అంతరిక్షం నుంచి భూమి మీదికి నేరుగా, వైర్లు లేకుండానే విద్యుత్తు - పరిశోధనలు ప్రారంభించిన అమెరికా, చైనా, బ్రిటన్, ఈయూ
అంతరిక్షం నుంచి భూమి మీదికి విద్యుత్తును నేరుగా, వైర్లు లేకుండానే ప్రసరింపజేసి, లక్షలాది ఇళ్లకు కరెంటు అందించవచ్చా? అంటే అది సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో తక్కువ ఖర్చుతో, భారీ సౌర క్షేత్రాలను పని చేయించవచ్చా అనే అంశంపై పరిశోధనకు నిధులు అందించే విషయాన్ని పరిశీలించనుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సోలారిస్ అని పిలిచే ఈ ప్రాజెక్ట్ కింద మూడేళ్ల పాటు అధ్యయనం జరుగుతుంది. మ్యూనిచ్ నుంచి బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ పల్లబ్ ఘోష్ అందిస్తున్న కథనం.
ఇదేదో సైన్స్ ఫిక్షన్‌లా కనిపిస్తోంది కదా!
ఒక్కసారి ఊహించుకోండి- సౌరశక్తినంతా బంధించడానికి రోబోట్లు పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేసి, ఆ శక్తిని మైక్రో వేవ్‌ల రూపంలో భూమిపైకి ప్రసరింపజేసి, విశాలమైన మైదానాల్లో ఏర్పాటు చేసిన అనేక యాంటీనాలు ఆ శక్తిని గ్రహించి విద్యుత్తుగా మార్చేస్తే ఎంత బాగుంటుందో కదా!
‘‘ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇదేదో చిన్న ప్రయోగమనో లేదా కాగితంపైన వేసిన లెక్కలనో అనుకోనక్కర్లేదు. ఇది చిన్నస్థాయిలో అమలుకు సిద్ధంగా ఉంది. అంతరిక్షం ఆధారిత సౌరశక్తి విషయంలో, ఆ స్థాయిలో, అంత భారీ శక్తిని, అనూహ్య రీతిలో విస్తరించడం ఎలా అన్నదే పెద్ద సవాల్. దానికి కొంత సమయం పడుతుంది. అది పెద్ద సవాలే అనడంలో సందేహం లేదు’’ అని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ప్రాజెక్ట్ లీడర్ సంజయ్ విజేంద్రన్ చెప్పారు.
మ్యునిచ్‌లోని ఈ పరిశోధకులు ఈ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు
ఏరోస్పేస్ కి చెందిన ఎయిర్ బస్ సంస్థలో ఈ ప్రయోగం జరుగుతోంది. 2 కిలోవాట్ల విద్యుత్‌ని సోలార్ ప్యానెల్స్ ద్వారా సేకరించి ఈ ట్రాన్స్‌మిటర్ సాయంతో ఈ గదిలోనే ఆ చివరికి ట్రాన్స్‌మిట్ చేశారు.
అంతరిక్షం నుంచి సౌరశక్తిని ప్రసారం చేయాలంటే- ఇక్కడ ఈ చిన్న ప్రదేశంలో చేసిన ప్రయోగాన్ని భారీ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. దీనికి మిలియన్ రెట్ల విద్యుత్తును ట్రాన్స్‌మిట్ చేయాల్సి ఉంటుంది. పది లక్షల సార్లు పంపించాల్సి ఉంటుంది. అయితే అది సాధ్యమే అని ఇక్కడున్న ఇంజినీర్లు భావిస్తున్నారు.
ఎనర్జీ శాటిలైట్ అనే భావనను విజయవంతంగా అభివృద్ధి చేస్తే, అవి రోజుకు 24గంటలూ సౌరశక్తిని సేకరిస్తాయి.
దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ పని చేయాలని కోరుకుంటున్నారు.
ఎందుకంటే భూమిపైన లభించే సౌరశక్తిలో అంతరాయాలుంటాయి. రాత్రి వేళల్లో లేదా మేఘాలు అడ్డుకుంటాయి. కానీ అంతరిక్షంలో రోజంతా సౌరశక్తిని ఉత్పత్తి చేయొచ్చు.
రాకెట్లను పదే పదే ఉపయోగించగలం కాబట్టి ఇప్పుడు దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే ఉండొచ్చు.
‘‘అంతరిక్షం నుంచి మనం ఇంకా చేయలేదు. కానీ ఒకవేళ చేయగలిగితే, అది నిజంగా ఓ అద్భుతం. రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోనున్న విద్యుత్ కొరతల్ని తీర్చడంలో అంతరిక్ష ఆధారిత సౌరశక్తి ఎంతగానో సాయపడుతుంది’’ అని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ ఏష్బాచర్ తెలిపారు.
అమెరికా, చైనా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే సొంతంగా పరిశోధనా కార్యక్రమాలు చేపట్టాయి.
ఒకవైపు విద్యుత్ ధరలు మండిపోతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పుల దుష్ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ తరుణంలో గతంలోకన్నా భారీ గ్రీన్ ఎనర్జీని అందించగల ఒక నమ్మకమైన కొత్త వనరు కోసం ప్రపంచ దేశాలు కృషిచేయాలనే ఒత్తిడి రోజు రోజుకూ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:
- తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మందిని కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా డీపీ ఎంతవరకు సేఫ్? సోషల్ మీడియాలో మీ ఫోటోల ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
- ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- తెలంగాణ - గద్వాల: ప్రసవం మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయారని ఆరోపణలు, పురిటిలోనే బిడ్డ మృతికి కారకులెవరు?
- ప్రపంచంలోనే బెస్ట్ క్లీనర్: 'ఇంట్లోని చెత్త నన్ను బర్గర్లా ఊరిస్తుంది'
- ఫేస్బుక్, ట్విటర్ల కథ ముగిసిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



