గాడిద పాలతో కోటి రూపాయల వ్యాపారం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

గాడిద పాలు
    • రచయిత, శంకర్ వడిసెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వ్యాపారం మీద మోజుతో కొత్త దారి పట్టారు. కొంత భిన్నంగా ఆలోచించారు. 

అందరూ నడిచే దారిలో కాకుండా నూతన మార్గం అన్వేషించారు. గాడిదల పెంపకానికి చేపట్టారు. గాడిదలను మేపి, వాటి పాలతో వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడా పాలను అమ్మేందుకు ప్రత్యామ్నాయాలు కూడా వెదుకుతున్నారు.

100కు పైగా గాడిదలతో ఫారం ఏర్పాటు చేశారు.

ప్రారంభంలో గాడిదలతో ఫారం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఏడాదిగా నడుస్తున్న తమ గాడిదల ఫారం సక్సెస్ బాట పడుతుండడం తమకు సంతృప్తినిస్తోందని నిర్వాహకులు అంటున్నారు.

గాడిదల నుంచి తీసిన పాలు అమ్మకం ద్వారా తమ టర్నోవర్ కోటి రూపాయలకు చేరుతోందని చెబుతున్నారు.

అక్షయ డాంకీ ఫారం పేరుతో నడుపుతున్న ఈ సంస్థను మరింత విస్తరించే ఆలోచన చేస్తున్నామంటున్నారు.

అసలింతకీ గాడిద పాలు అమ్మి, కోటి రూపాయలు ఎలా సంపాదించారని ఆశ్చర్యపోతున్నారు కదూ... వీళ్ల అనుభవం అలా ఉంది మరి.

విదేశాల్లో చూసి...

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన పీవీవీ రమణ, కిరణ్ కుమార్, నవ్య ముగ్గురూ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం రమణ, కిరణ్ ఇంకా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉండగా, నవ్య మాత్రం దిల్లీ ఐఐటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 

వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా వెళ్లినప్పుడు గమనించిన దానిని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకుని వీరు గాడిదల ఫారం వైపు అడుగులు వేశామని చెబుతున్నారు. 

"విదేశాల్లో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. ఎక్కువ మంది దాని కోసం ఆసక్తి చూపుతున్నారు. చాలా కారణాలతో గాడిద పాల పట్ల అక్కడ మోజు ఉందని గమనించాం. అక్కడే కాదు, మన ప్రాంతంలో కూడా గాడిద పాలకు గిరాకీ ఉందని తేలింది. అందుకే గాడిదలను పెంచాలని నిర్ణయించుకున్నాం. అన్నింటినీ పరిశీలించాం. యూపీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దేశవాళీ జాతులతో పాటుగా ఇథియోపియాకి చెందిన జాతి గాడిదలను తీసుకొచ్చాము. ఏడాదిగా ఫారం నడుస్తోంది. మరింత విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాం" అని పీవీవీ రమణ బీబీసీకి తెలిపారు. 

రాజానగరం మండలం మల్లెంపూడిలోని తమ సొంత పొలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ గాడిదల ఫారం ఏర్పాటు చేశారు. గాడిదల పాలకు ఉన్న డిమాండ్‌ని అనుసరించి కొత్త పద్ధతుల్లో వాటిని విక్రయించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. 

ఒకవైపు తమ ఉద్యోగాలు తాము చేసుకుంటూ మరోవైపు గాడిదల ఫారం నిర్వహణ సాగిస్తున్నారు.

గాడిద పాలు
ఫొటో క్యాప్షన్, రమణ

పాలతో పౌడర్...

గాడిద పాలను ప్రస్తుతం లీటర్ రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకూ అమ్ముతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యూటీ టిప్స్ కోసం వినియోగించే కాస్మోటిక్స్ కంపెనీలకు ఎక్కువగా గాడిద పాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. బ్యూటీ పార్లర్లు, స్పాలకు కూడా సరఫరా చేస్తున్నామని అంటున్నారు. 

"గాడిద పాలు కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ ఖరీదు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉంచడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయలేకపోతున్నారు. అందుకే పాలను ట్రెట్రా ప్యాక్‌లలో అందించాలని అనుకుంటున్నాం. 50 మిల్లీ లీటర్ల ప్యాకెట్లు చేస్తే ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. దాంతో పాటుగా పాలు పౌడర్‌కి మంచి అవకాశం ఉంది. విదేశాల్లో ఆ రీతిలోనే అమ్ముతున్నారు. అందుకే మేం కూడా వాటిని పౌడర్ రూపంలో ప్యాకెట్ల ద్వారా అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాం. అందుకోసం సన్నాహాలు చేస్తున్నాం. మాకు రోజుకి 15 లీటర్ల వరకూ పాలు వస్తున్నాయి" అంటూ రమణ వివరించారు. 

ఎక్కువ సంస్థల నుంచి ఆర్డర్లు వస్తున్నప్పటికీ తాము అందించలేకపోతున్నందున దానికి అనుగుణంగా పాలను ఇతర రూపాల్లో మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

గాడిదల యూరిన్‌తో పాటు పేడ అమ్మడం ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుందని తెలిపారు.

గాడిద పాలు

కర్ణాటకలో శిక్షణ..

అక్షయ గాడిదల ఫారం ఏర్పాటు చేయడానికి ముందు అనేక అంశాలను తాము పరిశీలించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అందులో భాగంగానే కర్ణాటకలో గాడిదల ఫారం నిర్వహణపై శిక్షణా కేంద్రంలో తాము అనేక అంశాలు నేర్చుకున్నామని తెలిపారు. అక్కడ అందించిన సర్టిఫికెట్, నేర్పిన అంశాలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాారు. 

ప్రస్తుతం నవ్య తన విద్యాభ్యాసం కోసం దిల్లీలో ఉండగా, కిరణ్ బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు. రమణ వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ ఫారం సమీపంలో ఉంటున్నారు. ఫారం నిర్వహణకు సంబంధించిన అంశాలు రమణ పర్యవేక్షిస్తున్నారు. 

రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు కొంత మంది కూలీలను పెట్టారు. గతంలో గాడిదల పెంపకంలో అనుభవం ఉన్న వారిని పనిలో పెట్టుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన అప్పలప్ప అనే వ్యక్తి గాడిదల ఫారంలోని గాడిదలకు సంబంధించిన పోషణ, నిర్వహణ చూస్తున్నారు. 

"గాడిదలకు ఉదయాన్నే పాలు తీసిన తర్వాత గడ్డి కోసం తోలుకెళతాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత శుభ్రం చేసి గడ్డి వేసి ఉంచుతాం. ఎప్పుడయినా వాటిలో సమస్యలున్నాయని తెలిస్తే వెటర్నరీ డాక్టర్‌కి తెలుపుతాం. వారు వచ్చి మందులు ఇస్తారు. బాగా చలి ఉన్నప్పుడు కొంత సమస్య అవుతుంది. మామూలు రోజుల్లో అయితే అంతా బాగానే ఉంటాయి" అని అప్పలప్ప బీబీసీకి తెలిపారు.

గాడిదలు

పాల దిగుబడి తక్కువ...

దాదాపుగా రూ. 50లక్షలు వెచ్చించి ఈ గాడిదల ఫారం ప్రారంభించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం 15 గాడిదలు పాలు ఇస్తుండగా పూటకు 10లీటర్ల వరకూ పాలు వస్తాయని చెప్పారు.

వాతావరణ పరిస్థితుల మూలంగా గాడిద పాలు ఎక్కువ సేపు నిల్వ ఉండే అవకాశం లేదు. దాంతో గాడిద పాలను నిర్దిష్ట పరిధిలో వేడి చేసి వాటిని నిల్వ ఉంచుతున్నారు. అవసరం ఉన్న వారికి సరఫరా చేస్తున్నారు. 

"సాధారణంగా ఆవులు, గేదెల మాదిరిగా గాడిదలు లీటర్ల కొద్దీ పాలు ఇవ్వవు. అరలీటర్ పాలు సాధారణంగా ఇస్తాయి. లీటర్ దాటి పాలు ఇస్తే అది మేలి జాతి గాడిద అన్నట్టు భావించాలి. గాడిద పాల దిగుబడి తక్కువ కావడమే వాటి డిమాండ్‌కి కారణం. ఆవు పాలతో సమానంగానే గాడిద పాలు నాణ్యమైనవి. గాడిద పాలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండడానికి చాలా కారణాలున్నాయి. కొన్ని నమ్మకాలు కూడా అందుకు మూలం. ఆరోగ్యం కోసమంటూ మన ప్రాంతాల్లో కూడా కొందరు గాడిద పాలపై ఆసక్తి చూపుతున్నారు. శరీర పోషణ, బ్యూటీ టిప్స్ కోసం గాడిదల పాల వినియోగం పెరుగుతోంది" అంటూ ఏపీ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ రామకోటేశ్వర రావు బీబీసీకి తెలిపారు.

గాడిదల సంఖ్య కూడా తగ్గుతోందని ఆయన అన్నారు. దాని పోషణ ఖరీదుతో కూడుకున్నదని, అందుకే పాల ధర అధికంగా ఉంటుందని వివరించారు.

గాడిదలు

గాడిదల డెయిరీ పట్ల ఆసక్తి...

గోదావరి తీరంలోనే కాకుండా, ఇంత పెద్ద సంఖ్యలో గాడిదలను పోషిస్తున్న వారు తెలుగునేల మీద ఎక్కడా కనిపించరు. దాంతో అక్షయ గాడిదల ఫారం గురించి తెలుసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆశావాహులు కూడా వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

గాడిదల డెయిరీ ఉందని తెలిసిన తర్వాత తమ ఊరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారు కనిపిస్తున్నారని స్థానికులు బీ మణికంఠం బీబీసీతో అన్నారు. 

"చాలామంది కొత్తగా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అది వీళ్లు చేసి చూపించారు. గాడిదలను పెంచడం ఏమిటిరా అని చాలామందే అనుకున్నారు. కానీ వీళ్ల ప్రయత్నం చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఊళ్లో వాళ్లే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. దూరం నుంచి వచ్చినవారు... అక్కడ ఏం జరుగుతుంది, ఎలా పెంచుతున్నారు, ఆదాయం ఎలా వస్తోంది అనే విషయాలమీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు" అని ఆయన తెలిపారు. 

ఒకప్పుడు కేవలం బరువులు మోసేందుకు ఎక్కువగా ఉపయోగపడిన గాడిదలు ఇప్పుడు పాల కోసం ఫారం ఏర్పాటు చేసే, పెంచే దశకు రావడం ఆసక్తికరమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)