తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మంది విదేశీయులను కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది? అంతమంది అవసరం ఆ దేశానికి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాబిన్ లెవిన్‌సర్ కింగ్
- హోదా, బీబీసీ న్యూస్
వయసు పైబడటంతో భారీగా ఉద్యోగాలకు పదవీ విరమణ చేస్తున్న వారి స్థానాన్ని విదేశీ వలసదారులతో భర్తీ చేసేందుకు కెనడా ప్రణాళికలు రచిస్తోంది.
2025నాటికి ఏడాదికి 5,00,000 మంది వలసదారులను దేశంలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఈ నెల మొదట్లో కెనడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే వచ్చే మూడేళ్లలో మొత్తంగా 15 లక్షల మంది విదేశీయులను దేశంలోకి కెనడా ఆహ్వానించబోతోంది.
బ్రిటన్‌లో శాశ్వత నివాసం కల్పిస్తున్న విదేశీయుల సంఖ్యతో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ. మరోవైపు అమెరికాతో పోల్చినా ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
ఇంత మంది విదేశీయులను ఆహ్వానించడంపై దేశీయంగా ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అంత మంది అవసరం?
కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నివాసముండే విదేశీయులను ఆహ్వానించేందుకు కెనడా ప్రయత్నాలు చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూసేందుకు, జనాభా పరమైన సమస్యలను అధిగమించేందుకు కెనడా ఈ నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది మొత్తంగా రికార్డు స్థాయిలో 4,05,000 మందికి కెనడా శాశ్వత నివాస అనుమతులు జారీచేసింది.
దీని వెనుక కారణాలను మనం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. చాలా పశ్చిమ దేశాల తరహాలోనే కెనడా జనాభాలోనూ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు జననాల రేటు కూడా చాలా తక్కువగా ఉంటోంది. అంటే దేశం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లడానికి బదులుగా వెనక్కి వెళ్తోంది. అందుకే విదేశీయుల అవసరం ఎక్కువ అవుతోంది.
దేశంలోని కార్మిక శక్తి వృద్ధికి వలసదారులే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, 2032నాటికి వీరు దేశ జనాభా వృద్ధి రేటులోనూ కీలక పాత్ర పోషించబోతున్నారని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
జీ7లో మొదటి స్థానం
నేడు దేశంలోని ప్రతి నలుగురు పౌరుల్లో ఒకరు వలసదారుడిగానే దేశానికి వచ్చారు. జీ7 దేశాల్లో కెనడాలోనే ఈ రేటు ఎక్కువగా ఉంది. అమెరికాలో వలసదారులుగా వచ్చి పౌరులుగా స్థిరపడిన వారి వాటా నేడు జనాభాలో 14 శాతం వరకూ ఉంది.
బ్రిటన్‌లోనూ వలసదారుల జనాభా 14 శాతం వరకూ ఉంటుంది.
‘‘ఇక్కడ వసలదారులను ఆహ్వానించడంలో బ్రిటన్ వెనుకపడిందని అనుకోకూడదు. కెనడా కాస్త దూకుడుగా ముందుకు వెళ్తోంది’’అని అంటున్నారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని మైగ్రేషన్ అబ్జర్వేటరీ విభాగం డైరెక్టర్ మెడిలీన్ సంప్షన్ వివరించారు.
బ్రిటన్ ఒక చిన్న ద్వీపం లాంటిది. అయితే, జనాభా విషయంలో కెనడాతో పోలిస్తే, బ్రిటన్ జనాభా రెండు రెట్లు ఎక్కువ. కానీ, విస్తీర్ణం పరంగా ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఇక్కడ జనాభా పెరుగుదలకు అవకాశం ఉంది.
‘‘కెనడా తరహాలో తమ జనాభాను పెంచుకోవాలని ఎప్పుడూ బ్రిటన్ ప్రయత్నించనేలేదు’’అని మెడిలీన్ చెప్పారు.
నేడు కెనడా తరహాలో వృద్ధుల జనాభా పెరుగుదల, జననాల రేటు పడిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న చాలా దేశాలు వలసదారులపై ఆధారపడుతున్నట్లు మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు జాఫెరీ కేమెరాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఆందోళన?
‘‘ఇక్కడ దేశాలను కట్టడి చేసే అంశం ఏమిటంటే ప్రజలు వ్యక్తంచేసే ఆందోళనే’’అని జాఫెరీ చెప్పారు.
అమెరికాలో దక్షిణాది సరిహద్దుల నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిపోయింది. కొత్త ఉద్యోగాల కంటే ఈ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
బ్రెగ్జిట్‌కు ముందు తూర్పు యూరప్ ప్రాంతాలకు చెందిన వలసదారులు పెద్దయొత్తున బ్రిటన్‌కు వెళ్లిపోయారు. దీంతో బ్రిటన్ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ‘‘అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల అభిప్రాయాల్లో మార్పు వస్తోంది. ఎందుకంటే దేశంలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? లాంటి అంశాలను దేశాలు మెరుగ్గా నియంత్రించ గలుగుతున్నాయి’’అని మెడిలీన్ చెప్పారు.
అయితే, కెనడాలో ముందునుంచీ వలసదారులకు పెద్దయెత్తున స్వాగతం పలుకుతూ వచ్చారు.
‘‘దీనికి కారణం ఏమిటంటే, ఇక్కడి ప్రభుత్వం వలసలను మెరుగ్గా నిర్వహించగలదని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. పైగా ఇక్కడకు వచ్చినవారు కెనడా ప్రయోజనాల కోసం పనిచేశారు’’అని కేమెరాన్ అన్నారు.
అయితే, వలసదారులపై ఇక్కడ ఎలాంటి ఆందోళనా వ్యక్తం కావడంలేదని అనుకోవడానికి వీల్లేదు.
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా సరిహద్దుల్లో వలసలపై వివాదం నడుస్తోంది. ఈ అంశంపై రైట్ వింగ్ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా (పీపీసీ) 2019 ఎన్నికల్లో భారీగా చర్చలు కూడా చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..
నిజానికి కెనడాలో వలసదారులపై ఒక్కో ప్రాంతంలోని పౌరులు ఒక్కోలా అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
ఏడాదికి దాదాపు 5,00,000 మంది కొత్త వలసదారులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు.. క్యూబెక్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పందిస్తూ.. తాము ఏడాదికి 50,000 మంది కంటే ఎక్కువ మందిని ఆహ్వానించలేమని స్పష్టంచేసింది. క్యూబెక్ ప్రభుత్వానికి సొంతంగా వలసల విధానం కూడా ఉంది. ఇక్కడే దేశంలోని 23 శాతం జనాభా నివసిస్తారు. అంటే మొత్తం వలసదారుల్లో పది శాతం మందికే తాము అవకాశం కల్పిస్తామని క్యూబెక్ ఇప్పటికే స్పష్టంచేసింది.
క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లీగల్ట్ మాట్లాడుతూ.. వలసదారుల సంఖ్య పెరిగితే, ఇక్కడ ఫ్రెంచ్ భాష ప్రాబల్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
‘’50,000 మందిని ఆహ్వానించినప్పటికీ, ఫ్రెంచ్ పతనాన్ని మనం ఆపలేం’’అని ఆయన అన్నారు.
కెనడాలో జనాభా పెరుగుదలకు అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం జన సాంధ్రత ఎక్కువగా ఉంది. ప్రధాన నగరాలైన టొరంటో, వాంకూవర్ లాంటి ప్రాంతాల్లోనే దేశ జనాభాలో 10 శాతం నివసిస్తోంది. ఇక్కడ ఇప్పటికే ఇంటి ధరల సంక్షోభం వెంటాడుతోంది.
కొత్త వలసదారుల విధానం వల్ల ఇంటి ధరలు, సామాజిక సేవలపై ఎలాంటి ప్రభావం పడుతోందోనని లేగర్ అండ్ ద అసోసియేషన్ ఫర్ కెనడియన్ స్టడీస్ అధ్యయనంలో పాల్గొన్న 1537 మందిలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు మరీ దూకుడుగా ఉన్నాయని 49 శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. మరో 31 శాతం మంది మాత్రం ఆ సంఖ్య ఎక్కువేమీకాదని అభిప్రాయపడ్డారు.
కెనడా విధానం..
పశ్చిమ దేశాల్లో కెనడా స్థానం మరో విధానంగానూ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. కెనడాలోని శాశ్వత నివాసం పొందినవారిలో సగం మంది ఇక్కడికి రావడానికి నైపుణ్యాల వల్ల అవకాశం లభించింది. అంతేకానీ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి వీరికి శాశ్వత నివాసం ఇవ్వలేదు.
2025నాటికి ఈ వాటాను 60 శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి కెనడా వ్యవస్థ, విధానాలే కారణం అని కేమెరాన్ అన్నారు. 1960ల్లో ఒక్కో దేశానికి ఒక్కో కోటా చొప్పున కేటాయించే విధానానికి కెనడా స్వస్తి పలికింది. ఇక్కడ పాయింట్ల ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే మేలిమి నైపుణ్యాలు గల వారికి ఈ విధానం అవకాశం కల్పించింది. ఫలితంగా వీరు కెనడా ఆర్థిక వ్యవస్థకు మేలు చేయగలిగారు.
‘‘అవే విధానాలు నేటికీ కెనడా వలసల వ్యవస్థను నడిపిస్తున్నాయి’’అని బీబీసీతో కేమెరాన్ చెప్పారు.
ఈ విధానం చాలా ప్రత్యేకమైనది. అయితే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లు కూడా ఇంచుమించు ఇలాంటి విధానాలనే అనుసరిస్తున్నాయి.
బ్రిటన్‌లో శాశ్వత నివాసం పొందిన ప్రతి నలుగురిలో ఒకరికి ఇలా నైపుణ్యాల ఆధారంగా దేశంలో ఉండేందుకు అవకాశం దక్కింది. అమెరికాలో అయితే, ఇలా నివాస అనుమతులు పొందిన వారి వాటా 20 శాతం వరకు ఉంటుంది. అయితే, ఈ రెండు దేశాలు నైపుణ్యాలపై వచ్చే వలసదారులకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే స్పష్టంచేశాయి. అయితే, ఈ దేశాల్లో నైపుణ్యాలు ఉండే వారికి వారి ఉద్యోగ సంస్థలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.
కానీ, కెనడాలో అలా కాదు. జాబ్ ఉండే మీ పాయింట్లు పెరుగుతాయి. కానీ, ఇదేమీ తప్పనిసరి కాదు.
బ్రిటన్ కూడా ఇటీవల పాయింట్ల విధానానికి మారినట్లు మెడిలీన్ చెప్పారు. ‘‘అయితే, వాస్తవానికి మాత్రం ఇప్పటికీ పాత విధానమే అమలు అవుతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు ఉండే వలసదారులకే ఇక్కడ ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని ఆమె చెప్పారు.
లక్ష్యాలను కెనడా చేరుకోగలదా?
నైపుణ్యాలు గల, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడే వలసదారుల విషయంలోనే కాదు.. శరణార్థుల విషయంలోనూ కెనడా ముందు ఉంటోంది. 2021లో 20,428 మంది శరణార్థులకు కెనడా స్వాగతం పలికింది.
కెనడా లక్ష్యాలు చాలా భారీగా కనిపిస్తున్నాయి. అయితే, చరిత్రను పరిశీలిస్తే, కొన్నిసార్లు కెనడా తమ లక్ష్యాలను చేరుకోలేదు కూడా. 2021లో మొత్తంగా 59,000 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని కెనడా చెప్పింది. కానీ, వీరిలో మూడో వంతు వారికే ఆశ్రయం కల్పించింది.
కోవిడ్-19తో సరిహద్దులను మూసివేయడం వల్లే ఈ సంఖ్య తగ్గిందని సీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వలసల శాఖ మంత్రి సీన్ ఫ్రేసర్ చెప్పారు.
అయితే, 2023నాటికి 76,000 మంది శరణార్థులకు నివాసం కల్పించేందుకు కృషి చేయాలని కెనడా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















