2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి? ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా?

2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి? ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరేళ్ల క్రితం వెనక్కి వెళితే.. సరిగ్గా ఇవే రోజుల్లో మనమంతా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలలో నిలబడ్డాం.

ఏటీఎంలలో వంద, రెండువేల నోటు మాత్రమే వచ్చేవి.

రెండు వేల నోట్లైతే ఒక్కొక్కరికి రెండే వచ్చేవి.

ఆ రెండు నోట్ల కోసం గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నారు జనం.

కొంతమంది క్యూలో ప్రాణాలు కూడా కోల్పోయారు.

అప్పట్లో అందరి చేతుల్లోనూ కొత్తగా కనిపించిన రెండు వేల రూపాయల నోటు.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

ఆ నోట్లన్నీ ఏమయ్యాయి? నల్లధనం అంతా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో పోగు పడుతోందన్న ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా?

2016 నవంబర్ 8 నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. దేశ ఆర్థికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.

డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయి. క్యాష్ వాడకం ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి చేరుకుంది.

రెండు పెద్ద నోట్ల రద్దు తర్వాత అంతకన్నా పెద్దదైన 2వేల నోటు ఉనికిలోకి వచ్చింది.

ఆరేళ్ల కింద నగదు లావాదేవీల్లో కీలకంగా మారిన పింక్ నోట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

‘రెండు వేల నోటా.. చూసి చాలా రోజులైంది’ అన్నారు హైదరాబాద్‌లోని కొత్త పేటలో కిరాణా కొట్టు నడిపే రాఘవ.

2 వేల రూపాయల నోట్ల ముద్రణ ఆపేసిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం రెండు వేల రూపాయల నోట్ల సరఫరా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ – బెంగళూరు, నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్, బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్‌ల నుంచి జరుగుతుంది.

అయితే, 2019 నుంచి ఇప్పటి వరకూ పింక్ నోట్ ఒక్కటి కూడా ముద్రించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మధ్యే ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

2016 నుంచే ఒక వ్యూహం ప్రకారం ఆర్బీఐ పింక్ నోట్ల ప్రింటింగ్‌ను తగ్గిస్తూ వస్తోందని కేంద్ర బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది.

2017 మార్చ్ 31 నాటికి ఆర్థిక వ్యవస్థలో 50.2 శాతం పింక్ నోట్ల వాటా.. ఈ ఏడాది మార్చ్ 31 నాటికి అది 13.8 శాతానికి పడిపోయింది.

వీడియో క్యాప్షన్, ఆర్థిక వ్యవస్థ నుంచి క్రమంగా కనుమరుగవుతున్న 2వేల రూపాయల నోటు

ఆ 2 వేల రూపాయల నోట్లన్నీ ఎటు పోయాయి?

  • 2వేల రూపాయల నోట్లు అసలు చలామణిలో ఉన్నాయా?
  • ఈ నోటుని కూడా కేంద్రం రద్దు చేస్తుందా?
  • మార్కెట్‌లో పింక్ నోట్లన్నీ నల్లధనంగా మారి బడాబాబుల ఇనప్పెట్టెల్లోకి చేరిపోయాయా?

సామాన్యుల్లో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి.

2016తో పోలిస్తే ఈ నోట్ల వాడకం, అవి కనిపించడం తగ్గిందన్నది వాస్తవం.

దీనికి ప్రధాన కారణం ముద్రణ ఆగిపోవడం.

మరో కారణం.. ఆర్బీఐ ఈ నోట్లను వెనక్కి తీసుకుంటూ ఉండటం.

2020లో రెండు వేల రూపాయల నోట్లు మొత్తం 274 కోట్లు చలామణిలో ఉంటే ఈ అర్థిక సంవత్సరంలో ఆ నోట్ల సంఖ్య 214 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది.

2 వేల నోటు నల్లధనంగా మారుతోందా?

మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుకు కారణాలుగా చెప్పిన వాటిలో నల్లధనాన్ని అరికట్టడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైంది.

కానీ, ముఖ్యంగా గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో అధికారులకు సోదాల్లో దొరికిన నగదులో ఎక్కువగా రెండు వేల నోట్ల కట్టలే ఉన్నాయి.

నగదును పెద్ద మొత్తంలో దాచేందుకు రెండు వేల రూపాయల నోటు అనువుగా మారిందన్నది స్పష్టం.

అలాగే నల్లధనాన్ని నిల్వ చేస్తున్న వారు దాన్ని రెండువేల నోట్ల రూపంలో దాచే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణుడు సూర్య నారాయణ తెలిపారు.

పింక్ నోట్ల చలామణి తగ్గుతున్న తీరును చూస్తుంటే.. కేంద్ర బ్యాంక్ దీన్ని దీర్ఘకాలం కొనసాగించే ఆలోచన లేదేమో అనిపిస్తోందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరాసేన్ అన్నారు.

బ్యాంకులు కూడా చిన్న డినామినేషన్ల నోట్లనే అడుగుతున్నాయని.. 2వేల నోటుని సామాన్య ప్రజలు పెద్దగా కోరుకోవడం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేస్తున్న సొనాల్ బంధన్ మనీ కంట్రోల్ వార్తా సంస్థ ప్రతినిధితో చెప్పారు.

2 వేల నోటు పూర్తిగా కనిపించకుండా పోతుందా?

ఫొటో సోర్స్, Getty Images

2 వేల నోటు పూర్తిగా కనిపించకుండా పోతుందా?

డిజిటల్ లావాదేవీలు పెరిగినా.. దేశ ఆర్థికవ్యవస్థలో ఇప్పటికీ నగదు చలామణీదే పైచేయి.

ఈ ఏడాది మార్చ్ 18 నాటికి దేశంలో 31.05 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉంది.

నగదు వాడకంలో ఇది ఆల్ టైమ్‌ హై రికార్డు.

ఈ లెక్కలు చూస్తే... రెండు వేల రూపాయల నోటుని మళ్లీ ముద్రించాల్సిన అవసరం కనిపించడం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.

మరోవైపు నకిలీ 2వేల నోట్ల ముద్రణ కూడా ఎక్కువగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయల నకిలీ నోట్ల ముద్రణ 55 శాతం పెరిగినట్లు కేంద్ర బ్యాంక్ గుర్తించింది.

రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయకపోయినా.. క్రమంగా ఆర్ధిక వ్యవస్థలో వాటి వాడకాన్ని తప్పించే పని ప్రణాళికాబద్దంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)