సూపర్‌మార్కెట్‌ షాపింగ్‌లో ఖర్చు తగ్గించుకోవడం ఎలా? ఈ 5 చిట్కాలు పాటించండి

ధరల పెరుగుదల

ఫొటో సోర్స్, DEEPAK SETHI/GETTY IMAGES

    • రచయిత, జాన్ కసీడీ
    • హోదా, బీబీసీ న్యూస్

పెరుగుతున్న ధరలు మనపై పెను భారాన్ని మోపుతున్నాయి. చాలా మంది ఇప్పటికే తాము మార్కెట్‌ల నుంచి కొనుగోలు చేస్తున్న వస్తువులను తగ్గించేస్తున్నారు.

తక్కువ వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు తమ బడ్జెట్‌ను ఆదా చేసేందుకు ప్రజలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ అంశంపై చిట్కాలు, సలహాలు అందిస్తున్న ‘‘మనీ బ్లాగర్ల’’తో బీబీసీ మాట్లాడింది.

షాపింగ్

1. ఇంట్లో ఉన్నవి ట్రాక్ చేయండి

షాపింగ్‌కు వెళ్లే ముందుగా అసలు మన ఇంట్లో ఏం ఉన్నాయో మొదట చూసుకోవాలని మనీ బ్లాగర్ రోసీ ఫర్షా చెప్పారు.

‘‘ఒక లిస్టును తయారుచేసుకుంటే వచ్చే ప్రయోజనాలేంటో మన అందరికీ తెలుసు. ఈ పద్ధతిని పాటిస్తే చాలా మేలు జరుగుతుంది. మరోవైపు మన ఇంట్లో ఉండే వస్తువులనే మరోసారి మన షాపింగ్‌ బాస్కెట్‌లో వేసుకుంటే అనవసర ఖర్చు పెరుగుతుంది. అంటే అవసరంలేని వాటిపై మనం ఖర్చు పెడుతున్నట్లు లెక్క’’అని ఆమె చెప్పారు.

‘‘మన ఇంట్లో ఐదు కంది పప్పు ప్యాకెట్లు ఉన్నప్పుడు మళ్లీ ఆ ప్యాకెట్లు కొనడం ఎందుకు?’’అని ఆమె ప్రశ్నించారు.

తమ కప్‌బోర్డ్‌లో ఏం ఉన్నాయో అనే వస్తువులపై ఆమె ఒక జాబితా సిద్ధం చేసుకుంటారు. అంటే షాపింగ్‌కు వెళ్లే ముందే, తనకు ఏం కావాలో ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. దీని వల్ల తను, తన భర్త, పిల్లాడి షాపింగ్‌లో వారానికి రూ.3800 (40 పౌండ్లు) వరకు ఆదా చేయగలుగుతున్నట్లు ఆమె చెప్పారు.

కేట్ హాల్

ఫొటో సోర్స్, KATE HALL

ఫొటో క్యాప్షన్, కేట్ హాల్

2. తక్కువగా కొనాలనుకునేవాటివైపు ముందు వెళ్లండి

అసలు స్టోర్‌లోకి మనం ఎలా వెళ్తాం? అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమని బ్లాగర్ లిన్ సూచిస్తున్నారు. మొదట మనం తక్కువగా కొనాలి అనుకునే వాటివైపు వెళ్లాలని ఆమె అంటున్నారు.

‘‘మీ జాబితాలో ఉన్న వస్తువు కనిపించింది అంటే, వెంటనే అది తీసుకుని టిక్ పెట్టుకోవాలి. అంటే మీరు ఇప్పటికే కొంత డబ్బును ఆదా చేసినట్లు లెక్క’’అని ఆమె అంటారు.

ఆ తర్వాత ‘‘ఫ్రోజెన్-ఫుడ్స్’’ సెక్షన్‌కు వెళ్లాలి, ఆ తర్వాత క్యాన్డ్ ఫుడ్ దగ్గరకు వెళ్లాలి అని ఆమె సూచిస్తున్నారు.

‘‘తాజా ఫుడ్స్ కంటే ఫ్రోజెన్ మీట్, చేపలు, కూరగాయలు ఎప్పుడూ ధర తక్కువే ఉంటాయి’’అని ఆమె చెప్పారు.

‘‘తాజా ఫుడ్స్ కంటే ముందే ఫ్రోజెన్ సెక్షన్‌కు వెళ్తే కచ్చితంగా ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, చైనా రాజధాని బీజింగ్‌లో కొనసాగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్.

3. ఫ్రిడ్జ్‌ను మెరుగ్గా ఉపయోగించుకోండి

సస్టైనబిలిటీ చారిటీ వ్రాప్ అంచనా ప్రకారం ఒక ఇంటి నుంచి బయటపడేసే ఆహార పదార్థాల విలువ ఏటా రూ.67,000 (700 పౌండ్లు). ఫ్రిడ్జ్‌ను మెరుగ్గా ఉపయోగించుకోవడంతో ఇలాంటి ఆహార వృథాను అరికట్టుకోవచ్చని లిన్ అంటున్నారు.

‘‘ఆహారం చెడిపోతుందని అవకాశం ఉండేటప్పుడు వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. మరోవైపు మార్కెట్‌లోనూ ఇలా రోజులు దగ్గరపడే ఆహార పదార్థాలు మనకు చవకైన ధరకు దొరకుతాయి’’అని ఆమె అన్నారు.

‘‘పాలు, చీజ్, పళ్లు, కూరగాయలు ఇలా చాలా ఆహార పదార్థాలను మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎక్కువ కాలం వాడుకోవచ్చు. అవసరమైనప్పుడు కొద్ది సమయం ముందు బయటకు తీస్తే చాలు’’అని ఆమె అన్నారు.

ఫ్రీజింగ్ విషయంలో మరిన్ని అంశాలు లోతుగా తెలుసుకునేందుకు ఫుడ్ స్టాండార్ట్స్ ఏజెన్సీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ద ఫుల్ ఫ్రీజర్ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నకేట్ హాల్ అయితే, తన ఫ్రీజర్‌ తనకు ‘‘పాజ్’’ బటన్‌లా ఉపయోపడుతోందని చెప్పారు. ‘‘మనం దాదాపు అన్ని ఫుడ్స్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మనం వాడుకునే విధానంలో కాస్త మార్పులు చేసుకుంటే చాలు’’అని ఆమె వివరించారు.

‘‘అయితే, అరటిపళ్లు, సాలడ్‌లను ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్లీ అలానే ఉండాలని ఆశించకూడదు’’అని ఆమె అన్నారు. ‘‘పుడింగ్స్, సూప్స్, ఐస్‌క్రీమ్‌లపై వాడాలి అనుకుంటే వీటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మనం వాడుకునే విధానంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే చాలు’’అని ఆమె అన్నారు.

నూనె

ఫొటో సోర్స్, Getty Images

4. ప్యాకేజింగ్ అర్థం చేసుకోండి

‘‘మన మార్కెట్లలో ప్యాకేజింగ్ చేసే ఆహార పదార్థాలు వారి సౌకర్యార్థం అలా ప్యాక్ చేస్తారు, మనకు వీలుగా ఉండేందుకు కాదు’’అని అంటారు రోసీ. ‘‘కొన్ని రకాల పుట్టగొడుగులు ప్యాకెట్ విప్పిన వెంటనే బూజు పట్టినట్లుగా కనిపిస్తాయి. రవాణా చేయడానికి వీలుగా ఉండేందుకు వాటిని అలా ప్యాక్ చేస్తారు, నిల్వ ఉండేందుకు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి’’అని ఆమె వివరించారు.

‘‘నేనైతే ఇంటికి వచ్చిన వెంటనే వాటిని పేపర్ బ్యాగ్‌లోకి మారుస్తాను. వాటిని ప్లాస్టిక్ బ్యాగ్‌ల లోనుంచి బయటకు తీసెస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి’’అని ఆమె చెప్పారు.

వ్రాప్‌కు చెందిన హెలెన్ వైట్.. ద లవ్ ఫుడ్ హేట్ వేస్ట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు మనం కొన్ని మార్పులు చేసుకోవాలని ఆమె అంటారు.

‘‘సాలడ్‌లో టిష్యూను పెట్టడం ద్వారా లోపల ఉండే తేమను పీల్చుకునేలా చేయవచ్చు. ఫలితంగా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది’’అని ఆమె అంటారు.

‘‘పళ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే, అక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి’’అని ఆమె అన్నారు. పాలు, ఇతర ఆహార పదార్థాలు ఉష్ణోగ్రతల్లో తేడాల వల్లే ఎక్కువగా పాడవుతుంటాయని ఆమె వివరించారు.

రోసీ ఫర్షా

ఫొటో సోర్స్, ROSIE FORSHAW

ఫొటో క్యాప్షన్, రోసీ ఫర్షా

5. నిపుణుల సలహాలు తీసుకోవాలి

స్థానికంగా అందుబాటులో ఉండే రీటెయిలర్‌ల దగ్గర నుంచి ఏళ్ల అనుభవమున్న నిపుణుల వరకు చాలా మందిని ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం ఎలా? అనే ప్రశ్న అడుగుతుంటానని రోసీ చెప్పారు.

‘‘మాంసం కొట్టు వ్యాపారులకు చాలా చిట్కాలు తెలుస్తుంటాయి. డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి, ఎక్కువ రోజు మాంసం నిల్వ ఉండేందుకు ఏం చేయాలి? అని వారిని మనం అడగొచ్చు’’అని ఆమె అంటారు.

‘‘తక్కువ ధరకు మాంసం ఎప్పుడు దొరకుతుంది? ఎలా మాంసాన్ని వృథా కాకుండా కాపాడుకోవచ్చు.. లాంటివి వారిని అడిగితే చెబుతారు’’అని ఆమె వివరించారు.

ఎలా వండుకోవాలి? వృథాను ఎలా తగ్గించుకోవాలి? లాంటి అంశాలపై వారు మంచి సలహాలు ఇవ్వగలరని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

ప్రజల నుంచి వచ్చిన సలహాలు

‘‘నేను, నా భార్య కలిసి కూర్చొని వారానికి ఏం కావాలో ముందుగా జాబితా సిద్ధం చేసుకుంటాం. ఆ వెంటనే డబ్బులు ఎంత అవుతాయో కూడా లెక్క వేసుకుంటాం. ముఖ్యంగా ఎక్కడ తక్కువ డబ్బులు చూపిస్తాయో ఆ యాప్‌కు వెళ్లి కొనుగోలు చేస్తాం. మార్కెట్‌కు నేరుగా వెళ్తే మనకు అవసరంలేనివి కూడా మనం కొనుగోలు చేసేస్తుంటాం. అందుకే ఆన్‌లైన్ కాస్త మేలు.’’

- రషెల్, పోర్ట్స్‌టెవార్ట్, నార్తెర్న్ ఐర్లాండ్

‘‘మనం వీక్లీ మెనూ సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఏ రోజు ఏం వండుకుంటామో ముందే తెలుస్తుంది. ఈ జాబితాను ఫ్రిడ్జ్‌పై అతికించుకోవాలి. దీని వల్ల ఇప్పుడేం వండాలి? అనే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఏం వండాలో తెలుసు, దీని వల్ల మన బడ్జెట్ పెరగకుండా ఉంటుంది. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు కూడా పక్కా ప్లాన్‌తో వెళ్తాం.’’

- మిషెల్ లుష్‌మన్, సర్రే

‘‘మనం క్లీనింగ్ ఉత్పత్తులపైనా చాలా ఆదా చేసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు అవసరమయ్యే డిటర్జెంట్లు, పౌడర్ల విషయంలో మనం డబ్బులు తగ్గించుకోవాలి. ఉదాహరణకు కొన్ని రకాల బట్టలకు వాషింగ్ పౌడర్ అవసరం ఉండదు. అలాంటి చిట్కాలను మనం ఆన్‌లైన్‌లో శోధించి తెలుసుకోవచ్చు.’’

- హెలెన్ బోరోడ్జిక్, సెయింట్ ఆన్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు