ఎలాన్ మస్క్: నవంబర్ 21 వరకు ట్విటర్ ఆఫీసులు మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ సంస్థ తన ఉద్యోగులకు చెప్పింది.
ఈ మూసివేత తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
నవంబర్ 21న సోమవారం మళ్లీ కార్యాలయాలు తెరుచుకుంటాయని చెబుతూ ఉద్యోగులకు మెసేజ్‌లు పంపించారు.
అయితే, కార్యాలయాలను ఎందుకు మూసివేస్తున్నారనేది ట్విటర్ ఆ మెసేజ్‌లలో చెప్పలేదు.
మరిన్ని గంటలు పనిచేయాలని.. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ చెప్పిన తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సంస్థను వీడుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పెద్దసంఖ్యలో ఉద్యోగులు రాజీనామా చేస్తున్న నేపథ్యంలోనే మస్క్ తాత్కాలికంగా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్ సిబ్బందితో మాట్లాడుతూ... ఎక్కువ గంటలు పనిచేయాలని, కఠోర శ్రమ చేయకపోతే సంస్థను విడిచివెళ్లాలని అన్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ట్విటర్‌లో పనిచేయాలంటే సంస్థ పద్ధతులను పాటించాలని ఆయన సూచించారంటూ వాషింగ్టన్ పోస్ట్ రాసింది.

ఈ క్రమంలో నవంబర్ 17 నాటికి దీనికి అంగీకరిస్తూ సంతకం చేయాలని.. లేదంటే మూడు నెలల జీతం ఇచ్చి పంపించేస్తామని మస్క్ ఈమెయిల్స్ పంపించారని ఆ కథనంలో పేర్కొన్నారు.
ట్విటర్ మస్క్ చేతికి వచ్చాక ఇప్పటికే 50 శాతం మంది సిబ్బందిని తగ్గించుకుంది.
ఇప్పుడు మస్క్ కొత్త నిబంధనలను అంగీకరించడానికి ఇష్టపడని సిబ్బంది సంస్థను వీడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ట్విటర్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
తాము సంస్థను వీడుతున్నట్లు సంకేతమిస్తూ #LoveWhereYouWorked అనే హ్యాష్‌ట్యాగ్, సెల్యూటింగ్ ఎమోజీలు ఉపయోగించి చాలామంది ట్వీట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్విటర్ మాజీ ఉద్యోగి ఒకరు బీబీసీతో మాట్లాడారు.. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన.. ‘‘ఇప్పుడు ట్విటర్‌లో 2,000 మంది కంటే తక్కువే మిగిలి ఉంటారు’ అన్నారు.
తన టీమ్‌లో అందరినీ తొలగించారని ఆ మాజీ ఉద్యోగి చెప్పారు.
‘టీమ్ మేనేజర్‌ను, ఆయన కంటే పై స్థాయిలో ఉన్న మేనేజర్‌ను తొలగించారు. వారిద్దరి కంటే ముందే ఆ చైన్‌లో పైన ఉండే సీనియర్ మేనేజర్‌ను తొలగించారు. మొత్తం టీమ్‌నే తొలగించారు’ అని చెప్పారు ఆ మాజీ ఉద్యోగి.
ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడానికి ముందు ఆ సంస్థలో 7,500 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు.
మస్క్ కోరుకుంటున్నట్లు ఎక్కువ గంటలు పనిచేయడానికి సిద్ధపడినప్పటికీ కూడా రాజీనామా చేశానని ఇంకో ఉద్యోగి చెప్పారు.
‘నేను ఇప్పటికే వారానికి 60 నుంచి 70 గంటలు పనిచేస్తున్నాను. అలాంటప్పుడు ఇంకా పనిచేయాలంటూ అనేకసార్లు ఈమెయిల్‌లో బెదిరింపులకు పాల్పడేవారి దగ్గర పనిచేయాలనుకోవడం లేదు’ అని చెప్పారు ఆ రాజీనామా చేసిన ఉద్యోగి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














