Football 95-0, 91-1: దేశ ఫుట్‌బాట్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన మ్యాచ్‌లు.. విచారణ చేపట్టిన అధికారులు

ఫొటో సోర్స్, Getty Images
రెండు ఫుట్‌బాల్ మ్యాచుల్లో కలిపి 187 గోల్స్ కొట్టడం మీద సియెర్రా లియోన్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఎస్‌ఎల్ఎఫ్‌ఏ) విచారణ చేపట్టింది.
ఆదివారం జరిగిన ప్రీమియర్ లీగ్ క్వాలిఫై మ్యాచుల్లో కహున్లా రేంజర్స్ 95-0 తేడాతో లుంబెబు యునైటెడ్ మీద గెలవగా, కొక్విమా లెబనాన్ మీద 91-1 తేడాతో విజయం సాధించింది గల్ఫ్ ఎఫ్‌సీ.
సియెర్రా లియోన్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ గోల్స్ చేసిన మ్యాచులుగా ఇవి రికార్డ్ సృష్టించాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆట తొలి సగ భాగం వరకు నమోదైన గోల్స్ 2-0, 7-1 మాత్రమే.
'ఇలాంటి అవమానకరమైన మ్యాచులకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదు. మేం వెంటనే విచారణ మొదలుపెడతాం' అని ఎస్‌ఎల్‌ఎఫ్‌ఏ ప్రెసిడెంట్ థామస్ డాడీ బ్రిమా బీబీసీతో అన్నారు.
'తప్పు చేసినట్లుగా తేలిన వారిని ఎస్ఎల్‌ఎఫ్‌ఏ నిబంధనల ప్రకారం శిక్షిస్తాం. అలాగే అవినీతి నిరోధక విభాగం అధికారులకు అప్పగిస్తాం' అని థామస్ చెప్పారు.
మ్యాచులు జరిగిన తీరును కహున్లా రేంజర్స్ సీఈఓ ఖండించారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని లుంబెబు టీం జనరల్ మేనేజర్ అన్నారు.
నాలుగు ఫుట్‌బాల్ క్లబ్స్‌కు చెందిన ప్లేయర్స్, మేనేజర్స్, ఇతర అధికారులతోపాటు ఈస్ట్రన్ రీజియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా విచారించనున్నట్లు సియెర్రా లియోన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది.
తమ దేశంలో జరిగే అవకతవకలు, మ్యాచ్ ఫిక్సింగులను ఏ మాత్రం సహించమని అసోసియేషన్ హెచ్చరించింది. ఫుట్‌బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఫిపా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ నియమాలను తాము కచ్చితంగా పాటిస్తున్నట్లు అది స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కహున్లా-లుంబెబు యునైటెడ్, గల్ఫ్ ఎఫ్‌సీ-కొక్విమా లెబనాన్ మ్యాచులు ఒకేసారి జరిగాయి.
మ్యాచులు మొదలై తొలి అర్ధభాగం ముగిసే సరికి కహున్లా-లుంబెబు యునైటెడ్ మ్యాచ్ స్కోరు 2-0. గల్ఫ్ ఎఫ్‌సీ-కొక్విమా లెబనాన్ స్కోర్ 7-1. కానీ ఆ తరువాత అసలు కథ మొదలైంది. తొలుత గల్ఫ్ ఎఫ్‌సీ రెండో అర్ధభాగం మ్యాచ్ నిర్వహించేందుకు రిఫరీ నిరాకరించారు. దాంతో కొత్త రిఫరీని తీసుకొచ్చారు.
ఇక రెండో అర్ధభాగంలో కహున్లా, గల్ఫ్ ఎఫ్‌సీ ప్లేయర్స్ రెచ్చిపోయారు. కహున్లా 93 గోల్స్ కొట్టగా గల్ఫ్ ఎఫ్‌సీ 84 గోల్స్ చేసింది.
ఇలా భారీగా గోల్స్ చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. తమ టీం ఆడిన తీరును కహున్లా సీఈఓ ఎరిక్ కైటెల్ ఖండించారు. ఫుట్‌బాల్ అభిమానులకు ఆయన క్షమాపణలు తెలిపారు. విచారణ కోసం ఒక కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
రెగ్యులర్ కోచ్ అందుబాటులో లేకపోవడంతో లుంబెబు యునైటెడ్ టీం మేనేజర్ మహ్మద్ జాన్ సయ్యద్ జలాహ్, ఆదివారం కోక్విమా లెబనాన్‌తో జరిగిన మ్యాచ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. తాను ఎప్పుడూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడనని జలాహ్ అన్నారు.
'ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు రెండు మ్యాచుల మీద విచారణ చేపట్టాలి. తప్పు చేసినట్లు తేలితే వారిని శిక్షించాలి.' అని ఆయన కోరారు.
అయితే ఫ్రెండ్లీ గేమ్ కావడం వల్లే ఫలితాలు అలా వచ్చాయని కొక్విమా లెబనాన్ చైర్మన్ మహ్మద్ లన్ఫియా అన్నారు. వాస్తవానికి నిజమైన మ్యాచ్ రెండు జట్ల మధ్య జరగలేదని, ఆ విషయాన్ని ఆటగాళ్లు, క్లబ్ అధికారులు తనకు చెప్పారని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు వినోదం పంచడానికి తమ ప్లేయర్స్‌తో సహా ఇతర ఫుట్‌బాల్ ఆటగాళ్లు సరదాగా తలపడ్డారని మహ్మద్ లన్ఫియా చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్లో చికెన్ అమ్మినందుకు ముస్లిం వ్యక్తి అరెస్టు
- IND vs ENG: ఐదో టెస్టులో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం.. టీమిండియా పొరపాట్లు ఇవేనా?
- 'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
- కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి ఈ లాయర్
- బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?
- ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











