28 ఏళ్ల పాటు పురుషుడిగా జీవించి, మహిళగా మారిన ఒక టీచర్ కథ..
- రచయిత, మయాంక్ భాగవత్, షాషీద్ షేక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మహారాష్ట్ర సింధ్‌దుర్గ్‌కు చెందిన ప్రవీణ్ 2019లో తన జెండర్‌ను మార్చుకుని రియాగా మారారు. వృతిరీత్యా టీచర్ అయిన ప్రవీణ్ జెండర్‌గా మారి.. రియా అయిన తర్వాత కూడా తన వృత్తిని కొనసాగించారు. అయితే ఈ క్రమంలో సమాజం నుంచి రియా ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఈ మార్పును ఆమె కుటుంబం ఎలా స్వీకరించింది?
‘‘అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు... నా వేషధారణ మాత్రమే మారింది. నా మనసు మాత్రం మారలేదు. వాళ్లకు మంచి అలవాట్లు నేర్పించే పనిని నాకు అప్పగించారు. నా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పనిని శక్తివంచన లేకుండా పూర్తి చేస్తాను’’ అని ఓరోస్ – బుద్రక్ జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రియా అళ్వేకర్ బీబీసీతో అన్నారు.
గతంలో ప్యాంటు, షర్ట్ వేసుకుని టీచింగ్ చేయడానికి స్కూల్‌కు వెళ్లేవారు ప్రవీణ్. ఇప్పుడు రియాగా మారి పిల్లలకు పాఠాలు చెప్పేందుకు చీరలో వెళ్తున్నారు. డ్రెస్ మాత్రమే మారింది కానీ తనలోని టీచర్ మాత్రం మారలేదు. రియా ఓ ట్రాన్స్‌జెండర్. మూడేళ్ల కింది వరకూ పురుషుడిగా ఉన్న ప్రవీణ్ ఇప్పుడు రియాగా మారారు. పదేళ్లుగా టీచింగ్ వృత్తిలోనే ఉన్నారు. 2019లో తన జెండర్‌ను మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె సింధుదుర్గ్ జిల్లాలోని ఓరోస్– బుద్రుక్ జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒక మహిళగా స్కూలుకు వెళ్తున్నప్పటికీ మానసికంగా తనపైన ఒత్తిడి ఉంటుందని ఆమె అన్నారు.
‘‘నేను స్కూల్లో పని మొదలు పెట్టినప్పుడు, పిల్లలు నా గురించి ఏం అనుకుంటారో అని భయమేసేది. టీచర్‌లు నన్ను అర్థం చేసుకుని అండగా నిలిచారు. నేను పిల్లలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. నేను క్లాస్ రూంలోకి అడుగుపెట్టినప్పుడు నా శ్రద్ధంతా విద్యార్థుల ఎదుగుదల మీదే ఉంటుంది. రకరకాల యాక్టివిటీస్ ప్రారంభించాను. ప్రతి విద్యార్థిలో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా స్పందించేదాన్ని. వారి ముందు నేను రియా మేడమ్ లాగానే వ్యవహరించాను. దాంతో వారు కూడా నన్ను రియా మేడమ్ అనే పిలవడం మొదలుపెట్టారు’’ అని రియా చెప్పారు.
రియా అళ్వేకర్ తన ధైర్యంతో ట్రాన్స్‌జెండర్ టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సమాజంలో 28 ఏళ్ల పాటు ప్రవీణ్ పేరుతో పురుషుడిగానే జీవించారు. అబ్బాయిగా పుట్టినా.. తన శరీరంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. తానొక మహిళను అనే భావన నిరంతరం మనసులో మెదిలేది. దాంతో ఎప్పుడూ పోరాడేవారు. శరీరంలో మార్పులు జరుగుతున్న కొద్ది అది ప్రవీణ్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరాఖరికి 2019లో అన్నింటిని ఎదుర్కొని రియాగా మారిపోయారు. ప్రవీణ్‌గా తనకు తన శరీరంతో పాటు, సమాజంతో కూడా పోరాడాల్సి వచ్చింది.
‘‘ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్లకి చెప్పినప్పుడు వాళ్లు నిర్ఘాంతపోయారు. దీన్నెలా స్వీకరించాలో వాళ్లకి తెలియదు. ఎలాగోలా మా కుటుంబం నన్ను అంగీకరించింది. కానీ సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని.. నా ప్రవర్తన వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కావొద్దని ఇంటికి దూరంగా బతుకుతున్నాను. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చాక, నేను సమాజంలో ఓ రోల్ మోడల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని రియా వివరించారు.
జెండర్ రీఅస్సైన్‌మెంట్ సర్జరీ తర్వాత, 2022 ఆగష్టు నుండి ఓరోస్ పాఠశాలలో పని చేయడం ప్రారంభించారు రియా. పిల్లలతో కలిసి మాట్లాడేటప్పుడు, వాళ్లకు డాన్స్ నేర్పించేటప్పుడు ఇప్పుడు ఆమె మీద ఎటువంటి ఒత్తిడీ లేదు. మహిళా టీచర్‌గా ఆమె ఒదిగిపోయారు. సమాజం హేళన చేసినా, యాజమాన్యం ఆమెకు అండగా నిలవడమే దానికి ప్రధాన కారణం.
‘‘ఆమె ఆర్డర్ మాకు సడన్‌గా అందింది. అంత వరకూ మాకు రియా మేడమ్ వస్తారనే విషయం తెలీదు. ఆర్డర్ అందినప్పుడు మాకు సంతోషం కలిగింది. టీచర్లు గానీ, విద్యార్థుల తల్లిదండ్రులు గానీ దీన్నలసలు పట్టించుకోలేదు. ఆమె నియామకాన్ని మేం ఆమోదించాం. ఆమె ఓ మంచి టీచర్. అప్పుడైనా, ఇప్పుడైనా మాకు సంతోషమే. కాబట్టి ఆమెపై ఎలాంటి వివక్షా ఉండదు’’ అని ఓరోస్– బుద్రుక్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శృతి ముండ్లే బీబీసీతో చెప్పారు.
టీచర్ కావడం అనేది రియా కల. కానీ ఆమె ప్రవీణ్‌ను మరిచిపోలేదు. ప్రవీణ్‌గా కష్టాలు పడటం వల్లనే ఈరోజు రియాగా గౌరవం దక్కుతోందని ఆమె అంటారు.
‘‘ఓ అబ్బాయిగా సమాజానికి భయపడే నేను ప్యాంటు షర్ట్ వేసుకునే దాన్ని తప్ప అవి నాకెప్పుడూ ఇష్టం లేవు. చీరే నా జీవితం. మా గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్లినా చీరలోనే వెళ్లేదాన్ని. చీరను చూస్తే ఓ అమ్మాయిలా వాటిని కట్టుకోవాలని అనిపించేది. ఇప్పుడు సర్జరీ అయ్యాక సంతోషంగా చీరను కట్టుకుంటున్నాను’’ అని రియా వెల్లడించారు.
టీచరుకు కులం, మతం ఏవీ ఉండవంటారు. పిల్లలకు బోధించడమే టీచరు ఆచరించే ధర్మం. రియా సమాజంలో తన గుర్తింపును నిలబెట్టుకున్నారు. గౌరవాన్ని పొందారు. అలా నవతరానికి ఓ ఉదాహరణగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:
- జాకిర్ నాయక్‌ను ఖతార్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఎందుకు ఆహ్వానించింది
- ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు
- తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మందిని కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది
- అంతరిక్షం నుంచి భూమి మీదికి నేరుగా, వైర్లు లేకుండానే విద్యుత్తు
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా డీపీ ఎంతవరకు సేఫ్? సోషల్ మీడియాలో మీ ఫోటోల ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



