జిన్నా:హిందూ జెనాభాయ్ ఠక్కర్ కొడుకు, ముస్లిం మహమ్మద్ అలీ జిన్నా ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- జిన్నా పూర్వీకులు గుజరాత్ రాజ్‌కోట్ జిల్లా పానేలీ మోటీ గ్రామంలో జీవించేవారు.
- జిన్నా తండ్రి జెనాభాయి ఠక్కర్ వ్యాపారం కోసం కరాచీకి వెళ్లారు.
- జెనాభాయి ఠక్కర్ భార్య మీఠీభాయి కరాచీలోనే జిన్నాకు జన్మనిచ్చారు.
- లండన్‌కు వెళ్లిన తర్వాత తన పేరును మహమ్మద్ అలీ జెనాభాయి నుంచి మహమ్మద్ అలీ జిన్నాగా ఆయన మార్చుకున్నారు.
- 16ఏళ్ల వయసులోనే పానేలీ మోటీ గ్రామానికి చెందిన 11ఏళ్ల అమీభాయితో జిన్నాకు మీఠీభాయి పెళ్లిచేశారు.
- అయితే, ఆ పెళ్లి తర్వాత అమీభాయిని జిన్నా కలవలేదు.

ఫొటో సోర్స్, Getty Images

భారత జాతిపిత మహాత్మా గాంధీ అయితే, పాకిస్తాన్ కాయద్-ఏ-ఆజమ్ మహమ్మద్ అలీ జిన్నా.
మహాత్మా గాంధీ స్వస్థలం గుజరాత్. మరోవైపు మహమ్మద్ అలీ జిన్నా తల్లిదండ్రులు కూడా గుజరాత్‌కు చెందినవారే.
గుజరాత్ కాఠియావాడ్‌లోని పోర్‌బందర్‌లో గాంధీ జన్మించారు. జిన్నా తల్లిదండ్రుల స్వస్థలం కూడా కాఠియావాడ్‌లోనే ఉంది. వీరు రాజ్‌కోట్‌లోని పానేలీ మోటీ గ్రామానికి చెందినవారు.
ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 95 కి.మీ.. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి 13ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు పెళ్లిచేశారు. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్లారు.
జిన్నాకు కూడా 16ఏళ్ల వయసులోనే పానేలీ మోటీ గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలికతో వారి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ తర్వాత జిన్నా కూడా ఇంగ్లండ్‌కు వెళ్లారు.
విదేశాలకు వెళ్లిన తర్వాత, వీరు అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుంటారేమోనని వీరి తల్లిదండ్రులు ఆందోళనపడేవారు. దీంతో విదేశాలకు వెళ్లకముందే వీరికి పెళ్లిళ్లు చేశారు.
పోర్‌బందర్‌లోని గాంధీ ఇంటిని నేడు మ్యూజియంగా మార్చారు. మరి జిన్నా పూర్వీకుల ఇల్లుకు ఏమైంది?
నేడు గుజరాత్‌లోని జిన్నా పూర్వీకుల ఇంట్లో ఎవరు ఉంటున్నారు? కరాచీ వెళ్లిన తర్వాత జిన్నా తండ్రి ఏం చేశారు? లాంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలు జిన్నా పూర్వీకులు హిందూ నుంచి ఇస్లాంలోకి ఎందుకు మతం మారారో కూడా చూద్దాం.

జిన్నా పూర్వీకుల ఇల్లు
ఈ ఫోటోలో కనిపిస్తున్న రెండంతస్తుల ఇల్లు జిన్నా పూర్వీకులది. భారత మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ తన పుస్తకం ‘‘జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’’లో జిన్నా తాతయ్య పూంజాభాయి తన ముగ్గురు కుమారులు వల్జీభాయి, నథూభాయి, జెనాభాయి, కుమార్తె మాన్‌భాయిలతో ఇక్కడి పానేలీ గ్రామంలో జీవించినట్లు పేర్కొన్నారు.
‘‘ఈ కుటుంబం ముస్లింలలోని ఖోజా వోరా వర్గానికి చెందినది. కుటుంబాన్ని పోషించేందుకు పూంజాభాయి చేపల వ్యాపారం చేసేవారు. అయితే, ఆయన చిన్నకుమారుడు గ్రామాన్ని వదిలి సమీపంలోని గోందల్‌లో వ్యాపారం చేయాలని భావించారు. అలా పానేలీ మోటీ గ్రామం నుంచి వారు బయటకు వచ్చారు’’అని జశ్వంత్ సింగ్ రాసుకొచ్చారు.
పానేలీ మోటీ గ్రామం రాజ్‌కోట్‌లోని ఉపెల్టా తహశీల్‌లో ఉంటుంది.
ఉత్తరప్రదేశ్-బిహార్ రాష్ట్రాలలోని గ్రామాల కంటే ఇక్కడి గ్రామాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పెద్దపెద్ద షాపులు, బ్యాంకులు కూడా ఉంటాయి. గ్రామాల్లోకి పెద్దపెద్ద ట్రక్కులు కూడా సాఫీగా వచ్చిపోతుంటాయి.
పానేలీ మోటీ ఉప సర్పంచ్ జతిన్‌భాయి వివరాల ప్రకారం.. ఈ గ్రామ జనాభా 13,000. ఇక్కడ ఇప్పటికీ అయిదారు ముస్లిం కుటుంబాలు జీవిస్తున్నాయి.

ఇది జిన్నా గ్రామం..
ఈ గ్రామాన్ని జిన్నా గ్రామంగా పిలుస్తారు. ఇక్కడ జిన్నా ఇల్లు ఎక్కడుందని అడిగితే, పిల్లలు కూడా మిమ్మల్ని నేరుగా ఈ ఇంటికి తీసుకొని వస్తారు.
ఈ రెండంతస్తుల ఇల్లు 110ఏళ్ల నాటిది. కింద అంతస్తులో రెండు గదులు, ఒక వంట గది ఉన్నాయి. పై అంతస్తులోనూ రెండు గదులు ఉన్నాయి.
గుజరాత్‌లో ఇలాంటి ఇళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. మేం తలుపు కొట్టిన వెంటనే, తలుపు తీయకుండానే ‘‘ఎవరు వచ్చారు’’అని ఒక వ్యక్తి లోపల నుంచి అడిగారు.
మా గురించి చెప్పనప్పుడు.. అయిష్టంగానే ఒక వ్యక్తి తలుపుతీశారు. లోపలకు వచ్చిన తర్వాత, కూర్చోమని కూడా చెప్పలేదు.
మీ పేరు ఏమిటని అడిగినప్పుడు కూడా అయిష్టంతోనే ‘‘ప్రవీణ్’’అని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన పూర్తిపేరు ‘‘ప్రవీణ్ భాయి పోపట్ భాయి పోకియా’’అని ఆయన వివరించారు. ఆయన పటేల్ కులానికి చెందినవారు.
మేం ప్రవీణ్‌తో మాట్లాడేటప్పుడు ఆయన 70ఏళ్ల తల్లి నందూ బెన్ బయటకు వచ్చారు. ఎవరెవరో ఇంటికి వచ్చి ఏవేవో ప్రశ్నలు వేయడంపై ప్రవీణ్, నందూ భాయి అసహనం వ్యక్తంచేశారు.
‘‘మీరు తలుపుకొట్టేటప్పుడు నేను నిద్రపోతున్నాను. కాసేపట్లో నేను పొలం పనులకు వెళ్లాలి. ఇప్పుడు నా నిద్రకు భంగం కలిగింది. పొలానికి వెళ్లడానికి కూడా ఆలస్యం అవుతుంది. రోజూ ఇలానే జరుగుతోంది. ఒక్కోసారి జర్నలిస్టులు, మరోసారి జిల్లా అధికారులు, ఇంకొకసారి నాయకులు ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చెప్పాలంటే నా సహనం నశించిపోతోంది. 2005లో అయితే, ఒక విదేశీ మీడియా సంస్థ కూడా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది’’అని ఆయన అన్నారు.

అడ్వాణీ పాక్ పర్యటనతో
2005లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్‌కృష్ణ అడ్వాణీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కరాచీలో జిన్నా సమాధిని కూడా సందర్శించి అడ్వాణీ నివాళులు అర్పించారు.
జిన్నాకు నివాళులు అర్పించిన సమయంలో ఆయన్ను.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా అడ్వాణీ అభివర్ణించారు.
‘‘చరిత్రపై చెరగని ముద్రవేసిన వారిలో చాలామందే ఉంటారు. కానీ, కొందరు మాత్రమే చరిత్రను మలుపు తిప్పగలుగుతారు. అలాంటివారిలో మహమ్మద్ అలీ జిన్నా ఒకరు’’అని అక్కడి రిజిస్టర్‌లో అడ్వాణీ రాశారు.
అడ్వాణీ వ్యాఖ్యలతో అప్పట్లో పెద్ద వివాదమే రాజుకొంది. ఈ వ్యాఖ్యలకు బీజేపీ దూరం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలతో అడ్వాణీ తన హోదాను తానే తగ్గించుకుంటున్నారని అప్పట్లో కొందరు విమర్శించారు. ఈ వివాదం పానేలీ మోటీ గ్రామానికి కూడా చేరింది.

ప్రవీణ్ భాయి పోకియా అన్నయ్య చమన్ భాయి పోకియా మాట్లాడుతూ.. ‘‘అడ్వాణీ పాకిస్తాన్ పర్యటన వల్ల మేం చాలా ఇబ్బంది పడ్డాం. జిన్నా పూర్వీకుల ఇల్లు ఎక్కడంటూ చాలా మంది మా ఇంటికి వచ్చారు. నిజానికి అసలు ఈ ఇల్లును అమ్మేద్దామని మేం భావించాం. కొత్త ఇల్లును కొనుక్కోవాలని అనుకున్నాం. ఎవరైనా కొనేవారు ఉంటే చెప్పండి. మేం అమ్మేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం. దీన్ని ఎవరైనా కొనుక్కొని జిన్నా మ్యూజియంగా మార్చేసుకోనివ్వండి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ఇల్లు తను చూస్తున్నప్పటి నుంచీ ఇలానే ఉందని ప్రవీణ్ తల్లి నందూ బెన్ అన్నారు.
‘‘నా జీవితం మొత్తం ఇదే ఇంట్లో గడిపాను. ఇప్పుడు చివరి రోజులు దగ్గరపడ్డాయి. జిన్నా విషయంలో మా పిల్లలు కాస్త అసహనంతో ఉన్నారు. కానీ, నాకు ఎలాంటి సమస్యా లేదు. పెళ్లి తర్వాత నేను ఇక్కడకు వచ్చాను. అప్పుడే విద్యుత్ సరఫరా వచ్చింది. వైర్లు, లైట్లు అన్నీ ఏర్పాటుచేశాం. కొన్ని గోడలకు ప్లాస్టరింగ్ కూడా చేశారు. మిగతా ఇల్లు మాత్రం అప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలానే ఉంది’’అని ఆమె వివరించారు.
‘‘నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇల్లు జిన్నా ఇల్లని కొందరు అనేవారు. మా తాతయ్య కూడా ఈ ఇల్లు జిన్నా తాతదని చెప్పారు. ఇలానే మాకు కూడా గుర్తింపు వచ్చింది. ఈ ఇంట్లోనే జిన్నా తాతయ్యా, మా తాతయ్య కలిసి జీవించేవారు. ఇదివరకు అంతా బానే ఉండేది. కానీ, ఇప్పుడే ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వేళపాళా లేకుండా ఎవరో ఒకరు వచ్చి తలుపు కొడుతున్నారు. దీంతో అసలు ఈ ఇల్లు అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చాం’’అని 50ఏళ్ల ప్రవీణ్ చెప్పారు.

గ్రామస్థులు ఏం చెబుతున్నారు?
పానేలీ మోటీ గ్రామంతో జిన్నా సంబంధాలపై గ్రామానికి చెందిన 70ఏళ్ల కిరణ్ భిమాజ్యానీ మాతో మాట్లాడారు.
‘‘జిన్నా పూర్వీకులు ఠక్కర్ కులానికి చెందినవారు. పూంజాభాయి ఇక్కడ చేపల వ్యాపారం చేసేవారని మా తాత చెప్పారు. అందుకే లోహానా-ఠక్కర్ కులాలు ఆయన్ను దూరంగా పెట్టేవి. దీంతో తర్వాత కాలంలో ఆయన ఇస్లాంను స్వీకరించారు. మా ఇల్లు వారికి పక్కనే ఉండేది. వారి వళ్లే ఈ గ్రామానికి పేరు వచ్చింది’’అని కిరణ్ చెప్పారు.
పానేలీ ఉపసర్పంచ్ జతిన్‌భాయి మాట్లాడుతూ.. ‘‘దేశ విభజన తర్వాత జిన్నా వల్ల ఈ గ్రామానికి కొంత చెడ్డపేరు కూడా వచ్చింది. అందుకే మేం ఆయన గురించి మాట్లడేందుకు కాస్త తటపటాయిస్తుంటాం’’అని చెప్పారు.
ఆధునిక భారత చరిత్రలో నిపుణులైన చిమన్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హరీ దేశాయ్ కూడా ఈ విషయంపై మాతో మాట్లాడారు.
‘‘పూంజాభాయి ఠక్కర్ కుమారుడు జెనాభాయి ఠక్కర్. జెనాభాయి కుమారుడే మహమ్మద్ అలీ జిన్నా. నిజానికి ఈ కుటుంబం హిందూ కుటుంబం. మొదట్లో చేపల వ్యాపారం చేసేది. లోహానా-ఠక్కర్ కులానికి చెందిన కుటుంబాలకు కాస్త పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు చేపల వ్యాపారం చేసే ఈ కుటుంబాలను దూరంగా పెట్టేవారు. దీంతో పూంజాభాయి ఇస్లాంలోకి మతం మారారు’’అని ఆయన చెప్పారు.
‘‘ఆ తర్వాత మళ్లీ హిందూమతాన్ని స్వీకరించాలని పూంజాభాయి భావించారు. కానీ, ఇక్కడి హిందువులు దానికి అనుమతించలేదు’’అని ఆయన వివరించారు.
‘‘వ్యాపారం చేసేందుకు జెనాభాయి కరాచీ వెళ్లారు. అక్కడే జిన్నా పుట్టారు. బ్రిటన్ వెళ్లిన తర్వాత తన పేరును ఆయన ఆంగ్లీకరించుకున్నారు. అలా అది జిన్నాగా మారింది. జిన్నా చదువుకునేందుకు లండన్ వెళ్లలేదు. ఆయన అక్కడ వ్యాపారం చేద్దామని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత అక్కడే బారిస్టర్ చదువుకున్నారు. జిన్నా పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అమీబాయి. ఆయనకు విదేశాలకు వెళ్లేముందే పెళ్లి చేయాలని ఆయన తల్లి భావించారు. గాంధీజి పెళ్లి కూడా ఇలానే జరిగింది. అయితే, ఆ తర్వాత కాలంలో జిన్నా మరో పార్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు’’అని దేశాయ్ చెప్పారు.

జెనాభాయ్ నుంచి జిన్నా..
జెనాభాయ్ ఠక్కర్ 1875లో కరాచీకి ఎలా వెళ్లారో జశ్వంత్ సింగ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. బొంబాయి తరహాలోనే కరాచీలోనూ బ్రిటిష్ పాలకులు ట్రేడింగ్ పోస్టులను ఏర్పాటుచేశారు.
‘‘కరాచీలో సర్ ఫ్రెడ్రిక్ లీ క్రాఫ్ట్‌ను జెనాభాయి కలిశారు. ఆయన డగ్లస్ గ్రాహం అండ్ కంపెనీకి జనరల్ మేనేజర్‌గా ఉండేవారు. ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం జెనాభాయి జీవితాన్ని మలుపుతిప్పింది. జెనాభాయి వ్యాపారం బాగా ముందుకు వెళ్లింది. ఆ తర్వాత కరాచీలోనే 1876 అక్టోబరు 25న జెనాభాయి భార్య మీఠీభాయి ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. నిజానికి పూంజాభాయి ఇంట్లో పుట్టిన అందరికీ హిందువుల పేర్లే ఉంటాయి. అయితే, కరాచీలో పుట్టిన కుమారుడికి మాత్రం కాస్త భిన్నమైన పేరును జెనాభాయి పెట్టారు’’అని జశ్వంత్ సింగ్ చెప్పారు.
‘‘కరాచీలో ముస్లింల జనాభా చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ పిల్లల అందరి పేర్లు ఇస్లాంకు అనుగుణంగా ఉండేవి. అందుకే తన కొడుక్కు కూడా అలాంటి పేరే పెట్టాలని జెనాభాయి భావించారు. అలా మహమ్మద్ అలీ జెనాభాయి అనే పేరు పెట్టారు. కాఠియావాడ్‌లో పెట్టినట్టే పేరుకు చివరన తండ్రి పేరును కూడా ఆయన ఉంచారు’’అని జశ్వంత్ సింగ్ తెలిపారు.
‘‘పానేలీ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో హసన్ పీర్ దర్గాకు తమ కుమారుడిని జెనాభాయి, మీఠీభాయి తీసుకొచ్చారు. అక్కడే జిన్నా తలనీలాలు కూడా ఇచ్చారు. అయితే, జిన్నా ప్రాథమిక విద్యాభ్యాసం సరిగా జరగలేదు. తొమ్మిదేళ్ల వయసులో ఒక ప్రాథమిక పాఠశాలకు ఆయన వెళ్లారు. ఆ తర్వాత సింధ్-మదర్సాతుల్-ఇస్లాంకు వెళ్లారు. అక్కడ ఆయన మూడున్నరేళ్లు చదువుకున్నారు. ఆ తర్వాత కరాచీలోని ఒక మిషనరీ స్కూలుకు వెళ్లారు’’అని జశ్వంత్ సింగ్ వివరించారు.
1892 నంబరులో వ్యాపారం కోసం ఫ్రెడ్రిక్ సూచనలపై జిన్నా లండన్ వెళ్లారు. అక్కడే ఆయన తన పేరును జిన్నాగా మార్చుకున్నారు.
కుటుంబ మూలాలు..
అమెరికాకు చెందిన చరిత్రకారుడు స్టాన్లీ వాల్‌పోర్ట్.. జిన్నాపై ‘‘జిన్నా ఆఫ్ పాకిస్తాన్’’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
‘‘షియా ముస్లిం ఖోజా కుటుంబంలో జిన్నా జన్మించారు. వీరు ఆగా ఖాన్‌ను అనుసరిస్తుంటారు. ఇరాన్‌లో అణచివేత వల్ల ఈ ఖోజా కుటుంబాలు పది నుంచి 16వ శతాబ్దాల మధ్య పెద్దయెత్తున వాయువ్య భారత్‌కు వలసవచ్చాయి’’అని ఆయన తన పుస్తకంలో రాశారు.
‘‘ఖోజాలు ఎక్కువగా వ్యాపారం చేస్తుంటారు. వ్యాపార పనులపై వీరు దేశాలు కూడా తిరిగేవారు. మహాత్మా గాంధీ బనియా కులానికి చెందినవారు. వీరు జిన్నా కుటుంబం నివసించిన ప్రాంతానికి 95 కి.మీ. దూరంలో ఉండేవారు. ఇక్కడ జిన్నా, అటు గాంధీ ఇద్దరి కుటుంబాల మాతృభాష గుజరాతీనే’’అని స్టాన్లీ వివరించారు.
జిన్నా తాతయ్య హిందూ నుంచి ఇస్లాంలోకి మతం మారారా? అని పాకిస్తాన్ చరిత్రకారుడు ముబారక్ అలీని ప్రశ్నించినప్పుడు.. ‘‘హిందువుల్లో చాలా మంది ఖోజా ముస్లింలుగా మారారు. జిన్నా తాతయ్యా, తండ్రి పేర్లను పరిశీలిస్తే, వారు ఇలానే మతం మారి ఉండొచ్చని అనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.
మరోవైపు జిన్నా తల్లి తరఫు బంధువులు పంజాబ్‌కు చెందిన సహీవల్ రాజ్‌పుత్‌లని ఓ పాకిస్తానీ రచయిత వివరించారు. జిన్నా విదేశాలకు వెళ్లి అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుంటారనే భయంతో 16ఏళ్ల వయసులోనే పానేలీ మోటీ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో పెళ్లి చేశారని తెలిపారు.
ఈ విషయంపై జిన్నా సోదరి ఫాతిమా మాట్లాడుతూ.. ‘‘అప్పటికి జిన్నా వయసు 16 ఉండొచ్చు. ఆ అమ్మాయిని మళ్లీ జిన్నా చూడనేలేదు. పెళ్లి సమయంలోనూ అమీబాయి ముఖాన్ని బట్టలతో కప్పారు. ఆ తర్వాత జిన్నా లండన్ వెళ్లిపోయారు. ఆమె చనిపోయింది’’ అని చెప్పారు.
అమీబాయికి ఏమైంది?
అమీబాయికి ఏమైందో, ఆమె కుటుంబంలో ఎక్కడుందో పానేలీ మోటీ గ్రామంలో ఎవరికీ తెలియడం లేదు.
గత మార్చిలో ఆహ్మదాబాద్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక ప్రదర్శన ఏర్పాటుచేసింది. గుజరాత్ మూలాలున్న 200 మంది ప్రముఖుల ఫొటోలను దీనిలో ప్రదర్శనకు పెట్టారు.
ఈ ఫొటోలో జిన్నా ఫొటోలు కూడా ఉన్నాయి. విక్రమ్ సారాభాయ్, అజీమ్ ప్రేమ్‌జీలతోపాటు నటుడు హరీభాయి జరీవాలా, డింపుల్ కపాడియాల ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి.
అయితే, ఆ తర్వాత విమర్శలు రావడంతో జిన్నా ఫొటోలను ప్రదర్శన నుంచి ఆరెస్సెస్ తొలగించింది.
‘‘ఆరెస్సెస్ ఇక్కడ ఫొటోలను తొలగించి ఉండొచ్చు. కానీ, ఈ గ్రామంతో జిన్నాకు ఉండే సంబంధాలు విడదీయరానివి’’అని ప్రవీణ్ భాయి అన్నారు.
ఇవి కూడా చదవండి
- భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా.. ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా
- గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- జీ20: షీ జిన్‌పింగ్‌ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి.. ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















