సౌరభ్ కిర్పాల్: భారతదేశ తొలి 'గే' జడ్జి కాబోతున్న న్యాయవాది

ఫొటో సోర్స్, Twitter/ Saurabh Kirpal
- రచయిత, సుచిత్ర మొహంతి
- హోదా, లీగల్ కరస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరును సుప్రీం కోర్టు కమిటీ ప్రతిపాదించింది.
కిర్పాల్ ఆ హోదాను అందుకుంటే ఆయన తన లైంగికతను బహిరంగపరిచిన తొలి భారతీయ గే జడ్జి అవుతారు.
తాను స్వలింగ సంపర్కుడినని బహిరంగపరచిన సౌరభ్ కిర్పాల్‌ను సుప్రీం కోర్టు ప్యానెల్ సిఫార్సు చేయడం ఎల్జీబీటీ హక్కుల విషయంలో మరో "మైలురాయి" అని పలువురు భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం కిర్పాల్ పేరును సిఫార్సు చేసింది.
భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి నియామకం ప్రక్రియలో భాగంగా తొలుత కొలీజియం ఒక సీనియర్ లాయరు పేరును సిఫార్సు చేస్తుంది.
తరువాత కేంద్ర ప్రభుత్వం దానిని అధికారికరంగా ఆమోదించాల్సి ఉంటుంది.
రాబోయే వారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కిర్పాల్ పేరును తప్పక ఆమోదిస్తుందని భావిస్తున్నారు.
స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని ఎల్జీబీటీ సంఘాల విజయంగా పరిగణిస్తూ దేశంలో సంబరాలు చేసుకున్నారు.
ఈ కేసులో ఇద్దరు కీలక పిటిషనర్ల తరపున కిర్పాల్ న్యాయవాదిగా వ్యవహరించారు.
అయినప్పటికీ, వాస్తవంలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. రోజువారీ జీవితాల్లో ఎల్జీబీటీ సభ్యుల పట్ల వివక్ష, హింస కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ వివక్షను రూపుమాపాలంటే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రచారకర్తలు పిలుపునిచ్చారు.
అలాగే, ఎల్జీబీటీ సభ్యులకు ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, NurPhoto
2018లో తొలిసారిగా కిర్పాల్ పేరును ప్రతిపాదించినప్పటికీ...
నిజానికి, తన లైంగిక ధోరణి కారణంగానే ఇన్నాళ్లూ తనకు న్యాయమూర్తి పదవి దక్కలేదని కిర్పాల్ భావిస్తున్నారు.
2018లోనే కొలీజియం ఆ పదవికి కిర్పాల్ పేరును పరిగణించింది. కానీ, నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేసింది.
కిర్పాల్ నేపథ్యాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, ఆయన సహచరుడు విదేశీయుడని బయటపడడంతో దేశ భద్రతకు ముప్పు కావొచ్చని ప్రభుత్వం భావించిందన్నది ఒక వాదన. అయితే, ఈ వాదనను కిర్పాల్ తోసిపుచ్చారు.
"20 ఏళ్లుగా నాతో సాహచర్యం చేస్తున్న నా భాగస్వామి విదేశీయుడు కావడం భద్రతకు ముప్పు అనే కారణం ఎంత బూటకంగా ఉందంటే అసలు కారణం ఇంకేదో ఉందని అర్థమవుతోంది. అందుకే, నా అభ్యర్థిత్వాన్ని పరిగణించకపోవడానికి కారణం నా లైంగిక ధోరణే అని విశ్వసిస్తున్నాను" అని 49 ఏళ్ల కిర్పాల్ కిందటి ఏడాది ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
2020లో న్యాయమూర్తి పదవికి తన పేరును ప్రతిపాదించినప్పుడు, అంగీకరించాలా, వద్దా అని రెండు రకాల ఆలోచనల్లో ఉన్నానని, అయితే, ఎల్జీబీటీ కమ్యూనిటీకి తాను రోల్ మోడల్ కాగలననే నమ్మకంతో చివరికి ఒప్పుకున్నట్లు కిర్పాల్ తెలిపారు.
సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయాన్ని పలువురు న్యాయవాదులు స్వాగతించారు.
"కాలంతో పాటు దేశం అభివృద్ధి చెందింది" అని మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్ బీబీసీతో అన్నారు. సింగ్‌కు కిర్పాల్ ఎన్నో ఏళ్లుగా పరిచయం.
కిర్పాల్ ఎంతో "తెలివైన", అసామాన్యమైన", "అర్హత గల" వ్యక్తి అని సీనియర్ లాయర్ గీత లూత్రా అన్నారు.
"సౌరభ్ కిర్పాల్ లైంగిక ధోరణి ఆయన వ్యక్తిగత విషయం. దిల్లీ హైకోర్టు జడ్జి పదవికి అది అడ్డు రాకూడదు. ఆ పదవికి మనం యోగ్యత, సామర్థ్యాలను మాత్రమే పరిగణించాలి" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎల్జీబీటీ కమ్యూనిటీకి స్ఫూర్తి కావొచ్చు'
సౌరభ్ కిర్పాల్ దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫిజిక్స్ అభ్యసించారు. తరువాత, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో లా చదివేందుకు స్కాలర్‌షిప్‌పై వెళ్లారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు.
1990లలో భారతదేశానికి తిరిగి వచ్చే ముందు జెనీవాలోని ఐక్యరాజ్యసమితితో కలిసి కొంతకాలం పనిచేశారు.
అప్పటి నుంచి సుప్రీం కోర్టు న్యాయవాదిగా ఉంటూ, ఎన్నో ముఖ్యమైన కేసులను వాదించారు.
మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి అసోసియేట్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
ఆయన దగ్గర పని చేసిన సమయంలోనే కిర్పాల్ నైపుణ్యం, చట్టంపై అవగాహన మెరుగుపడ్డాయని వికాస్ సింగ్ అభిప్రాయపడ్దారు.
న్యాయ రంగంలో తనను అత్యంత ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తన తండ్రి అని, మరొకరు ముకుల్ రోహత్గీ అని కిర్పాల్ చెప్పారు.
ఆయన తండ్రి బీఎన్ కిర్పాల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
కిర్పాల్ పేరును ప్రతిపాదించడం ఎల్జీబీటీ కమ్యూనిటీకి "చారిత్రక" క్షణం అని మాజీ జర్నలిస్టు, 'స్ట్రైట్ టు నార్మల్: మై లైఫ్ ఆజ్ ఏ గే మ్యాన్' పుస్తక రచయిత షరీఫ్ డీ రంగ్నేకర్ అభివర్ణించారు.
"దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కమ్యూనిటీ నుంచి ఇంకెంతోమంది లాయర్లు రావొచ్చు. వివక్షకు గురి కామనే నమ్మకం వారికి కలగవచ్చు" అని ఆయన పీటీఐతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా
- ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- భారత్-పాకిస్తాన్ యుద్ధం 1971: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్ ఆల్బర్ట్ ఎక్కా
- సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మళ్లీ చర్చల్లో కేరళ పద్మనాభస్వామి ఆలయం
- దిల్లీలో గల్లీ గల్లీకో వైన్ షాప్
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రకారు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
- వరదలొస్తే నీటిని పీల్చేసుకునే నగరాలు.. స్పాంజ్ సిటీలను రూపొందిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








