కరోనావైరస్: డెన్మార్క్‌లో ‘మింక్’లను ఎందుకు చంపేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
డెన్మార్క్‌లో మింక్(ముంగిసలను పోలిన జంతువు)లలో కరోనావైరస్ ఉన్నట్లు బయటపడటంతో ఆ దేశ ప్రభుత్వం వీటిని పూర్తిగా అంతం చేయాలనే నిర్ణయం తీసుకుంది.
గత వారం డెన్మార్క్ సుమారు 1.7 కోట్ల మింక్‌లను చంపేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇది రాజకీయ రంగును సంతరించుకోవడంతో డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ ఈ నిర్ణయానికి చట్టబద్ధత లేదని అంగీకరించారు.
ఆమె ఈ అంశంపై పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు.
అసలు ఏం జరిగింది?
ఇప్పటి వరకు మనుష్యులలో మాత్రమే విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు మింక్ అనే జంతువులలో కనిపించడం మొదలైంది.
వైరస్ సోకిన కొంత మంది వ్యక్తుల ద్వారా మింక్ ఫార్మ్స్‌లో ఉండే మింక్‌లకు ఈ వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఈ జంతువుల నుంచి మనుషులకు తిరిగి వైరస్ సోకిన కేసుల సంఖ్య తక్కువగానే ఉంది.
ఇప్పటికే డెన్మార్క్‌లో 200 మందికి మింక్ నుంచి కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు.
వైరస్‌లో మింక్ నుంచి తలెత్తిన స్ట్రెయిన్ కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ వైరస్ యాంటీ బాడీలను పరిరక్షించదని ఇది వ్యాక్సీన్ అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని చెబుతున్నారు.
ఈ నివేదికలు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని, అయితే ఈ వైరస్ వలన కరోనా చికిత్సకు, వ్యాక్సీన్ మీద ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరి కొన్ని అధ్యయనాలు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
వీటిలో జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వ్యాక్సీన్ తయారీ మీద ప్రభావం చూపిస్తుందో లేదో చెప్పడానికి ఇంకా కొంత కాలం వేచి చూడకుండా ఎటువంటి నిర్ణయానికీ రాలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరోనావైరస్ కూడా ఇతర వైరస్ లాగే కాలక్రమేణా తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అయితే, డెన్మార్క్ లో ప్రస్తుతం కనిపించిన వైరస్ మనుషులకు ప్రమాదకరమో కాదో చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
"జంతువుల మధ్య ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రతి సారీ దీని స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది ఒక వేళ ప్రస్తుతం మనుష్యులలో కనిపిస్తున్న వైరస్ కంటే మరీ ఎక్కువగా తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటే గనక వ్యాక్సీన్ పని తీరు పై ప్రభావం పడే అవకాశం ఉంది" అని ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిరాడ్ కి చెందిన ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరిసా పేర్ చెప్పారు.
అయితే, వీటిలో ఇప్పటి వరకు కనిపించిన వైరస్ స్వభావం తీవ్రంగా ఉండి వైరస్ ప్రొటీన్లని పెంచేస్తున్నాయి. ఈ ప్రోటీన్లను హరించే లక్ష్యంగా కొన్ని వ్యాక్సిన్ల తయారీ కూడా జరుగుతోంది.
" ఏదైనా ప్రత్యేక ప్రోటీన్ ని లక్ష్యంగా పెట్టుకుని దానికి తగిన రోగనిరోధక శక్తి పెంపొందించడానికి వాక్సీన్ అభివృద్ధి చేస్తున్న సమయంలో, ఈ జంతువుల నుంచి ఒక వేళ వైరస్ తిరిగి మనుష్యులకు సోకుతుంటే, వ్యాక్సీన్ కూడా వైరస్ నుంచి రక్షించలేదు" అని పేర్ చెప్పారు.
మింక్ లలో కనిపిస్తున్న జన్యు మార్పుల వలన వ్యాక్సీన్ తయారీ మీద ప్రభావం చూపవచ్చు అనే భయంతో డెన్మార్క్ లో చాలా ప్రాంతాలలో తిరిగి లాక్ డౌన్ విధించారు.
డెన్మార్క్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ నిషేధం విధించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉన్ని కోసం చైనా, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలండ్ లలో ఏటా 5 కోట్ల మింక్ లను పెంచుతూ ఉంటారు.
అయితే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, అమెరికాలో ఇప్పటికే ఈ జంతువులలో వైరస్ సోకినట్లు నివేదికలు రావడంతో వీటిని ఏరివేయడం ప్రారంభించారు.
మింక్ లలో కూడా మనుష్యుల లాగే వైరస్ సోకిన తర్వాత ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం నుంచీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
"వీటికి ఆహారం ఇస్తున్నప్పుడు కానీ, లేదా ఇన్ఫెక్షన్ సోకిన తుంపర్ల వలన కానీ వైరస్ సోకుతుందేమోనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ వైరస్ మిగిలిన ఇతర జంతువులకు వేటికైనా సోకిందేమో పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని యూనివర్సిటీ కాలేజీ లండన్ కి చెందిన ప్రొఫెసర్ జొవాన్ సాంటిని అన్నారు.
ఈ మింక్ లలో కనిపించిన వైరస్ పై శాస్త్రవేత్తలు జన్యు పరమైన అధ్యయనాలు చేస్తున్నారు.
ఈ వైరస్ తన స్వభావాన్ని ఎలా మార్చుకుంటుందో ఇది వ్యాప్తి చెందే క్రమంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, ఇది ఎంత అంటువ్యాధో చూడాల్సిన అవసరం ఉంది. అని సాంటిని అన్నారు.
వివిధ దేశాలు వీటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు అవలంబించాయి?

ఫొటో సోర్స్, EPA
ఈ మింక్ ల పెంపకాన్ని ఆపాలని ఇప్పటికే డెన్మార్క్, చైనా, మలేసియా కి చెందిన కొంత మంది శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి పెంపకం పై పర్యవేక్షణ పెంచి జీవ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని దేశాలకు పిలుపునిచ్చింది.
ఇప్పటికే డెన్మార్క్‌లోని గ్రామాల శివార్లలో చంపేసిన మింక్‌లు గుట్టలుగుట్టలుగా ఉన్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు.
ఈ పని కోసం ఇప్పటికే పోలీసులు, సైనిక దళాలను రంగంలోకి దించి ఆరోగ్యకరంగా ఉన్న జంతువులను కూడా చంపేయాలని రైతులను ఆదేశించారు. అయితే, దీనికి కొంత సమయం పట్టవచ్చు.
"మా దగ్గర 65,000 మింక్ లు ఉన్నాయి. రానున్న వారాల్లో వీటన్నిటినీ అంతం చేస్తాం " అని ఫునెన్ లో మింక్ పెంపకం చేస్తున్న మార్టిన్ ఫ్రొమ్ చెప్పారు. రాత్రికి రాత్రే జీవనాధారం కోల్పోయానని ఆయన అంటున్నారు.
ఇలా జరిగింది ఈయనొక్కరికే కాదు. కన్నీళ్లు పెట్టుకుంటున్న చాలా మంది రైతులు డానిష్ టెలివిజన్ లో కనిపించారు.
డెన్మార్క్ లో 1000 కి పైగా మింక్ పెంపకం ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పటికే 116 మింక్ ఫార్మ్స్ లో మొత్తం మింక్ లన్నిటినీ అంతం చేయడం పూర్తయిందని డానిష్ వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది.
డెన్మార్క్ ఈ విషయంలో కాస్త తీవ్రంగానే స్పందించేదేమోనని కొందరు విమర్శిస్తున్నారు. రైతులకు ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల విముఖత వ్యక్తం అవుతోంది.
డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన మింక్ పరిశ్రమ పూర్తిగా మూత పడి కనీసం 6000 మంది ఉద్యోగాలు కోల్పోతారని కోపెన్ హాగెన్ ఫుర్ ట్రేడ్ సంఘం అధ్యక్షుడు టేగ్ పెడర్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్ వలన ఇప్పటికే నెథర్లాండ్స్ మింక్ ఊలు ఉత్పత్తిని నిషేధించింది. యుకె, ఆస్ట్రియాలో వీటి ఉత్పత్తిని కొన్నేళ్ల క్రితమే ఆపేసారు. జర్మనీ కూడా ఈ ఉత్పత్తిని నెమ్మదిగా తగ్గిస్తూ వస్తోంది. బెల్జియం, ఫ్రాన్స్, నార్వే కూడా వీటి ఉత్పత్తిని ఆపాలనే ప్రణాళికల్లో ఉన్నారు.
యూరప్ అంతటా కనీసం 4350 మింక్ ఫార్మ్స్ ఉన్నాయి.
మిగిలిన యూరప్ దేశాల లాగే డెన్మార్క్‌లో కూడా ఈ వ్యాపారాన్ని క్రమేపీ తగ్గించేందుకు తగిన ప్రణాళిక ఉండాలని డానిష్ జంతు పరిరక్షణ సంఘాల వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్
- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: డోనాల్డ్ ట్రంప్ వేస్తున్న కేసులు ఏమిటి? ఏం జరుగుతుంది?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- హోమో ఎరక్టస్: 20 లక్షల ఏళ్ల కిందటి మనిషి పుర్రె లభ్యం.. తవ్వకాల్లో వెలుగులోకి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








