బైజూస్, మెటా, ట్విటర్: ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఏం చేస్తున్నారు

ఉద్యోగాల కోత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చెరిలన్ మోలన్
    • హోదా, బీబీసీ న్యూస్

టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు వరుసగా ఉద్యోగాల కోతలను ప్రకటిస్తుండటంతో వేల మంది భారతీయ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, పెట్టుబడులు తగ్గడం నడుమ సంస్థలు ఈ ఉద్యోగాల కోతలను ప్రకటిస్తున్నాయి.

దీనిపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు.

గత అక్టోబరులో తనతోపాటు పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందిని తీసేస్తున్నట్లు రవికి (పేరు మార్చాం)కి తెలిసింది.

వెంటనే ఆయనపాటు ఓ భారతీయ ఎడ్‌టెక్‌ సంస్థలో పనిచేస్తున్న మిగతవారితో కలిసి ఒక ప్రైవేటు ఆన్‌లైన్ గ్రూపును ఆయన ఏర్పాటుచేశారు.

తమ భయాలు, ఆందోళనలను వీరు ఈ గ్రూపు ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మేనేజ్‌మెంట్‌తో ఎలా మాట్లాడాలి? మంచి భవిష్యత్‌ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఒక ఉద్యోగిగా తమకుండే హక్కులు ఏమిటి? తదితర అంశాలపై ఈ గ్రూపులో చర్చలు జరుగుతున్నాయి.

‘‘సంస్థ నుంచి మెరుగ్గా బయటకు వెళ్లేందుకు ఏం చేయాలి’’అని తెలుసుకోవడంలో ఈ గ్రూపు సాయం చేస్తోందని రవి చెప్పారు.

ఉద్యోగ సంఘాలు

ఫొటో సోర్స్, Getty Images

బైజూస్.. అన్‌అకాడమీ..

గత కొన్ని నెలలుగా భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కష్టకాలం నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎడ్‌టెక్ సంస్థలు బైజూస్, అన్అకాడమీ ఇప్పటికే వందల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి.

మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా తమ మొత్తం సిబ్బందిలో 13 శాతం మందిని అంటే 87,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఉద్యోగాల కోతపై సోషల్ మీడియాలో భారీగా నిరసన వ్యక్తం వ్యక్తం అవుతోంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు చెప్పాపెట్టకుండానే ఇలా ఉద్యోగాలను తీసేయడంతో మొదలుపెట్టి, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని అభ్యర్థించడం వరకు చాలా విషయాలు వాట్సాప్, లింకిడ్‌ఇన్ లాంటి వేదికలపై పంచుకుంటున్నారు. తమ హక్కుల గురించి మాట్లాడుతూ.. ఈ వివరాలను జర్నలిస్టులకు కూడా అందిస్తున్నారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు భారత్‌లో ఉద్యోగాల నుంచి తీసివేయడాన్ని సిగ్గుచేటుగా భావించేవారు.

ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు మౌనంగా ఉండిపోయేవారు.

కానీ, ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి.

ఎందుకంటే నేడు ఉద్యోగాలు కోల్పోవడం అనేది సర్వసాధారణం అవుతోంది.

కొన్ని దశాబ్దాల ముందువరకు ఉద్యోగాల నుంచి తీసివేయడం అనేది ‘‘ప్రతిభ’’కు సంబంధించిన విషయంగా ఉండేదని మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం నిపుణురాలు ప్రీతా దత్ చెప్పారు.

‘‘కానీ నేడు ఉద్యోగాల కోత, సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం అనేది వ్యాపార లావాదేవీల్లో భాగం అయిపోయింది.

నేడు ఉద్యోగం నుంచి తీసివేయడం అనేది ఎవరూ సిగ్గుచేటుగా భావించడం లేదు’’అని ఆమె అన్నారు.

అయితే, వారి సమస్యలను సోషల్ మీడియా ఎంతవరకు పరిష్కరించగలదో చూడాలి. అయితే, ఇదివరకటిలా కార్మిక సంఘాలు నేడు శక్తిమంతంగా లేవు. దీంతో తమ స్వరం వినిపించడానికి ఇదొక వేదికలా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘తమ గళాన్ని వినిపించేందుకు సోషల్ మీడియా ఉద్యోగులకు సాయం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగ సంఘాల పాత్ర నేడు సోషల్ మీడియా తీసుకుంటోంది. ఫలితంగా మధ్యవర్తుల అవసరం ఉండటం లేదు’’అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ నిపుణుడు, ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద చెప్పారు.

సంస్థను గాడిలో పెట్టేందుకు 2500 మంది ఉద్యోగులపై కోత విధించడం తప్పనిసరని గత అక్టోబరులో బైజూస్ వెల్లడించింది.

ఆ వెంటనే సోషల్ మీడియాలో సంస్థ ఉద్యోగులు స్పందించడం మొదలుపెట్టారు.

మొదట్లో సంస్థ అనుసరిస్తున్న విధానాలు, తమపై ఉండే ఒత్తిడిని పేర్లు బయటకు వెల్లడించకుండా వారు చెప్పారు.

మరోవైపు తాజాగా ఉద్యోగం కోల్పోయిన ఒక ట్విటర్ ఉద్యోగి కూడా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వినిపించారు.

‘‘కన్ఫర్మేషన్ ఈమెయిల్ రాకముందే ఫైర్ చేశారు. పరిస్థితులు ఎప్పటికప్పుడే మరింత జాగజారుతున్నాయి’’అని ఒక ఉద్యోగి ట్వీట్ చేశారు.

మరో ఉద్యోగి సంస్థ కొత్త బాస్ ఎలాన్ మస్క్‌పై విమర్శలు చేస్తారు.

వీడియో క్యాప్షన్, దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా?

సాయం దొరకుతోందా?

ఇలా సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేయడంతో కొన్నిసార్లు సాయం దొరకొచ్చు కూడా.

ముఖ్యంగా ఉద్యోగ సంస్థలు తమ సిబ్బందికి క్షమాపణలు చెప్పేలా చేయడం, వర్క్ కల్చర్‌లో మార్పులు చేయడం లాంటి మార్పులకు ఇది తోడ్పడే అవకాశముంది.

అయితే, ఈ మార్పులు చాలా తాత్కాలికమైనవని దత్ అంటున్నారు.

‘‘ఈ అవకాశం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ఇది ప్రభావం చూపొచ్చు.

లేదా మాజీ ఉద్యోగ సంస్థలే వారిపై కోర్టు కేసులు పెట్టొచ్చు’’అని ఆమె అన్నారు.

అందుకే చాలా మంది ఉద్యోగులు తమ సాధాకబాధకాలను వెల్లడించేందుకు, తమ హక్కుల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

దక్షిణాది నగరం తిరువంతపురంలో ఉద్యోగాలు కోల్పోయిన 140 మంది బైజూస్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.

వీరు కేరళ మంత్రిని కూడా కలిశారు. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.

ఇక్కడి ప్రభుత్వం వామపక్షాల ఆధీనంలో ఉంది. ఉద్యోగుల హక్కులకు వామపక్షాలు ప్రాధాన్యం ఇచ్చే సంగతి తెలిసిందే.

ఆ తర్వాత, తిరువంతపురంలో తమ కార్యాలయాన్ని మూసివేయాలనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బైజూస్ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ బెంగళూరు విభాగం అధ్యక్షుడు సుమన్ దాస్ మహాపాత్ర మాట్లాడుతూ.. 2018 నుంచి తమ సంస్థలో చేరే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ అవుతోందని ఆయన చెప్పారు.

అయితే, మొత్తం ఐటీ ఉద్యోగులతో పోల్చినప్పుడు తమ సంస్థలో చేరే ఉద్యోగుల సంఖ్య తక్కువేనని ఆయన చెప్పారు.

‘‘ఇప్పటికీ చాలా మంది ఉద్యోగ సంఘాల్లో చేరేందుకు ఇష్టపడటం లేదు.

మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటుందనో లేదా తాము పూర్తికాల ఉద్యోగులం కామనే ఆందోళన వల్లే వారు ముందుకు రావడం లేదు’’అని ఆయన అన్నారు.

అయితే, నేడు మళ్లీ ఉద్యోగ సంస్థలు క్రియాశీల పాత్ర పోషించే అకాశం ఉందని మహాపాత్ర అన్నారు.

ఉద్యోగ మార్కెట్ ఒడిదొడుకులకు లోనుకావడమే దీనికి కారణమని ఆయన అన్నారు.

స్టార్‌బక్స్

ఫొటో సోర్స్, Getty Images

గత కొన్ని సంవత్సరాలుగా అమెజాన్, స్టార్‌బక్స్, యాపిల్ లాంటి అమెరికా దిగ్గజ సంస్థలకు చెందిన ఉద్యోగులు కార్మిక సంఘాల్లో చేరడం ఎక్కువైంది.

ఉద్యోగ సంఘాల్లో చేరాలనే డిమాండ్లు అన్ని రంగాల్లోనూ వినిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

అయితే, ఈ విషయంలో శ్రీపాద భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

‘‘నేడు ఉద్యోగ సంస్థలు ఉద్యోగుల హక్కుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాయి. వర్క్ కల్చర్‌లోనూ మార్పులు చేస్తున్నాయి’’అని ఆయన అన్నారు.

‘‘ఉద్యోగుల మేనేజ్‌మెంట్‌లో లోపాలు ఉన్నప్పుడే ఉద్యోగ సంఘాలు పురుడుపోసుకుంటాయి.

ఉద్యోగ సంస్థ విఫలమైతే, ఉద్యోగ సంఘాలు పురోగతి సాధిస్తాయి.

కానీ, నేడు తమతోపాటు ఉండే ఉద్యోగుల విషయంలో సంస్థలు కొన్ని సానుకూల విధానాలను అనుసరిస్తున్నాయి.

కానీ, ఉద్యోగాల కోత మాత్రం ఇలానే కొనసాగితే, కథ వేరుగా ఉండొచ్చు’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)