భారతదేశంలో రిజర్వేషన్లు అమలులో లేని ఏకైక రాష్ట్రం ఇది.. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, CGABAR KH
- రచయిత, ఆలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం
రిజర్వేషన్ల కేంద్రంగా జరుగుతున్న వాదాలు, వివాదాలతో వేడిక్కి పోతున్న ఛత్తీస్‌గఢ్‌ను ఉత్తర భారత్ నుంచి వీస్తున్న చలి గాలులు కూడా చల్లబరచ లేక పోతున్నాయి.
ఆదివాసీలు ప్రతిరోజూ రిజర్వేషన్ల మీద నిరసనలకు దిగుతున్నారు. కొందరు రోడ్ల మీద రాకపోకలను అడ్డుకుంటూ ఉండే ఇంకొందరు ధర్నాలు చేస్తున్నారు. మరికొందరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ముఖ్యమంత్రి భూపేష్ బఘలే దిష్టిబొమ్మను తగులబెడుతున్నారు.
నిరసనల వల్ల రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో మంగళవారం ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని చోట్ల రైళ్లను అడ్డుకునేందుకు కూడా నిరసనకారులు ప్రయత్నించారు.
రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విచిత్రమైన స్థితి నెలకొంది. సుమారు రెండు నెలలుగా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆ రాష్ట్ర హై కోర్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వేషన్ల అమలు నిలిచిపోయినట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సాధారణ పరిపాలనా విభాగం బదులిచ్చింది.

ఫొటో సోర్స్, CGABAR KH
ఆగిన నియామకాలు
సుమారు మూడేళ్ల కిందట రిజర్వేషన్ల వాటాను 82శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాజ్యాంగం విరుద్ధం అంటూ ఛత్తీస్‌గఢ్ హై కోర్టు వాటిని కొట్టి వేసింది. ఆ తరువాత పాత రిజర్వేషన్ వ్యవస్థను కూడా ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ ఈ ఏడాది సెప్టెంబరు 19న హై కోర్టు తీర్పునిచ్చింది.
ఇలా రిజర్వేషన్లను కోర్టు నిలిపివేయడంతో ఇంజినీరింగ్, పాలిటెక్నికట్, బీఈడీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ వంటి కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఈ కోర్సులకు సంబంధించి సుమారు 46,500 సీట్లు భర్తీ కావాల్సి ఉంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నిలిచి పోయింది. 12వేల టీచర్ల ఖాళీలు కూడా ఇందులో ఉన్నాయి. సుమారు 1,000 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఈ నెల 6న ఎగ్జామ్ జరగాల్సి ఉండగా అది కూడా వాయిదా పడింది. 2.5 లక్షల క్లర్కు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించారు. కానీ వాటి ఫలితాల విడుదల ఆగిపోయింది.
ఇలా రిజర్వేషన్ల అమలు ఆగిపోవడం వల్ల చాలా ప్రవేశ పరీక్షల నిర్వహణ తాత్కాలికంగా నిలిచి పోయింది. మెడికల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొందరు కోర్టకు వెళ్లారు.
‘ఛత్తీస్‌గఢ్ రిజర్వేషన్ల వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. మరొక వారం పది రోజుల్లో విచారణకు వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ సతీశ్ చంద్ర వర్మ బీబీసీకి తెలిపారు.
రిజర్వేషన్ల వివాదానికి పరిష్కారం కోసం డిసెంబరు తొలి వారంలో ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. అయితే రిజర్వేషన్లు అమలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావాలని ప్రతిపక్షం బీజేపీ డిమాండ్ చేస్తోంది.
మరొకవైపు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు కారణం బీజేపీనే అని ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఆరోపిస్తున్నారు. ‘ఇది వారు చేసిన పాపం ఫలితం. దాన్ని సరిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Bhupesh Baghel/Facebook
82శాతానికి రిజర్వేషన్లు
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్, 2012లో రిజర్వేషన్లను 50శాతం నుంచి 58శాతానికి పెంచారు. ఇందుకోసం రిజర్వేషన్ల చట్టం-1994లోని సెక్షన్-4కు సవరణ చేశారు. ఎస్టీల రిజర్వేషన్ 20శాతం నుంచి 32శాతానికి పెంచగా ఎస్సీల రిజర్వేషన్ 16శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. ఓబీసీలకు ఉన్న 14శాతం రిజర్వేషన్‌ను అలాగే ఉంచారు.
రమణ్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు హై కోర్టుకు వెళ్లారు.
ఆ తరువాత 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఆగస్టు 15న కొత్త రిజర్వేషన్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త వ్యవస్థలో ఎస్సీల రిజర్వేషన్ 12శాతం నుంచి 13శాతానికి పెంచారు. ఓబీసీల రిజర్వేషన్ 14శాతం నుంచి 27శాతానికి తీసుకెళ్లారు. దీనికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10శాతం రిజర్వేషన్ కలుపుకొని ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం రిజర్వేషన్ల వాటా 82శాతానికి చేరింది.
భూపేశ్ బఘేల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంతో కొత్త రిజర్వేషన్ల విధానాన్ని ఆపివేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత 2012లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని కూడా కోర్టు నిలిపి వేసింది.
ఎస్సీల రిజర్వేషన్ తగ్గించి ఎస్టీలకు ఎందుకు పెంచారో సరైన కారణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చూపించ లేక పోయిందని ఛత్తీస్‌గఢ్ హై కోర్టు మాజీ న్యాయవాది కనక్ తివారి అన్నారు. అందువల్లే రిజర్వేషన్ల అమలును కోర్టు నిలిపి వేసింది అని తెలిపారు.
‘రిజర్వేషన్ల కోటాను నిర్ణయించినప్పుడు రోస్టర్ సిస్టమ్‌ను తయారు చేయాలి. అంటే తొలి ప్రయారిటీ ఎవరికి... రెండో ప్రయారిటీ ఎవరికి... మూడో ప్రయారిటీ ఎవరికి అనే విషయాన్ని నిర్ణయించాలి. భిన్న వర్గాలకు సంబంధించి భిన్న రోస్టర్ వ్యవస్థలను రూపొందించాలి. అయితే రిజర్వేషన్ల కోటాను కోర్టు రద్దు చేయడం వల్ల రోస్టర్‌ను అమలు చేయడం సాధ్యం కావడం లేదు’ అని బీబీసీకి కనక్ తివారీ తెలిపారు.

ఫొటో సోర్స్, Dr Raman Singh/Facebook
రాజకీయ వివాదం
మరొక ఏడాదిలో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు రానున్నాయి. దీంతో రిజర్వేషన్ల సమస్య చుట్టూ రాజకీయ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సమస్యకు కారణం మీరంటే మీరు అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఒకరిని మరొకరు నిందించుకుంటున్నాయి.
తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన రిజర్వేషన్ల కోటాను తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆదివాసీలకు 32శాతం రిజర్వేషన్ ఇవ్వడం కాంగ్రెస్ ఇష్టం లేదని చెబుతోంది. అందుకే వారు హై కోర్టుకు వెళ్లారని విమర్శిస్తోంది.
ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయరు? అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది.
రమణ్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల కోటాను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన కేపీ ఖండేను ఎస్సీ కమిషన్ చైర్మన్ చేయడాన్ని కూడా బీజేపీ పార్టీ విమర్శించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల వ్యవస్థ మీద కోర్టుకు వెళ్లిన కునాల్ శుక్లాను రీసెర్చ్ విభాగం చైర్మన్‌గా చేయడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి.
అయితే రమణ్ సింగ్ ప్రభుత్వం సరైన పత్రాను కోర్టుకు సమర్పించక పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని భూపేశ్ బఘేల్ ఆరోపిస్తున్నారు. మరొకవైపు కాంగ్రెస్ పార్టీలోని నేతలు కొందరు తమ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.
‘ఆదివాసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది. గత రెండు నెలల్లో ఆదివాసీలకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. షెడ్యూల్డ్ ఏరియాల్లో కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నిబంధనల వల్ల ఆదివాసీలు మైనార్టీలుగా మారిపోయారు. మరొకవైపు రిజర్వేషన్లు ఆగిపోయాయి. ఇంత జరిగాక కూడా మేం ఆదివాసీలకు అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇదొక పెద్ద జోక్’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అరవింద్ నేతామ్ అన్నారు.
ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల భవిష్యత్తు ఏంటి? 2012లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ వ్యవస్థ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతుందా? లేక 2019లో తాము తీసుకొచ్చిన వ్యవస్థనే అమలు చేసేందుకు మార్గాలు వెతుకుతుందా?
ఇప్పుడు అందరూ ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా.. ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా
- గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- జీ20: షీ జిన్‌పింగ్‌ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి.. ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














