సూర్యుడు నిజంగానే నవ్వాడా.. నాసా ట్వీట్ చేసిన ఫొటో కథేంటి?
కథనం: పారా పద్దయ్య, బీబీసీ ప్రతినిధి
ప్రతీరోజూ కనిపించే వింత కాదు. అప్పుడప్పుడు, అరుదుగా కనిపించే ఓ విచిత్రం. నాసా పంపిన శాటిలైట్ తీసిన చిత్రంలో సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించాడు. నిప్పుల కుంపటి లాంటి నక్షత్రం అలా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇది ప్రమాదమని కొందరంటే.. భ్రమణంలో బాగంగా జరిగే మార్పుల్లో ఏర్పడిన పరిణామం అని మరి కొందరు విశ్లేషించారు. నెటిజన్లు సృజనాత్మకతకు పదును పెట్టారు. నాసా ట్వీట్‌చేసిన ఈ చిత్రాన్ని రీట్వీట్ చేస్తూ నవ్వుతున్న సూర్యుడిని హాలోవీన్ గుమ్మడికాయ, మిని బీఎన్ బిస్కట్, పఫ్ మార్ష్ మల్లో, నవ్వుతున్న సింహం, కార్టూన్ ఛానల్‌లో కనిపించే టెలీ టబ్బీ... ఇలా రకరకాల వాటితో పోల్చారు.
సూర్యుడు నవ్వాడా?
అమెరికన్ స్పేస్ ఏజన్సీ నాసా సూర్యుడి గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 2010 ఫిబ్రవరి 11న సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని ప్రయోగించింది. ఇది సూర్యుడి అంతర వలయం, వాతావరణం, అయస్కాంత క్షేత్రం, శక్తి గురించి అధ్యయనం చేస్తోంది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ తీసిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నాసా సే ఛీజ్ అనే కామెంట్ రాసింది. సూర్యుడు నవ్వుతూ ఉన్న చిత్రాన్ని నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఫోటో తీసిందని... సూర్యుడిపై కనిపిస్తున్ననల్లటి ఖాళీలు చీకటి మచ్చలుగా పేర్కొంది. బలమైన సౌరగాలులు అంతరిక్షంలోకి వీచే ప్రాంతం ఇలా నల్లగా ఖాళీగా కనిపిస్తున్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, NASA
కరొనల్ హోల్స్ అంటే?
నిరంతరం నిప్పులు వెదజల్లుతూ మండుతూ ఉండే ఈ అతి పెద్ద నక్షత్రంలోనూ అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే తాజా చిత్రం వచ్చింది. సూర్యుడి ఉపరితలం మీద సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సహజంగా ఉండే దాని కంటే తగ్గినప్పుడు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఈదురు గాలులుగా మారి వేగంగా అంతరిక్షంలోకి ప్రయాణిస్తాయి. ఈ గాలుల వల్ల భూమి మీద నుంచి ప్రయోగించిన శాటిలైట్లకు ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవి సూర్యుడి ఉపరితలం మీద ఎప్పుడైనా ఏర్పడవచ్చు. ఇలాంటివి చాలా సహజం అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలా ఏర్పడతాయంటే..
ఆస్ట్రేలియన్ అంతరిక్ష వాతావరణ విభాగం ప్రకారం సూర్యుడి అయస్కాంత క్షేత్రం మరింతగా విస్తరించినప్పుడు కరోనల్ హోల్స్ ఏర్పడతాయి. ఇవి సూర్యుడి ఉపరితలాన్ని వీడి వేడి గాలులుగా మారి అంతరిక్షంలోకి చేరిన తర్వాత ఎక్కడకు వెళతాయి, అవి సూర్యుడిని తిరిగి చేరుకుంటాయా లేదా అనే దానిపై సమాచారం లేదు. సూర్యుడు భూమికి అభిముఖంగా ఉన్నప్పుడు ఏర్పడే కరోనల్ హోల్స్ వల్ల వీచే సౌరగాలులు భూమి వైపు సాధారణం కంటే ఎక్కువ వేగంగా వీస్తాయి. ఇవి భూ భౌగోళిక ఆకర్షణ శక్తిలో అవంతరాలను సృష్టించవచ్చు. ఆకాశంలో విద్యుల్లతల్లాంటి మెరుపు కాంతిని కూడా సృష్టించగలుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ప్రమాదమా?
సూర్యుడు నవ్వుతున్నట్లు ఉన్న ఈ ఫోటో క్యూట్‌గా ఉండవచ్చు, సోషల్ మీడియాలో మీమ్స్‌తో దీన్ని ఎంజాయ్ చెయ్యవచ్చు. కానీ ఇది భూమికి అంత మంచిది మాత్రం కాదు. సూర్యుడి నుంచి వేడి గాలులను భూ అయస్కాంత క్షేత్రం అడ్డుకుని కవచంలా కాపాడుతోంది. అయినప్పటికీ ఈ వేడి గాలులు భూవాతావరణాన్ని ప్రభావితం చెయ్యగలవు. సూర్యుడి నుంచి వచ్చే వేడి గాలులు భూ ఉపరితల వాతావరణంలోకి ప్రవేశిస్తే కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు టీవీ ఛానళ్లలో సిగ్నల్స్ రాకుండా పోవడానికి కారణం ఇదేనని అమెరికాలోని హ్యూస్టన్ కేంద్రంగా నడుస్తున్న క్రాన్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ వేడిగాలులు బలంగా వీస్తే ఎలక్ట్రిక్ గ్రిడ్లు కుప్పకూలి ప్రపంచం అంధకారంలోకి మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన జియో మాగ్నెటిక్ తుపాను వల్ల 40 స్టార్‌లింక్ శాటిలైట్లు ధ్వంసం అయ్యాయని వీటి విలువ 413 కోట్ల రూపాయలని స్పేస్ డాట్ కామ్ పేర్కొంది.

సూర్యుడిపై పరిశోధనలు
సూర్యుడి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్లు, టెలిస్కోపుల్ని ప్రయోగించాయి. వీటి ద్వారా సూర్యుడి గమనాన్ని 24 బై 7 గమనిస్తున్నాయి. ఇందులో నాసా ప్రయోగించిన పార్కర్ సూర్యుడికి దగ్గరగా వెళ్లింది. ఇది సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. చరిత్రలో తొలిసారిగా ఒక స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిని తాకిందని పార్కర్ సోలార్ గురించి ప్రకటించింది నాసా. పార్కర్ సూర్యుడి పైనున్న ఉపరితలం, వలయం, అయస్కాంత క్షేత్రాల్లోకి ప్రయాణించిందని నాసా వెబ్ సైట్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడి గురించి మనకేం తెలుసు?
నిరంతరం మండుతున్న అగ్నిగోళం, మన సౌర కుటుంబానికి కేంద్ర బిందువు సూర్యుడు. సూర్యగోళం వ్యాసార్ధం భూమితో పోలిస్తే దాదాపు 109 రెట్లు ఎక్కువ. సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత కోటి 50లక్షల సెల్సియస్ డిగ్రీలు ఉంటుంది. అయితే ప్రోటోస్పియర్ అని పిలిచే సూర్యుడి ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. ఆశ్చర్యకరంగా సూర్యుడి ఉపరితల వాతావరణంలో ఈ వేడి 2 కోట్ల డిగ్రీలు ఉండవచ్చని అంచనా. సూర్యుడి నుంచి ఒక సెకనుకు 42 లక్షల టన్నుల శక్తి విడుదలవుతోంది. ఇది సూర్యుడికున్న శక్తిలో చాలా తక్కువ. సెకనుకు 42 లక్షల టన్నుల శక్తి నష్టపోయినా.. 5వేల సంవత్సరాల తర్వాత కూడా 99.966 శాతం శక్తి ఉంటుంది. భూమి మీద జీవకోటి మనుగడకు దీని నుంచి వచ్చే కాంతి, శక్తి ఒక్కటే ఆధారం.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ ప్రజలు కొత్త బట్టల కంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు?
- మునుగోడులో టీఆర్ఎస్ విజయం.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ
- టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం
- ఉత్తరాఖండ్: జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్
- 140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)