పాకిస్తాన్-భారత్: ఎల్‌ఓసీ వద్ద కాల్పులు.. నలుగురు పాకిస్తాన్ సైనికులు, ముగ్గురు భారత జవాన్లు మృతి

ఫొటో సోర్స్, INDIAN ARMY
నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో భారత భద్రతా దళాలకు చెందిన ముగ్గురు సహా ఆరుగురు మరణించినట్లు భారత సైన్యం తెలిపింది.
భారత భద్రతా దళానికి చెందిన మరో ముగ్గురు సభ్యులు కూడా గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో గురేజ్, ఉరి సహా పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపినట్లు భారత సైన్యం వెల్లడించింది.
అదే సమయంలో పాకిస్తాన్ కూడా భారత్‌పై అవే ఆరోపణలు చేసింది. నీలం, జీలం వ్యాలీ ప్రాంతాలలో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటనలో ఆరోపించింది.

ఫొటో సోర్స్, Indian army
సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్
శ్రీనగర్‌లో భారత సైన్యం చేసిన ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్ ఈ దాడిలో మోర్టార్, ఇతర ఆయుధాలను ఉపయోగించింది. సాధారణ పౌరులను పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం చెబుతోంది.
"మా సైన్యం పాకిస్తాన్ సైన్యపు మౌలిక సదుపాయాలను, బంకర్లను ధ్వంసం చేసింది. వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, ఉగ్రవాదులకు చెందిన అనేక లాంచ్ ప్యాడ్లను నాశనం చేసింది" అని భారత సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, Sdma
భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు
మరోవైపు పాకిస్తాన్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ముజఫరాబాద్) బ్రాంచ్ ప్రకటన ప్రకారం.. భారత్‌వైపు నుంచి జరిగిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 23మంది సైనికులు గాయపడ్డారు. గాయపడినవారిలో పిల్లలు కూడా ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది.
చొరబాటు కుట్ర విఫలం
పాకిస్తాన్ కాల్పుల్లో ఉరిలోని నంబాలా సెక్టార్లో ఇద్దరు సైనికులు మరణించారని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో హాజీపీర్ సెక్టార్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్‌ఇన్స్పెక్టర్ ఒకరు మరణించారు. ఒక భారతీయ సైనికుడు కూడా గాయపడ్డారు.

ఫొటో సోర్స్, Sdma
బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలోని కమల్‌కోట్ సెక్టార్‌లో ఇద్దరు పౌరులు కూడా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉరిలోని హాజీపీర్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందింది.
పాకిస్తాన్ దాడిలో చాలామంది గాయపడ్డారని భారత సైన్యం చెబుతోంది.
సరిహద్దుకు సమీపంలో ఉన్న కేరన్ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనతోపాటు, పాక్ సైన్యం చొరబాటుకు ప్రయత్నించిందని, దాన్ని భగ్నం చేశామని రక్షణశాఖ ప్రతినిధి రాజేశ్ కలియా తెలిపారు.
"ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని ఎల్‌ఐసి సమీపంలో కేరన్ సెక్టార్‌లో శుక్రవారం మా సైన్యానికి అనుమానాస్పద కదలికలను గమనించాం. పాక్ సైన్యపు చొరబాటు ప్రయత్నాలను మా దళాలు విఫలం చేశాయి" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డెన్మార్క్‌లో ‘మింక్’లను ఎందుకు చంపేస్తున్నారు
- ధన్తేరస్: ఈ పండగకు బంగారం ఎలా కొనాలి?
- డోనల్డ్ ట్రంప్ ఎందుకు ఓడిపోయారు?
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. మరోసారి లాక్డౌన్ తప్పదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








