డిజీహబ్: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఒకప్పుడు ఫోటోలు దిగాలంటే ప్రత్యేకించి తయారై ఫోటో స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చేది. ఇక వీడియో అంటే పెళ్ళిలాంటి భారీ శుభకార్యాలకు, అదీ తాహతున్న కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యేది.
కానీ, ప్రస్తుతం పేరుకి ఫోనే కానీ అచ్చంగా కెమెరాగానే ఎక్కువ వాడుతున్నాం. ఫోటోలు, వీడియోలు తీయడం చాలా మామూలైపోయింది.
ఇలా ఎడాపెడా తీసిన ఫోటోలు, వీడియోలకు మొబైల్‍లో స్టోరేజ్ సరిపోకపోతే గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లాంటి క్లౌడ్ స్టోరేజీలు సిద్ధంగా ఉన్నాయి.
పైగా సోషల్ మీడియా ప్లాట్‍ఫార్మ్స్ కూడా కేవలం టెక్స్ట్ మెసేజ్ కన్నా ఇమేజ్/వీడియో ఉన్న కంటెంట్‍కే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వాటికే లైక్స్, షేర్స్ ఎక్కువ వచ్చేలా చూస్తున్నాయి.
అందుకని మన ఫోటోలు షేర్ చేయాలన్న కోరిక పెరగడంలో వింత లేదు. అలానే వాటివల్ల కలిగే ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. అలా జరగకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
అప్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తం
ఫోటోలు/వీడియోలు ఏవి, ఎందుకు అప్‍లోడ్ చేస్తున్నామన్న విషయమై అవగాహన కలిగి ఉండాలి. దానికి తగ్గట్టు సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే, కేవలం చుట్టాలు, స్నేహితులు చూసేలా పెట్టాలి. అదే, అందరికీ తెలియాల్సిన విషయం గురించి అలెర్ట్ చేయాలనుకుంటే పబ్లిక్ సెట్టింగ్ పెట్టవచ్చు.
డిస్‍ప్లే పిక్చర్స్:
ఫేస్‌బుక్/ఇన్‍స్టా/ట్విట్టర్ లాంటి సైట్స్ డీపీలను ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోకుండా, స్క్రీన్‍షాట్స్ తీసుకోకుండా సెట్టింగ్ ఒకటి ఇస్తుంది. అది ఎనేబుల్ చేసుకోవాలి. ముఖ్యంగా, చిన్నపిల్లలతో, కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు అయితే, మీతో పాటు వారి ఫోటోలూ దుర్మార్గుల చేతిలో పడచ్చు.
పిల్లల ఫోటోలు పెట్టేటప్పుడు వారి మొహం సరిగ్గా కనపడకుండా, లేదా మొహాన్ని ఏదన్నా ఎమోజీతో దాచి అప్‍లోడ్ చేస్తే మేలు… ముఖ్యంగా పబ్లిక్ సెట్టింగ్‍తో పెట్టేవి.
డిస్‍ప్లే పిక్చర్స్ ఎవరు చూడవచ్చు అన్న సెట్టింగ్ ఒకటుంటుంది. ఉదా: వాట్సాప్ డీపీ మీ కాంటాక్ట్స్‌లో లేనివారికి కనిపించడం అంత శ్రేయస్కరం కాదు.
డీపీలను అదే పనిగా ఊరికూరికే మార్చకూడదు. ఇట్లా ఎప్పుడూ మారుస్తూ ఉంటే మీ ఫోటోలు ఎక్కువగా ఆయా సైట్లలో నిలిచిపోతాయి. పైగా ఇలా ఎక్కువసార్లు డిపీ మారుస్తున్నట్టు గమనించిన దుండగులు దాన్ని అనువుగా తీసుకుని కొత్త విధాలతో మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా పోస్టుల్లో పెట్టే ఫోటోలు/వీడియోలు
ఇంట్లో ఉండి తీసే ఫోటోలు, వీడియోల్లో వీలైనంత తక్కువ వివరాలు వచ్చేట్టు చూసుకోవాలి. ఉదా: మెయిన్ డోర్ దగ్గర నిలుచుని తీసుకున్న మీ ఫోటో, డోర్ లాకింగ్ సిస్టమ్ ఎలాంటిదో తెలిసేట్టు దిగారనుకోండి, అప్పుడు దుండగుల పని తేలికవుతుంది.
పండుగలు, పబ్బాలకు ఇంటికీ, వంటికీ అలంకరణలు తప్పనిసరి. అయితే, ఫోటోలు ఆన్‍లైన్‍లో పెట్టే ఉద్దేశం ఉంటే మాత్రం వీలైనంత తక్కువ ఆర్భాటం కనిపించేలా తీసుకుంటే మంచిది. ఉదా: శ్రావణ శుక్రవారాలు, కార్తీక మాసాల పూజలప్పుడు అలకరించిన దేవతా విగ్రహాలను ఫోటోలు అప్‍లోడ్ చేస్తుంటారు. ఆ నగలు, వెండి సామాను అంతా ఆన్‍లైన్‍లోకి వెళ్ళిపోయాక, దాన్ని ఎవరు చూస్తారో, ఎలాంటి హాని కలిగించడానికి వాడతారో చెప్పలేం. అందుకని పబ్లిక్ డొమైన్‍లో పెట్టేముందు ఒకసారి ఆలోచించాలి.
అలానే, ఈ మధ్య హోమ్ టూర్లనీ, టెర్రస్ గార్డెన్ లాంటి ఇంట్లోంచి చేసే హాబీ వీడియోలు ఎక్కువగా అప్‍లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలు తీసేటప్పుడు ఆన్‍లైన్ భద్రత గురించి పదేపదే ఆలోచించుకోవాలి. టెర్రస్ గార్డెన్ వీడియో టెర్రస్‍పైకి వెళ్ళి మొక్కల మధ్య ఉండగా మొదలవ్వాలి. అంతే కానీ, కిందనుంచి పైకి ఎలా వెళ్తే టెర్రస్ వస్తుందో చూపించకూడదు. ఇంట్లో ఉండి చేసే కుట్లు, అల్లికలు వీడియోలు అయినా, లేక రీల్స్ అయినా, ఏదో ఒకటిరెండు చోట్లను ఫిక్స్ చేసుకుని అక్కడే ఉండేలా చూడాలి. నేమ్‍ప్లేట్స్, హౌస్ నెంబర్, వీధి పేర్లు లాంటి వీడియోల్లో రాకుండా చూసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
రీల్స్, వీడియోస్‍లో గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం: వీడియో/ఫోటోలో కనిపించడానికి ఇష్టపడని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగువారిని, స్నేహితులను బలవంతంగా షూట్ చేయకూడదు. వాళ్ళ ప్రైవసీని గౌరవించాలి.
ఊర్లకి/వెకేషన్స్‌కి వెళ్ళే ముందు సోషల్ మీడియోలో “ఊరెళ్తున్నానోచ్” అని టైప్ హడావిడి స్టేటస్‍లు పెట్టకూడదు. వెకేషన్‍లో ఉన్నప్పుడే అక్కడి ఫోటోలు/వీడియోలు పంచుకోవాలని ఆరాటంగా ఉంటుంది కానీ, అవి మీరు ఇంటికి చాలా దూరంగా ఉన్నారన్న సంగతి కూడా బట్టబయలు చేస్తుంది. దీని వల్ల దొంగతనాలు లేదా ఇతర నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని వెకేషన్ ఫోటోలు ఇంటికి తిరిగొచ్చాక అప్‍లోడ్ చేయడం మంచి అలవాటు.
ఇమేజ్‍లు అప్‍లోడ్ చేసేటప్పుడు జియో-టాగింగ్ (ఎక్కడ తీసారో ఆ ప్రదేశం వివరాలు) తొలగించే సెట్టింగ్ ఎంచుకోవాలి. దీని వల్ల మీ ఫోటోల ద్వారా మీ లొకేషన్ బయటపడదు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టా వాడేటప్పుడు..
ఫేస్‌బుక్, ఇన్‍స్టా, ట్విటర్‌లో ఫోటో షేరింగ్ ఒకలా పనిజేస్తుంది. మనం అప్‍లోడ్ చేస్తున్నవి మనల్ని ఫాలో అయ్యేవాళ్ళందరికీ కనిపిస్తాయి. వాట్సాప్/మెసెంజర్/స్నాప్‌చాట్ లాంటి ఇన్‍స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌లో మనం ఎవరికి పంపిస్తామో ఆ వ్యక్తికో, గ్రూపుకో మాత్రమే కనిపిస్తాయి. అందుకని ఇక్కడ అన్ని జాగ్రత్తలు అవసరం లేదనిపిస్తుంది కానీ, ఇక్కడా అప్రమత్తంగా ఉండాలి.
సోషల్ మీడియాలో అయితే ఒకసారి అప్‍లోడ్ చేసిన ఫోటోని డిలీట్ చేస్తే అది మళ్ళీ ఎవరికి కనిపించదు. కానీ యాప్‌లలో ఒకసారి ఫోటో పంపేశాక, అది వాళ్ళ ఫోనుల్లోకి చేరిపోతుంది. దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు, ఉన్నా డిలీట్ చేసే లోపు వాళ్ళు దాన్ని వేరే విధంగా సేవ్ చేసుకుని ఉండచ్చు.
ఫోటోలు పంపేటప్పుడు ఏం చేయాలి?
- అవసరం అనిపించిన ప్రతీ ఫోటోకి “ఒకసారి చూడగానే డిలీట్ చేసేయ్” లాంటి సెట్టింగ్ ఏదన్నా ఉంటే (వాట్సాప్ ఇస్తుంది ఈ ఆప్షన్) దాన్ని వాడుకోవాలి. దీనివల్ల వాళ్ళ దగ్గరున్న కాపీని దుర్వినియోగం చేసే అవకాశాన్ని తొలగించవచ్చు.
- తెలియని వ్యక్తులు ఉండే గ్రూప్స్‌లో ఉండాల్సి రావచ్చు. (పెద్ద అపార్ట్మెంట్ సొసైటీ గ్రూప్, కాలేజీ పూర్వవిద్యార్థుల గ్రూప్) అలాంటి వాటిల్లో ఫోటోలు పంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
- సన్నిహితులతో ప్రైవేట్ ఫోటోలు పంచుకోడానికి యాప్‌లు సరైన వేదికల కావు. ఇక్కడి ఫోటోలను బ్లాక్‍మెయిలింగ్ కోసం వాడుకునే అవకాశం ఉంది.
మనకి తెలిసినవారికి, తెలియనివారికి సంబంధం లేకుండా సమాచారాన్ని పంచుకునే వీలు ఈ ఆన్‍లైన్ మాధ్యమాలు కలిపిస్తాయి. మన ఫోను డివైజుల్లో కూడా కెమెరా పనితనం రోజురోజుకీ మెరుగుపడుతుంది. ఇన్ని సౌలభ్యాలున్న మనం వీటిని ఉపయోగించుకోవడంలో అంతే జాగ్రత్త వహించాలి. బాధ్యతగా ప్రవర్తించాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















