తిరుమలలో ఆర్గానిక్ లడ్డూ, అన్నప్రసాదాలు.. సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి

తిరుపతి ఆర్గానిక్ ప్రసాదం

ఫొటో సోర్స్, TTD

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం..

తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు రసాయనాలు వాడకుండా పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారైన లడ్డూ, అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

తమతోపాటూ రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా తిరుమల తిరుపతి దేవస్థానాలు చొరవ తీసుకుంటున్నాయి.

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతులతో ఒప్పందాలు చేసుకుని, వారితో సమావేశాలు నిర్వహించి అవగాహన కూడా కల్పిస్తోంది.

ఇందులో భాగంగా 12 రకాల సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను తమకు సరఫరా చేసేలా మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థలతో టీటీడీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

మార్క్‌ఫెడ్ ఈ ఉత్పత్తులను టీటీడీకి అందేలా చూస్తుంటే.. టీటీడీ, రైతులకు మధ్య సంధానకర్తగా రైతు సాధికార సంస్థ వ్యవహరిస్తోంది.

ఎరువులు, పురుగు మందులు వేసి పండించని వ్యవసాయ ఉత్పత్తులతో ప్రసాదం అందించేలా రాష్ట్రంలోని మరో 11 ఆలయాలు కూడా ప్రస్తుతం ముందుకు వచ్చాయి.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

రైతులకే లాభం

టీటీడీ చొరవ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తుందని, వారికి మరిన్ని లాభాలు తెచ్చిపెడుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి బీబీసీతో చెప్పారు.

రైతుల నుంచి టీటీడీ సేకరించే ఆర్గానిక్ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటూ దానికి 10 శాతం అదనంగా ఇస్తోంది.

ఒక వేళ మార్కెట్లో ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంటే, అదే ధర వారికి చెల్లించడంతోపాటూ 15 శాతం అదనంగా టీటీడీ ఇస్తుంది.

“రైతులకు ఇచ్చే ధరను టీటీడీ నిర్ణయించింది. కనీస మద్దతు ధర ప్లస్ 10 % లేదా మార్కెట్ రేట్ ప్లస్ 15% ఇస్తుంది. టీటీడీకి ఒక్కో ప్రసాదానికి వేర్వేరు ఉత్పత్తులు, వేర్వేరు పరిణామాల్లో అవసరం ఉంటాయి.

సెనగలు 7 వేల క్వింటాళ్లు అవసరం అవుతాయి. బియ్యం 7 వేల క్వింటాళ్లు కావాలి.

అన్న ప్రసాదాలు, లడ్డు తయారీ, అన్నదానం క్యాంటీన్ అన్నింటికీ కలిపి టీటీడీకి 12 ఆహార ఉత్పత్తులు అవసరం” అని ధర్మారెడ్డి చెప్పారు.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

రైతులకు టీటీడీ నుంచి ఆవులు

తమ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులు పండించే రైతులకు టీటీడీ తమ దగ్గరున్న ఆవులు కూడా ఇచ్చింది.

టీటీడీ సంరక్షణలో ఉన్న గోవుల సంఖ్య పెరిగిపోయిందని, అందుకే వీటిని రైతులకు ఇస్తే వారికి అవసరమైన ఎరువు కోసం ఉపయోగపడడంతోపాటూ, తమపై ఉన్న భారం కూడా తగ్గుతుందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

“మాకు గోశాలలో గోవులున్నాయి. వాటిని టీటీడీ చూసుకోవడం కంటే, ఆ గోవులను రైతులకు ఇస్తే, వ్యవసాయానికి ఉపయోగపడతాయి. మాకు ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే టీటీడీ దేవస్థానం గోవులను రైతులకు దగ్గరికే నేరుగా చేరుస్తోంది” అని ఆయన వివరించారు.

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు పండించే రైతులు మార్క్‌ఫెడ్ వరకూ తీసుకెళతారు. రైతుల నుంచి ఈ పంటలను మార్క్‌ఫెడ్ కొని వాటిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి టీటీడీకి అవసరమైనప్పుడు అందిస్తుంది.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

రైతులు వేసే పంటల్లో ఏవైనా రసాయనాల ఛాయలున్నాయా, సేంద్రియ వ్యవసాయంలో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా అనేదాన్ని రైతు సాధికార సంస్థ తనిఖీలు చేస్తుంటుంది. ఈ పంటలను కొనే టీటీడీ కూడా రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పంటలను తనిఖీ చేస్తుంది.

 “టీటీడీ నేరుగా రైతులతో ఈ ఒప్పందం చేసుకోదు. రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్ చేసుకుంటాయి. మాకు ఏ ఉత్పత్తులు ఎంతెంత క్వాంటిటీలో కావాలో వారికి చెబితే, ఆ క్వాంటిటీని ఎంత మంది రైతులు, ఎంత పొలంలో పండించగలరు అనేది చూసుకుని రైతులు విత్తనాలు వేసే సమయంలోనే సాధికార సంస్థలో తమ పేర్లు

నమోదు చేసుకుంటారు. సంస్థ మాకు వారి అడ్రస్, వివరాలు ఇస్తుంది. ఆ పంట వేసినప్పుడు టీటీడీ అధికారులు ఆ పంట పండే స్థితి నుంచి కోసే వరకు వెళ్లి తనిఖీలు చేస్తారు. ఇప్పటికే రెండు మూడేళ్లు శెనగ పంట వేసి విజయవంతం అయిన రైతులతో ఒప్పందం చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా అలాంటి రైతులనే ఎంచుకున్నాం” అని ధర్మారెడ్డి వివరించారు.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

‘‘తిరుమల లడ్డూకు వాడేది మా శెనగలే’’

టీటీడీతో ఒప్పందం కుదర్చుకుని సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన పొలంలో పండిన శెనగలు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తుండడంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఉన్న చిన్న పడమల గ్రామంలో సేంద్రియ పంటలు పండించే రైతు రవీంద్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

“నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో బెంగాల్ గ్రామ్(సెనగలు) వేశాను. అందులోనే ఆవాలు, అలసందలు అంతరపంటలుగా వేశాను. ఎకరాకు 400 కేజీలు ఘన జీవామృతం వేశాను. 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం

పిచికారీ చేస్తుంటాను. మధ్య మధ్యలో ఇంకా ద్రావణం పిచికారీ చేశాను. టీటీడీ వారు నెలకు ఒకసారి మా పొలంలోకి వచ్చి టెస్ట్ చేసి లడ్డు తయారీకి మా శెనగలు తీసుకోవడం మాకు ఆనందంగా ఉంది”అని రవీంద్ర అన్నారు.

“కనీస మద్దతు ధర కంటే 10 శాతం ఎక్కువ ఇవ్వడంతోపాటు పంట ఇచ్చిన 15 రోజులకి అమౌంటు పడుతుంది అని చెప్పారు. అయితే మాకు ఎనిమిది రోజులకే అమౌంట్ పడింది. మధ్యలో దళారులు ఎవరూ లేరు. డైరెక్ట్ మా అకౌంట్లోకి డబ్బు వస్తుంది. దాంతో నన్ను చూసి మా పక్క రైతులు కూడా 20 మందికి పైగా ఆర్గానిక్ పండిస్తామని ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం మా ఊళ్లో 20 నుంచి 30 మంది రైతులు టీటీడీ లడ్డూ తయారీకి తమ పంటను ఇవ్వాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు” అని ఆయన తెలిపారు.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

ఎకరానికి రూ.10 వేలు అదనపు ఆదాయం

బాపట్ల జిల్లా చెందలూరు గ్రామంలో ఎనిమిదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అనంతలక్ష్మి, టీటీడీకి తమ ఉత్పత్తులు అమ్మడం వల్ల మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నామని బీబీసీతో చెప్పారు.

“మేం బెంగాల్ గ్రామ్, మిర్చి, మినుములు, పెసర, ధనియాలు, వేరుశెనగ, మెంతులు, వెల్లుల్లి లాంటివి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం. మిర్చిలో వెల్లుల్లిని అంతరపంటగా వేశాను. అలాగే కూరగాయలు కూడా పండిస్తున్నాం.

మేం చాలా ఏళ్లుగా ఇది చేస్తున్నా ఇప్పుడు వస్తున్నంత అమౌంట్ ఎప్పుడు రాలేదు. మేం టీటీడీకి 30 ఎకరాల్లో పండిన 340 క్వింటాళ్ల శెనగలు ఇచ్చాము. మార్కెట్ రేట్ కంటే రూ.1200 నుంచి రూ.1300 అధికంగా వస్తుంది. మాకు ఎకరానికి రూ.10 వేల రూపాయలు అధికంగా ఆదాయం ఉంటుంది. 30 ఎకరాల మీద మాకు మూడు లక్షల వరకు అదనపు ఆదాయం వచ్చింది” అని అనంత లక్ష్మి చెప్పారు.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాధవి బీబీసీతో మాట్లాడుతూ- “2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. నాకు తెలిసినప్పటి నుంచి మాది వ్యవసాయ కుటుంబమే. అయితే రసాయనాలు వాడటం వల్ల పొలమంతా పాడైపోతుందని భూమి సారం కోల్పోతుందని, వ్యాధులు వస్తున్నాయని మేం ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాం. ఇందులో అయితే దిగుబడి కూడా మాకు ఎక్కువ వస్తుంది. 2016 నుంచి మేం మామూలు ధరలకే అమ్ముకునేవాళ్లం. ఇప్పుడు టీటీడీ 10 శాతం అధికంగా ఇచ్చి మా పంటలు కొనుగోలు చేయడాన్ని మేం ఒక వరంగా భావిస్తున్నాము”అని ఆమె అన్నారు.

తన ఎకరా పొలంలో మొత్తం 18 రకాల పంటలు సాగు చేశానని చెప్పిన మాధవి, అన్ని రకాల విత్తనాల భూమిలో కలవడం వల్ల నేల కూడా సారవంతమవుతోందన్నారు.

తిరుపతి

ఫొటో సోర్స్, TTD

రైతులకు ఆదాయం, భక్తులకు సంతృప్తి

టీటీడీ ప్రయత్నంలో తమ సంస్థ ఎలాంటి పాత్ర పోషిస్తోందో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ బీబీసీకి చెప్పారు.

“నిరుడు అక్టోబర్లో టీటీడీ, రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్ ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రసాయనాలు వాడని రైతుల నుంచి స్వామివారికి నైవేద్యం ప్రసాదాలు, అన్నదానం అన్నింటికీ ఉత్పత్తులు

తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జరిగిన ఒప్పందం ప్రకారం రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తున్న రైతులను రైతు సాధికార సంస్థ గుర్తించింది. వారికి శిక్షణ ఇచ్చి, వారు అంతా సక్రమంగానే చేస్తున్నారనేది ధ్రువీకరించడం మా బాధ్యత. వారు సాగు చేసిన పంటలో పురుగు మందులు, రసాయనాల అవశేషాలు లేవని సర్టిఫికేషన్ ఇస్తాం. టీటీడీకి ఆ రిపోర్ట్స్ అందిస్తాం” అని చెప్పారు.

‘‘రైతు సాధికార సంస్థ గ్రామస్థాయిలో ఆ వ్యవసాయ ఉత్పత్తులను గుర్తించిన తర్వాత మార్క్‌ఫెడ్ వాటిని కొనుగోలు చేస్తుంది. వాటిని గోడౌన్లకు తీసుకెళ్లి ప్రాసెస్ చేసి, టీటీడీకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సరఫరా చేస్తుంది’’అని అంటున్నారు విజయ్ కుమార్.

“టీటీడీ, మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థ కలిసి ఒక కమిటీగా ఏర్పడి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి. రైతుకి ఎంత ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటుంది. గతసారి మేం శెనగలతో మొదలుపెట్టాం. అది మార్కెట్‌కి వచ్చేసరికి క్వింటాలుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5300 ఉంటే మార్కెట్ ధర రూ.4700 ఉంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన రైతులకు రూ.5300 ఇవ్వడంతోపాటూ దానిపై 10 శాతం అదనంగా ఇచ్చాం. అంటే మొత్తం రూ.5,830 ఇచ్చాం”అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, తిరుమల వెంకటేశ్వరస్వామికి తాళ్లపాక వంశస్థులే ఎందుకు కన్యాదానం చేస్తారు

ఎంఎస్‌పీకి అదనంగా ఎందుకు?

రైతులకు అదనపు ధర ఎందుకు చెల్లిస్తున్నదీ రైతు సాధికార సంస్థ వివరించింది.

“రైతులకి 10 శాతం, 15 శాతం అదనంగా ఆదాయం వస్తే వారి పరిస్థితి కూడా మెరుగు పడుతుంది అనే ఉద్దేశంతో టీటీడీ ఇంత పెద్దయెత్తున దీనిని చేపడుతోంది. అందుకే మేం దేవాదాయ శాఖతో కూడా మాట్లాడాం. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం లాంటి మరో 11 ప్రధాన ఆలయాలు కూడా సేంద్రీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. దీనివల్ల రైతులకే కాదు, ఆలయాలకు వచ్చే భక్తులకు కూడా తాము రసాయనాలు లేని ప్రసాదం తింటున్నామని ఒక తృప్తి కలుగుతుంది’’అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఏడాది టీటీడీకి 12 వస్తువులు కలిపి 20 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని రైతు సాధికార సంస్థ గుర్తించింది.

మిగతా ఆలయాలన్నీ కలుపుకుని మొత్తం 35 వేల మెట్రిక్ టన్నుల సరఫరా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో సేంద్రీయ వ్యవసాయం చేసే సుమారు 35 వేల మంది ఆంధ్రప్రదేశ్ రైతుల భాగస్వామ్యం ఉంటుందని చెబుతోంది.

వీడియో క్యాప్షన్, తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతుల నుంచి మార్క్‌ఫెడ్ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. వాటిని కోల్డ్ స్టోరేజ్ లేదా గిడ్డంగులకు తరలిస్తారు.

అక్కడ శాంపుల్స్ తీసుకున్న తర్వాత, ఏ స్లాట్‌లో రసాయనాలు వాడలేదని స్పష్టం అవుతుందో ఆ రైతులకు పేమెంట్ చేస్తుంది.

సీఎం యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు వారు ఇచ్చిన క్వాంటిటీ ఎంత, వాళ్లకు ఎంత మొత్తం ఇవ్వాలి అనేది చెక్ చేసిన తర్వాత మార్క్‌ఫెడ్ చెల్లింపులను నేరుగా వారి ఖాతాకే పంపుతుంది.

టీటీడీ కోసం పంటలు పండించే రైతులకు రైతు సాధికార సంస్థ ఆర్గానిక్ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తుంది. టీటీడీ, మిగతా ఆలయాలకే కాకుండా.. మార్క్‌ఫెడ్ యూనిట్ ద్వారా ఈ పంటలు కొనుగోలు చేసి నేరుగా వినియోగదారులకు సరఫరా చేయడం కూడా ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)