పాకిస్తాన్‌లో బాంబులతో మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహం పేల్చివేత, తమ పనేనన్న బలూచ్ సంస్థ

ఫొటో సోర్స్, BEEBAGRBALOCH3
పాకిస్తాన్‌లో మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఈ ఘటన బలూచిస్తాన్ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో జరిగింది.
పాకిస్తాన్ జాతిపితగా చెప్పే జిన్నా విగ్రహాన్ని పేల్చివేసింది తామేనని తీవ్రవాద సంస్థ నిషేధిత బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ(బీఆర్ఏ) ప్రకటించింది.
జిన్నా విగ్రహాన్ని పేల్చివేసింది తామేనని బీఆర్ఏ ప్రతినిధి బాబ్గర్ ట్వీట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
గ్వాదర్ నగరంలో అత్యంత సురక్షితమని భావించే ప్రాంతంలో జిన్నా విగ్రహంను పేల్చేయడాన్ని సోషల్ మీడియాలో చర్చనీయమైంది.

ఫొటో సోర్స్, TABEEN6
మరోవైపు విగ్రహం పేల్చిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం 9.20కి జరిగినట్లు బీబీసీతో మాట్లాడిన గ్వాదర్ డీపీఓ డాక్టర్ ఫర్హాన్ చెప్పారు.
విగ్రహం కింద బాంబు పెట్టడతో విగ్రహం పూర్తిగా ధ్వంసమైందని మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అధికారులు ఏమంటున్నారు
ఈ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించామని గ్వాదర్ డిప్యూటీ కమిషనర్ మేజర్(రిటైర్డ్) అబ్దుల్ కబీర్ ఖాన్ బీబీసీతో చెప్పారు.
"ఇప్పటివరకూ లభించిన రిపోర్టుల ప్రకారం విగ్రహాన్ని పేల్చేయడానికి తీవ్రవాదులు పర్యాటకుల్లా అక్కడికి వచ్చినట్లు తెలిసింది" అని ఆయన చెప్పారు.
"ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ, రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం" అని డిప్యూటీ కమిషనర్ ఖాన్ చెప్పారు.
"మేం కేసు దర్యాప్తు ప్రారంభించాం. వీలైనంత త్వరగా దోషులను పట్టుకుంటాం" అన్నారు.
గ్వాదర్‌లో మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్న ఈ విగ్రహాన్ని ఇదే ఏడాది జూన్‌లో మెరీన్ డ్రైవ్ దగ్గర ఏర్పాటు చేశారు. నగర డీఐజీ కార్యాలయం ఈ ప్రాంతం ఎంతో దూరంలో లేదు. భద్రతా పరంగా ఈ ప్రాంతాన్ని చాలా సున్నితమైనదిగా భావిస్తారు. జిన్నా విగ్రహానికి భద్రతగా ఇక్కడ ఒక సెక్యూరిటీ వాహనం కూడా మోహరించారు.
భద్రతపై ప్రశ్నలు
జిన్నా విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. చాలా మంది దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
బలూచిస్తాన్ మాజీ హోం మంత్రి, ఎంపీ సర్ఫరాజ్ బుగతీ ట్విటర్‌లో దీనిపై మండిపడ్డారు.

ఫొటో సోర్స్, Twitter
"గ్వాదర్‌లో జిన్నా విగ్రహాన్ని పేల్చేయడం అనేది పాకిస్తాన్ ఐడియాలజీపైనే దాడి లాంటిది. జిన్నా ఇంటిపై దాడి చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించామో, ఈ విగ్రహం పేల్చేసినవారికి కూడా అదే శిక్ష వేయాలని నేను అధికారులను కోరుతున్నాను" అన్నారు.
2013 జూన్‌లో జియారత్‌లోని మొహమ్మద్ అలీ జిన్నా ఇంటిని బాంబుతో పేల్చేశారు.
ఈ ప్రాంతం కూడా బలూచిస్తాన్‌లోనే ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోని ఫర్నీచర్ కాలిపోయింది. జిన్నా తన జీవితం చివరి రోజుల్లో ఈ ఇంట్లోనే గడిపారు. ఆయన చనిపోయాక ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేశారు.

ఫొటో సోర్స్, Twitter
"పాకిస్తాన్‌కు ఇది చాలా విషాదకరమైన రోజు. గ్వాదర్ వరకూ వచ్చి ఎవరైనా ఇలాంటి పని ఎలా చేయగలరు. నగరంలో అన్న చోట్లా సైన్యం ఉంది. దీనికి ఎవరో ఒకరు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది" అని సైఫ్ అనే ఒక ట్విటర్ యూజర్ అన్నారు.

ఫొటో సోర్స్, JOHN MOORE/GETTY IMAGES
పాకిస్తాన్‌లో ఉద్రిక్త ప్రాంతం
బలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లోనే అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా భావిస్తారు. ఇది పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. కానీ, పాకిస్తాన్‌లో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన ప్రావిన్సుల్లో ఇది కూడా ఒకటి.
70వ దశకంలో పాకిస్తాన్ జీడీపీలో బలూచిస్తాన్ భాగస్వామ్యం 4.9 శాతంగా ఉండేది. అది 2000లో 3 శాతానికి పడిపోయింది.
వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం పాకిస్తాన్‌కు చాలా కీలకం. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని 760 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, పాకిస్తాన్ మొత్తం తీర ప్రాంతంలో మూడింట రెండు వంతులు ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












