ఫుట్‌బాల్: భారత జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఎందుకు ఆడలేదు?

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, ULLSTEIN BILD DTL./GETTY IMAGES

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మొత్తం 32 దేశాల జట్లు ఇందులో పాల్గొంటాయి.

నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఈ వరల్డ్ కప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కోట్ల ప్రజలు వీక్షిస్తారని ఫీఫా తెలిపింది.

ఫీఫా ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటను నియంత్రించే సంస్థ. 

2018 ప్రపంచ కప్‌ను 400 కోట్ల ప్రజలు వీక్షించారు. ఇప్పుడు ఆ సంఖ్య మరో 100 కోట్లు పెరగనుంది. 

ఇది 22వ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఈవెంట్. అయితే, భారతీయ క్రీడా అభిమానులకు ఇది అంత ఉత్సాహకరమైనదేం కాదు. ఎందుకంటే, భారతదేశం ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంటులో ఒక్కసారి కూడా పాల్గొనలేదు. 

కానీ, ఒకసారి భారత్‌కు వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందన్న విషయం నేటి తరం క్రీడా అభిమానులకు తెలియకపోవచ్చు.

72 ఏళ్ల క్రితం 1950లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం భారత ఫుట్‌బాల్ జట్టుకు వచ్చింది. కానీ, ఆడలేదు.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, PABLO PORCIUNCULA/GETTY IMAGES

భారత్‌కు ఆ అవకాశం ఎలా వచ్చింది?

రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నిర్వహించలేదు. 12 ఏళ్ల నిరీక్షణ తరువాత, 1950లో బ్రెజిల్‌లో ప్రపంచ కప్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఆడేందుకు 33 దేశాలు అంగీకరించాయి. 

క్వాలిఫైయింగ్ గ్రూప్ 10లో బర్మా (మయన్మార్), ఫిలిప్పీన్స్‌తో పాటు భారత్‌కు చోటు దక్కింది. కానీ బర్మా, ఫిలిప్పీన్స్ తమ పేర్లను వెనక్కు తీసుకున్నాయి. 

అంటే, భారత్ ఆడకుండానే క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ముందుకెళ్లిపోయింది. ప్రపంచ కప్‌లో ఆడి తమ సత్తా చాటుకునే అవకాశం భారత్‌కు దగ్గరి దాకా వచ్చింది. 

టోర్నమెంట్‌లో చివరి రౌండ్ డ్రా ముగిసింది. పూల్-3లో స్వీడన్, ఇటలీ, పరాగ్వేతో పాటు భారత్‌కు చోటు లభించింది. 

ఒకవేళ, భారత్ ఈ టోర్నీలో పాల్గొంటే ఎలా ఉండేది? 

దీని గురించి ఫుట్‌బాల్ జర్నలిస్ట్ నోవీ కపాడియా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ గైడ్ బుక్‌లో ఇలా రాశారు.

"ఆ సమయంలో పరాగ్వే జట్టు అంత బలంగా లేదు. ఇటలీ జట్టులో ఎనిమిది మంది ప్రధాన ఆటగాళ్లకు క్రమశిక్షణా రాహిత్యం కారణంగా చోటు దక్కలేదు. ఇటలీ జట్టు ఎంత బలహీనంగా ఉందంటే, బ్రెజిల్‌ చేరిన తరువాత వాళ్ల కోచ్ విట్టోరియో పోజో రాజీనామా చేశారు. స్వీడన్ జట్టు భారత్‌తో పోలిస్తే బలంగానే ఉంది. అంటే, ఈ గ్రూపులో భారత్ రెండవ బలమైన జట్టు కింద లెక్క. ఇందులో ఆడి ఉంటే భారత జట్టుకు మంచి అనుభవం వచ్చి ఉండేది."

1950లో భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడ ఎలా ఉండేది?

1950లలో భారత ఫుట్‌బాల్ జట్టుకు అంతర్జాతీయ క్రీడలలో ఆడిన అనుభవం పెద్దగా లేదు. కానీ, బాగా ఆడే దేశంగా పేరు తెచ్చుకుంది. 

1948 లండన్ ఒలింపిక్ క్రీడలలో భారత జట్టు సత్తా చాటుకుంది. ఫ్రాన్స్ లాంటి ఉద్దండ పిండం చేతిలో 1-2 తేడాతో ఓడిపోయినప్పటికీ, భారత్, తన సత్తాను ప్రదర్శించింది. 

ఆ కాలంలోనే ఫార్వర్డ్, డ్రిబ్లర్ ఆటతో భారత జట్టు, తన గుర్తింపు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.

అహ్మద్ ఖాన్, ఎస్ రామన్, ఎంఏ సత్తార్, ఎస్ మేవాలాల్ వంటి ఆటగాళ్లకు అభిమానులు ఉండేవారు.

లండన్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లందరూ షూస్ లేకుండా ఫుట్‌బాల్ ఆడారు. రైట్ బ్యాక్‌లో ఆడిన తాజ్ మహ్మద్ మాత్రమే షూస్ వేసుకున్నాడు. 

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఫుట్బాల్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు ఎస్ మహలాల్, ఎస్ నంది షూస్ వేసుకోకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు.

బ్రెజిల్ ప్రపంచ కప్‌లో భారత జట్టు ఎందుకు పాల్గొనలేకపోయింది?

1950 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఎందుకు పాల్గొనలేదు అనేదానికి స్పష్టమైన సమాచారం లేదు. 

జట్టు ఎంపికలో విభేదాలు, ప్రాక్టీస్‌కు సమయం సరిపోకపోవడంతో ఆ టోర్నమెంటు నుంచి జట్టు వైదొలిగిందని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అప్పట్లో చెప్పింది.

దీని గురించి చాలా ఏళ్లు రకరకాల చర్చలు జరిగాయి. భారత ఆటగాళ్లు షూస్ లేకుండా ఉత్తి కాళ్లతో ఆడాలనుకున్నారు గానీ ఫీఫా అందుకు అంగీకరించలేదన్న కథనంపై ఎక్కువ చర్చ జరిగింది.

కానీ, నోవీ కపాడియా ఈ కారణాన్ని అంగీకరించలేదు. అలాగే, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జైదీప్ బసు ఇటీవల రాసిన పుస్తకంలో దీని గురించి ప్రస్తావిస్తూ, ఈ కారణాన్ని నమ్మదగినదిగా పరిగణించలేదు. 

జైదీప్ బసు సంపాదకత్వం వహించిన 'బాక్స్ టు బాక్స్: 75 ఇయర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్' అనే పుస్తకంలో, "భారత ఆటగాళ్లు షూస్ లేకుండా ఆడతామనడం, ఫీఫా అభ్యంతరం చెప్పడం.. వీటికి తావు లేదు" అని రాశారు. 

"ఆ జట్టులోని ఏడుగురు, ఎనిమిది మంది ఆటగాళ్ల ట్రావెల్ బ్యాగ్‌లలో స్పైక్ షూస్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం" అని జైదీప్ బసు రాశారు.

ఆ కాలంలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ పాదాలకు మందపాటి పట్టీ కట్టుకుని ఆడటానికి ఇష్టపడేవారు. 1954 వరకు ఈ పద్దతి చాలా దేశాల్లో పాటించేవారు.

డబ్బు లేకపోవడం కారణమా?

భారత జట్టు వద్ద తగినంత డబ్బు లేకపోవడం ఒక కారణమన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ, ఆ వాదన కూడా నమ్మదగినదిగా కనిపించడంలేదు. 

భారత జట్టుకు బ్రెజిల్‌లో ఆడడానికి వెళ్లే ముందు డబ్బు సమస్య ఉత్పన్నమయింది కానీ, అది వెంటనే పరిష్కారమయిందని జైదీప్ బసు తన పుస్తకంలో రాశారు.

ఆ సమయంలో భారతదేశంలోని మూడు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఖర్చులో భాగం పంచుకుంటామని హామీ ఇచ్చాయని ఆయన రాశారు. 

అంతే కాకుండా, బ్రెజిల్, ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సంప్రదించి, జట్టు ఖర్చులలో ఎక్కువ భాగం భరిస్తామని హామీ ఇచ్చినట్టు నోవీ కపాడియా తన పుస్తకంలో రాశారు.

నోవీ కపాడియా పుస్తకంలో రాసిన వివరాల ప్రకారం, బ్రెజిల్ ఈ హామీ ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, స్కాట్లాండ్, ఫ్రాన్స్, టర్కీ( ప్రస్తుత తుర్కియే ), చెకోస్లోవేకియా జట్లు ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నుంచి తమ పేర్లను ఉపసంహరించుకున్నాయి. రెండవది, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలున్న దేశం తమ దేశంలో ఫుట్‌బాల్ ఆడాలని బ్రెజిల్ కోరుకుంది.

జైదీప్ బసు తన పుస్తకంలో ఏం రాశారంటే, 1950 మే 16న భారతదేశం ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు వెళ్లే జట్టును ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, భారత జట్టు జూన్ 15న బ్రెజిల్‌కు బయలుదేరుతుంది. మొదటి మ్యాచ్ జూన్ 25న పరాగ్వేతో జరగాల్సి ఉంది.

కానీ, ఆ తరువాత ఏమి జరిగిందో తెలీదు. దీన్ని జైదీప్ బసు భారతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అతిపెద్ద రహస్యంగా పేర్కొన్నారు.

అయితే, భారత జట్టు ఎంత మంచి అవకాశం కోల్పోయిందనేది భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు లేదా ఆ కాలంలోని ఫుట్‌బాల్ అధికారులు గ్రహించలేదని నోవీ కపాడియా, జైదీప్ బసు పుస్తకాల బట్టి అర్థమవుతోంది. 

ఇదిలా ఉండగా, అదే సమయంలో భారత హాకీ జట్టు ఒలింపిక్ క్రీడలలో చాంపియన్‌గా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

అందుకే, భారత ఫుట్‌బాల్ జట్టులో ఆటగాళ్లు, అధికారులు కూడా ఒలింపిక్ క్రీడలపై ఎక్కువ దృష్టి సారించారు. 

1951 ఆసియా క్రీడలు దిల్లీలో జరగాల్సి ఉంది. ఆతిథ్య జట్టుగా ఇందులో మెరుగ్గా రాణించడమే భారత్ లక్ష్యం. 

మరో విషయం ఏమిటంటే, 1950కి ముందు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు అంత ప్రజాదరణ లేదు. అప్పటివరకు, ఇదొక గ్లామర్ లేని స్పోర్ట్స్ టోర్నమెంట్. ఆ తరువాతి సంవత్సరాలలో దీనికి అభిమానులు పెరిగారు, ఆదరణ పెరిగింది. 

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌

ఫొటో సోర్స్, STRDEL/GETTY IMAGES

నిబంధనలపై అవగాహన లేకపోవడం?

నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లే భారత ఫుట్‌బాల్ అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. 

వాస్తవానికి, అప్పట్లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ప్రొఫెషనల్ ప్లేయర్‌ అనే ట్యాగ్ వచ్చేది. 

ఈ ట్యాగ్ వస్తే వాళ్లకు ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి లభించదు. ఎందుకంటే, ఈ టోర్నమెంటులు ఔత్సాహికులకు మాత్రమే. ప్రొఫెషనల్స్‌కు కాదు. 

అయితే, ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి కూడా ఓ మార్గం ఉంది. హంగేరీ, రష్యా లాంటి సోషలిస్ట్ దేశాలు తమ క్రీడాకారులను సైన్యంలో సభ్యులుగా పేర్కొనేవి. సైన్యంలోని సభ్యులు ప్రొఫెషనల్స్‌గా ఉండలేరని చెప్పేవి. 

ఆ సమయంలో భారత ఫుట్‌బాల్ సంఘం అధికారులకు ఈ విషయం తెలియకపోవచ్చు.

1950 ప్రపంచ కప్‌లో పాల్గొంటే ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే అవకాశం కోల్పోతామన్న భయంతో ఆ టోర్నమెంటులో పాల్గొనకూడదన్న నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. 

కానీ, ఈ నిర్ణయం భారత ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు 72 ఏళ్లుగా నిరాశే మిగిల్చింది. ప్రతీ నాలుగేళ్లకు వచ్చే వరల్డ్ కప్ ఆ బాధను మరింత పెంచుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)