ఈ భారీ బిలాల రహస్యం ఏమిటి, హఠాత్తుగా భూమి ఎందుకు విస్ఫోటం చెందుతోంది?

ఫొటో సోర్స్, Evgeny Chuvilin
- రచయిత, రిచర్డ్ గ్యారీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఆర్కిటిక్ వలయంలోని ఒక మారుమూల పీఠభూమిలో అంతుచిక్కని పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.
హఠాత్తుగా భూమి ఇలా విస్ఫోటం ఎందుకు చెందుతుందో తెలియక శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు.
ఒక్కసారిగా ఇక్కడ భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత పెద్దపెద్ద బిలాలు కనిపిస్తున్నాయి.
రంధ్రానికి చివరన భూమి చీలినట్లుగా కనిపిస్తోంది. భూమి ఉపరితలానికి కింద ఉండే బూడిదరంగు మంచు, మట్టి పొరలు ఈ రంధ్రాల లోపలివైపు కనిపిస్తున్నాయి. పేలుడు అనంతరం పరిసరాల్లో కనిపిస్తున్న మొక్కల వేళ్లు బాగా కాలిపోయినట్లుగా ఉన్నాయి. వీటిని పరిశీలిస్తుంటే సైబీరియా ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు ఎంత భయానకంగా చోటుచేసుకుంటాన్నాయో తెలుస్తోంది.
పేలుడు వల్ల పరిసరాల్లోకి పెద్దయెత్తున ఎగసిపడుతున్న ధూళి కణాలు గాల్లో కనిపిస్తున్నాయి. గోళాకారంలో కనిపించే ఈ బిలాల లోపలకు చూస్తే, నల్లని రంగులో నీరు కూడా కనిపిస్తోంది.
ఈ బిలాలను పరిశీలించేందుకు ఇక్కడకు శాస్త్రవేత్తల బృందం చేరుకుంది. ఇలా వచ్చిన వారిలో మాస్కోలోని స్కోల్‌వోకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన జియాలజిస్టు ఎవెజెనీ చువిలిన్ కూడా ఉన్నారు. వాయువ్య సైబిరియాలోని యమల్ పీఠభూమిలో ఒక మారుమూల ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతున్న ప్రాంతాన్ని చూసేందుకు ఆయన వచ్చారు.

ఫొటో సోర్స్, Evgeny Chuvilin
ఎన్నో ప్రశ్నలు..
164 అడుగుల లోతులో కనిపిస్తున్న ఒక బిలాన్ని శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తోంది. యమల్ పీఠభూమిని ఆరేళ్ల నుంచీ వెంటాడుతున్న పేలుళ్ల మర్మం వెనుక ప్రశ్నలకు ఇది సమాధానాలు చూపించే అవకాశముంది.
యమల్ పీఠభూమిలోని బోబోనెన్‌కోవో గ్యాస్ ఫీల్డ్ నుంచి 26 మైళ్ల దూరంలోని ఈ బిలాన్ని 2014లో అటుగా వచ్చిన హెలికాప్టర్ పైలట్లు గుర్తించారు. అప్పట్లో ఇది 66 అడుగుల వెడల్పు, 171 అడుగుల లోతులో ఉండేది.
అసలు ఇలాంటి భారీ బిలాలను ఇదివరకెప్పుడూ ఇక్కడ తాము గమనించలేదని ఎర్త్ క్రయోస్పియర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చీఫ్ సైంటిస్ట్ మరియానా లీబ్‌మన్ చెప్పారు. ఆమె 40ఏళ్లుగా సైబీరియాలో మంచు, మట్టితో కలిసిన పెర్మాఫ్రోస్ట్ పొరలను అధ్యయనం చేస్తున్నారు.
జీఈసీ-1గా పిలుస్తున్న ఈ బిలానికి సంబంధించిన కొన్ని ఉపగ్రహ చిత్రాలను కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. దీంతో బహుశా 2013 అక్టోబరు 9 నుంచి నవంబరు 1 మధ్య ఈ బిలం ఏర్పడి ఉండొచ్చని వారు అంచనాకు వచ్చారు.
గత ఆగస్టులో రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ నిపుణులతో కలిసి సైన్స్ పర్యటనలో భాగంగా యమల్‌కు వచ్చిన కొంత మంది టీవీ సిబ్బంది ఒక కొత్త బిలాన్ని గుర్తించారు. దీంతో ఇప్పటివరకకు యమల్, పొరుగుతున్న గిడన్ పీఠభూమిలో ఇలా కనిపించిన బిలాల సంఖ్య 17కు పెరిగింది.

ఫొటో సోర్స్, Vasily Bogoyavlensky/OGRI RAS/Getty Images
అసలేం జరుగుతోంది?
మట్టి, మంచుతో కలిసిన ఇక్కడి భూమి పొరల్లో భారీ బిలాలు ఇంత వేగంగా ఎలా ఏర్పడుతున్నాయి? అనే ప్రశ్న అంతుచిక్కుండానే మిగిలిపోతోంది. ఇలాంటి బిలాలతో ఆర్కిటిక్ భవిష్యత్ ఏం అవుతుంది? ఇక్కడి ప్రజలు సురక్షితంగా జీవించడం ఎలా లాంటి ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి.
గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో భూమికి ఉత్తరాన ఉండే ఈ ప్రాంతాల్లో మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పడానికి ఇవి సంకేతాలు లాంటివని ఇక్కడి పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, తాజాగా చేపట్టిన పరిశోధన ఇక్కడ ఏం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నించింది. భూమి కుంగిపోవడం వల్ల లేదా మంచు కరగడం వల్ల ఈ బిలాలు ఏర్పడలేదనేది మాత్రం సుస్పష్టం. ఇవి కచ్చితంగా విస్ఫోటాలేనని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘ఈ పేలుడు జరిగేటప్పుడు మట్టి, మంచుతో కలిసి రాళ్లు కొన్ని వందల మీటర్ల వరకు వెళ్లి పడుతున్నాయి. భూమిలో విపరీతమైన ఒత్తిడి వల్లే ఈ పేలుళ్లు సంభవిస్తున్నాయి. కానీ, అంత ఒత్తిడి ఎలా పేరుకుంటోందో అసలు అర్థం కావడం లేదు’’అని చువిలిన్ చెప్పారు.
ఇక్కడి బిలాల నుంచి నమూనాలు, కొలతలు తీసుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న శాస్త్రవేత్తలతో చువిలన్ బృందం కలిసి పనిచేస్తోంది. అసలు టండ్రా కింది పొరల్లో ఏమి జరుగుతుందోనని వీరంతా అధ్యయనం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Sylvia Buchholz/Alamy
వోల్కనోలా?
కొంతమంది శాస్త్రవేత్తలు ఈ బిలాలను క్రయోవోల్కనోల వల్ల ఏర్పడే బిలాలతో పోలుస్తున్నారు. క్రయోవోల్కనోలు లావాకు బదులుగా మంచును వెదజల్లుతాయి. ప్లూటోతోపాటు శనిగ్రహ చందమామ టైటన్, మరుగుజ్జు గ్రహం సెరెస్‌లపై ఇలాంటి బిలాలు కనిపిస్తాయి. అయితే, ఆర్కిటిక్ బిలాలను మాత్రం ‘‘గ్యాస్ ఎమిషన్ క్యాటర్లు’’గా పిలుస్తున్నారు. ఈ పేరును పరిశీలిస్తుంటే అసలు ఈ బిలాలు ఎలా ఏర్పడ్డాయో కొంతవరకు అవగాహన చేసుకోవచ్చు.
‘‘ఉపగ్రహ చిత్రాలను పరిశీలించినప్పుడు పింగోలుగా పిలిచే మట్టి, మంచుల దిబ్బ స్థానంలో పేలుడు తర్వాత ఈ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది’’అని చువ్లిన్ చెప్పారు. పింగోలు అనేవి గుమ్మటం ఆకారంలో కనిపించే చిన్న పర్వతాలు లాంటివి. భూమి కింద పొరలు ఆ పైభాగాన్ని ఇంకాస్త పైకి నెట్టినప్పుడు ఇవి ఏర్పడతాయి. దీని కింద ఒకప్పుడు సాఫీగా ప్రవహించి నీరు గడ్డకట్టడంతో ఈ పరిణామం సంభవిస్తుంది.
అలా నీరు క్రమంగా గడ్డకడుతున్నప్పుడు మరింతగా ఆ పొర పైకి లేస్తుంది. అలా అక్కడ ఒక చిన్న కొండలా ఏర్పడుతుంది. వీటినే రష్యాలో ‘‘బల్జునియఖ్స్’’గా పిలుస్తారు. ఇవి సీజన్లకు అనుగుణంగా పైకిలేస్తూ లేదా కుంగిపోతూ ఉంటాయి. కెనడాలో ఇలాంటి 1200 ఏళ్లనాటి చిన్నచిన్న కొండలు కూడా కనిపిస్తాయి. అయితే, ఆర్కిటిక్‌లో ఇలాంటివి ఎక్కువగా కుంగిపోతుంటాయి. విస్ఫోటం అనేది ఎక్కడా కనిపించదు.
వాయువ్య సైబీరియాలోని ఈ ప్రాంతాల్లో మార్పులు కాస్త భిన్నంగా చోటుచేసుకుంటున్నాయి. ‘‘ఇవి పైకిలేవడం చాలా వేగంగా జరిగిపోతోంది. చాలా వేగంగా ఇవి మీటర్ల ఎత్తుకు పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా విస్ఫోటం చెందుతున్నాయి’’అని చువ్లిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Greg Fiske
గ్యాస్ కారణమా?
అయితే, ఇక్కడ భూమి కింద పొరల్లో నీరు గడ్డకట్టడానికి బదులుగా గ్యాస్ వల్ల ఇలా పైపొరలు పైకివస్తున్నట్లుగా కనిపిస్తోంది.
‘‘పింగోలు ఏర్పడటానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. పైగా అవి అలానే చాలా కాలం కనిపిస్తాయి’’అని మసాచుసెట్స్ వుడ్‌వెల్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ ఆర్కిటిక్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఆర్కిటిక్ ఎకాలజిస్టు స్యూ నటాలి చెప్పారు. ‘‘కానీ, గ్యాస్‌తో నిండిన ఈ పింగోలు కొన్ని సంవత్సరాల కాలంలోనే ఏర్పడుతున్నాయి’’అని ఆమె చెప్పారు.
2014లో వెలుగులోకి వచ్చిన తొలి బిలం పరిసరాలోని చెట్లను పరిశీలించినప్పుడు, 1940 తర్వాత ఇక్కడ భూమిలో విపరీతమైన ఒత్తిడి పేరుకుంటున్నట్లు తెలుస్తోంది. భూమి పైపొరల్లో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.
‘‘గ్యాస్ వల్ల బిలాలు చాలా వేగంగా ఏర్పడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. బహుశా మూడు నుంచి ఐదేళ్లలోనే ఇవి ఏర్పడొచ్చు’’అని రష్యాలోని లొమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ క్రయోలిథాలజిస్టు అలెగ్జాండర్ కిజియాకోవ్ అన్నారు. 2017 నవంబరులో ఏర్పడిన సెయెక్-జీఈసీగా పిలిచే బిలానికి పరిసరాల్లోని ఉపగ్రహ చిత్రాలను పరిశీంచినప్పుడు 2015లో ఇక్కడి నేల కింద భాగంలో మార్పులు మొదలైనట్లు తేలింది.
ఇలా గ్యాస్ వల్ల ఏర్పడిన కొన్ని బిలాలు కారా సముద్రానికి కిందుండే నేలపైనా కనిపిస్తాయి. ఇవి యమల్ పీఠభూమికి సమీపంలోనే ఉన్నాయి. మరోవపు బారెంట్స్ సముద్రంలోనూ ఇలాంటివి మనం చూడొచ్చు. అయితే, ఆర్కిటిక్ భూభాగంలో మిగతాచోట్ల ఇలాంటి ఎక్కడా కనిపించవని నటాలి చెప్పారు.
యమల్, గిడన్‌లలోని భూమిలో మార్పుల వల్లే ఈ చిన్నచిన్న దిబ్బల్లాంటి ప్రాంతాలు పేలుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ‘‘ఇక్కడి నేల పైపొరలు కాస్త భిన్నమైవి. ఇక్కడ చాలా దట్టంగా మంచు పేరుకుని ఉంటుంది. దీన్నే ట్యాబులర్ ఐస్‌గా పిలుస్తారు. మంచు, మట్టితో కలిసిన పెర్మాఫ్రాస్ట్‌పై ఇది కనిపిస్తుంది. క్రయోపెగ్ లాంటి ప్రాంతాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవి పెర్మాఫ్రాస్ట్‌కు చుట్టుపక్కల ఉండే గడ్డకట్టని ప్రాంతాలు. దీన్ని ఒక పెర్మాఫ్రాస్ట్ శాండ్‌విచ్‌గా చెప్పుకోవచ్చు. ఆ మధ్యలోనే గ్యాస్, చమురు నిక్షేపాలు కూడా ఉంటాయి’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Vasily Bogoyavlensky/Getty Images
చెరువు ఎండిపోయి..
చువ్లిన్ తాజాగా పరిశీలించిన వాటిలో ఎర్కుటా బిలం ఒకటి. ఇక్కడ 66 అడుగుల లోతులో గొయ్యి కనిపిస్తోంది. ఇక్కడికి సమీపంలోనే ఎర్కుటా నది ప్రవహిస్తుంది. ఈ నది వల్ల ఏర్పడిన ఒక చెరువు ఎండిపోవడంతో ఇక్కడ భూమికంద గడ్డకట్టడని నీరు మిగిలింది. దీన్ని టలిక్‌గా పిలుస్తారు. ఆ తర్వాత ఇక్కడ గ్యాస్ పేరుకుంది. అయితే, అసలు గ్యాస్ ఎలా వచ్చిందో తమకు తెలియడం లేదని చువ్లిన్ అన్నారు.
‘‘ఈ పరిశోధనలో ప్రధానమైన అంశం ఏమిటంటే, పెర్మాఫ్రాస్ట్ కింద పేరుకుంటున్న గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది. అయితే, ఇక్కడ బిలం ఏర్పడే వరకు వచ్చిందంటే.. గ్యాస్ పూర్తిగా బయటకు పోతుంది’’అని చువ్లిన్ అన్నారు.
అసలు దిబ్బల్లాంటి ఈ ప్రాంతాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఇక్కడ గ్యాస్ ఎలా పేరుకుంటోంది? లాంటి అంశాలు తెలుసుకునే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘అయితే, ఇక్కడ ముందెన్నడూలేని విధంగా భూమిపొరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని ముందెన్నడూ మనం ఊహించుకోలేదు కూడా’’అని నటాలీ చెప్పారు.
బిలాలకు అడుగున నేలను కూడా పరిశోధకులు పరిశీలించారు. ఇక్కడ నీటిలో మీథేన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బహుశా కింద నుంచి గ్యాస్ బుడగల రూపంలో రావడమే దీనికి కారణం అయ్యుండొచ్చు.
పెర్మాఫ్రాస్ట్ కింద భారీ స్థాయిలో ఉండే మీథేన్ గడ్డకట్టని భూభాగం వరకు చేరుకోగలుగుతోందని దీని వెనుక కారణాలను కొందరు పరిశోధకులు వివరిస్తున్నారు. ‘‘ఇక్కడి నీటిలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంటుంది. అయితే, నీరు గడ్డకట్టడం మొదలైనప్పుడు ఈ గ్యాస్ బయటకు వస్తుంది’’అని మరికొందరు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Alexander Nemenov/Getty Images
మంచు నుంచి కూడా మీథేన్
అయితే, ఇక్కడ మంచు నుంచి కూడా మీథేన్ విడుదల కావొచ్చు. పెర్మాఫ్రాస్ట్‌లోని మంచినీటి స్ఫటికాల్లో గ్యాస్ పేరుకొని ఉండొచ్చు. ఇలానే గ్యాస్ హైడ్రేట్లు ఏర్పడతాయి. మంచు కరిగినప్పుడు ఈ గ్యాస్ బయటకు వస్తుంది.
‘‘అసలు ఈ గ్యాస్ కనిపించడం వెనుక రెండు, మూడు పరిణామాలు కూడా ఉండొచ్చు. ఇవన్నీ భూమి పైపొరలు, పర్యావరణం మీద ఆధారపడి ఉంటాయి’’అని చువ్లిన్ అన్నారు.
గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చేటప్పటికీ, భూగర్భంలోని గడ్డకట్టని ప్రాంతాల్లో ఇది పేరుకుంటోంది. ఆ తర్వాత పైపొరలను ఇది మరింత పైకి నెడుతోంది. ఒక్కోసారి ఇది 16 నుంచి 19 అడుగుల ఎత్తువరకు పైకి లేస్తోంది.
విస్ఫోటం చెందినప్పుడు ఇది అద్భుతంగా కనిపిస్తుంది. గ్యాస్‌కు పైనుండే బురద, మట్టి, మంచు దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడతాయి. దాదాపు మూడు అడుగుల పరిమాణంలో మట్టి ముద్దలు కూడా ఎగురుకుంటూ వెళ్తాయంటే అక్కడ ఒత్తిడి ఏ మేరకు పేరుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
2017 జూన్‌లో ఒక విస్ఫోటం తర్వాత, మంటలు, పొగ కూడా కనిపించాయని మియుద్రియాఖ్ నది సమీపంలో జీవించే స్థానికులు చెప్పారు. ఈ బిలానికి దాదాపు 33 కిమీ. దక్షిణాన ఉండే గ్రామస్థులు.. దాదాపు 90 నిమిషాలపాటు మంటలు చెలరేగాయని, ఇవి దాదాపు 13 నుంచి 16 అడుగుల ఎత్తులో కనిపించాయని వివరించారు.
ప్రజలకు ప్రమాదమా?
ప్రజలు చాలా తక్కువగా జీవించే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. అయితే, గ్రామాలకు సమీపంలో జరిగే విస్ఫోటాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పెర్మాఫ్రాస్ట్‌కు కిందుండే శిలాజ ఇంధనాలను ఇక్కడి నుంచి తరలించేందుకు ఈ ప్రాంతంలో భారీగా చమురు, గ్యాస్ పైప్‌లైన్లు కూడా ఏర్పాటుచేశారు.
‘‘ఈ విస్ఫోటాల వల్ల ఆర్కిటిక్‌లో జీవించే ప్రజల మనుగడ ప్రమాదంలో పడుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం’’అని నటాలీ అన్నారు. దీని కోసం ఆమె ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్నారు.
‘‘మొదట చిత్రాల్లో ఒక బిలం లాంటిది కనిపించిన వెంటనే.. అసలు ఇది ఎప్పుడు అక్కడ కనిపించడం మొదలైంది? అని గత ఫోటోలను మేం పరిశీలిస్తాం. దీంతో విస్ఫోటం ఎప్పుడు జరిగిందో తెలుస్తోంది’’అని ఆమె వివరించారు. అయితే, వీరి పరిశోధనలో అంచనా వేసిన దానికంటే ఎక్కువ బిలాలు ఇక్కడ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ‘‘మేం కొత్తగా మరో రెండు బిలాలను గుర్తించాం. 2013లో అసలు దీని గురించి మనకు ఏమీ తెలియదు. ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులోకి వస్తోంది’’అని ఆమె చెప్పారు.
మూడో బిలాన్ని కూడా ఫిబ్రవరి 2021లో నటాలీ బృందం గుర్తించింది. మొత్తంగా వీరు 17 బిలాలను గుర్తించారు. అయితే, ఈ విస్ఫోటాలకు గ్యాస్ కారణం కాకపోవచ్చని వీరు భావిస్తున్నారు. ‘‘నేరుగా మనం అక్కడికి వెళ్లి చూసేవరకు దేనిపైనా ఒక అవగాహనకు రాలేం’’అని ఆమె అన్నారు.
భూభాగంలో వేగంగా మార్పులు చేసుకుంటున్న మరికొన్ని ఇక్కడి ప్రాంతాలను కూడా నటాలీ బృందం గుర్తించింది. 1984 నుంచి 2007 మధ్య ఇక్కడి మొత్తం భూభాగంలో ఐదు శాతం ప్రాంతాల్లో మార్పులు వచ్చినట్లు వీరు భావిస్తున్నారు.
బిలాలను వేగంగా గుర్తించేందుకు ఒక అల్గారిథమ్‌లను అభివృద్ధి చేసేందుకు నటాలీ బృందం పనిచేస్తోంది. దీని కోసం సరిపడా సమాచారాన్ని వీరు సేకరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా విస్ఫోటాలకు ముందే మనం ఆ ప్రాంతాలను గుర్తించే అవకాశముందని ఆమె అంటున్నారు.
‘‘విస్ఫోటాలకు ముందే మనం వాటిని గుర్తించే రోజు వస్తుంది’’అని నటాలీ చెప్పారు. ‘‘చుట్టుపక్కల జీవించే ప్రజలు, పైప్‌లైన్లు, చమురు, గ్యాస్ నిక్షేపాలను దీని ద్వారా ముందుగానే మనం కాపాడుకోవచ్చు’’అని ఆమె వివరించారు.
వాతావరణ మార్పులు కారణమా?
ఈ బిలాలు, ఆ పరిసరాల మధ్య సంబంధంపైనా ప్రస్తుతం పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. దీని వల్ల విస్ఫోటానికి ముందుగానే ఆ ముప్పు ఉండే ప్రాంతాలను అంచనా వేయొచ్చు. వాయువ్య సైబీరియాలో కనిపిస్తున్న ఈ బిలాలకు ఆర్కిటిక్‌పై వాతావరణ మార్పుల ప్రభావంతో సంబంధం ఉండొచ్చని కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ. ఫలితంగా పెర్మాఫ్రాస్ట్‌లోని మంచు కరిగిపోతోంది. ఇక్కడ వేసవి నిడివి కూడా పెరుగుతోంది. ఫలితంగా భూభాగంలో చాలా మార్పులు వస్తున్నాయి. కొన్నిచోట్ల భూమి కుంగిపోవడం, మరికొన్ని చోట్ల పైకిరావడం లాంటివి జరుగుతున్నాయి.
‘‘భూమి పైపొరల్లో ఇంత వేగంగా మార్పులు మరెక్కడా కనిపించడం లేదు’’అని నటాలీ అన్నారు.
ఆర్కిటిక్ పెర్మాఫ్రాస్ట్‌లో పెద్దమొత్తంలో కార్బన్ నిల్వ ఉంది. మన వాతావరణంలో మొత్తం కార్బన్ కంటే ఇక్కడ నిల్వ ఉండేది రెండు రెట్లు ఎక్కువ. ఇదంతా జంతువులు, మొక్కల కళేబరాల రూపంలో నిల్వ ఉంది. మరోవైపు మంచు స్ఫటికాల్లో మీథేన్ హైడ్రేట్లు కూడా ఉంటాయి.
భూమి పైపొరల్లో మంచు కరిగేటప్పుడు ఇక్కడి జంతువులు, మొక్కల కళేబరాల్లో సూక్ష్మజీవుల చర్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా మరింత మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి..
పెర్మాఫ్రాస్ట్ నుంచి విడుదలయ్యే మీథేన్.. భూతాపానికి కూడా కారణం అవుతుంది. ఫలితంగా మంచు మరింత వేగంగా కరుగుతుంది.
కానీ, యమల్‌లో ఈ బిలాలు, విస్ఫోటాలు మరిన్ని ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
‘‘ఈ బిలాలను చూస్తుంటే ఏదో షాక్ తగిలినట్లుగా అనిపిస్తోంది. ఇక్కడి భూమిలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆందోళను కలిగిస్తున్నాయి. ఇక్కడ కొన్ని విస్ఫోటాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. మరికొన్ని చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. అయితే, వీటి వల్ల పరిసరాల్లో గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణం ఎలా మారుతుందనే అంశంపై లోతైన పరిశోధన జరగాలి’’అని ఆమె అన్నారు.
యమల్‌లో ఈ భారీ బిలాల మర్మం ఇప్పటికీ పూర్తిగా అంతుచిక్కలేదు. అయితే, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలను పరిశీలిస్తుంటే.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మనం వీటిని జాగ్రత్తగా పరిశీలించాలని అర్థమమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి.. ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















