నేను బైసెక్సువల్‌ని...నాలాంటి వారిపై ఎందుకు చిన్నచూపు?

బైసెక్సువాలిటీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మేము మైనారిటీల్లో మైనారిటీలం. బైసెక్సువల్ అని చెబితే ఎల్జీబీటి కమ్యూనిటీలో కూడా మమల్ని సందేహిస్తారు. మీరు ప్యూర్ కాదు అని మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. బయట సమాజం సంగతి చెప్పక్కర్లేదు.. మేమేదో భ్రమల్లో ఉన్నాం అంటారు. బైసెక్సువాలిటీని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ" అంటున్నారు దీప్తి. 

"నాకు ఐశ్వర్యా రాయ్ అంటే ఇష్టం. హృతిక్ రోషన్ అంటే కూడా అంతే ఇష్టం. నేను ఇద్దరికీ ఆకర్షితుడిని అవుతాను. నేను బైసెక్సువల్. ఇందులో నేను సిగ్గుపడేదేం లేదు. నాకున్న పలు గుర్తింపుల్లో నా సెక్సువల్ ఓరియెంటేషన్ కూడా ఒకటి" అంటున్నారు చిదానంద శాస్త్రి.

38 ఏళ్ల దీప్తి ఈమధ్యే తాను బైసెక్సువల్ అన్న విషయాన్ని బయటకి చెప్పుకోవడం ప్రారంభించారు. అలా చెప్పుకోవడం వలన తనకు విముక్తి పొందిన భావన కలుగుతోందని ఆమె అన్నారు.

29 ఏళ్ల శాస్త్రి కూడా ఇదే మాట చెబుతున్నారు. తన సెక్సువాలిటీ గురించి బహిర్గతం చేయడం వలన సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. 

బైసెక్సువాలలిటీ అంటే ఒకటి కన్నా ఎక్కువ జెండర్ల పట్ల ఆకర్షితులు కావడం. ఆడ, మగ ఇద్దరి పట్ల ఉన్న లైంగిక ఆకర్షణనే బైసెక్సువల్ అంటారన్నది సాధారణ అభిప్రాయం. కానీ, ఆడ, మగ మాత్రమే కాదు ట్రాన్స్‌జెండర్ల పట్ల ఆకర్షణ కూడా బైసెక్సువాలిటీ కిందకే వస్తుంది.

LGBTQ .. ఇందులో B అనేది బైసెక్సువాలిటీని సూచిస్తుంది.

బైసెక్సువాలిటీ

ఫొటో సోర్స్, Getty Images

'చాలాకాలం కన్ఫ్యూజన్‌లో ఉండిపోయా..'

దీప్తి ఇప్పుడు తన సెక్సువాలిటీ గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

కానీ, తన లైంగిక ధోరణి గురించి తెలుసుకోవడానికి చాలాకాలం పట్టిందని, ఒక రకమైన కన్ఫ్యూజన్‌లో ఉండిపోయానని ఆమె చెబుతున్నారు. 

"చాలా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యాను. దాంతో, నాకు మగవాళ్లంటే భయం మొదలైంది. నేను డిగ్రీకి వచ్చాక ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. తనకు కూడా నా మీద ఇష్టం ఉండడంతో మేమిద్దరం జంటగా కలిసి తిరిగేవాళ్లం. నాకు మగవాళ్లంటే ఉన్న భయం వలన అమ్మాయిల పట్ల లైంగిక ఆకర్షణ కలుగుతోంది అనుకున్నా. నా పార్టనర్‌కు, నాకూ కొన్ని విభేదాలు రావడంతో, మేం విడిపోయాం.

తరువాత, నేను డిజైనింగ్ కోర్సులో చేరాను. అక్కడ అబ్బాయిలపై ఆకర్షణ మొదలైంది. ఒక అబ్బాయితో స్నేహం కుదిరింది. కానీ, తను దగ్గరకు వచ్చినప్పుడు బిగుసుకుపోయేదాన్ని. దాంతో, చాలా గందరగోళానికి గురయ్యాను. నాకు అబ్బాయిల మీద ఆకర్షణ లేదేమో, ఆడవాళ్లంటేనే ఇష్టం కలుగుతుంది కాబోలు అనుకున్నా. కానీ, మగవారి పట్ల ఆకర్షణ తగ్గలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు. చాలా కాలం ఎటూ తేలని స్థితిలో ఉండిపోయా. అప్పటికి నాకు బైసెక్సువాలిటీ లేదా ఎల్జీబీటీ గురించి తెలీదు. క్రమంగా ప్రపంచ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు ఇవన్నీ పరిచమయ్యాయి. రెండు జెండర్ల పట్ల సమాన లైంగిక ఆకర్షణను బైసెక్సువాలిటీ అంటారని తెలిసింది. నేను బైసెక్సువల్ అన్న సంగతి నాకు అర్థమైంది" అని వివరించారు దీప్తి.

'నువ్వు ప్యూర్ కాదు'

తన లైంగిక ధోరణి గురించి స్పష్టత వచ్చిన తరువాత, సంశయాలన్నీ తొలగిపోయాయని దీప్తి చెప్పారు . ఈ క్రమంలో మరొక అమ్మాయితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. అయితే, వారి ప్రేమకు కులం అడ్డొచ్చింది.

"ఆ అమ్మాయి లెస్బియన్. నేను లెస్బియన్ కాదు, బైసెక్సువల్ అని తనకి వివరించాను. 'నువ్వు ప్యూర్ లెస్బియన్ కాదు' అనేది. ఇందులో ప్యూరిటీ ఏముంటుందో నాకర్థం కాలేదు. 'నీకు అబ్బాయిలంటే కూడా ఇష్టమే. నువ్వు వాళ్లతో కూడా సంబంధం ఏర్పరచుకోగలవు' అని నిందించింది.

బైసెక్సువల్ వ్యక్తులకు ఎల్జీబీటీ కమ్యూనిటీలో కూడా ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతుంది. లెస్బియన్లు మమ్మల్ని ప్యూర్ లెస్బియన్లు కాదు అంటారు.

గే వ్యక్తులు మమ్మల్ని ప్యూర్ గే కాదు అంటారు. మేం గందరగోళంలో ఉన్నాం అంటారు. మాకేం కావాలో మాకే తెలీదని, ఆడ, మగ ఇద్దరినీ ఇష్టపడతామని ఎద్దేవా చేస్తారు. అందుకే మేం మైనారిటీల్లో మైనారిటీలం" అన్నారామె. 

బైసెక్సువాలిటీ

ఫొటో సోర్స్, Getty Images

'దీని గురించి బయటకు ధైర్యంగా చెప్పుకోవాలి'

21వ శతాబ్దంలో కూడా బైసెక్సువాలిటీ మీద అవగాహన, అంగీకారం లేదని దీప్తి అన్నారు. 

"సమాజంలో బైసెక్సువాలిటీ మీద అవగాహన, అంగీకారం గతం కన్నా కాస్త పెరిగింది కానీ, దీని మీద అపోహలు పోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. మార్పు కోసం ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాలి. బైసెక్సువల్ వ్యక్తులు నోరు తెరిచి చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ట్రాన్స్‌జెండర్లను చూడగానే గుర్తుపడతారు. కానీ, బైసెక్సువలిటీ గురించి మా అంతట మేము చెప్తే తప్ప ఎవరికీ తెలీదు. దీని గురించి దాచి లాభం లేదు. మార్పు రావాలంటే ధైర్యంగా బయటకు చెప్పుకోవాలి. అందుకే నేను నా లైంగిక ధోరణి గురించి బయటపెట్టాలని నిర్ణయించుకున్నాను. సోషల్ మీడియాలో బహిర్గతం చేశాను. ఒకటి, రెండు వేదికలపై దీని గురించి మాట్లాడాను. ఎల్జీబీటీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను" అని చెప్పారు దీప్తి.

'బైసెక్సువాలిటీ రోగం కాదు.. పెళ్లి దానికి చికిత్స కాదు'

"నేను ఒకసారి ఒక వేదికపై బైసెక్సువాలిటీ గురించి మాట్లాడినప్పుడు, విన్నవాళ్లల్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయికి పెళ్లయింది కదా, ఇంకా ఈ బైసెక్సువాలిటీ ఏంటి అన్నట్టు కనుబొమలు ఎగరేశారు. ఒకవేళ ఏదైనా ఉన్నా, పెళ్లయితే మారిపోవాలి కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లి అయినా, అవ్వకపోయినా నా లైంగిక ధోరణి ఎందుకు మారుతుంది? బైసెక్సువాలిటీ రోగం కాదు. పెళ్లి దానికి చికిత్స కాదు.

మా పిల్లలు నేను సోషల్ మీడియాలో రాసింది చూస్తున్నారు. మా అమ్మాయికి అర్థమవుతోంది. నన్ను అప్పుడప్పుడూ అడుగుతూ ఉంటుంది. ఇది చాలా స్వేచ్ఛగా అనిపిస్తుంది. నేను ఏమీ దాచట్లేదు అన్న తృప్తి ఉంది నాకు. మిగతా కుటుంబ సభ్యులు కూడా నా సోషల్ మీడియా చూసే ఉంటారు. కానీ, నన్ను ఏమీ అడగలేదు. వాళ్లు అడిగితే, నిజమే చెప్తా. నా లైంగిక ధోరణి ఇది. దీన్ని మార్చలేం. దానర్థం నాకు ఈ పెళ్లి, కుటుంబం, పిల్లలు వద్దని కాదు" అని చెప్పారు దీప్తి. 

"నేనొక మామ్స్ గ్రూపులో ఉన్నాను. అక్కడి చర్చలు చాలా చిత్రంగా అనిపిస్తాయి. నేటి కాలంలో సంస్కృతి పాడైపోయిందని, ఓటీటీలలో వచ్చే సీరీస్, సినిమాలలో గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్ల గురించి అనవసరంగా ఎక్కువ చర్చ చేస్తున్నారని, వాటిని చూసి పిల్లలు పాడైపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. నా చిన్నప్పుడు టీవీ కూడా లేదు. భిన్న లైంగికత కొత్త విషయమేం కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. టీవీలు లేదా సినిమాలు చూస్తే లైంగికత మారిపోదు. అలాగే, లైంగికత గురించి అవగాహన ఏ వయసులోనైనా రావొచ్చు" అన్నారు దీప్తి.

చిదానంద శాస్త్రి
ఫొటో క్యాప్షన్, చిదానంద శాస్త్రి

'బైసెక్సువల్ అంటే ఒకే సమయంలో స్త్రీ, పురుషులతో సంబంధాలు పెట్టుకుంటారని కాదు'

చాలాందిలో ఈ అపోహ ఉంటుందని చిదానంద శాస్త్రి అంటున్నారు.

"ఆడ, మగ పట్ల సమాన ఆకర్షణ ఉంటుంది కానీ, ఒకే సమయంలో ఇద్దరితోనూ సంబంధాలు పెట్టుకుంటారని కాదు. బైసెక్సువల్స్ గురించి ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అందరిలాగే మేమూ ప్రేమ, పెళ్లి వంటి సంబంధాలలో నిజాయితీగా ఉంటాం. మేం సాధారణ మనుషులమే. మా లైంగికత కొంచం భిన్నంగా ఉంటుంది. అంతే తేడా. హెటెరోసెక్సువల్ వ్యక్తులు ఆపోజిట్ జెండర్ పట్ల మాత్రమే ఆకర్షితులవుతారు. బైసెక్సువల్స్ ఇతర జెండర్ల పట్ల కూడా ఆకర్షితులవుతారు. దానర్థం, మేం మోసం చేస్తామని కాదు. ఉదాహరణకు, నేనొక అమ్మాయితో రిలేషన్‌లో ఉంటే.. ఇంకో అబ్బాయి కనిపిస్తే అతడితో వెళిపోతానని ఈ అమ్మాయి భయపడుతూ ఉండక్కర్లేదు. లైంగిక ధోరణి అనేది ఒక గుర్తింపు. మిగతా మానవ సంబంధాలు, ఆసక్తులు, అభిరుచులు, సమాజగత వ్యవహారాలలో మేం అందరిలాగానే ఉంటాం" అని వివరించారు శాస్త్రి. 

ఐటీలో పనిచేస్తున్న చిదానంద శాస్త్రి బైసెక్సువాలిటీపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. 

2018లో సుప్రీం కోర్టు ఆర్టికల్ 377ను రద్దు చేస్తూ, స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చిన సందర్భంలో శాస్త్రి తొలిసారిగా తన లైంగికత గురించి బయటపెట్టారు. 

"మొదట్లో నాకు బైసెక్సువాలిటీ అనే పదం తెలీదు. ఆ పదం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. 2018లో ఆర్టికల్ 377 రద్దు తరువాత, ఒక వార్తాపత్రిక ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొందరిని ఇంటర్వ్యూ చేసింది. అప్పుడే నేను తొలిసారిగా నా లైంగిక ధోరణి గురించి బహిరంగంగా మాట్లాడాను. నాకు భిన్న లింగ వ్యక్తులు అంటే ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల పట్ల సమాన లైంగిక ఆకర్షణ ఉంటుంది. నేను అమ్మాయిలతోనూ, అబ్బాయిలతోనూ డేటింగ్ చేసేవాడిని. కానీ, నాకు కొంత గందరగోళంగా ఉండేది. ఈ లైంగికతను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. నేను దీని గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడే నాకొక స్పష్టత వచ్చింది. దీన్ని బైసెక్సువాలిటీ అంటారని కూడా తెలిసింది. అప్పటివరకు నేను జెండర్ ఫ్లూయిడ్ వ్యక్తినని చెప్పుకునేవాడిని. దీన్నే జెండర్ నాన్-కన్ఫర్మిటీ అని కూడా అంటారు" అని శాస్త్రి వివరించారు. 

జెండర్ ఫ్లూయిడ్ లేదా జెండర్ నాన్-కన్ఫర్మిటీ అంటే తమ గుర్తింపును ఒక ప్రత్యేక లింగానికి కాకుండా భిన్న లింగాలకు ఆపాదించుకుంటారు. లేదా నో జెండర్ లేదా జెండర్ తటస్థం అని చెప్పుకుంటారు.

అదే సమయంలో శాస్త్రి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఆయన తన లైంగిక ధోరణి గురించి వారికి వివరించారు. అయితే, వారికి అది అర్థం కాలేదని చెప్పారు. 

"మా అమ్మ, నాన్నలకు అర్థం కాలేదు. కానీ, వాళ్లు నా పట్ల ప్రేమగానే ఉన్నారు. 'మేం దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, నీ పట్ల మేం తప్పుగా వ్యవహరిస్తే మాకు వెంటనే చెప్పు' అన్నారు. అది నాకు బలాన్నిచ్చింది. బైసెక్సువాలిటీపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వివిధ ఎల్జీబీటీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాను. నేనొక పెర్ఫార్మర్‌ను. డ్రాగ్ అనే డాన్స్ చేస్తాను.

చిదానంద శాస్త్రి
ఫొటో క్యాప్షన్, చిదానంద శాస్త్రి

'ఎల్జీబీటీ కమ్యూనిటీలో కూడా మాపై చిన్నచూపే'

ఎల్జీబీటీ కమ్యూనిటీలో కూడా బైసెక్సువల్ పట్ల చిన్నచూపు ఉంటుందని చిదానంద శాస్త్రి చెప్పారు. 

"మాకు కుదురు ఉండదు అనుకుంటారు. నేనొక అబ్బాయితో సంబంధంలో ఉన్నప్పుడు, తన నుంచి నాకెప్పుడూ ఎమోషనల్ సపోర్ట్ వచ్చేది కాదు. ఎందుకంటే తనకు నా మీద నమ్మకం ఉండేది కాదు. నేను వేరే అమ్మాయితోనో లేదా ట్రాన్స్ వ్యక్తితోనే వెళ్లిపోతానని భయపడేవాడు. మేం రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేసేవాళ్లం కాదు. ఎప్పుడైనా ఎటైనా వెళ్లిపోయేవాళ్లం కాదు. ఈ అపోహ పోవాలి" అని ఆయన అన్నారు. 

'నేను ఒక స్ట్రెయిట్ అమ్మాయిని పెళ్లిచేసుకున్నానని నా లైంగికతను కొట్టిపారేశారు'

ఎల్జీబీటీ కమ్యూనిటీ తనను హోమోసెక్సువల్‌గానే పరిగణించేవారని, బైసెక్సువల్‌గా ఒప్పుకునేవారు కాదని శాస్త్రి చెప్పారు. అమ్మాయితో ఉంటే స్ట్రెయిట్ అని, అబ్బాయితో ఉంటే గే అని భావించేవారు తప్ప తను బైసెక్సువల్ అనేది ఒప్పుకునేవారు కాదని శాస్త్రి చెప్పారు.

"నేను ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఉంటూ నా బైసెక్సువలిటీ గురించి వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసేవాడిని. ఒక ఆరేడేళ్లు నా ప్రయత్నాలు కొనసాగాయి. నేను ఒక స్ట్రెయిట్ అమ్మాయిని పెళ్లి చేసుకోగానే, వాళ్లు నా లైంగికత పట్ల చిన్నచూపు ప్రదర్శించారు. నేను స్వలింగ సంపర్కుడిని కాదని, ఎల్జీబీటీ కమ్యూనిటీ స్పేస్‌ను వాడుకుంటున్నానని విమర్శించారు. ప్రైడ్ కార్యక్రమాలలో నా పేరు తొలగించేవాళ్లు. నేను, సిస్ జెండర్ అంటే స్ట్రెయిట్ వుమన్‌ను పెళ్లి చేసుకున్నానని, ఎల్జీబీటీకి చెందనివాడినని నాపై వివక్ష చూపేవారు." అని శాస్త్రి చెప్పారు.

చిదానంద శాస్త్రి

'నా భార్య నాకు పెద్ద సపోర్ట్'

శాస్త్రి భార్య ఆయనకు చాలా మద్దతు ఇస్తారు. శాస్త్రితో పాటు ఆమె కూడా ఎల్జీబీటీ కార్యక్రమాలలో పాలుపంచులుంటూ బైసెక్సువాలిటీ గురించి అవగాహన పెంచేందుకు సహాయపడతారు. 

"ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో నా భార్యను కలిశాను. మేం దూరపు బంధువులం. అప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవుతోంది. బైసెక్సువాలిటీ గురించి నన్ను అడిగింది. నేను తనకి వివరించాను. ఆ తరువాత ఒక 20 ఆర్టికల్స్ పంపించాను. దాంతో, తనకు కొంచెం విసుగొచ్చింది. 'నువ్వు నన్ను ప్రేమిస్తే, మనం పెళ్లిచేసుకుందాం. లేదంటే లేదు. కానీ ఇంక ఈ వివరణలు ఆపు ' అని చెప్పింది. మేమిద్దరం ప్రేమలో పడ్డాం. పెళ్లిచేసుకున్నాం. దీనివల్ల, నా లైంగికత మారిపోదు. నా వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నాను. నా భార్య నాకు పెద్ద సపోర్ట్. తను కూడా నాతో పాటూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. 'నా భర్త బైసెక్సువల్, నేను తనకు సపోర్ట్ చేస్తాను' అని స్పష్టంగా చెబుతుంది. దీనిపై సమాజంలో అవగాహన రావాలన్నదే తన తపన కూడా" అని శాస్త్రి వివరించారు.

బైసెక్సువాలిటీపై ప్రతికూలత

ఇంత వివరించినా ఇంకా జనానికి సందేహాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయని, మీది ఓపెన్ మ్యారేజా అని అడుగుతుంటారని శాస్త్రి చెప్పారు.

"నన్ను, నా భార్యని కలిపి సందేహించడం మొదలుపెట్టారు. లైంగికత భిన్నంగా ఉంటే ఓపెన్ రిలేషన్స్‌లో ఉంటారన్న భావన పోవట్లేదు. నాకు, నా భార్యకి కూడా హృతిక్ రోషన్ అంటే ఇష్టం ఉండొచ్చు అని చెబితే వారికి అర్థం కావట్లేదు. ఎల్జీబీటీ కమ్యూనిటీలో కూడా నన్ను గేటు దగ్గరే అడ్డేస్తున్నారు. నువ్వు స్ట్రెయిట్ అమ్మాయిని చేసుకున్నావు, నీకు ఈ కమ్యూనిటీలో స్థానం లేదు అంటున్నారు.

అందుకే ఈమధ్య నేను, నా భార్య కలిసి యూట్యూబ్‌లో ఒక వీడియో చేశాం. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇవన్నీ చెప్పి నా భార్యను పాడుచేస్తున్నానని, తనకు నిజం చెప్పకుండా మోసం చేస్తున్నానని ఆరోపణలు కూడా వచ్చాయి. బైసెక్సువాలిటీపై చాలా ప్రతికూలత ఉంది" అని చెప్పారు. 

ఈ విషయంలో సమాజంలో అవగాహన పెంపొందించేందుకు శాస్త్రి తన సన్నిహితులతో కలిసి హైదరాబాదులో 'బై పాన్ ఫెస్ట్'ను ప్రారంభించారు. 2021లో, 2022లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

"దీని ఉద్దేశం బైసెక్సువాలిటీ మీద ఒక చర్చను ప్రారంభించడం. ఎల్జీబీటీ సముదాయంలో బైసెక్సువల్స్‌పై వివక్ష ఉంటుంది కాబట్టి, వాళ్లు ఎదుర్కునే అంశాలు, ఇబ్బందుల గురించి చర్చించడానికి, తమ గురించి తాము చెప్పుకోవడానికి ఇదొక వేదిక. సెప్టెంబర్ 23 బైసెక్సువాలిటీ డే. ఆ సమయంలోనే మేం బై పాన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం" అని శాస్త్రి చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

ఎల్జీబీటీలో వర్గ కోణం

ఎల్జీబీటీలో ఒక క్లాస్ కోణం కూడా ఉందని శాస్త్రి అంటున్నారు.

"సాధారణంగా ట్రాన్స్‌జెండర్స్‌లో ఎక్కువమంది దిగువ తరగతి వాళ్లు కనిపిస్తుంటారు. కానీ, బైసెక్సువల్స్ విషయంలో అలా కాదు. వీళ్లల్లో చాలామందికి విద్యావకాశాలు మెరుగ్గా ఉంటాయి. సమాచారం అందుబాటులో ఉంటుంది. మధ్య తరగతి లేదా పై తరగతి వర్గాలవారు అయి ఉంటారు. ఇది నా పరిశీలన. దీనర్థం అంత చదువు, ప్రపంచ జ్ఞానం ఉంటే తప్ప బైసెక్సువాలిటీ గురించి బయటపడట్లేదు అని. దిగువ తరగతుల్లో బైసెక్సువల్ వ్యక్తులు లేరని కారు. కానీ, ఆ పేరు తెలియడం, తమ లైంగికతను గుర్తించగలగడం, దాన్ని బహిర్గతం చేయడం ఈ సమాజంలో అంత సులువు కాదు.

నాకు తెలిసిన ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ బైసెక్సువల్. కానీ, దీన్ని ఎలా వివరించాలో ఆమెకు తెలియట్లేదు. ఆమె ఒక ట్రాన్స్ వ్యక్తి. దానికితోడు బైసెక్సువల్. ఎంత సంక్లిష్టమో చూడండి. అర్బన్ జనాభా లేదా ఈ అంశాల గురించి అవగాహన ఉన్నవారికి తప్ప ఆమె భావనలు ఇతరులకు అర్థం కావడం లేదు" అని చెప్పారు శాస్త్రి.

'కట్టుబాటు కానిది ఏదైనా సమాజం ఆమోదించదు'

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బైసెక్సువాలిటీ పట్ల చిన్నచూపు ఉందని, కట్టుబాటు కానిది ఏదైనా సమాజం ఆమోదించదని సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ అంటున్నారు. "ఒక పురుషుడు, ఒక స్త్రీని వివాహం చేసుకోవడం కట్టుబాటు. ఇదే ప్రకృతి సహజం అన్నది సమాజంలో ఉన్న భావన. దీనికి వ్యతిరేకమైనది ఏదైనా రోగం అని, జబ్బు అని భావించేవారు. పూర్వకాలంలో భిన్న లైంగికతను తప్పుగా చూసేవారు. వాటికి శిక్షలు ఉండేవి. వీటి గురించి కొన్ని పుస్తకాల్లో కూడా ప్రస్తావించారు. కాలం మారుతూ వచ్చింది. ఎల్జీబీటీ పట్ల కొంత అవగాహన వచ్చింది. అయితే, బైసెక్సువాలిటీ అనేది ఒక గొడుగు. స్పష్టంగా ఒక నిర్వచనం ఇవ్వలేం. అందువల్ల బైసెక్సువల్ వ్యక్తులకు నీతి ఉండదని, రెండు జెండర్ల మధ్యలో అటూ ఇటూ సులువుగా మారిపోతుంటారని అనుకుంటారు. 21వ శతాబ్దంలో అతి పెద్ద మార్పు ఏంటంటే, చాలామంది యువత తమ బైసెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రయోగాలు చేసి తమ లైంగికతను నిర్థరించుకుంటున్నారు. మరి కొంతమంది జీవితంలో లేటు వయసులో తమ లైంగికతను గుర్తిస్తున్నారు. దీనివల్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారిపై సందేహాలు వెలువడుతున్నాయి.

బైసెక్సువాలిటీ

ఫొటో సోర్స్, Getty Images

'ఇది రోగం కాదు, ప్రవర్తన లోపం కాదు'

బైసెక్సువాలిటీ మానసిక రోగం కాదని డాక్టర్ పూర్ణిమ స్పష్టం చేశారు. "బైసెక్సువాలిటీ రోగమా? కచ్చితంగా కాదు. ప్రవర్తన లోపమా? అస్సలు కాదు. వీళ్లకి నీతి నియమాలు ఉండవా? అలా ఏమీ కాదు." "ఇది ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపణ అయింది. వారి లైంగికతను సమాజం అర్థం చేసుకోవాలి. అయితే, గే లేదా లెస్బియన్, ట్రాన్స్ వ్యక్తులలాగ బైసెక్సువల్స్ ఓపెన్‌గా ఉండేది తక్కువ. నా పరిశీలనలో వాళ్లు కొంత రహస్యంగా ఉంటారు. దాని వల్ల ఎల్జీబీటీ సముదాయంలో వారిపై కొన్ని సందేహాలు వస్తే రావచ్చు. అంతే తప్ప, బైసెక్సువాలిటీ తప్పు కాదు. జబ్బు కాదు. అది చాలా సహజమైన అంశం. ఇప్పుడిప్పుడే ఎల్జీబీటీ సముదాయం గురించి అవగాహన పెరుగుతోంది. బైసెక్సువాలిటీకి అంగీకారం ఇంకా పెరగాలి" అన్నారు డాక్టర్ పూర్ణిమా నాగరాజ.

ఇవి కూడా చదవండి: