గాంధీ-జిన్నా: విభజన విభేదాలున్నా ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారు?

జిన్నా, గాంధీ

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

    • రచయిత, వఖర్ ముస్తాఫా
    • హోదా, జర్నలిస్టు, పరిశోధకులు

బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత్, పాకిస్తాన్‌లలో నెలలపాటు హింసాత్మక రక్తపాతం కొనసాగింది. రెండుచోట్లా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే, రెండు దేశాల అగ్ర నాయకులు ఒకరికి మరొకరు సాయంగా నిలిచారు. వీరి మధ్య విద్వేషం ఎక్కడా కనిపించదు.

అప్పట్లో పాకిస్తాన్ రాజధాని కరాచీగా ఉండేది. అక్కడి బీచ్‌లో నడుస్తూ పాకిస్తాన్ పితామహుడు, గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా.. అమెరికా దౌత్యవేత్త పాల్ ఆలింగ్‌తో మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు... అమెరికా-కెనడా సంబంధాల్లా ఉండాలని ఆనాడు జిన్నా ఆకాంక్షించారు.

రెండు దేశాల మధ్య నుండే దాదాపు 9,000 కి.మీ. పొడవైన సరిహద్దుల్లో ప్రజలు, సరకులను స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని జిన్నా చెప్పారు. అప్పుడే రెండు దేశాలు సంతోషంగా ఉంటాయని అన్నారు.

అమెరికా విదేశాంగ శాఖ కోసం 20ఏళ్లపాటు పనిచేసిన దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు డెనిస్ కుక్స్.. పాకిస్తాన్‌లోనూ నాలుగేళ్లు గడిపారు.

‘‘ద యునైటెడ్ స్టేట్స్ అండ్ పాకిస్తాన్ (1947-2000): డిసెన్‌చాంటెడ్ అలయన్స్’’ పేరుతో కుక్స్ ఒక పుస్తకం రాశారు. మార్చి 1948లో జిన్నా నివాసంలో ఆలింగ్‌తో జరిగిన సంభాషణ గురించి ఈ పుస్తకంలో వివరించారు.

భారత్, పాకిస్తాన్‌లను సుహృద్భావ ఇరుగుపొరుగు దేశాలుగా అమెరికా చూడాలని అనుకుంటోందని ఆనాడు జిన్నాతో ఆలింగ్ అన్నారు.

భారత్

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES

‘‘అప్పుడు తాను కూడా అదే కోరుకుంటున్నట్లు జిన్నా చెప్పారు. నా మనసులో మాట కూడా అదేనని అన్నారు’’అని కుక్స్ వివరించారు.

దేశ విభజనకు మూడు నెలల ముందుగా రాయిటర్స్ ప్రతినిధి డాన్ కాంబ్లేకు కూడా జిన్నా ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూపై 22 మే 1947లో డాన్‌ పత్రికలో ఒక కథనం ప్రచురించారు. ‘‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య సుహృద్భావ, విశ్వాసనీయ సంబంధాలు పెనవేసుకోవాలని జిన్నా ఆకాంక్షించారు. ఎందుకంటే దేశ విభజన అనేది చిరకాల శత్రుత్వం, ఉద్రిక్తతల ఆధారంగా జరగలేదు. విభేదాలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ఇది తప్పనిసరయ్యిందని జిన్నా భావించారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

దేశ విభజన తర్వాత దిల్లీలోని తన నివాసాన్ని జిన్నా అమ్మేశారు. కానీ, బాంబే(ముంబయి)లోని 2.5 ఎకరాల ఇంటిని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ ఇంటితో ఆయనకు విడదీయరాని అనుబంధముంది. దీనిలో ఇటాలియన్ మార్బుల్స్, వాల్‌నట్ వుడ్‌వర్క్‌ కనిపిస్తాయి.

1947 ఆగస్టు 7న, అంటే స్వాతంత్ర్యానికి ఒక వారం ముందు, అప్పటి బాంబే ప్రధాన మంత్రి బీజీ ఖైర్‌కు ఈ ఇంటి సంరక్షణ బాధ్యతలను జిన్నా అప్పగించారు. త్వరలో సెలవుపెట్టి మళ్లీ ఇక్కడకు వస్తానని ఆయన అన్నారు.

గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘గాంధీ.. పాకిస్తాన్ బాపూ’’

మరోవైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి, సామరస్యాలు పరిఢవిల్లేందుకు పాకిస్తాన్‌లోనూ పర్యటించాలని భారత జాతిపిత మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ భావించారు.

ఈ విషయాన్ని ‘‘ద గుడ్ బోట్‌మ్యాన్: ద పోట్రైట్ ఆఫ్ గాంధీ అండ్ అండర్‌స్టాండింగ్ ద ముస్లిం మైండ్’’ పుస్తకంలో గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ ప్రస్తావించారు. ‘‘ఆగస్టు 1947 నుంచి గాంధీ పాకిస్తాన్‌కు వెళ్లాలని భావించారు’’అని రాజ్‌మోహన్ చెప్పారు. ‘‘నాకు లాహోర్‌కు వెళ్లాలని ఉంది. రావల్‌పిండికి వెళ్లాలని ఉంది’’అని సెప్టెంబరు 23న గాంధీ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని జిన్నాకు కూడా తెలియజేశారు. ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో పాకిస్తాన్‌లో గాంధీ పర్యటించాలని జనవరి 27న నిర్ణయం తీసుకున్నారు.

‘‘ఒకవేళ 1940ల చివర్లో లేదా 50ల మొదట్లో గాంధీ అక్కడకు వెళ్లుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగుపడి ఉండేవి’’అని రాజ్‌మోహన్ చెప్పినట్లు అవుట్‌లుక్ మ్యాగజైన్ ఒక కథనం ప్రచురించింది.

‘‘మ్యూజిక్ ఆఫ్ ద స్పిన్నింగ్ వీల్’’ పుస్తకంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ సన్నిహితుడు సుధీంద్ర కులకర్ణి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు.

‘‘పశ్చిమ దేశాలు భయంకరమైన అంధకారంలో ఉన్నప్పుడు తూర్పులో వెలుగులు విజరమ్మే ఇస్లాం కాంతిని ప్రసాదించింది. ప్రపంచ దేశాలకు సాంత్వన చేకూర్చింది. ఇస్లాం కలహపూరిత మతం అసలు కాదు’’అని గాంధీ చెప్పేవారని సుధీంద్ర వివరించారు.

జిన్నా, గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇస్లాం వేగంగా విస్తరించడానికి కత్తి కారణం కాదు. అది చాలా నిరాడంబర మతం. మహమ్మద్ ప్రవక్త మేలిమి విలువల వల్లే ప్రజలు సంతోషంగా ఈ మతాన్ని స్వీకరిస్తున్నారు’’అని గాంధీ అన్నారని సుధీంద్ర పేర్కొన్నారు.

‘‘గాంధీ, జిన్నాల మధ్య వరుస చర్చల తర్వాత.. వాయువ్య, తూర్పు భారత్‌లోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకునేలా స్వతంత్ర ప్రాంతాల ఏర్పాటుకు గాంధీ అంగీకారం తెలిపారు. మీరు కావాలంటే దీన్ని పాకిస్తాన్ అనే పేరుతో పిలుచుకోవచ్చని జిన్నాకు సూచించారు. ఒకవేళ విభజన తప్పనిసరైతే.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభజన జరిగినట్లు ఉండాలని గాంధీ చెప్పారు’’అని సుధీంద్ర వివరించారు.

‘‘హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు భారత్, పాకిస్తాన్.. రెండు దేశాలూ తనవేనని గాంధీ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌కు వెళ్లేందుకు తనకు పాస్‌పోర్టు అవసరంలేదని అన్నారు. రాజకీయంగా, భౌగోళికంగా దేశాన్ని విభజించినప్పటికీ, మనసుల్లో మేమంతా స్నేహితులం, సోదరులం అని గాంధీ చెప్పారు. ఒకరికి ఒకరం సాయం చేసుకుంటామని అన్నారు’’అని సుధీంద్ర కులకర్ణి వివరించారు.

పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన రూ.55 కోట్లతోపాటు సైనిక పరికరాలను ఇచ్చేందుకు భారత్ ప్రభుత్వం నిరాకరించడంతో.. పాకిస్తాన్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని గాంధీ అన్నారు. దీంతో జనవరి 16న ఈ డబ్బులు, సైనిక సామగ్రిని ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. అయితే, ఇదే కారణాన్ని చూపిస్తూ గాంధీని కాల్చేశానని నాథురామ్ గాడ్సే చెప్పారు.

గాంధీజీని పాకిస్తాన్ బాపూ అంటూ కోర్టులో గాడ్సే వ్యాఖ్యానించారు. ‘‘గాంధీ మనసు, ఫిలాసఫీ అన్నీ జిన్నాను ప్రతిబింబించాయి’’అని ఆయన అన్నారు.

భారత్

ఫొటో సోర్స్, COURTESY THE PARTITION MUSEUM, TOWN HALL, AMRITSAR

గాంధీ హత్యపై పాకిస్తాన్‌లో సంతాప దినాలు

గాంధీ హత్యకు మరో కారణం కూడా ఉందని రచయిత, పరిశోధకుడు అమ్జాద్ సలీమ్ అల్వీ చెప్పారు.

విభజన సమయంలో తూర్పు బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రావర్దీ.. గాంధీని బెంగాల్‌కు తీసుకెళ్లారు. హిందువుల ఆగ్రహం నుంచి బెంగాలీ ముస్లింలను కాపాడాలంటూ గాంధీజీని హుస్సేన్ అభ్యర్థించారు.

‘‘బెంగాల్‌లో ఊచకోత అడ్డుకోవడంలో ఈ పర్యటన ప్రధాన పాత్ర పోషించింది. దిల్లీతోపాటు బెంగాల్‌లోనూ గాంధీ రక్తపాతాన్ని ఆపారు. ఆ తర్వాత భారత్ నుంచి కొంతమంది హిందువులను తీసుకెళ్లి మోడల్ టౌన్ లాహోర్‌లో నివాసాలు ఏర్పాటు చేయాలని, అలాగే అటు వలసవెళ్లిన ఇక్కడి ముస్లింలను మళ్లీ వారి పూర్వీకుల ఇళ్లకు చేర్చాలని గాంధీ భావించారు’’అని అల్వీ చెప్పారు.

‘‘1948 జనవరిలో గాంధీ పర్యటన కోసం ఏర్పాట్లు చేసేందుకు హుస్సేన్ లాహోర్ వచ్చారు. అక్కడ గాంధీ రెండు రోజులు ఉండాలని ప్రణాళికలు రచించారు. అధికారులతోపాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని బాపూ భావించారు. అయితే, అంతలోనే ఆయన్ను హత్య చేశారు’’అని అల్వీ వివరించారు.

గాంధీ హత్యపై పాకిస్తాన్‌లో అధికారికంగా సంతాప దినాలు ప్రకటించారు. జనవరి 31, 1948 వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేయాలని నిర్ణయించారు. ఈ ప్రకటన పాకిస్తాన్ ఇంగ్లిష్ పత్రిక పాకిస్తాన్ టైమ్స్‌లో ప్రచురించారు.

గాంధీ మృతిపై పాకిస్తాన్ టైమ్స్‌లో ఎడిటర్ ఫైజ్ అహ్మద్ ఒక సంపాదకీయం రాశారు. ‘‘ఈ శతాబ్దంలో చాలా కొద్ది మంది మాత్రమే అంత ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎంతో మంది అణగారిన వర్గాలకు ఆయన చేరువయ్యారు. గాంధీ మృతి మాకు తీరని లోటని సరిహద్దుకు అవతలి మిత్రులకు మేం చెప్పాలని అనుకుంటున్నాం’’అని ఫైజ్ రాశారు.

‘‘సంతాప దినాల్లో లాహోర్‌లో వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సముదాయాలు తెరచుకోలేదు. భారత ముస్లింలను న్యాయంగా, సహనంతో చూసినప్పుడే గాంధీ ఆత్మకు శాంతి కలుగుతుంది. దీని కోసమే ఆయన చనిపోయారు’’అని ఫైజ్ చెప్పారు.

గాంధీ మరణ వార్త విన్న వెంటనే జిన్నా సంతాప సందేశాన్ని పంపించారు. ‘‘గాంధీపై దాడి వార్త విని విస్మయానికి గురయ్యాను. మా మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. కానీ, హిందువుల్లో జన్మించిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు’’అని జిన్నా చెప్పారు.

‘‘ఆయన్ను ప్రజలు ఎప్పటికీ గౌరవిస్తారు. ఆయన లోటు భారత్‌కు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదు’’అని జిన్నా వ్యాఖ్యానించారు.

జిన్నా

ఫొటో సోర్స్, KEYSTONE/HULTON ARCHIVE

పాకిస్తానీ పార్లమెంటులో..

మరోవైపు గాంధీ హత్యపై 4 ఫిబ్రవరి 1948లో పాకిస్తాన్ పార్లమెంటులో సభాపక్ష నేత లియాఖత్ అలీ ఖాన్ కూడా మాట్లాడారు. ‘‘గాంధీ మరణ వార్త గురించి మాట్లాడుతుంటే దు:ఖం పొంగుకొస్తోంది. నేటి తరం గొప్ప నాయకుల్లో ఆయన ఒకరు’’అని ఆయన అన్నారు.

‘‘గాంధీ కలలుగన్న సమాజం, ఆయన మరణానంతరమైనా నెరవేరాలి. ఈ ఉపఖండంలో దేశాలు శాంతి, సామర్యాలతో మెలగాలని ఆయన కోరుకున్నారు. ఆ కల సాకారం కావాలి’’అని లియాఖత్ అలీ ఖాన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

జిన్నా.. భారత్ వ్యతిరేకి కాదు

1948 సెప్టెంబరు 11న మహమ్మద్ అలీ జిన్నా మరణించారు. 13వ తేదీన ది హిందూ ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది.

‘‘గాంధీ తర్వాత అవిభాజ్య భారత్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్నా మన్ననలు పొందారు’’అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. ‘‘రెండు దేశాల మధ్య స్నేహభావం తప్పనిసరని జిన్నా భావించారు’’అని వివరించారు.

జిన్నా ‘‘భారత్ వ్యతిరేకి లేదా హిందూ వ్యతిరేకి అసలు కాదు’’అని సుధీంద్ర కులకర్ణి చెప్పారు. ‘‘1948లో జిన్నా ఢాకాలో పర్యటించినప్పుడు, అక్కడి హిందువులను భయపడొద్దని జిన్నా భరోసా ఇచ్చారు. పాకిస్తాన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవద్దని అభ్యర్థించారు. పాకిస్తాన్‌ కూడా ప్రజాస్వామ్య దేశమేనని, ఇక్కడ హిందువులకు కూడా ముస్లింలలానే అన్ని హక్కులు ఉంటాయని హామీ ఇచ్చారు’’అని సుధీంద్ర వివరించారు.

వీడియో క్యాప్షన్, కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?

‘‘చాలా మంచి సంబంధాలు’’

స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితులపై పల్లవి రాఘవన్ అధ్యయనం చేపట్టారు. ‘‘ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలు చాలా బావుండేవి. మరోవైపు రెండు దేశాల మధ్య అధికారుల సంబంధాలు కూడా అలానే ఉండేవి’’అని ఆమె చెప్పారు.

ఆనిమోసిటీ ఎట్ బే: ఎన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ ఆఫ్ ద ఇండియా-పాకిస్తాన్ రిలేషన్స్, 1947-1952 పేరుతో పల్లవి ఒక పుస్తకం రాశారు. లియాఖత్-నెహ్రూ ఒప్పందంతోసాహా స్వాతంత్ర్యం తర్వాత శాంతి స్థాపనకు చేసిన ప్రయత్నాలపై ఈ పుస్తకంలో విశ్లేషించారు.

‘‘విభజన వల్ల తలెత్తిన మైనారిటీ హక్కులు, వలసదారుల ఆస్తులు లాంటి సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి’’అని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఈ కల కేవలం అధికారిక ప్రక్రియలకు మాత్రమే పరిమితమైందని చరిత్రకారుడు మీరజ్ హసన్ అన్నారు.

‘‘మొదట్లోనే రెండు దేశాల మధ్య కశ్మీర్ కోసం యుద్ధం జరిగింది. పాకిస్తాన్ మళ్లీ భారత్‌లో కలిసిపోతుందని భారత్ నాయకులు చెప్పేవారు. ఆ తర్వాత యుద్ధం ముగిసింది. నెహ్రూ-లియాఖత్ ఒప్పందం కుదిరింది. కానీ, ఇదంతా ఏదో ఒక అధికారిక లాంఛన ప్రక్రియల్లా కనిపిస్తాయి’’అని ఆయన అన్నారు.

అయితే, విభజన అనివార్యమనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని సుధీంద్ర అన్నారు. ‘‘పాకిస్తాన్ ఎప్పటికీ స్వతంత్ర దేశంగానే ఉంటుంది. ఈ విషయాన్ని భారత్ అంగీకరించాలి. అంతేకాదు పాక్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటై, సంపద పెరగాలని కోరుకోవాలి. అప్పుడే పొరుగు దేశంతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి’’అని చెప్పారు.

‘‘మనం చరిత్ర నుంచి సరైన పాఠాలు నేర్చుకోవాలి. గాంధీ, జిన్నా కలలు కన్నట్టే మంచి ఇరుగుపొరుగు దేశాల్లా నడుచుకోవాలి’’అని సుధీంద్ర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)