా చివరి అధ్యయనాలు కాబోవు. ‘‘ఈ ఉల్క నమూనా మీద పరిశోధకులు ఇంకా చాలా ఏళ్లపాటు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. మన సౌర వ్యవస్థ మూలాలకు సంబంధించి మరిన్ని రహస్యాల గుట్టు విప్పటానికి అవి తోడ్పడతాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకు చ దిన పరిశోధకుడు డాక్టర్ ల్యూక్ డాలీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: