తొలిసారి కూతుర్ని ప్రపంచానికి చూపించిన కిమ్ జోంగ్ ఉన్.. ‘కిమ్ చు-ఏ’తో కలసి క్షిపణి ప్రయోగానికి వచ్చిన ఉత్తర కొరియా పాలకుడు

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూతురు తొలిసారిగా పబ్లిక్‌లో కనిపించారు. కిమ్‌కు కూతురు లేదన్న వదంతులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటికి చెక్ పెడుతూ ఇటీవల ఆయన తన కూతురితో కనిపించారు.
కిమ్ కుమార్తె పేరు కిమ్ చు-ఏ అని చెబుతున్నారు.
శుక్రవారం, ఒక ముఖ్యమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించడానికి కిమ్ తన కూతురితో పాటు వచ్చారు. నాన్న చేయి పట్టుకుని కిమ్ చు-ఏ ఈ ప్రయోగాన్ని వీక్షించారు.
కాగా, ఈ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా ఖండించింది.
ఉత్తర కొరియా వ్యవహారాలన్నీ చాలా రహస్యంగా ఉంటాయి. కిమ్ వ్యక్తిగత జీవితం కూడా రహస్యమే. ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు తెలిసింది చాలా తక్కువ.
కిమ్ తన కూతురి చేయి పట్టుకుని నిల్చున్నట్టు ఉన్న ఫొటోలు, వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా తీసిన ఫొటోలు, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్నప్పటి పలు ఫొటోలను నార్త్ కొరియా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రచురించింది.
కిమ్ చు-ఏ వయసు 12-13 మధ్య ఉంటుందని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్ సెంటర్‌కు చెందిన ఉత్తర కొరియా నిపుణుడు మైఖేల్ మాడెన్ అంచనా వేశారు.
"నాల్గవ తరం అధికార వారసత్వం కూడా మా రక్తం నుంచే వస్తుందని" చెప్పడానికే కిమ్ తన కూతురిని పబ్లిక్‌లోకి తీసుకువచ్చి ఉంటారని మైఖేల్ మాడెన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS
అంతకుముందు, సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక వీడియోలో చు-ఏ కనిపించినట్టు పలువురు నార్త్ కొరియా విశ్లేషకులు తెలిపారు.
అయితే, అవి ఊహాగానాలు కావచ్చు. ఆ పాప కిమ్ కూతురన్న విషయాన్ని నార్త్ కొరియా అధికార యంత్రాంగం ధృవీకరించలేదు.
2013లో తొలిసారిగా చు-ఏ ఉనికి బయటకు పొక్కింది. అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ (రిటైర్డ్) డెన్నిస్ రాడ్‌మాన్ ఉత్తర కొరియా పర్యటన వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే చు-ఏ ప్రస్తావన వచ్చింది.
కిమ్ కుటుంబంతో సాగర తీరంలో హాయిగా గడిపానని కిమ్ కుమార్తె 'చు-ఏ'ను ఎత్తుకున్నానని డెన్నిస్ రాడ్‌మాన్ చెప్పారు.
కాగా, కిమ్‌కు ముగ్గురు పిల్లలు ఉండవచ్చని, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు కావచ్చని, చు-ఏ వారిలో పెద్ద పిల్ల అయి ఉండవచ్చని విశ్లేషకులు ఊహిస్తున్నారు.
అయితే కిమ్ తన కుటుంబం గురించి అతి రహస్యాన్ని పాటిస్తారు. కిమ్ భార్య రి సోల్-జు గురించి కూడా వారి వివాహమైన కొంత కాలం వరకు బయటకు తెలియలేదు.

ఫొటో సోర్స్, Reuters
క్షిపణి పరీక్ష కన్నా ఆసక్తికరమైన విషయం? - సోల్ బీసీ కరస్పాండెంట్ షాన్ మెకెంజీ విశ్లేషణ
ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష కన్నా కిమ్ కుమార్తె విషయమే విశ్లేషకులను ఎక్కువ ఆకర్షించింది.
ఈ క్షిపణికి అమెరికాను డీకొట్టగల సామర్థ్యం ఉన్నదని చెబుతున్నారు. అయినా సరే, కిమ్ కూమార్తె కనిపించడమే ప్రధాన విశేషంగా మారింది.
ఎందుకు?
ఎందుకంటే, ఇది ఉత్తర కొరియా పరిపాలన భవిష్యత్తు, దాని అణ్వాయుధాల కార్యక్రమం గురించి చాలా చెబుతుంది. లేదా, కనీసం కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
మొదటగా, ఈ పాప కిమ్ అధికార వారసత్వాన్ని కొనసాగిస్తుందా? భవిష్యత్తులో ఒక రోజు ఆమెను అధినేత్రిగా ప్రకటిస్తారా?
కావచ్చు. వారిది కుటుంబ వారసత్వం. అంటే, కిమ్ పిల్లలలో ఒకరు సింహాసనాన్ని అధిష్టించవచ్చు.
రెండవది, ఇప్పుడెందుకు ఆమెను బయటకు తీసుకొచ్చారు?
ఆమె ఇంకా చాలా చిన్నపిల్ల. ఇప్పుడే ఆ పాపను బయటకు తీసుకువచ్చారంటే, 38 ఏళ్ల అధినేతకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? కిమ్ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఏవో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాాయి. ఎందుకంటే పాలన స్థిరత్వానికి అది సవాలుగా మారే అవకాశం ఉంది.
మూడవది, నార్త్ కొరియా అణ్వాయుధాల కార్యక్రమం గురించి ఇది ఏం చెబుతుంది?
ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి ఆమెను తీసుకురావడం, బహుసా భవిష్యత్తులో దేశ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తుందని సూచించడం కావచ్చు.
ఎట్టి పరిస్థితులలోనూ అణ్వాయుధాల ప్రయోగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కిమ్ ఇటీవల ప్రకటించారు.
తరువాతి తరాలు కూడా తన అడుగుజాడల్లోనే నడుస్తాయని చెప్పడానికే కిమ్ ఈ క్షిపణి పరీక్షకు తన కూతురిని తీసుకుని వచ్చి ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
- సంధ్యా దేవనాథన్: విశాఖపట్నంలో చదివిన మెటా ఇండియా హెడ్ ‘చదువులో చురుకు, వాట్సాప్‌లో సైలెంట్ ’
- నేను బైసెక్సువల్‌ని...నాలాంటి వారిపై ఎందుకు చిన్నచూపు?
- ఇక ఆకాశం నుంచి డబ్బులు కురిపించవచ్చా, భారత్‌లో ప్రైవేట్ శాటిలైట్ విజయాలు ఏం చెబుతున్నాయి?
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















