కేసీఆర్ 13 లక్షల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించగలరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నేనే బయల్దేరతా. అన్ని చోట్లకూ నేనే స్వయంగా పోతా.

మంత్రివర్గం, అధికార గణం అందర్నీ తీసుకెళ్తా. ప్రజా దర్బారు పెట్టి పోడు పట్టాలు ఇచ్చేస్తాం. తరువాత ఒక ఇంచు కూడా ఆక్రమణ కానివ్వం.

ఎక్కడో ఒకచోట దీన్ని ఆపి, హక్కు నిర్ధారించాలి. గిరిజనులకు హక్కులు ఇస్తాం. ఆ తరువాత ఆక్రమణ ఉండొద్దు. తాలూకా కేంద్రానికి కూడా నేనే వెళ్లి దర్బార్ పెట్టి సమస్య పరిష్కరిస్తా.’’

13 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి 2019 జూలైలో అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన ఇది.

ఆయన ఆ హామీ ఇవ్వడం అదే మొదలు కాదు. 2018 ఎన్నికల ముందు కూడా ఇలానే చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. ఆయన హామీ ఇచ్చిన ఇన్నాళ్లకు ఆ విషయంలో కదలిక వచ్చింది. కానీ అది పరిష్కారం వరకూ వెళుతుందా?

అటవీశాఖ అధికారులతో ఘర్షణ పడుతున్న ఆదివాసీలు

ఫొటో సోర్స్, Telanganaku Haritha Haram/Facebook

ఫొటో క్యాప్షన్, అటవీశాఖ అధికారులతో ఘర్షణ పడుతున్న ఆదివాసీలు

అసలేంటీ 13 లక్షల ఎకరాల భూమి?

అడవి, కొండ ప్రాంతాల్లో పోడు పేరుతో వ్యవసాయం చేస్తారు. అంటే అడవిలోని చెట్లను నరికి, నేల బాగు చేసి వ్యవసాయం చేస్తారు. తరువాత కొంత కాలానికి ఆ భూమి వదిలి వేరే భూమి సాగు చేస్తారు.

పూర్వం గిరిజనుల జనాభా తక్కువగానే ఉండి, వారి అవసరాలకు మాత్రం ఆహార పంటలు సాగు చేసుకునే రోజుల్లో అది పెద్ద సమస్య కాలేదు. కానీ పత్తివంటి వాణిజ్య పంటలు వచ్చాక, గిరిజనులు కాని వారు కూడా అక్కడ భూములు సాగులోకి తెచ్చాక, పెద్ద ఎత్తున అటవీ భూమి సాగులోకి వచ్చింది. గతంలోలా ఒక భూమిని కొంత కాలం సాగు చేసి, వేరే భూమికి వెళ్లే పద్ధతి ఇప్పుడు దాదాపు లేదు కానీ, ఇప్పటికే సాగులోకి తెచ్చిన భూమి ఎవరికి చెందాలి అన్న విషయంలోనే గొడవంతా.

 అటవీ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేయకుండా ఆపాలని అటవీ శాఖ ప్రయత్నం చేస్తుంది. తమ జీవనోపాధి అయిన వ్యవసాయం చేసుకునే భూమిని వదలకూడదని గిరిజనులు, అటవీ ప్రాంతం దగ్గరలో ఉండే గిరిజనేతరులూ ప్రయత్నం చేస్తారు. అదో నిరంతర ఘర్షణ.

ఆ గొడవ ఎంత వరకూ వెళ్లిందంటే, అటవీ సిబ్బందిని స్థానికులు కర్రలతో కొట్టే ఘటనలు ఒక దశలో తెలంగాణలోని ప్రతీ జిల్లాలో కనిపించాయి. ఇదేదో ఎకరా రెండెకరాల సమస్య కాదు. 13 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన సమస్య. 4 లక్షల కుటుంబాల సమస్య.

ఫలానా భూమి అటవీ శాఖకు చెందినది అంటూ ఆ భూమిలో అటవీ సిబ్బంది మొక్కలు నాటడానికి వెళ్లడం. కాదు అది మా సాగు భూమి అంటూ గిరిజనులు అడ్డుకోవడం. హరిత హారం జరిగినంత కాలమూ తెలంగాణలో అడవి ఉన్న ఏ జిల్లాలో చూసినా ఇదే గొడవ.

దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా ఆ భూమి మీద ఏ హక్కూ లేక, ఎప్పుడు ఏ ఆఫీసరు వచ్చి ఆ భూమి మీది కాదు అంటాడో తెలియక, మిగిలిన రైతులకు వచ్చినట్టు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రాక గిరిజన రైతుల, గిరజనేతర రైతుల ఆందోళన ఒకవైపు…

అసలే తరిగిపోతున్న అడవిని మరింత కోల్పోతే వచ్చే పర్యావరణ నష్టం, అడవిలో నుంచి పులుల్లాంటి జంతువులు బయటకు వచ్చి మనుషులకు చేసే హాని, పోడు భూముల్లో కూడా ఆహార పంటలే వేయాలి తప్ప, పురుగుమందులు ఎక్కువ వాడే పత్తి వంటి వాణిజ్య పంటలు వద్దనే వాదనా, వాతావరణ మార్పుల దృష్ట్యా అటవీ భూమిలో సాగు వద్దంటూ గద్దించే అటవీ శాఖ అధికారుల వాదన మరోవైపు..

వీళ్లిద్దరి మధ్యా మెల్లిగా తలదూర్చి, కొత్తగా మరికొంత అడవి నరికేసి, సాగులోకి తెచ్చి తమ పార్టీ వారికి అప్పగించేసే ప్రయత్నాలు చేసే నాయకులు.. ఇలా ఈ మొత్తం 13 లక్షల ఎకరాల భూమీ నానా వివాదాలకు నిలయంగా ఉంటూ వచ్చింది.

తునికి ఆకు ఏరుతున్న మహిళలు

ఫొటో సోర్స్, Telangana Govt

గిరిజనులకు అటవీ భూమిపై హక్కు ఉంటుందా?

సాధారణంగా ఎవరికీ అటవీ భూమిపై హక్కు ఉండదు. అయితే గిరిజనులు – అడవి భూమి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 2006వ సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆ చట్టం ప్రకారం 2005 డిసెంబరు 13వ తేదీ నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటోన్న కుటుంబాలకు ఆ భూమిపై హక్కు కల్పిస్తూ హక్కు పత్రాలు ఇచ్చారు.

వారికి ఇచ్చేది సాగు చేసుకునే హక్కే తప్ప శాశ్వత పట్టా కాదు. ఇక ఆ తేదీ తరువాత, అంటే 2005 తరువాత కొత్తగా అటవీ భూమి ఆక్రమణ కాకూడదని ఆ చట్టం ఉద్దేశం.

తెలంగాణ అడవులు

ఫొటో సోర్స్, Telanganaku Haritha Haram/Facebook

ఇక గొడవ ఏంటి?

ఆ చట్టం వచ్చిన సమయంలో చాలా మందికి హక్కు పత్రాలు వచ్చాయి. కానీ అందరికీ రాలేదు. ఆ చట్టం తరువాత కూడా కొత్తగా భూమి సాగులోకి వచ్చింది. ఫలానా భూమి 2005 కంటే ముందే మేం సాగు చేస్తున్నాం అని గిరిజనులు అంటే, లేదు అప్పటికి ఆ భూమి సాగులో లేదని అటవీ అధికారులు అంటూంటారు.

ఇది కేవలం అటవీ అధికారులు, గిరిజనుల మధ్య సమస్యే కాదు. రెవెన్యూ శాఖ – అటవీ శాఖ మధ్య కూడా చాలా గొడవలు ఉన్నాయి. ఫలానా భూమి మా రెవెన్యూ శాఖ పరిధిలోనిదని వీరు, కాదు అది అటవీ భూమి అని వారూ వాదించుకుంటూ ఉంటారు. పలువురు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం కేవలం రెవెన్యూ శాఖ – అటవీ శాఖ మధ్య వివాదంలోనే తెలంగాణలో 2 లక్షల ఎకరాల భూమి ఉంది.

మొక్కలు నాటుతున్న తెలంగాణ అటవీశాఖ అధికారులు

ఫొటో సోర్స్, Telanganaku Haritha Haram/Facebook

తాజా వివాదం ఏంటి?

పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సమగ్ర సర్వే చేసి, ఏ భూమి 2005 కంటే ముందు నుంచి సాగులో ఉంది? ఏ భూమి ఆ తరువాత సాగులోకి వచ్చిందీ తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.

2006లో ఇచ్చిన తరహాలోనే మళ్లీ కొత్తగా హక్కుల పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం అడవి భూములను సాగు చేస్తోన్న వారిని దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పింది. 2021 నవంబరు 8 నుంచి డిసెంబరు 31 వరకూ దరఖాస్తులు తీసుకున్నారు.

అక్షరాలా 4 లక్షల కుటుంబాలు, 13 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ దరఖాస్తులన్నీ ఏం చేస్తారు?

ఇప్పుడు వచ్చిన దరఖాస్తులన్నీ గ్రామ సభలు ఏర్పాటు చేసి చర్చించాలి. ఊరి వాళ్లంతా కూర్చుని ఆ భూమిని నిజంగా 2005 ముందు నుంచి ఫలానా వారు సాగు చేస్తున్నారా అని తేల్చాలి. అప్పుడు ఆ గ్రామ కమిటీ డివిజినల్ కమిటీకి, డివిజినల్ కమిటీ జిల్లా కమిటీకి ఆ హక్కు ప్రతిపాదన పంపుతుంది. గిరిజన సంక్షేమ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఈ కమిటీల్లో ఉంటారు. జిల్లా కమిటీ దాన్ని ఆమోదించాలి.

అయితే ఆ కమిటీల్లో రాజకీయ నాయకులు కూడా ఉండటాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే కొందరు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అన్నీ సక్రమంగా ఉన్న వారికి వచ్చే నెలలోనే హక్కు పత్రాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

దరఖాస్తు చేసుకున్న అందరికీ భూమి వస్తుందా?

సరిగ్గా ఇక్కడే ఉంది అత్యంత కీలకమైన సమస్య. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ సంస్థ తరపున డాక్టర్ త్రినాథ రావు తయారు చేసిన నివేదిక ప్రకారం... గతంలో అయితే దరఖాస్తు చేసిన అందరికీ హక్కు ఇవ్వలేదు. 2016 నాటికి 7 లక్షల 61 వేల ఎకరాల భూమిపై హక్కు కోసం 2 లక్షల 11 వేల 973 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 99 వేల 486 మందికి 3 లక్షల 31 వేల ఎకరాల భూమిపై హక్కులు ఇచ్చారు. అంటే దాదాపు సగం మందికి కూడా హక్కు పత్రం రాలేదు. ఇప్పుడు ఏకంగా డబుల్ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

ముఖ్యంగా తెలంగాణలో హరిత హారం ప్రారంభం అయ్యాక అటవీ భూముల ఘర్షణలు పెరిగాయి. గతంలో హక్కు పత్రం లేకపోయినా క్షేత్ర స్థాయిలో సాగు చేసుకునే వారు. కానీ ఈసారి హక్కు పత్రం రాకపోతే ఇక ఆ భూమి తమకు దక్కదు అన్న స్పష్టత గిరిజనులకు, గిరిజనేతర రైతులకు వచ్చింది. అందుకే ఈసారి హక్కు పత్రాలు ఎందరికి వస్తాయి అనేది కీలకంగా మారింది.

హక్కు పత్రాలు ఇచ్చే కమిటీలో, సర్వేలో అటవీ అధికారులూ ఉంటారు. రైతులు కోరుతున్న భూమి నిజంగా సాగులో ఉందా లేదా అని నిర్ధారించే దగ్గర సమస్య వస్తుంది.

‘‘కొన్నిచోట్ల సర్వే సక్రమంగానే జరుగుతోంది. కొన్ని చోట్ల మాత్రం కొత్తగా భూమిని తీసుకువచ్చి హక్కు కోరుతున్నారు. ఇలా ఇచ్చుకుంటూ పోతే అడవి మిగలదు.’’ అంటూ బీబీసీతో వ్యాఖ్యానించారు ఒక అటవీ శాఖ అధికారి. అయితే అటవీ శాఖ ఎంత భూమి విషయంలో అభ్యంతరం పెడుతుంది అనేది ఇంకా తెలియదు.

వచ్చే నెలలో హక్కు పత్రాలు నిజంగా అందుతాయా?

ఆదివాసీ రైతులు

ఫొటో సోర్స్, Telanganaku Haritha Haram/Facebook

ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే అంటున్నాయి ప్రతిపక్షాలు. కొన్ని చోట్ల ఇవ్వగలిగినా, చాలా చోట్ల వివాదాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

‘‘అధికారులు అసలు సర్వే సక్రమంగా చేయడంలేదు. చాలామంది గిరిజనుల దగ్గర 2005 నాటి పట్టాలే లేవు. కానీ అటవీ అధికారులు మాత్రం 1950ల నాటి పత్రాలు అడుగుతున్నారు. గ్రామ సభల్లో గొడవలు జరుగుతాయి. అటవీ అధికారులు సొంతంగా పత్రాల వెరిఫికేషన్ కాకుండా, గ్రామ సభలు చెప్పిన తీర్మానాన్ని కచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే సమస్య లేకుండా ఉంటుంది. అంటే గ్రామ సభ ఫలానా వాడు భూమి సాగు చేస్తున్నా అంటే, వారికి భూమి ఇచ్చేయాలి.

కానీ ఇప్పటికే అటవీ అధికారులు చాలా చోట్ల ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఎల దగ్గర నిరసనలు కూడా మొదలు అయ్యాయి. అటు వన సంరక్షణ సమితి భూములను అయినా పంచమని గిరిజనులు అడుగుతుంటే అది కూడా చేయడం లేదు. ఇదే పద్ధతిలో సర్వేలు, గ్రామ సభలు కొనసాగితే ఇబ్బందే.’’ అని ఆదివాసీ హక్కుల నాయకులు, పీసీసీ సభ్యులు వెద్మా బొజ్జు బీబీసీతో అన్నారు.

‘‘ఈసారి పక్కాగా పట్టాలు ఇస్తాం. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను లబ్ధిదారులకు వచ్చే నెల ఇస్తాం. అటు గిరిజనులకు అన్యాయం జరగకుండా, ఇటు అటవీ భూమీ నష్టపోకుండా చేస్తాం.’’ అని తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)