అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: డోనాల్డ్ ట్రంప్ వేస్తున్న కేసులు ఏమిటి? ఏం జరుగుతుంది?

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచినట్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ మాత్రం ఈ గెలుపును, కొన్ని రాష్ట్రాలలో వెలువడిన ఎన్నికల ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు దోపిడీ చేశారని చెప్పడానికి తన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ న్యాయవాది రూడి జులియాని.. ఫాక్స్ న్యూస్‌కి చెప్పారు.

అయితే ట్రంప్, ఆయన మద్దతుదారులు ఈ ఆధారాలను బయటపెట్టలేదు. కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో కేసులు వేయనున్నట్లు సోమవారం వారు చెప్పారు.

ఇప్పటివరకు ఏం జరిగింది?

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

పెన్సిల్వేనియా

పెన్సిల్వేనియాలో ఎన్నికల పరిశీలకులను ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు అనుమతించకపోవడంపై కూడా కేసులు వేస్తామని జులియాని చెప్పారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదో పర్యవేక్షించే వారిని ఎన్నికల పరిశీలకులు అంటారు. ఎన్నికల ముందు రోజు పేర్లను నమోదు చేసుకున్న వారికి ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు అనుమతి లభిస్తుంది.

కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి నడుమ నిబంధనలు విధించారు. మరి కొన్నిచోట్ల బెదిరింపుల భయంతో వీరి సంఖ్యపై పరిమితి విధించారు.

ఫిలడెల్ఫియాలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో 20 అడుగుల దూరంలోనే పర్యవేక్షకులు ఉండాలని నిబంధన పెట్టారు. అయితే, దీనిపై కోర్టులో కొందరు సవాలు చేయడంతో.. ఆ దూరాన్ని ఆరు అడుగులకు తగ్గించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఎన్నికల పరిశీలకులు కోవిడ్-19 నిబంధనలను తప్పని సరిగా పాటించాలని కోర్టు చెప్పింది.

కోర్టు ఆదేశాలను ఎన్నికల అధికారులు ధిక్కరించారంటూ ట్రంప్ మద్దతుదారులు మరో కేసు వేశారు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఆరు అడుగుల దూరం నుంచి ఓట్ల లెక్కింపును పరిశీలించవచ్చని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎన్నికల పరిశీలకులను 12 అడుగుల దూరం దాటనివ్వలేదని జులియాని చెప్పారు.

అయితే, ముందుగా నమోదుచేసుకున్న వ్యక్తులందరినీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు అనుమతించినట్లు పెన్సిల్వేనియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కేథి బూక్వార్ నవంబరు 5న చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రజలు నేరుగా చూసేందుకు టీవీల్లో లైవ్ స్ట్రీమ్ కూడా చేశారు.

ఎన్నికల రోజే ఓటు వేసినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓట్లు 3 రోజుల తర్వాత కేంద్రానికి చేరతాయి. వీటి లెక్కింపు పట్ల రిపబ్లికన్లు కోర్టుకు వెళ్లాలని చూస్తున్నారు.

ఎన్నికలకు ముందే ఈ అంశంపై దేశంలో అత్యున్నత న్యాయ స్థానంలో ప్రతిష్టంభన ఏర్పడిందని బై పార్టిసన్ పాలసీ రీసెర్చ్ సెంటర్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాధ్యు వేల్ అన్నారు.

ఎన్నికల రోజే ఓటు వేసినప్పటికీ శుక్రవారం వరకు ఓటింగ్ కేంద్రానికి చేరని ఓట్లను వృథాగా పరిగణిస్తారేమోననే భయం ఉందని ఆయన అన్నారు.

"అయితే, అలా వృథా అయ్యే ఓట్లు భారీ సంఖ్యలో ఏమీ ఉండవని అనుకుంటున్నాను. వాటి వల్ల చాలా స్వల్ప తేడాలు ఉండొచ్చు" అని ఆయన అన్నారు.

2020 అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

మిషిగన్

2016లో ట్రంప్ 10,700 ఓట్ల ఆధిక్యతతో మిషిగన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పొందారు. ప్రస్తుతం ఇక్కడ బైడెన్‌ని విజేతగా ప్రకటించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి లభించకపోవడంతో ఈ లెక్కింపును ఆపేయాలని నవంబరు 4న ట్రంప్ మద్దతుదారులు కోర్టులో కేసు వేశారు.

అయితే, ఎన్నికల పరిశీలకులను అడ్డుకున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవంటూ ఈ కేసును జడ్జి కొట్టేశారు.

2020 అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

విస్కాన్సిన్

ఇక్కడి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అందుకే కౌంటింగ్ మళ్లీ చేపట్టాలని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు.

అయితే, ఈ ఓట్ల లెక్కింపును ఎప్పుడు చేపడతారో స్పష్టత లేదు. సాధారణంగా అధికారులు ఓట్ల లెక్కింపును పరిశీలించడం పూర్తయ్యే వరకు తిరిగి లెక్కింపును మొదలు పెట్టరు.

ఒక వేళ ఓట్లను తిరిగి లెక్కించాల్సి ఉంటే.. ఈ రాష్ట్రంలో మొత్తం ప్రక్రియను నవంబరు 17లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

2016లో కూడా ఈ రాష్ట్రంలో రెండోసారి ఓట్ల లెక్కింపును చేపట్టినప్పటికీ ఓట్ల తేడా కేవలం వందల్లోనే ఉందని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ బ్రిఫాల్ట్ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

నెవాడా

నెవాడా నుంచి బయటకు వెళ్లిపోయిన ఓటర్లు కూడా ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని నెవాడా రిపబ్లిక్ పార్టీ ట్వీట్ చేసింది. ట్రంప్ న్యాయ శాఖ బృందం అలాంటి వారి పేర్ల జాబితాను సేకరించింది. కేవలం ఆ జాబితాను చూపించి చట్టాన్ని వ్యతిరేకించినట్లు నిరూపించలేమని పొలిటిఫ్యాక్ట్ చెబుతోంది.

ఎన్నికలకు 30 రోజులలోపు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన వారెవరైనా అదే రాష్ట్రంలో ఓటు వేయవచ్చు. నెవాడాకు చెందిన విద్యార్థులు మరో రాష్ట్రంలో చదువుకుంటున్నప్పటికీ నెవాడాలో ఓటు వేయవచ్చు.

అయితే దొంగ ఓట్ల లెక్కింపు జరిగినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని క్లార్క్ కౌంటీ రిజిస్ట్రార్ చెప్పారు.

ఓటర్ల సంతకాలను ధ్రువీకరించే పరికరం సరిగ్గా పని చేయడం లేదని ఆరోపిస్తూ, ఆ పరికరాన్ని వాడవద్దని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేసిన చర్యలను కూడా జడ్జి అడ్డుకున్నారు.

బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో సమస్యలున్నాయంటూ ఓట్ల లెక్కింపును ఆపమని జార్జియాలోని ఛాతాం కౌంటీలో కూడా కేసు వేశారు.

లెక్కపెట్టకుండా పడేసిన ఓట్లలో 50 బ్యాలెట్లను కలిపేసినట్లు ఎన్నికల పర్యవేక్షకులు గమనించారని జార్జియా రిపబ్లికన్ పార్టీ చైర్మన్ డేవిడ్ షాఫర్ ట్వీట్ చేశారు.

ఈ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ ఈ కేసును కూడా కోర్టు నవంబరు 5న రద్దు చేసింది.

2020 అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

అరిజోనా

అరిజోనాలో కొన్ని చట్టబద్ధమైన ఓట్లను ధిక్కరించారంటూ ట్రంప్ మద్దతుదారులు కూడా శనివారం కేసు వేశారు.

ఓటింగ్ మెషీన్లలో సమస్యలున్నాయని ఇద్దరు ఓటర్లు, కొందరు ఎన్నికల పర్యవేక్షకులు ఇచ్చిన తీర్మానాల ఆధారంగా ఈ కేసును వేశారు.

ఈ కేసును కోర్టు పరిశీలిస్తోంది.

2020 అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్తుందా?

ఎలాంటి ఆధారాలు చూపించకుండా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టుకు వెళతానని బుధవారం ట్రంప్ ప్రకటించారు.

ఈ ఎన్నికల ఫలితాలను సవాలు చేయాలంటే ముందుగా వాటిని ఆ యా రాష్ట్రాల కోర్టుల్లో సవాలు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రాల్లోని జడ్జీలు ఆ సవాలును ఆమోదించి, ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలనే ఆదేశాలను ఇవ్వాలి.

వాటిని పరిశీలించమని అప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు.

ఎన్నికల ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వేయడానికి ఒక నిర్ణీత ప్రక్రియ లేదని ప్రొఫెసర్ బ్రిఫాల్ట్ అన్నారు. ఇది చాలా అసాధారణమైనదని, అలా జరగాలంటే చాలా ప్రాముఖ్యమైన అంశం ఉండాలని చెప్పారు.

అమెరికా చరిత్రలో 2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుందని ఆయన చెప్పారు.

2000 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రట్ అభ్యర్థి అల్ గోర్.. ఫ్లోరిడాలో ఆరు లక్షల ఓట్లు పోల్ కాగా 537 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ మళ్లీ మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపమని సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే వరకు.. ఒక నెల రోజుల పాటు లెక్కింపు కొనసాగింది. రిపబ్లికన్ అభ్యర్థి జార్జి డబ్ల్యూ బుష్‌కు మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)